గురువారం, జూన్ 30, 2011

180

ఒక్క క్షణం.. కేవలం ఓకే ఒక్క క్షణం.. ఒక్క మాట.. ఒకే ఒక్క మాట.. ఒక్క క్షణంలో విన్న ఒక చిన్న మాట ఒక జీవితాన్నే మార్చేయగలదు. విషాదంలో కూరుకు పోయిన ఓ మనిషిని ఎంతో ఆనందంగా జీవించేలా, జీవించే ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేలా చేయగలదు. డాక్టర్ అజయ్ కుమార్ జీవితమే అందుకు ఉదాహరణ. లోకం తెలియని ఓ పసివాడిని గురించి అతని తాతగారు పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో గంగానది ఒడ్డున ఉన్న స్నాన ఘాట్లో చెప్పిన ఓ మాట, అజయ్ పేరునే కాదు, అతని జీవన గమనాన్నీ పూర్తిగా మార్చేసింది.

"ఈ సినిమాని ఒక పదేళ్ళ క్రితం నాకు ఆఫర్ చేస్తే నేను చేసి ఉండేవాడిని కాదు," తన కొత్త సినిమా, తెలుగు తమిళ ద్విభాషా చిత్రం '180' ప్రమోషన్లో భాగంగా హీరో సిద్ధార్ద్ ఓ ఇంటర్యూలో ఈ మాటలు చెప్పినప్పుడు "ఇప్పుడు చేతిలో సినిమాలు లేవు కాబట్టి చేసి ఉంటాడు" అని నవ్వుకున్నాను. కానీ, సినిమా ప్రోమోలు నాకు చాలా నచ్చాయి. ముఖ్యంగా ఫోటోగ్రఫీ, నేపధ్య సంగీతం. టాక్ తో నిమిత్తం లేకుండా సినిమా చూడాలని అనుకున్నాను. దానికి తోడు థియేటర్ దగ్గర కనిపిస్తున్న 'హౌస్ ఫుల్' బోర్డు నా ఆసక్తిని మరింత పెంచింది. ఈ సినిమా నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు.

కాశీలో గంగా నదిఒడ్డున ప్రారంభ సన్నివేశం. కాలుతున్న శవాలు, గంగ ఒడ్డున పిండ ప్రదానాలు.. ఓ గంభీర వాతావరణం. మృత్యువు నేపధ్యంగా వచ్చే సాహిత్యం అన్నా, సినిమాలన్నా నాకున్న ప్రత్యేకమైన ఆసక్తి కారణంగా కావొచ్చు, సినిమాలో లీనమైపోయాను. తాతగారి ఆధ్వర్యంలో తన తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న ఓ ఐదేళ్ళ పిల్లాడితో పరిచయం అయ్యాక, అప్పటివరకూ గంబీరంగా ఉన్న హీరో సిద్ధార్ద్ ముఖం మీద చిరునవ్వు మొలిచింది. ఆ కుర్రాడు తన పేరు 'మనో' అని చెప్పగానే, "నేనుకూడా మనో కావొచ్చా?" అని అతని నుంచి అనుమతి తీసుకుని హైదరాబాద్ బయలుదేరతాడు.

హైదరాబాద్లో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి మూర్తి దంపతుల ఇంట్లో ఓ వాటాని, మూర్తి గారి బైకునీ ఆరు నెలల పాటు అద్దెకి తీసుకుంటాడు మనో. మిసెస్ మూర్తి (గీత) సంగీతం పాఠాలు చెబుతూ ఉంటుంది. పిల్లలకి 'రాధే రాధే' కీర్తన నేర్పిస్తూ ఉండగా, మనో ఆగమనం. అతను చేసే పనులన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. కూరగాయలమ్ముకునే ముసలమ్మకి తన బైక్ మీద లిఫ్ట్ ఇవ్వడం, పార్క్ లో శనగలు అమ్ముకునే కుర్రాడిని ఆటలకి పంపి, వాడి బదులు తను శనగలు అమ్మడం, పేపర్లు పంచే కుర్రాళ్ళతో కలిసి ఆడిపాడడం.. ఇలా.. ఈ క్రమంలోనే ఫోటో జర్నలిస్ట్ విద్య ('అలా మొదలైంది' ఫేం నిత్యామీనన్) కెమెరాలోనూ, కళ్ళలోనూ పడతాడు. అతని ఫోటోలు తను పనిచేసే 'భారత మిత్ర' పత్రికలో ప్రచురిస్తుంది విద్య. ('రంగం' హీరో గుర్తొచ్చాడు నాకు).

విద్య తనంత తానుగా మనో ని పరిచయం చేసుకుని స్నేహం చేస్తుంది. చూస్తుండగానే అందరికీ చేరువ అయిపోతాడు మనో. ఉన్నట్టుండి ఆలోచనల్లోకి వెళ్లిపోవడం మినహా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్త్తూ ఉండే మనో ని విద్య ప్రేమిస్తుంది. ప్రకటిస్తుంది కూడా. అతని నుంచి స్పందన ఉండదు. ఇంతలో ఆరునెలలు పూర్తవ్వడంతో ఇల్లు ఖాళీ చేసి బయలుదేరతాడు. అనూహ్యంగా విద్యని తీసుకుని అమెరికా వెళ్ళాల్సి వస్తుంది మనోకి. అది కూడా గతంలో తను పని చేసిన ఆస్పత్రికి. పాత మిత్రుడు కనిపించడంతో అప్పటివరకూ అప్పుడప్పుడూ మాత్రమే గుర్తొచ్చిన గతం, భయ పెట్టిన మృత్యువు ఇక అనుక్షణం వెంటాడడం మొదలు పెడతాయి. విద్య ప్రేమ-స్నేహితుడి నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో మనోగా మారిన అజయ్ కుమార్ ఎటువైపు మొగ్గాడన్నది ముగింపు.

ఇది అనుభూతి ప్రధానమైన సినిమా. ప్రధమార్ధంలో హీరో చాలా ఎక్కువ సరదాగా ఉండడాన్ని బట్టే ఏదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని ఊహించాను. ఇక, నాకు ప్రోమోల్లో నచ్చిన ఫోటోగ్రఫీ (కేటీ బాల సుబ్రమణియం), సంగీతం నన్ను ఏమాత్రం నిరాశ పరచలేదు. ఫొటోగ్రఫీలో చాలా సన్నివేశాలు గ్రీటింగ్ కార్డులని తలపించాయి. లొకేషన్లు చాలా చక్కగా కుదిరాయి. అజయ్-రేణూ (ప్రియా ఆనంద్) ల మధ్య రొమాన్స్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. శరత్ సంగీతం వినగానే, ఇతను ఇంతకు ముందే తెలుసు అనిపించింది. 'కలవరమాయే మదిలో' కి సంగీతం అందించిన శరత్ వాసుదేవన్ అని తర్వాత తెలిసింది.

క్లాసికల్ టచ్ తో సాగిన సంగీతం. పాటలన్నీ ఆకట్టుకున్నా, బాగా నచ్చింది శరత్ పాడిన 'మూన్నాళ్ళే నీకీ లోకంలో..' చెవితో పాటు కంటికీ ఇంపుగా అనిపించిన పాటలు 'నిన్న లేని..' ...'నీ మాటలో..' దర్శకుడు జయేంద్ర కి ఇది తొలి సినిమా. మొదటి సగంతో పోల్చినప్పుడు రెండో సగాన్ని కొంచం సాగదీసినట్టుగా అనిపించింది. చిత్రీకరణలో వైవిధ్యం చూపడానికి ప్రయత్నించడం అభినందించాల్సిన విషయం. క్లైమాక్స్ కి ముందు సన్నివేశంలో మణిరత్నం 'గీతాంజలి' ని గుర్తు చేశాడు. నటనపరంగా, సిద్ధార్ద్ కి దొరికింది మంచి పాత్ర, గత సినిమాలతో పోల్చినప్పుడు బాగా చేశాడు కూడా. నాయిక లిద్దరిలోనూ విద్యగా చేసిన నిత్యమీనన్ ని కొంచం ఎక్కువ మార్కులు పడతాయి. ప్రియా ఆనంద్ ఎందుకోగానీ సిద్ధార్ద్ కన్నా పెద్దదానిలాగా అనిపించింది, చాలాచోట్ల.

డబ్బింగ్ సినిమా కావడం కొంచం ఇబ్బంది పెట్టిన విషయం. చెన్నైని హైదరాబాద్ అనుకోవాల్సి రావడం లాంటివి కొంచం సరిపెట్టుకోవాలి. సత్యం సినిమా, అఘల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. పత్రికా సంపాదకుడిగా ఎమ్మెస్ నారాయణ, రేణు తండ్రిగా తనికెళ్ళ భరణిలవి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు. కేవలం తెలుగు నేటివిటీ చూపించడంకోసం తీసుకున్నట్టున్నారు. వనమాలి పాటలూ, ఉమర్జీ అనురాధ సంభాషణలూ బాగున్నాయి, కథకి తగ్గట్టుగా. పబ్లిసిటీలో పోస్టర్ల మీద 'ఈ వయసిక రాదు' అని సబ్ టైటిల్ వేస్తున్నారు కానీ, థియేటర్లో ఇది కనిపించలేదు. సినిమా కథకి అంతగా అతకలేదు కూడా. ఈమధ్య కాలంలో థియేటర్లో వరుసగా చూసిన మూడో డబ్బింగ్ సినిమా ఇది. టైటిల్ కి అర్ధం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

10 కామెంట్‌లు:

 1. inthaki meeku nachchindaa nachchaledaa anedi cheppaledu meeru. meeru ee cinemani migatha cinemalatho polchaaru kanuka naku anipinchinadi inkokati cheppadalachukunna. indulo sidharthni mruthyuvu tarumuthondi annanduku symbolicga vaadiki oka negro kanipisthaadu. sarigga ilane balachandar gaaru andamayina anubhavam ani kamalhaasan movielo chupinchaaru.

  రిప్లయితొలగించు
 2. 'చక్రం' సినిమా గుర్తురాలేదా మీకు?

  రిప్లయితొలగించు
 3. మీ విశ్లేషణ కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇంతకుముందు మీ ఇతర సినిమా విశ్లేషణలతో నేను చాలావరకు ఏకీభవించేవాడిని. ఈ సినిమాలో చాలా విషయాలు నన్ను నిరుత్సాహపరిచాయి. డైలాగ్స్‌ రాసిన ఉమర్జీ అనురాధ మన తెలుగువారేనా అన్న సందేహం కలిగింది. కాన్సెప్ట్‌ బాగున్నా టేకింగ్ చాలా సాగదీసినట్టుగా ఉంది. కీ పాయింట్‌ ని రివీల్‌ చెయ్యడానికి దర్శకుడు చాలా ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్‌ చప్పగా అనిపిస్తుంది. పాటల పిక్చరైజేషన్‌ కూడా చప్పగా ఉంది. సంగీతం పరంగా ఒకట్రెండు పాటలు నాకు నచ్చాయి. నిత్యామీనన్‌ కి ఎవరు డబ్బింగ్‌ చెప్పారో కానీ బాలేదు. మొదటి భాగం కన్నా రెండవ భాగం ఎక్కువ ఫిలసాఫికల్‌గా అనిపిస్తుంది. మొదటి భాగంలో కూడా ఆ షేడ్స్‌ ని తీసుకువస్తే బావుండేది. నటన విషయంలో నిత్యామీనన్‌కి స్కోప్‌ ఎక్కువలేదు. ప్రియా ఆనంద్‌ మిగిలిన సినిమాలకన్నా బాగా చేసింది. నాకైతే సినిమా నచ్చలేదు. ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ నచ్చాయి.

  రిప్లయితొలగించు
 4. @తృష్ణ: వావ్.. నిజమే కదూ.. నేను ఈ లైన్లో ఆలోచించ లేదండీ.. ధన్యవాదాలు.
  @cenima: అవునండీ.. చాన్స్ ఉంది.. ధన్యవాదాలు.
  @ రసజ్ఞ : 'ఈ సినిమా నన్ను ఏమాత్రమూ నిరాశ పరచలేదు.' అని రెండో పేరాలోనే చెప్పాను కదండీ.. 'అందమైన అనుభవం' ..నిజమేనండీ.. పోలిక ఉంది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 5. @హరిచందన: 'చక్రం' నేను థియేటర్లో చూడలేదండీ.. టీవీలో కూడా ఎప్పుడూ పూర్తిగా చూడలేదు.. నిజమే, పోలికలున్నాయి.. ధన్యవాదాలు.
  @మురారి: మొత్తంగా అర్బన్ సినిమా, పైగా గీత వాళ్ళు తమిళియన్స్.. కాబట్టి డైలాగులకి అంతకన్నా అవకాశం లేదనిపించిందండీ.. నాకు, పాటలు, చిత్రీకరణ కూడా నచ్చాయి. గత రెండు డబ్బింగ్ సినిమాల్లో (రంగం, వైశాలి) ఈ మాత్రం కూడా లేకపోవడం వల్లనేమో.. నిత్య సొంత డబ్బింగ్ అనుకుంటానండీ.. 'అలా మొదలైంది' లో కూడా అదే గొంతు. నాకు బహుశా సినిమాలో ఉన్న ఫీల్ బాగా నచ్చిందేమో అనుకుంటున్నా.. ధన్యవాదాలు.
  @హరేకృష్ణ: ఇదో కొత్త కోణం! బాగుందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు