ఆదివారం, జూన్ 26, 2011

మమత

నిన్నమొన్నటి వరకూ తన ప్రీమియర్ షోలకి నిర్మాత మరియు కథానాయక బాధ్యతలకి మాత్రమే పరిమితమైన సుమన్ బాబు మెల్ల మెల్లగా తన బాధ్యతలని పెంచుకుంటున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ సుమన్ ప్రొడక్షన్స్ సగర్వంగా సమర్పిస్తున్న ప్రీమియర్ షోల పరంపరలో నాలుగోదైన 'మమత' కి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలని తనే సమకూర్చుకోడంతో పాటుగా, యధావిధిగా ప్రధాన పాత్రని శక్తి మేరకి ధరించాడు. ఏ ఇతర పాత్రా తను పోషించిన పాత్ర దరిదాపులకి ఏ విధంగానూ రాని విధంగా శ్రద్ధ తీసుకున్నాడు కూడా.

టైటిల్స్ పూర్తవ్వగానే ఓ కాలేజీ. అక్కడ ఏం చెబుతారన్నది రహస్యంగానే ఉంచారు. ఆ క్యాంపస్ లో ఓ మెల్లకన్ను అమ్మాయి 'మమతా.. మమతా..' అని అరుచుకుంటూ రావడం ప్రారంభ దృశ్యం. ఎంత లాజిక్ పక్కన పెట్టి చూడాలి అని ముందుగానే నిర్ణయించుకున్నా, "ఇప్పటి అమ్మాయిలు సెల్ ఫోన్ లో మెసేజో, మిస్డ్ కాలో ఇచ్చి ఫ్రెండ్స్ ని పిలుస్తున్నారు తప్ప, ఇలా కోర్ట్ అమీనా లాగా అరవడం లేదు కదా" అని డౌట్ వచ్చేసింది. అయితే, ఈ షో మొత్తం మీద ఎక్కడా, ఎవరి దగ్గరా సెల్ ఫోన్ అన్నది కనిపించలేదు, బహుశా బడ్జెట్ ఒప్పుకుని ఉండకపోవచ్చు.

నాలుగే నాలుగు క్లోజప్ షాట్లలో మమత ప్రత్యక్షం. ఈ అమ్మాయికి కూడా మెల్ల కన్ను. 'సిరి మెల్ల' అంటారు పెద్ద వాళ్ళు. అందుకే కాబోలు, ప్రతిష్టాత్మకమైన సుమన్ ప్రొడక్షన్స్ లో టైటిల్ పాత్ర పోషించే అవకాశం వచ్చింది. సినిమాకి వెళ్దామన్న స్నేహితురాలిని, మెత్తగా కోప్పడి, తను తెలుగు ట్యూషన్ కి వెళ్ళాలి కాబట్టి రావడం కుదరదని చెప్పేస్తుంది మమత. ఈ అమ్మాయికి అన్ని సబ్జక్ట్ లలోనూ టాప్ మార్కులు వస్తున్నాయిట , తెలుగులో తప్ప. వాళ్ళ నాన్నగారికి తెలుగంటే ఇష్టంట. తెలుగు లో తక్కువ మార్కులు రావడం గురించి వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారో స్నేహితురాలికి చెప్పి చెప్పి ట్యూషన్ కి బయలుదేరుతుంది.


భారతి మేడం (కృష్ణశ్రీ) దగ్గర తెలుగు ట్యూషన్ పూర్తి చేసుకుని, అప్పటిక్కూడా తనకోసం వెయిట్ చేస్తున్న ఫ్రెండ్ కి (మమతకి కారుంది, వెయిట్ చేస్తే ఆటో ఖర్చులు కలిసొస్తాయి కదా) దొరికిందే చాన్సుగా తన తండ్రి డాక్టర్ శరత్ చంద్ర గొప్పదనాన్ని కథలు కథలుగా చెప్పడం మొదలు పెడుతుంది మమత. మంచి వాడు, సున్నిత హృదయుడు, ఎవరి కష్టాన్నీ చూడలేని వాడూ... మొత్తంమీద సారాంశం ఏమిటంటే, మదర్ తెరెసా మగజన్మ ఎత్తితే అచ్చం డాక్టర్ శరత్ చంద్రలాగే ఉంటుందని. శరత్ చంద్ర ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నెక్స్ట్ సీన్లో ముక్కలు ముక్కలు గా కనిపించేశాడు, కళ్ళు చెదిరే డిజైన్ ని పరీక్షగా చూస్తూ. 'ఐలవ్యూ డాడీ' లో వాడిన విగ్గే అయినప్పటికీ, పక్కన పేర్రాశారు.

ఓ పేషెంటు, పక్కన అతని తండ్రి (హేమచందర్) శరత్ చంద్ర మంచితనాన్ని ప్రేక్షకులకి విసుగొచ్చేలా పొగుడుతుంటే (అప్పటికే మమత నోటెంట వినడం అయిపోయింది కదా) చిరునవ్వులు చిందిస్తూ, తగుమాత్రంగా సిగ్గు పడుతూ వింటున్నాడు సుమనుడు. తర్వాతి దృశ్యంలో మ్యూజియం లాంటి పెద్ద బంగ్లాలో తండ్రీకూతురూ కలుసుకోవడం. తల్లి లేని మమతని అన్నీ తనే అయి పెంచిన తండ్రి శరత్ చంద్ర కూతురి కోసం కాఫీ తయారు చేసి తీసుకు రావడం, కూతురంటే తనకెంత ప్రేమో ఓ రెండు పేజీల డైలాగుల సాయంతో చెప్పడం పూర్తయ్యింది.

వాళ్ళింట్లో సింహాసనం లాంటి ఓ కుషన్ చైర్ ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే శరత్ చంద్రకి మనసు బాగోనప్పుడల్లా (పాపం, ఎప్పుడూ ఎందుకో అందుకు బాగోదు.. వెంటాడే (ప్రేక్షకులని వేటాడే) గతం ఉంది మరి) అందులో కూర్చుని దుఃఖ పడుతూ ఉంటాడు. (శ్రీనివాస్ పప్పు గారి లాంటి అభిమానులు కోప్పడమంటే ఓ మాట, నాకు 'జస్టిస్ చౌదరి' లో ఎన్టీఆర్ కి ఆవేశం వచ్చినప్పుడల్లా రివాల్వింగ్ చైర్లో కూర్చుని పైప్ పీల్చడం పదేపదే గుర్తొచ్చింది). మమత పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయినట్టుగా పీడకల (???) రావడంతో ఉదయాన్నే ఆ కుర్చీలో కూర్చుని శక్తివంచన లేకుండా బాధ పడుతున్న శరత్ చంద్రని, తను పెళ్ళే చేసుకోనని చెప్పి ఓదారుస్తుంది మమత.

వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన శరత్ చంద్ర మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడేమో అనిపించక మానదు, ప్రతి సంవత్సరం నవంబరు ఆరో తేదీన అతనా కుర్చీలో కూర్చుని దుఃఖ పడడం చూస్తే. ఆరోజు ప్రత్యేకత ఏమిటంటే, కొన్నేళ్ళ క్రితం అదే రోజున అతని భార్య, మూడేళ్ళ కూతురు మమతని అతని దగ్గర వదిలేసి మరో వ్యక్తితో వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసేసుకుంది. అప్పటినుంచీ మమతకి తల్లిలేని లోటు లేకుండా పెంచుతూ, భార్యని విపరీతంగా ద్వేషిస్తూ ఉంటాడు శరత్ చంద్ర. భార్య ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో ఉంచడు. ఈ కథ తెలిసిన మమత, అత్యంత ఆవేశంగా తన గదికి పరిగెత్తి, అచ్చం సుమన్ బాబు గీసినట్టుగా ఓ స్త్రీ బొమ్మ గీసి, కింద 'నా తల్లి రాక్షసి' లాంటిదేదో రాసి, తాపీగా, కోపంగా ఆ బొమ్మని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. (ఐలవ్యూ డాడీ లో కుర్రాడు చేసినట్టుగా).

నేపధ్య సంగీతం బ్రహ్మాండం బద్దలు కొట్టేస్తుండగా, ఆ చింపిన ముక్కలన్నీ జాగ్రత్తగా ఇంటి బయటకి తెచ్చి, ఓకే ఒక్క అగ్గిపుల్లతో తగల పెట్టడం ద్వారా అతి తక్కువ బడ్జెట్లో తల్లి మీద పగ తీర్చేసుకుంటుంది. ఇదిలా ఉండగా, తనకంటూ ఎవరూ లేని భారతీ మేడం అంటే మమతకీ, అలాగే మమత అంటే భారతీ మేడం కీ ఎంతో అభిమానం పుట్టి పెరుగుతూ ఉంటుంది. మమత తెలుగులో హయ్యెస్ట్ స్కోర్ సాధించడంతో ఆ అభిమానం అవధులు దాటుతుంది. ఫలితం, ఓ గిఫ్ట్ పట్టుకుని మేడం ఇంటికి వెళ్ళడం, అక్కడ ఓ గొప్ప రహస్యం తెలుసుకోవడం జరిగిపోతుంది.

బీద పేషెంట్ల దగ్గర ఫీజే తీసుకోని, అవసరమైతే పేషెంట్లని ఇంట్లో పెట్టుకుని వైద్యం చేసే శరత్ చంద్ర, సుధాకర్ అనే కుర్రాడిని వీల్ చైర్లో ఇంటికి తీసుకొస్తాడో రోజు. మమత అతడిని సొంత తమ్ముడిలా చూసుకోవడం మొదలు పెడుతుంది. త్వరలోనే, శరత్ చంద్రకి అతనంటే అభిమానం మొదలవుతుంది. ఎంతగా అంటే, అతను వైద్యం పూర్తయ్యి వెళ్లిపోతుంటే బుళుకూ బుళుకూ ఏడ్చేసేటంతగా. చివరాఖరికి అతగాడు భారతి మేడం కొడుకని తెలియడంతో పాటుగా, ఆ కుటుంబానికి సంబంధించిన ఓ ముఖ్యమైన రహస్యం బయట పడడం, పాతకాలపు నాటకాల్లోలా ముఖం మీద ఎర్ర లైటు ఆర్పి వెలిగించే టెక్నిక్ ద్వారా శరత్ చంద్ర కోపాన్ని ఓ ఐదారు నిమిషాలు చూపించాక, సమస్యకి మమత తనదైన పరిష్కారాన్ని సూచించేయడం ముగింపు.

టైటిల్స్ లో సుమన్ ప్రొడక్షన్స్ సమర్పించు 'మమత' అని వెయ్యగానే, వెరీ నెక్స్ట్ టైటిల్ 'మేకప్ వై. హరి' ..మేకప్ కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది దీనిని బట్టి తెలుస్తోంది కదా. ఎప్పటిలాగే సుమన్ బాబు అత్యంత అందంగా కనిపించడానికి ప్రయత్నించాడు. మార్చిన చొక్కా మార్చకుండా మార్చేశాడు. పెద్దగా బడ్జెట్ లేకపోవడం వల్ల అనుకుంటా మిగిలిన వాళ్ళ మేకప్, కాస్ట్యూమ్స్ మీద అంత శ్రద్ధ పెట్టలేకపోయారు. సుదీర్ఘమైన సంభాషణలు, వాటిలో మితిమీరిన ఇంగ్లిష్ పదాలు (అదేంటో కానీ తెలుగు లెక్చరర్ కూడా ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడుతుంది) డైలాగ్స్ డిపార్టుమెంటు ప్రత్యేకత. నిడివి కేవలం రెండు గంటలే అవడం వల్లనేమో పాటలూ అవీ లేవు. ఎలాగో 'ట్విస్ట్' ప్రకటన వచ్చేసింది కాబట్టీ, దానిక్కూడా తనే దర్శకుడు కాబట్టీ అనుకుంటా ఇంద్రనాగ్ ఈసారి కూడా పాదనమస్కారం చేయలేదు.

40 కామెంట్‌లు:

 1. murali garu nenu mee blog chadavadam kosame inti dagara net petinchi nattu ayindhi and mee review (ani nenu anukunta) of mamata ok eppati antha funny ga ledemandhi?

  రిప్లయితొలగించు
 2. మీకు చాలా ఓపిక ఉందండి. సుమన్ సీరియల్ చూడటమే కాకుండా మళ్లీ దాని మీద టపా రాయడం కూడానా.. అంతా సుమనుడి మీద మీ అభిమానం. సుమన్ సీరియల్సు ఎక్కువ చూడకండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. :)

  రిప్లయితొలగించు
 3. నేను చివరకి గంటా చూశాను, పర్లా మిగతావి ఐదు నిముషాలు చూస్తే దడుచుకునేట్టు ఉన్నాయి, ఇది టివీ పెట్టి అప్పుడప్పుడూ వింటూ ఉండొచ్చు, తట్టుకోగలం, ఆ తమ్ముడుకేసింది ఎవరండీ బాబు, సుమన్ బాబు కన్నా అదరగొట్టేశాడు, బడ్జెట్ బాగా లో అట్టుంది ఇంద్రనాగ్ కుడా కోటీశ్వరుడు ఐపోతాడేమో అనుక్కున్నా పాపం అయ్యేట్టు లేదు.

  రిప్లయితొలగించు
 4. ఆ ట్విష్ట్ ఎమిటో వివరించగలరని మనసారా ప్రార్థిస్తున్నాను :)

  రిప్లయితొలగించు
 5. మీరు చాలా ధైర్యవంతులు...
  నాకు అయితే సినిమా చూసినట్టే వుంది.. మీ review చూసాక..

  రిప్లయితొలగించు
 6. హమ్మయ్య ..మేము కష్టపడకుండా..మమతని ..చూపించారు.మురళి గారు. ఏమైనా మీకు సుమన్ బాబు అంటే చాలా అభిమానం. జస్టిస్ చౌదరి ని గుర్తుకు తెచ్చారు.. ధన్యవాదములు..అండీ.

  రిప్లయితొలగించు
 7. హ్హహ్హహ్హ నేను ఈ మమతని పూర్తిగా ఫేమిలీతో సహా ఆస్వాదించా మురళిగారు.
  చిన్న చెణుకులు:
  నాన్నా మీరు భోజనం అయ్యాక మందులువేసుకున్నారా అని కూతురు అడగ్గానే బాబు హా అని చిన్నగా నాలిక ఐమూలగా పెట్టి(మర్చిపోయాను అన్నట్టు)న ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే.
  భారతీ మేడం డాక్టర్ బాబు రూం లోపలికి రాగానే బాబుకి వచ్చిన కోపానికి పలికిన డైలాగులతో పాటూ ఆ హావభావాలు చూసితరించాల్సిందే(జన్మ తరింపచేసాడు) అని మనవిచేస్తున్న్నా అధ్యక్షా.
  చివరిగా అన్నగారితో పోలిక తెచ్చారు మనసెక్కడో కలుక్కుమంది కానీ ఈ పాలికి సెమించి ఒగ్గేత్తన్నా అని గమనించ ప్రార్ధన.

  రిప్లయితొలగించు
 8. హ్హహ్హ.. ఈ సారి బామ్మని కూడ కూర్చోపెట్టి చూపించా ఈ సినిమా... కాసేపు చూసి బోరు కొట్టేసింది తనకు.. ఇదేం సినిమా, ఒక పాట లేదు, పద్యము లేదు.. ఇలాంటి సినిమాలు నేను చూడను అని చెప్పేసి వాకింగ్కి వెళ్ళిపోయింది.. నేను మాత్రం చివరిదాకా చూశా :)
  సుమన్ బాబు సినిమల్లో డైలాగులు భలే ఉంటాయి.. అసలు మాటల మధ్యలో వచ్చే ఇంగ్లీష్ డైలాగులు ఇంకా సూపర్ :D

  రిప్లయితొలగించు
 9. మురళిగారు, మా ఇంట్లో అందరూ నన్నదోలా చూస్తున్నా పట్టించుకోకుండా 'మమత' చూసాను. చివరాఖరిలో ఆ పిల్లవాడి తల్లి కృష్ణశ్రీ అని ఆమె తన భార్య అని తెలుసుకొని సుమన్ బాబు ముఖం ఎర్రగా (లైటు ఎఫ్ఫెక్టు) మారే వరకు చూసాను. తరువాత ముఖ్యమయిన పని ఉండి బయటకు వెళ్ళాను. తరువాత కథ ఏమయ్యిందో తెలీలేదు :-( . మీరు కథ చెప్తారన్నఆశతో పొద్దున్నే మీ నెమలికన్నులోకి చూసినా ముగింపు ఏమయ్యిందో చెప్పలేదు మీరు.
  నాకింకో డవుటు వచ్చింది, ఆ పిల్లాడు పోలికలు అచ్చం సుమన్ బాబు కొడుకులానే ఉన్నాయి. 'నీకు నవ్వు తెప్పించాలంటే ఏమి చెయ్యాలో నాకు తెలుసు' అన్న మమత నేను మనసులో శంకించిన కితకితలు పెట్టనే పెట్టింది బుల్లి తమ్ముడికి :-)

  రిప్లయితొలగించు
 10. సుమన్ బాబు సినిమా చూసి వచ్చి, తొలి రివ్యూ రాసారంటే, మురళి గారి గుండె ధైర్యానికి గండపెండేరమో, మణికంకణమో, కనకాభిషేకమో తప్పదు గాక తప్పదు. ఎవరయ్యా.. అక్కడ, ముందు సార్ కి దిష్టి తీద్దాం. సుమన్ బాబంత బూడిద గుమ్మడి కాయ ఒకటి పట్రా..

  రిప్లయితొలగించు
 11. :-)

  మురళి గారూ!!

  మీ రివ్యూ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను.

  నిజానికి ఆ టైముకి టీవీ చూస్తూ, ఎందుకో ఆ ఛానెల్లోకి తొంగి చూసి కూడా, ధైర్యం చాలక ఛానెల్ మార్చేసాను. అదీకాక, సుమన్‌బాబు విషయంలో అసలు (సినిమా) కంటే కొసరే (రెవ్యూయే) ముద్దని నాకు గట్టి నమ్మకం అన్నమాట.. అందుకని..

  రిప్లయితొలగించు
 12. సూపర్. మీరు ఏం భాష్యం చెప్తారా అనుకుంటూ చూసాను.
  -సూరంపూడి పవన్ సంతోష్.

  రిప్లయితొలగించు
 13. మన ఇంద్రనాగ్ మన సుమన్ బాబుకి పాద నమస్కారం చెయ్యలేదా????? ;)
  మీ ఓపికకి మెచ్చుకోవాలండీ మురళి గారు. ఆ టెలీ ఫిల్మ్ ఎలా ఉంటుందో ఊహించగలిగి, అది చూసాక మన పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలిసి ఉండీ కూడా ధైర్యం చేసారు అంటే, మీరు చాలా గ్రేట్ అండీ.. ఈ గ్రేటుల లిస్ట్ లోకి చేర్చాల్సిన వాళ్లు చాలానే ఉన్నారనుకుంట:)) లలిత గారితో కలిసి నేను కూడా ఆ లిస్ట్ ప్రెపేర్ చేయ్యడంలో సహాయం చేస్తా.. :)))
  టపా సూపరు:)

  రిప్లయితొలగించు
 14. మా ఇంట్లో టీ వీ కాలిపోయింది ఎలాగా అని అనుకుంటుండగా నిన్న "మమత"సినిమా అనగానే మీరు రాస్తారు కదా అని గెస్ చేసాను. సుమన్ సినిమాల లాగానే... మీరు కూడా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా రాసారు.
  బొగ్గులతో (గేస్ ఖరీదు అయింది కదా ) మగ్గిపోయే మాలాంటి గృహిణులకు ,బగ్గులతో సతమతమయ్యే సాఫ్ట్వేర్ నిపుణులకు సుమన్ సినిమాలే ఓదార్పు.

  మీలాంటి అభిమానిని సంపాదించుకున్నందుకు సుమన్ బాబు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి.

  brahma has done two mistakes!!!

  The great Director, producer and Actor Suman baabu ని చామన చాయలో, సన్నగా పుట్టించక పోవడం,The great writer and analyst muraLi గారిని డైరెక్టర్ గా మార్చలేకపోవడం.

  మరీ ఇంత "అతి" ప్రేమ కూడా మంచిది కాదు. మీ ప్రతిభ, అభిమానం గురించి తెలిసుకుని..... మిమ్మల్ని తన సినిమాలకి మాటల రచయిత గానో, డైరెక్టర్ గానో .... ఒక సంవత్సరం పాటు తన ఉషా కిరణ్ మూవీస్ లో మిమ్మల్ని పనిచేయమని కోరవచ్చేమో????

  ఆలోచించండి మరి !!

  రిప్లయితొలగించు
 15. హహహ మురళీ గారూ...బలే రాసారు...మీరు కనీ కనిపించనట్టు బలే నవ్విస్తారు "సుమన్"డీ :))....నిజంగానే మీ ఓపికకి జోహార్లు. పట్టు విడవకుండా చూసేసారుగా మమత ని....సుమన్ బాబు సంఘానికి మీరే అత్యుత్తమ అధ్యక్షులు.

  మరింకెందుకు ట్విస్ట్ కి రెడీ అయిపోండి. :D

  రిప్లయితొలగించు
 16. అతి తక్కువ పాత్రలతో, అతి తక్కువ ఖర్చుతో, మితి మీరే డైలాగ్స్ తో సినిమాలు తీసి అతిగా ప్రేక్షకులని కష్టపెట్టే సుమన్ సినిమాలకి నేనూ ఎడిక్ట్ అయిపోయాను. చూడలేను, చూడకుండా ఉండలేను. అంతా సుమన్ మాయ అంటారా? :))

  రిప్లయితొలగించు
 17. మీరు వ్రాసే పుస్తకాల్లో ముగింపు దాచిపెట్టారు అంటే అర్ధముంది, ఆ బుక్స్ చదువుకోవచ్చు కాబట్టి. మరి ఈ సినిమాలో సస్పెన్స్ ఎందుకు దాచేసారు. ఇది మళ్ళీ రాదే చూసుకుందామంటే. ఏం లేదండి, భారతి కొడుకును ఇంటికి తీసుకు రావటం వరకే నేను చూసాను. కాని ఆ తరువాత అనుకోని అంతరాయం వల్ల పూర్తిగా చూడలేక పోయాను. మీ మీదున్న నమ్మకంతోటే మధ్యలో వదిలేసి వెళ్ళాను. ఇప్పుడు నాకు ముగింపు ఎలా తెలవాలి....ఎలా తెలవాలి...ఎలాతెలవాలి:(

  రిప్లయితొలగించు
 18. అయ్య బాబొయ్....సుమనుడి సినిమా చూదటమె
  కాక వ్యాఖ్య వ్రాయటమా.....అన్నయ్యా....
  వా.....వా....యెమైంది నీకు........

  రిప్లయితొలగించు
 19. మురళిగారూ.. హిహిహి సూపరో సూపరు..
  శరత్ చంద్ర గారి బ్లాక్ డే నవంబరు 5 అండీ.. ఆరు కాదు. ఇదిగో మీరిలాంటీ పొరపాట్లు చేస్తే లలిత గారు పెట్టబోయే సంఘానికి అధ్యక్షుడిగా మీకు పోటీగా నేనొచ్చేస్తా.. ;) ;) ;)

  "ట్విస్ట్" కోసం ఎదురుచూస్తూ..
  తోటి సుమన్ అభిమాని ;)

  రిప్లయితొలగించు
 20. "ట్విస్ట్" కోసం ఎదురుచూస్తూ..
  తోటి సుమన్ అభిమాని..

  నేను కూడా .. :) :)

  రిప్లయితొలగించు
 21. హ్హహ్హహ్హా!! ఈసారి బ్లాగులన్ని గోలగోలగా సుమన్ సినిమా సందడితో! మీరు తప్పక రాస్తారనుకున్నా! రాసేసారు!{ఎంతైనా మీరు వీరాభిమాని కదా బాబుకు ;) ] నేనైతే అస్సలు సాహసం చేయలేదు :)))))) పైగా వేణుగారి బజ్జులో పెట్టిన లింకులో వీడియో చూసి పడిపోతే పాపం మా చందు నీళ్ళు చల్లి లేపారు! :))) మీకు మాత్రం ఓర్పురత్న, సహనచక్ర అని బిరుదులు ఇవ్వాలనుందండీ....ఎలా భరించారండీ బాబూ!!

  రిప్లయితొలగించు
 22. eenadu lo ee prakatana choosa ninna.. ee roju ventane mee blog open chesa..anukunnattugaane oka adhbutamaina sameeksha chesaru.. indranag suman ki padabhivandanam chesinattuga.. meeku suman padabhi vandanam cheyyali.. naaku telisi.. suman teleshows meeda sameeksha cheyyagalige dhairyam meeku maatrame vundanukunta....

  రిప్లయితొలగించు
 23. బాబు సుమన్ వీళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు బాబు .నీ ఎదుగుదలను చూసి భరించలేక ఇలా అంటున్నారు. నేను చెబుతున్నాను కదా నువ్వు మరో సినిమా తియ్యి మళ్లీ చూసేందుకు వీరే ముందుంటారు. నువ్వు తలుచుకుంటే ఎన్ని రోజులు వారానికో సినిమా తియగలవు. ) . ( నాకు సరిగ్గా నీ సినిమా వచ్చేప్పుడే అత్యవసరమైన పని పడుతుంది. దాంతో నీ సినిమా చూడలేక పోతున్నాను)

  రిప్లయితొలగించు
 24. ఎప్పుడో కళంకిత టైంలో పేరు వినడం తప్ప అసలీ సుమన్ గురించి ఏ మాత్రం పట్టించుకోని నేను మీరు, రాజ్ ఇంకా కొందరు అభిమానులు రాస్తున్న రివ్యూలు అన్నీ చదివి... అసలు గొప్ప హాస్యరసభరిత చిత్రాలను మిస్ అవుతున్నా అని అన్కుని నిన్న మధ్య మధ్యలో అక్కడక్కడా చూస్తూ చివరి అరగంటా పూర్తిగా చూశానండి. నేను కూడా ఆయన అభిమాన సంఘంలో చేరిపోయా... ట్విస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నా..

  కానీ నిన్న నాకో డౌటొచ్చింది. మనమంతా ఏదో ఇలా కామెడీ చేస్కోడానికి చూస్తుంటే మన బాబు గారు తన టీఆర్పీ రేటింగ్స్ పెరిగిపోతున్నాయ్ అభిమాన్లు పెరుగుతున్నారు అనుకుని మరింత విజృంభించరు కదా.. ఐనా నిన్న మొత్తం మీద ఒక గంట చూసినందుకే నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది. మీరిన్ని సినిమాలు చూస్తూ ఎలా భరిస్తున్నారండీ బాబు.. మీది మహా గట్టిప్రాణం సుమీ !!

  రిప్లయితొలగించు
 25. నేనైతే వీకెండ్ అంతా నిద్ర పోలేదంటే నమ్మండీ! "మమత" సినిమా ఎవరూ చూడరేమో, చూసినా రివ్యూ రాసే పరిస్థితిలో వుండరేమో (ఐ.సీ.యూ లో ఉంటారేమో!) అని ఒకటే పీడకలలు. సోమవారం పొద్దున్న మీ రివ్యూ చూసింతరువాత కానీ నా సుమను- ఛీ ఛీ- అదేనండీ, నా మనసు కుదుట పడ లేదు.

  @కొత్తావకాయ గారూ, మీరన్నది నిజమేనండి. మురళి గారికి (సుమన్ గారితోపాటు) దిష్టి తీసెయ్యాల్సిందే!

  @బులుసు గారూ, మీ రివ్యూ ఏదండీ?ఇంకా ఆలస్యమైతే బెంచీ ఎక్కాల్సొస్తుంది మరి!.


  శారద

  రిప్లయితొలగించు
 26. @S: :-) ధన్యవాదాలండీ..
  @బాలు: నేనెప్పుడూ సీరియస్ గానే రాస్తున్నానండీ.. అసలు ఫన్నీ గా రాసిందెప్పుడు? :-) :-) ..ధన్యవాదాలు.
  @Tollywood Spice: నేనూ అనుకుంటానండీ, దూరంగా ఉందామని.. కానీ అంత కామెడీ ఇంకెక్కడా దొరకడం లేదు మరి :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 27. @తార: అవునండీ.. ఇందులో నాకు అస్సలు నచ్చని విషయం బడ్జెట్టే.. లేదా, పోదా? తీసేదేదో కొంచం భారీగా తియ్యొచ్చు కదా? ..ధన్యవాదాలు.
  @సందీప్: సుమన్-ఇంద్రనాగ్ ద్వయం సగర్వంగా సమర్పించ బోతున్న ఐదో ప్రీమియర్ షో పేరు 'ట్విస్ట్' అండీ.. త్వరలో, ఈటీవీలో.. ..ధన్యవాదాలు.
  @సుధ: :-) :-) ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 28. @వనజ వనమాలి: చూస్తే ఆ సరదా వేరండీ.. 'ట్విస్ట్' ప్రయత్నించండి :)) ..ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: నాకైతే స్క్రీన్ షాట్ తీసి దాచాలని అనిపించిందండీ.. కానీ ఎన్నని తియ్యగలం?? అన్నట్టు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' 'ఉషా పరిణయం' టైం లో కొందరు సిని, టీవీ రంగ ప్రముఖులు (?) పౌరాణికాల్లో అన్నగారి వారసుడు సుమన్ బాబేనని ఈటీవీ సాక్షిగా ప్రకటించారు. అప్పటినుంచే నాకు బాబు లో అన్నగారు కనిపిస్తున్నారు. ఈ ప్రకటన సంగతి బాలయ్య బాబుకి తెలుసంటారా?? ...ధన్యవాదాలు.
  @మేధ: ఇందులో మాత్రం నాకు ఇంగ్లీష్ మధ్యలో అక్కడక్కడా తెలుగు డైలాగులు ఉన్నట్టు అనిపించిందండీ... ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 29. @శ్రీ: అయ్యో.. అతను సుమన్ బాబు (శరత్ చంద్ర) కొడుకు కాదండీ.. అతని మాజీ భార్య కొడుకు.. అదన్నమాట. మిగిలిన కథ కూడా చెప్పేస్తాను లెండి.. ఇంకా మిత్రులు కొందరు అడిగారు కదా.. ధన్యవాదాలు.
  @కొత్తావకాయ: మీరు మరీనండీ.. నేనొక్కడినేనా? చాలామంది చూశారు.. అన్నట్టు మీరు కూడా 'ట్విస్ట్' ప్రయత్నించ కూడదూ? :)) ..ధన్యవాదాలు.
  @రవికిరణ్: అసలు ఎన్ని రివ్యూలు చదివితే, చూసినప్పటి ఆనందం దొరుకుతుంది చెప్పండి? అయినా ఒకసారి చూస్తే తప్ప మీకు అదేమిటో అర్ధం కాదు లెండి:)) ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 30. @పక్కింటబ్బాయి: నాదేముందండీ.. సుమన్ బాబు చెప్పిందేమిటో ఇక్కడ రాసుకోవడమే కదా! ..ధన్యవాదాలు.

  @మనసు పలికే: అబ్బే, అంత గ్రేటు ఏమీ లేదండీ.. అసలు సుమన్ బాబు విశ్వరూపం చూడాలంటే, సాంఘికం కాదు.. పౌరాణిక చూడాలి.. మళ్ళీ ఎప్పుడు వస్తుందో .. ..ధన్యవాదాలు.

  @నీహారిక: బొగ్గులు-బగ్గులు.. ప్రాస బాగుందండీ.. అన్నట్టు మీరన్న ప్రమాదం ఏదీ జరగదు లెండి :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 31. @కృష్ణ ప్రియ: :-) :-) ..ధన్యవాదాలండీ..

  @ఆ.సౌమ్య: అబ్బే, పదవులూ అవీ ఎందుకండీ.. 'ట్విస్ట్' సరే కానీ, పౌరాణికం కానీ, జానపదం కానీ తీస్తే చూడాలని ఉందండీ నాకు.. ధన్యవాదాలు..

  @బులుసు సుబ్రహ్మణ్యం: నిజమేనండీ సుమన్ మాయ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 32. @జయ: మీరన్నది పాయింటే, ముగింపు చెప్పేస్తాను. మమత తన తండ్రిని తల్లితో రెండో పెళ్ళికీ, తల్లిని తండ్రితో మూడో పెళ్ళికీ ఒప్పించేసి, తనేమో తను ప్రేమించిన క్లాస్మేట్ ని మొదటి పెళ్లి చేసుకోడానికి సిద్ధ పడిపోతుంది.. మీకు కొంచం తల తిరుగుతున్నట్టు ఉంది కదండీ.. అందుకే క్లైమాక్స్ రాయలేదు నేను :)) ..ధన్యవాదాలు.

  @శశి: ఏమీ అవలేదండీ.. నేను వీలైనంతవరకూ మిస్ కాకుండా చూస్తూ ఉంటాను. అంతే.. ధన్యవాదాలు.

  @రాజ్ కుమార్; నిజమేనండీ, పొరపాటు జరిగింది.. ప్చ్.. సుమన్ బాబు ఉచ్చారణ లో ఐదు ఆరులా వినిపించింది. అసలే బోల్డు బాధలో ఉంది చెప్పిన డైలాగు కదా.. థాంకులు.. అన్నట్టు ఆ సంఘానికి తనే అధ్యక్షులుగా ఉండడానికి లలితగారు ఒప్పుకున్నారు.. ఒక వేల పురుషులకి రిజర్వ్ చేస్తే మాత్రం మీరు బులుసు గారితో పోటీ పదండి.. నాకు పదవులూ అవీ అస్సలు ఒద్దు :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 33. @స్వామి (కేశవ) : చాలా సంతోషం అండీ :-) ..ధన్యవాదాలు.

  @ఇందు: అబ్బా.. సుమన్ బాబు పౌరాణికాలు చూసిన వాళ్లకి సాంఘికాలు పెద్ద సమస్య కాదండీ.. అసలైన మజా అంతే పౌరాణికాలే.. ధన్యవాదాలు.

  @సత్య: మీరీమధ్య బ్లాగులకి కొంచం దూరంగా ఉన్నట్టున్నారు.. బులుసు గారు, రాజ్ కుమార్ గారు ఒక్కో సీన్ నీ వర్ణిస్తూ విపులంగా రాస్తున్నారు :)) ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 34. @బుద్దా మురళి: తీసేదేదో 'శక్తి' 'బద్రీనాథ్' లాంటి భారీ బడ్జెట్ సినిమా తియ్యమనండీ, తన స్థాయికి తగ్గట్టు. అవి కూడా వారానికొకటి తీయగలడు కదా!! ... ధన్యవాదాలు.

  @వేణూ శ్రీకాంత్: ముందుగా మీకు స్వాగతం.. త్వరలోనే బులుసు గారిలాగా మీరు కూడా అడిక్ట్ అయిపోతారని అనిపిస్తోంది :)) ..ధన్యవాదాలు.

  @శారద: 'శ్రీకృష్ణ బలరామ యుద్ధం' రెండుసార్లూ, 'ఉషా పరిణయం' థియేటర్ లోనూ చూసి తట్టుకున్న గుండె నాది.. మీరు అనవసరంగా భయ పడకండి :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 35. సుమన్ సినిమాలన్నీ యూ ట్యూబ్ కి పెట్టేస్తున్నారు కదా, మీ రివ్యూ పుణ్యమా అని ఈ సినిమా చూడాల్సి వచ్చి౦ది :(

  ఆ రె౦డో అమ్మాయి (మమత)కి మెల్ల కన్ను కాద౦డీ, గుడ్డి అమ్మాయి లా ఉ౦ది మీరు చెప్పిన సీన్ లో :)

  చూడ౦డి మీ స్పూర్తి తో బోలెడ౦త మ౦ది చూడగానే రివ్యూలు రాసేసి/ రివ్యూ రాయడ౦ కోస౦ కష్టపడి సినిమా చూసేసి!!!... మొత్తానికి అ౦దరూ సుమన్ సిన్మాలకి కూడా, బద్రినాధ్ రే౦జ్ అటెన్షన్ తెప్పిస్తున్నారు. ఇ౦ద్రనాగ్, సుమన్ మీకె౦త రుణపడి ఉన్నారో కదా.

  రిప్లయితొలగించు
 36. @Mauli: అదేం మాటండీ.. కామెడీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో కదా అనిపిస్తోంది నాకైతే :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 37. అయ్యా మురళి గారు. నేను ఎన్నాళ నుండో బాబు గారి సినిమా ల కోసం వెతుకుతున్నాను.
  ఎవైన లంకె లు ఉంటె ఇచ్చి నన్ను మీ అభిమాన సంఘం లో చేర్చుకోగాలరని ప్రార్థన.

  రిప్లయితొలగించు
 38. @CricketLover: అన్ని వీడియోలూ అంటే కష్టమండీ.. కాకపొతే యూట్యూబ్ లో కొన్ని వీడియోలో ఉన్నట్టు సమాచారం. ప్రయత్నించండి.. త్వరలో 'ట్విస్ట్' రాబోతోంది.. చూసి ఆనందించగలరు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు