సోమవారం, జులై 18, 2011

విడిచివచ్చే...

"....వేళ సెలవని అడుగనైనా అడుగలేదని.. ఎంతగా చింతించెనో.. ఏమనుచు దుఃఖించెనో..." మల్లీశ్వరి (భానుమతి) మంద్రంగా పాడుతోండగా, నాకు రకరకాల ఫేర్వెల్ లు ఒక్కసారిగా గుర్తొచ్చేశాయి. అసలు వీడ్కోలు అనే పదమే కొంచం విచారాన్ని సూచిస్తుంది, పైగా చాలా బరువుగా ఉంటుంది కూడా. ముఖ్యంగా ఆ వీడ్కోలు ఇచ్చేది మనకి ప్రియమైన వాళ్లకి అయినప్పుడు గుండెల్ని మెలిపెట్టే ఒకలాంటి అనుభూతిని అక్షరాల్లోకి అనువదించడం చాలా కష్టమైన పని.

ఫేర్ వెల్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది కాలేజీనే. ఇప్పుడంటే "తడి కన్నులనే తుడిచిన నేస్తమా.." లాంటి పాటలు ప్లే చేసేస్తూ, చాలా గ్రాండ్ గా వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. జూనియర్స్ కి సీనియర్స్ వెల్కం పార్టీ చేయడం, ఇందుకు ప్రతిగా జూనియర్స్, సీనియర్స్ కి ఫేర్ వెల్ ఇవ్వడం అనే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతున్నట్టే ఉంది. కాకపొతే భవిష్యత్తుని గురించి లెక్చరర్లు ఇచ్చే బరువైన ఉపన్యాసాల లాంటి వాటికి భిన్నంగా, కొంచం సరదాగా సరదాగా జరుగుతున్నట్టున్నాయీ పార్టీలు.

ఉద్యోగం మారేటప్పుడో, బదిలీ అయినప్పుడో లేదా ఉద్యోగ పర్వం ముగిసినప్పుడో జరిగే ఫేర్ వెల్ అయితే ఒకేసారి భిన్నమైన అనుభూతులని అనుభవంలోకి తెచ్చేస్తుంది. అప్పటివరకూ తెర వెనుక రాజకీయాలు చేసిన సహోద్యోగులు, నిండు సభ సాక్షిగా మనంత మంచి వాళ్ళు లేరనీ, మనల్ని వాళ్ళెంతో మిస్సవుతారనీ చెప్పడం వింటుంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మనసుకవి ఆత్రేయ 'పోయినోళ్ళందరూ మంచోళ్ళు' అని సూత్రీకరించేశారు. పోయిన వాళ్ళ గురించి ఎవరూ చెడుగా మాట్లాడరు. ఇదో సంప్రదాయం. అలాగే ఫేర్ వెల్ ఎవరికైతే జరుగుతోందో, వాళ్ళని గురించి కూడా ఒక్క చెడ్డ మాట వినపడదు.

అందువల్లే ఫేర్ వెల్ స్పీచిలు వింటుంటే 'ఇదంతా నిజమేనా?' అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలిగి తీరుతుంది. నేను హైస్కూల్లో ఉండగా, చండశాసనుడిగా పేరు తెచ్చుకున్న ఒక మేష్టారు రిటైరయ్యారు. ఆయనకి ఆవేళ సన్మానం. ఓ పక్క ఏర్పాట్లు జరుగుతూ ఉండగానే, పిల్లలు అల్లరి చేయకుండా పాటల కార్యక్రమం పెట్టారు. స్థానిక ఔత్సాహిక గాయకుడు ఉత్సాహంగా స్టేజీ ఎక్కి "భలే మంచి రోజు.. పసందైన రోజు.." అని పాటందుకోగానే మా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మేష్టార్లు చాలా కష్టపడి మమ్మల్ని అదుపులో పెట్టారు. చాలా మంది పిల్లలు వన్స్ మోర్ అని అరిచినా, మేష్టార్లు వీలు కాదనేశారు.

మనల్ని చూడవచ్చి తిరిగి వెళ్తున్న బంధుమిత్రులకీ, దూర ప్రయాణం చేస్తున్న దగ్గరి వాళ్ళకీ ఇచ్చే ఫేర్ వెల్ మరో రకం. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఏర్పోర్ట్లు ఇందుకు వేదికలు. తెచ్చి పెట్టుకునే గాంభీర్యాలు, అవి కరిగిపోయే క్షణాలు వీటన్నింటికీ నిశ్శబ్ద సాక్షులు మన బస్సులూ, రైళ్ళూ, విమానాలూను. ఎనిమిదేళ్ళ క్రితం ఒక మిత్రుడికి సెండాఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, అక్కడ దొర్లిన సంభాషణలో తను నాకు రికమెండ్ చేసిన పుస్తకం గొల్లపూడి మారుతీరావు 'సాయంకాలమైంది.' చాలా కాలం క్రితమే ఎన్ని సార్లు చదివానో లెక్క పెట్టడం మానేసిన ఈ పుస్తకాన్ని తిరగేసిన ప్రతిసారీ ఆనాటి దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది నాకు.

పెళ్లి జరిగాక అమ్మాయిని అత్తవారింటికి పంపించే దృశ్యం, అమ్మాయి సంబంధీకులని మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరినీ కూడా కదిలిస్తుంది. "ఆ క్షణంలో, వచ్చే జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టించకు దేవుడా అని మనసులో దండం పెట్టుకున్నాను" అని నా సర్కిల్లో చాలామందే అన్నారు నాతో. అప్పటి వరకూ ఆడ పెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళుగా విడిపోయిన రెండు గ్రూపులూ ఒక్కటైపోయే సందర్భమది. పిల్లల్ని మొదటిసారి, మొదటిరోజు బడికి పంపించే సందర్భమూ ఇలాంటిదే. 'ఆకాశమంత..' సినిమా చూసినప్పుడు, 'ఎమోషన్స్ ని చాలా బాగా పట్టుకున్నాడు కదూ' అంటూ మెచ్చుకున్నాను, దర్శకుడు రాధామోహన్ ని. జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నోసార్లు ఎదురయ్యేదే అయినా, ఎదురైన ప్రతిసారీ కొత్తగా అనిపించే సందర్భం ఈ ఫేర్ వెల్. కాదంటారా?

24 కామెంట్‌లు:

 1. నేను జీవితంలో మొదటసారి మా ఊరు వదిలి నా ఉద్యోగపర్వం కోసం ఇంటి నుండి బయలుదేరుతుంటే అమ్మమ్మ వచ్చి "ఇక నువ్వు మాతో కలిసి ఉండవు కదరా" అన్న మాటలు, కళ్ళలో ఒక్కసారి తళుక్కుమని మెరిసి మాయమైన కన్నీటి మెరుపు ఎప్పటికీ మరిచిపోలేను. వీధి చివరి వరకూ తాతగారు, మమ్మీ నా వెంటే బ్యాగులు పట్టుకుని నడిచారు. అయిదేళ్ళు గడిచాయి ఇంకా ఆ క్షణాలు సజీవంగా ఉన్నాయి. యువకులు ఊర్లు వదిలి వలసపోయే స్థితిని తెచ్చిన ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వాల పాలనా వైభవం ఇంకెన్నాళ్ళో.

  రిప్లయితొలగించు
 2. మీరు ఏ టాపిక్ తీసుకున్నా భలే రాసేస్తారండీ.. మీరు చెప్పిన ప్రతి వీడుకోలు సన్నివేశము నాకు అనుభవమో / చాలా దగ్గరనుండి చూసిన సంధర్బమో లేకపోలేదు. కొన్నిసార్లు వీడ్కోలు ఆ క్షణంలో బాదించినా తరువాత రోజుల్లో మధురమైన అనుభూతులలో ఒకటిగా మిగిలిపోతుంటాయ్.

  రిప్లయితొలగించు
 3. ఇంత బరువైన టాపిక్ తీసుకొని మధ్యలో కిసుక్కున నవ్వించారు "భలే మంచి రోజు.. " పాట తో. భలే!
  "సాయంకాలమయింది" నాకూ చాలా ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి. ఇంకో భలే!

  "నిజంగా మగాళ్ళు ఆడపిల్ల వెళ్ళిపోతూంటే అంత బాధపడతారా?" అని మీతో వాదించేదాన్నేమో, ఫాదర్ ఆఫ్ ద బ్రైడ్ చూసి ఉండకపోతే. 1991లో వచ్చిన ఈ సినిమాకి దేశీ నకలే ఆకాశమంత. చూసారా మీరు? చూడకపోతే మిస్ అవకండి.
  ఫాదర్ ఆఫ్ ద బ్రైడ్ కి మూలం ఎలిజబెత్ టేలర్ కూతురిగా నటించిన ఫాదర్స్ లిటిల్ డివిడెండ్ (1951)ట. నేను అదీ చూసాను ఆవిడ అందం చూడడం కోసం. ఫాదర్ ఆఫ్ ద బ్రైడ్ కి సీక్వెల్ కూడా వచ్చింది. అన్నిటిలోనూ నాకు బాగా నచ్చినది FOB లో స్టీవ్ మార్టిన్ మాటలు, నటన. :)

  "రాశి ఉన్నచోట వాసి కొరవడుతుందేమో!" అనుకోనివ్వదు మీ టపాల పరంపర. షరా మాములుగా మంచి టపా. :)

  రిప్లయితొలగించు
 4. >>జీవితంలో ఎన్నో సందర్భాల్లో, ఎన్నోసార్లు ఎదురయ్యేదే అయినా, ఎదురైన ప్రతిసారీ కొత్తగా అనిపించే సందర్భం ఈ ఫేర్ వెల్. కాదంటారా?
  అవునండి...ఇంక మాటలు రావటం లేదు ...

  రిప్లయితొలగించు
 5. "నిశ్శబ్దం మాట్లాడినంత గొప్పగా ఏ భాషా మాట్లాడలేదు.కలయికలో ఆనందాన్నీ,విడిపోవటంలో విషాదాన్నీ నిశ్శబ్దం ప్రకటించినంత బాగా ఏ స్వరమూ ప్రకటించలేదు."

  నేను అందుకే ఎవరికీ వీడ్కోలివ్వడానికి వెళ్ళను సాధ్యమయినంతవరకూ.

  ఈ మధ్య వచ్చిన సినిమాల్లో "ఆకాశమంత" చాలా మంచి సినిమా,కామెడీ ట్రాజెడీ రెండూ చక్కగా బాలన్స్ చేస్తూ నవ్విస్తూన్నే ఏడిపించేసాడు.

  ఇంకా వేణూ + కొత్తావకాయ గార్ల కామెంటు కూడా కలుపుకోండి.

  రిప్లయితొలగించు
 6. వీడుకోలు నాకెప్పుడూ దుఃఖభరితమే. చినప్పుడు ఇంటికి బంధువులు వచ్చి వెళ్ళిపోతుంటే ఏడ్చేదాన్ని. పదేళ్ళ క్రితం చదువుల కోసం ఇల్లు వదిలిపెట్టిన క్షణం నాకిప్పటికీ గుర్తే. అమ్మ కళ్ళలో నీళ్లు నాకు కనిపించలేదు, నా కళ్ళే జలపాతాల్లా ఉంటే ఇంకేమి కనిపిస్తాయి!

  రిప్లయితొలగించు
 7. ఫేర్ వెల్ పార్టీలో ముసుగు వేసుకొని మాట్లాడాలండి బాబు... అదో ఇబ్బంది. గత ఏడాది మా సీనియర్ ఉద్యోగి రిటైర్ అయ్యారు. ఆయన 'ప్రతిభ' ఏమిటో అందరికి తెలుసు. అందరు అయన పని తీరుని పొగుడుతుంటే నాకు నవ్వు ఆగలేదు. దానికి శిక్షగా అన్నట్లు నాతోను మాట్లాడించారు. నేను ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. అయినా అన్ని ఫేర్ వెల్ పార్టీలు ఒకలా వుండవులెండి.

  రిప్లయితొలగించు
 8. బాగాచెప్పారండీ !
  పెళ్ళిబట్టలతో అత్తవారింటికి వచ్చేసేటప్పుడు నేనస్సలు బాధపడలేదు . నేను ఘొల్లుమని ఏడ్చేస్తే ఓదార్చేద్దామని కర్చీఫులు చేత్తోపట్టుకు రెడీగా వున్నవాళ్ళంతా నేను హేపీగా మా ఆయన వెనకాలే అంబాసిడర్ కారెక్కి అందరికీ టాటా చెప్పేస్తుంటే , ఏం చెయ్యాలో పాలుపోక బిక్కమొహాలేసుకు చూసారు.( ఇప్పటికీ ఆ సన్నివేశం గుర్తుచేసి నవ్వుకుంటారు మా వాళ్ళంతా )
  నేను నిజంగా బాధపడి , క్షణమొక యుగంలా గడిపింది మాత్రం మా వాడిని స్కూల్ లో వదిలేసి వచ్చిన మొదటిరోజు. వచ్చేకన్నీటిని ఆపుకుంటూ మళ్ళీ సాయంత్రం వాడిని చూసేవరకూ నేను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేను . ఇప్పటికీ ఆరోజు గుర్తొస్తే దిగులుగానే అనిపిస్తుంది

  రిప్లయితొలగించు
 9. ఏ సందర్భం లో నైనా వీడ్కోలు గుండె బరువు ఎక్కిస్తుంది. ఆ క్షణాలు దాటితే ఒక్కొప్పుడు తిరిగి తలుచుకుంటే నవ్వు వస్తుంది అంత బేలగా ఎలా ఫీల్ అయ్యామా అని.

  కానీ నాకు తెలియకుండా నా నెత్తిమీద జుట్టు వీడ్కోలు తీసుకుంటునప్పుడు నా రాతి గుండె కూడా కరిగి ఏడిచింది. ఏడాది క్రితం మిగిలిన నాలుగూ వదిలిపోతే ఇంకా ధుఃఖం ఆగలేదు. (జస్ట్ ఫర్ ఫన్. అతిగా అనిపిస్తే పబ్లిష్ చేయవద్దు)

  రిప్లయితొలగించు
 10. మా కొలీగ్స్ ఎవరు రిటైర్ అయినా నాకు చాలా బాధనిపిస్తుంది. కాని కొంత కాలానికి మరుగునపడిపోతుంది. అసలైన బాధ ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలినప్పుడే అనిపిస్తుంది. కాని, అదికూడా కొంతకాలమే. ఎన్ని రకాల వీడ్కోలు లైనా ఉండచ్చుగాక, జీవితమంతా కలిచివేసేది మాత్రం ఇంక ఏనాడూ కంటపడని ఇష్టమైన వారి శాశ్వత వీడ్కోలు.

  రిప్లయితొలగించు
 11. మురళి గారు, మీరు ఏ అంశాన్ని ఎంచుకున్నా కళ్లకి కట్టినట్లు అద్భుతంగా రాస్తారు. అలా అందులో లీనమైపోయి, అసంకల్పిత ప్రతీకార చర్య లాగా తల ఆడించేస్తుంటాను. తెలియకుండానే పెదవుల పై నవ్వులు, కళ్లలో నీళ్లు తిరిగుతుంటాయి.

  ఇక టపా విషయానికొస్తే, మీరు చెప్పిన వాటిల్లో నన్ను బాగా కలవర పెట్టిన వీడుకోలు అప్పగింతల సమయం:( నిజంగా భరించలేని వీడ్కోలు అది, ప్రతి అమ్మాయికి ఆమె తల్లిదంద్రులకి. నేనైతే బాగా ఏడ్చేసా..
  ఆకాశమంత సినిమా ఎన్ని సార్లు చూసినా ఏడ్చేస్తా. అంత బాగా చూపించారు అందులో భావోద్వేగాల్ని. నాకైతే నిజంగా మా నాన్నే కనిపిస్తూ ఉంటారు అందులో ప్రకాష్ రాజ్ ని చూస్తుంటే...

  రిప్లయితొలగించు
 12. "ఆ క్షణంలో, వచ్చే జన్మంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టించకు దేవుడా అని మనసులో దండం పెట్టుకున్నాను"

  ఉమ్రావ్ జాన్ చూశారా (పాతది కాదు కొత్తది) అందులో అప్పగింతల పాటొకటుంటుంది. ఇదే themeతో చాలా బాగుంటుంది. "జో అబ్ కియె హొ దాతా ఐసా న కీ జో... అగ్‌లె జనం మొహె బేటియా న కీ జో" అంటూ. ఎంత ఏడిపిస్తుందో ఆ పాట.

  రిప్లయితొలగించు
 13. నేనైతే ఏ వీడ్కోలునూ భరించలేను .
  బాగా రాసారు .

  రిప్లయితొలగించు
 14. ప్రతి వీడ్కోలు మరో కలయికకు నాంది కదా! అలా అని బాధ పడకుండా ఉండలేం.మనసైన వారికి ఇచ్చిన వీడ్కోలు తర్వాత మనకి రేడు లేని రేయి వంటిది.బాగా చెప్పారు..మురళి గారు.

  రిప్లయితొలగించు
 15. @ఇందు: ??.. ...ధన్యవాదాలండీ..
  @మురళి: "యువకులు ఊర్లు వదిలి వలసపోయే స్థితిని తెచ్చిన ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వాల పాలనా వైభవం ఇంకెన్నాళ్ళో." ఊళ్లేమిటండీ, ఏకంగా దేశమే వదిలి పోతుంటే.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: 'మధురమైన అనుభూతులు..' నిజం చెప్పారు!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @కొత్తావకాయ: మీరిచ్చిన సినిమాల జాబితా బాగుందండీ.. ఒక్కటి కూడా చూడలేదని చెప్పడానికి చింతిస్తూ, చూడ్డానికి ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను.. మీ ప్రశంశ కి ధన్యవాదాలు.
  @శ్రీ: ధన్యవాదాలండీ..
  @శ్రీనివాస్ పప్పు: వీడ్కోలు గురించి ఏకీభవిస్తాను మీతో.. నిజమేనండీ.. కొన్నిసార్లు మాటలకన్నా మౌనమే బాగుంటుంది.. 'ఆకాశమంత' గురించి కూడా నేను డిట్టో.. మీ అభిమానానికి ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 17. @ఆ.సౌమ్య: బాగా చిన్నప్పుడు అత్తయ్యలూ వాళ్ళూ వచ్చి వెళ్లిపోతుంటే ఏడ్చేసిన సందర్భాలు గుర్తు చేశారు మీరు.. ఏనాటి సంగతులు!! ..ధన్యవాదాలండీ..
  @శ్రావ్య వట్టికూటి: ..... ధన్యవాదాలండీ..
  @చక్రవర్తి: ఒక్కోసారి తప్పదు. నాదీ అలాంటి అనుభవమే కానీ, నేను మాట్లాడకుండా తప్పించేసుకున్నా లెండి!! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. @లలిత: మహమ్మదీయ పెళ్ళికూతుళ్ళు పెళ్ళయ్యాక వెళ్తూ ఏడవక పొతే తప్పట! 'దర్గామిట్ట కథ'ల్లోనో ఎక్కడో చదివింది జ్ఞాపకం వచ్చిందండీ మీ వ్యాఖ్య చదివాక. ఏడవడం తప్పనిసరి కాదు కానీ, చాలామందికి అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేస్తాయ్.. సందర్భం అలాంటిది కదండీ మరి.. ధన్యవాదాలు.
  @బులుసు సుబ్రహ్మణ్యం: నేను కూడా జుట్టుకి వీడ్కోలిచ్చే పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి మీ బాధని నా బాధగా అర్ధం చేసుకోగలనండీ.. ధన్యవాదాలు.
  @జయ: అవునండీ.. ఇక కనిపించరు అన్న ఊహనే భరించలేం కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 19. @మనసు పలికే: అప్పగింతలు చూసే వాళ్ళకే బరువుగా అనిపిస్తే, ఇక అసలు వాళ్ళకి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదండీ.. ధన్యవాదాలు.
  @ఇండియన్ మినర్వా: చూడలేదండీ ఆ సినిమా, చూడాలి ఈసారి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 20. @మాలాకుమార్: ధన్యవాదాలండీ..
  @వనజ వనమాలి: "మనసైన వారికి ఇచ్చిన వీడ్కోలు తర్వాత మనకి రేడు లేని రేయి వంటిది." యెంత కవితాత్మకంగా చెప్పారు!! ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 21. మీ వీడ్కోలు అదిరిందండీ :-)భలేమంచిరోజు చూసి పగలబడి నవ్వాము నేను నా పుత్రికారత్నం .నాకు వీడ్కోలు ఇవ్వడం భాధాకరం ,ఆఖరికి మా ఇంట్లో అద్దెకి ఉన్నోళ్ళు వెళ్ళిపోతున్నా చాలారోజులు గుర్తొస్తూనే వుంటారు .ప్రియం అయినవారి గురించి చెప్పక్కరలేదు .
  మొట్టమొదటి సారి నా కూతుర్ని హైదరాబాద్ సెంట్రల్ యునివర్స్య్తి కాంపస్ లో వదిలి వచ్చేప్పుడు ఇద్దరం ఒకర్నిఒకరమ్ పట్టుకుని ఏడ్చిన సీన్ ఎవరు మరచిపోలేరు (మావాళ్ళు).
  పోస్ట్ చాల సరదాగా రాసారు .

  రిప్లయితొలగించు
 22. @చిన్ని: ఆ పాట, ఆసందర్భం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తుందండీ.. హైస్కూలు మిత్రులం ఎప్పుడన్నా కలుసుకుంటే మొదట గుర్తు చేసుకునే జ్ఞాపకాల్లో ఇదొకటి.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు