గురువారం, జులై 14, 2011

ఇల్లూ-గుడీ

'ఇంటికన్నా గుడి పదిలం' అని ఎవరన్నారో, ఎందుకన్నారో నాకు తెలీదు కానీ, గుడికి దగ్గరగా ఇల్లు ఉండడం మాత్రం అన్ని వేళలా పదిలం కాదు. ముఖ్యంగా మనకి ఇంట్లో పనులున్నప్పుడో, ఒంట్లో బాగోనప్పుడో గుళ్ళో పెద్ద ఎత్తున భజనల్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మాత్రం 'ఎక్కడికన్నా పారిపోతే బాగుండు' అనిపిస్తుంది. కానీ ఇంటినుంచి, ఇంటిళ్ళపాదీ పారిపోవడం అనేది ఎల్లవేళలా ఆచరణ సాధ్యం కాదు కాక కాదు.

నా అదృష్టం ఏమిటో కానీ, పుట్టి పెరిగిన ఇల్లు మొదలు ఇప్పుడుంటున్న ఇల్లు వరకూ నేను పాదం మోపిన చాలా ఇళ్ళు గుడికి దగ్గరగా ఉన్నవే. ఈ ఆధ్యాత్మిక వాతావరణం చాలా వరకూ అలవాటైపోయినా, అప్పుడప్పుడూ చుట్టూ ఉండే భక్తుల యొక్క భక్తి శృతి మించి రాగాన పడ్డప్పుడు మాత్రం అసహనం కలుగుతూ ఉంటుంది. కానీ ఎవర్నీ ఏమీ అనలేని పరిస్థితి. దైవ భక్తి అనేది చాలా సున్నితమైన విషయం మరి. ఈ కారణానికి ఓపిక పడుతూ ఉండాలి.

ఇంటికి దగ్గరగా గుడి ఉండడం లేదా గుడి దగ్గర ఇల్లు ఉండడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరికైనా ఇంటి ఎడ్రస్ చెప్పడం బహు సుళువు. గుడి ఓ బ్రహ్మాండమైన లాండ్ మార్క్ కాబట్టి, ఎవరూ చిరునామా పట్టుకోలేక పోవడం అనే సమస్య ఉండదు. అలాగే, ఎప్పుడన్నా గుడికి వెళ్లాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి ప్రయాణం కానక్కర్లేదు. మనకి మనంగా ఎలాంటి ప్రయత్నమూ చేయనప్పటికీ గుడికివచ్చే భక్తులతో పరిచయాలేర్పడి సర్కిల్ కొంచం విస్తరిస్తుంది.

చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఏటా ఉగాదికి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి. వారం రోజుల పాటు బోల్డన్ని సాంస్కృతిక కార్యక్రమాలు. ఊరంతా అక్కడే ఉండేది. చిన్న క్లాసుల్లో ఉండగా సరదాగానే గడిచినా, కొంచం పెద్ద క్లాసులకి వచ్చేసరికి సమస్యలు మొదలు. సరిగ్గా అదే సమయంలో వార్షిక పరిక్షలు ఉండేవి. రోజులో పద్దెనిమిది గంటలు మైకుసెట్టు చెవుల్లో మోగుతూ ఉంటే క్లాసు పుస్తకాలు తీసి చదువుకోవడం అన్నది ఎంత దుస్సాధ్యమైన విషయమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అలాగని దూరంగా ఎవరింటికైనా వెళ్లి చదువుకోడానికి ఇంట్లో ఓ పట్టాన ఒప్పుకునే వాళ్ళు కాదు. రెండు చెవులూ గాట్టిగా మూసేసుకుని, చదివిందే పదేసి సార్లు చదవడం ఇప్పటికీ అప్పుడప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది నాకు. పరీక్షల గండాలు దాటడానికి ఎంతలేసి ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఊళ్లు తిరగడం మొదలు పెట్టాక ఒక్కో ఊళ్లోనూ ఒక్కో అనుభవం. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేయలేం అన్న ఆలోచన కొంతా, గుడి అన్నాక ఇలాంటివి తప్పవు కదా అని మరికొంతా.. సర్దుకుపోదాం లెండి అనేసుకోవడం.

చాలా విసుగ్గా, చిరాగ్గా ఇంటికొచ్చేసరికి గుళ్ళో ఏ ఏకాహమో జరుగుతుంటే? రాక రాక వచ్చిన బంధువులతోనో, మిత్రులతోనో సరదాగా కబుర్లు చెబుదాం అనుకుంటూండగా గుళ్ళో ఏ సప్తాహమో మొదలైతే? అనుభవించే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే బాధ ఇది. మైకక్కర్లేకుండా మైళ్ళ దూరం వినిపించే గాత్ర సౌలభ్యం ఉన్న గాయనీ గాయకులు మైకులు పెట్టుకుని మరీ పాడేస్తుంటే వడగళ్ళ వానలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో మనుషులతోనే కాదు, వచ్చిన ఫోన్లని కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఇక అనారోగ్యంగా ఉన్నప్పుడైతే ఈ భజనల కారణంగా కలిగే అసౌకర్యం వర్ణనాతీతం.

ఒకప్పుడంటే ఆలయాలు ప్రత్యేకంగా ఉండేవి.. ఇప్పుడు గుళ్ళ చుట్టూ ఇళ్ళూ, ఇళ్ళ మధ్యన గుళ్ళూ వచ్చేశాయి. భక్తిగా చేసుకునే భజనలు దేవుడికి వినిపిస్తే చాలును కదా. మైకులు పెట్టి ఊరందరికీ వినిపించడం ఎందుకో ఎంత ఆలోచించినా అర్ధం కాదు. గాత్ర శుద్ధి ఏమాత్రమూ లేనివాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడి హై పిచ్ లో పాడేస్తూ ఉంటే, పాడేవాళ్ళకి సరదాగా, పోటీలాగా ఉంటుందేమో కానీ వినేవాళ్ళకి మాత్రం దుర్భరంగానూ, దుస్సహంగానూ ఉంటుంది. భక్తి అనేది మనసులో ఉంటే చాలు కదా అని మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది.

19 కామెంట్‌లు:

 1. నిజమండీ!భక్తి కలవారికి ఇతరులని ఇబ్బందికి..గురి చేస్తున్నామని అనిపించకపోవడం..విచారకరం.మేము ఇలాటి ఇబ్బందినే యెదుర్కుంటాము. మన ఇబ్బంది చెబితే విడ్డూరంగ చూస్తారు.చెవుల్లో దూది పెట్టుకుని..భరిస్తున్నాం.మన బ్లాగర్లలో ఇలాటి భక్తాగ్రేసులు ఉంటె..ఇలాటి ఇబ్బందిని కల్గించకుండా..ఉండాలని కోరుకుందాం .

  రిప్లయితొలగించండి
 2. మురళిగారు, అందుకే అనుకుంటా పెద్దలు ఇంటి మీద గుడి నీడ పడకూడదు అన్నారు (ఆరోజుల్లో మైకుసెట్లు లేవు కాబట్టి) ఇప్పుడు గుడికి 400 మీటర్ల దూరంలో ఉండాలి

  రిప్లయితొలగించండి
 3. ఇంటికన్నా గుడిపదిలం అన్నారూ అంటే ఇంట్లో అంటే పెద్దవాళ్ళు తిట్లూ కొట్లూ ఉంటాయి కాబట్టి(చెప్పిన పనులు చెయ్యకపోతే,చదువు సరిగ్గా చదవకపోతే ఇలాంటివాటికన్నమాట)అక్కడ దేవుడయితే కొట్టడు కాబట్టి,పైగా అడక్కుండా ప్రసాదం కూడా పెడతాడు కాబట్టీ అలా అన్నారంటారా?
  ఇక మైకు సెట్లు అవీ చిన్నప్పుడు అంతల్లా లేవు కానీ ఆ తర్వాత కాలాంలో చాలా ఎక్కువయిపోయాయి బహుశా పక్కవాళ్ళు మైకులు పెట్టి మరీ దేవుడ్ని పిలుస్తున్నారు మనం కూడా అలా అరుస్తేనే కానీ దేవుడు పలకడేమో అని భ్రాంతేమో.

  ఏది ఏమయినా గుళ్ళో గోలా మనిళ్ళల్లో గగ్గోలా అంటారా?

  రిప్లయితొలగించండి
 4. ee badhalu memu anubavincham,maa inti daggara hanuman temple undi.chinnapudu nunchi maku ee badha tappadu.ippudu vallu konchem telusukunnaru,memu chebite volume taggistaru..

  రిప్లయితొలగించండి
 5. చాలా జెన్యూన్ ప్రాబ్లం అండీ. నాకు మైక్ లో లలితా సహస్రం చదివే వాళ్ళ గొంతు నలిమెయ్యాలనుంటుంది. శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో నేను పూజ చేసుకోవడానికి లేకండా తెగ వినిపిస్తారు మా కాలనీ లో - అలా ఆ చెత్త గోల విన్లేక, ప్రశాంతత లేక, పూజ కి ఎప్పుడో దూరమయ్యాను. ఈ మధ్య మా కాలనీ మైసమ్మ గుడి ప్రాభవం తగ్గింది. మైకు పాడైయిందో, ఏమో ! మరిప్పుడు బోనాలు కదా, పెయింటులేస్తున్నారు. నా గుండెలో మళ్ళీ రాళ్ళు పడుతున్నాయి.

  రిప్లయితొలగించండి
 6. ఎంత సర్వమతసామరస్యం పాటించాలన్నా, అని మతాల ప్రార్ధనామందిరాలకి సరిగ్గా కూతవేటు దూరంలోగనక మన ఇల్లు ఉంటే..!!!.

  .. ఈ అనుభవం నాకు మెండుగా ఉందిలెండి.. :)

  రిప్లయితొలగించండి
 7. మైకక్కర్లేకుండా మైళ్ళ దూరం వినిపించే గాత్ర సౌలభ్యం ఉన్న గాయనీ గాయకులు మైకులు పెట్టుకుని మరీ పాడేస్తుంటే వడగళ్ళ వానలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తూ ....

  :))))

  రిప్లయితొలగించండి
 8. ఇవన్నీ నాకూ అనుభవంలోకొచ్చిన బాధలే.

  రిప్లయితొలగించండి
 9. బాగున్నాయండి మీ అనుభవాలు.
  I tooooooo late. 401 వ పోస్ట్ కు నా హృదయపూర్వక అభినందనలు. మీకు గుడి బాధైతే నాకు బడి బాధ ఎక్కువయ్యింది. ఈ మధ్య గోరింటాకు మాతోటి బాగా రుబ్బించి, పెట్టి మరీ పంపుతున్నారు:)

  రిప్లయితొలగించండి
 10. :)నిజమే. మాకూ అనుభవమే. ఒక్క గుడే కాకుండా పైగా ఒక పక్క మసీదూ, చర్చీ కూడానూ. మసీద్ శుక్రవారం, రంజాన్ నెలల్లో కొద్దిగా.. చర్చ్ అయితే ప్రతి ఆదివారం.. ఒక పూట పూట అంతా ప్రశాంతత లేకుండా.

  రిప్లయితొలగించండి
 11. నాకూ గత 10-11 ఏళ్లగా గుడి పక్కన ఇళ్లే దొరుకుతున్నాయి అద్దెకి. ఇక్కడ ఏలూరు లో కూడా వేంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలో నే ఉన్నాము. పక్కనే రెండు ఫంక్షన్ హాల్స్. గుడిలో అప్పుడప్పుడు కొంతమంది ఔత్సాహికులు సహస్రనామాలు అవీ చదువుతారు మైక్ లో . ఆ దేవుడెలా సహించగలుగుతున్నాడా ఆ నామాలు అని అనుమానం నాకు.

  రిప్లయితొలగించండి
 12. @బులుసు సుబ్రహ్మణ్యం గారు,
  >>సహస్రనామాలు అవీ చదువుతారు మైక్ లో . ఆ దేవుడెలా సహించగలుగుతున్నాడా ఆ నామాలు అని అనుమానం నాకు.
  సహస్రనామం లో సహనం కూడా ఉందేమోనండి! దేవుడి అటంక్షణ్ పక్కవాడి మీద కాకుండా మనమీద పడాలంటే ఆమాత్రం గట్టిగా అరవాలి మరి :)

  రిప్లయితొలగించండి
 13. @ శ్రీ గారూ,
  ఘట్టిగా అనే కాదండీ, అపస్వరం తో, నామం తప్పుగా పలుకుతూ అని కూడా నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించండి
 14. @వనజ వనమాలి: హమ్మయ్య.. మేమొక్కళ్ళమే కాదని తెలిసిందండీ ఈ టపా రాయడం వల్ల.. నిజమే.. వాళ్లకి తెలిస్తే బాగుండును.. ధన్యవాదాలు.
  @శ్రీ: రానురాను గుళ్ళ సంఖ్యా కూడా పెరుగుతోంది కదండీ మరి.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: నిజమేనండోయ్.. మీరు చెప్పిందీ పాయింటే.. ముఖ్యంగా ప్రసాదాల విషయంలో.. అవునండీ మైకుల పోటీ రానురాను పెరిగిపోతోంది.. అక్కడికీ పండగలప్పుడు పోలీసులు యేవో రూల్స్ పెడుతూ ఉంటారు కానీ, భక్తి ముందు అవన్నీ బలాదూర్.. :( ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 15. @సాయి: కాబట్టి, మీరు ఇంకా బాగా అర్ధం చేసుకోగలరు.. మైక్ లో పాటలు కొంత వరకూ నయం అండీ.. అదే భజన అయితే ఒకరితో ఒకరు పోటీ పడి గొంతు పెంచి పాడేస్తూ ఉంటారు.. ధన్యవాదాలు.
  @సుజాత: నాకైతే ఉన్న కాసింత భక్తీ కూడా అడుగంటి పోతుందేమో అని అనుమానం వచ్చేస్తోందండీ, ఈ భజనలూ, మైకులూ అవీ చూస్తుంటే.. ధన్యవాదాలు.
  @రవి కిరణ్: అలాంటి ఇల్లు దొరకడం సాధ్యమే అంటారా? అసలే, భక్తితో నిమిత్తం లేకుండా గజానికో గుడో, చర్చో కనిపిస్తున్నాయి ఇప్పుడు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. @రిషి: :)) ..నా బాధని అంతకన్నా బాగా ఎలా వర్ణించాలో అర్ధం కాలేదండీ మరి.. ధన్యవాదాలు.
  @శిశిర: హమ్మయ్య.. మీరు కూడా ఉన్నారన్న మాట.. ధన్యవాదాలండీ..
  @జయ: మీ అభినందనలు ఎప్పుడూ ఉంటాయండీ.. ఇప్పుడే అకడెమిక్ ఇయర్ ప్రారంభం కదా..నేనేమో మీరు చక్కగా లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివేసుకుంటూ ఉంటారని ఊహిస్తున్నా.. అంత పనా!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. @కృష్ణప్రియ: హయ్యబాబోయ్.. మీకు ట్రిపుల్ ధమాకా అయితే!! రోలూ-మద్దెలా సామెత గుర్తొస్తోందండీ నాకు.. ధన్యవాదాలు.
  @బులుసు సుబ్రహ్మణ్యం: ఈ భజనల విషయంలో నాకూ అదే పెద్ద సందేహం అండీ.. అసలు దేవుడికి ఓర్పు చాలా ఎక్కువ.. మానవ మాత్రులం కాబట్టి మనం భరించ లేక పోతున్నాం.. అంతే కదండీ?!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 18. మురళి గారు, నాకు మీ టపా చదువుతుంటే అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం పుస్తకం లో చదివిన "దేవుడి చెవిలో గ్రాంఫోను పూలు" వ్యంగ్య వ్యాసం గుర్తొస్తుంది. అది ఇప్పటికీ మా ఊర్లో భగ్రంగా ఉంది. ఈ సారి దాన్ని షేర్ చేస్తా..
  ఇక టపా గురించి చెప్పేదేముంది, మీతో పూర్తిగా ఏకీభవిస్తాను..

  రిప్లయితొలగించండి
 19. @మనసు పలికే: ఆ కథనం చదివినట్టే జ్ఞాపకం అండీ.. టపా రాయండి తప్పక.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి