సోమవారం, జూన్ 20, 2011

ఇట్లు, మీ విధేయుడు

పుస్తకాల షాపుకి వెళ్ళినప్పుడు ఊరికే పైపైన డిస్ప్లే లో ఉన్న పుస్తకాలు చూసేసి ఊరుకోకుండా, రాకుల్లో సద్దేసిన పుస్తకాలని కూడా తీరికగా, ఓపిగ్గా చూస్తూ ఉండాలి.. ఏమో, ఎవరికి తెలుసు. "అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే.." అట్టడుగు రాకుల్లో మనం ఎన్నాళ్ళుగానో వెతుకుతున్న పుస్తకం దొరకవచ్చు. ఆమధ్యన నాకలాగే దొరికింది, భమిడిపాటి రామగోపాలం రాసిన 'ఇట్లు, మీ విధేయుడు' పుస్తకం. ఇప్పటికి సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్న కథా సంపుటం.

భరాగోగా తెలుగు పాఠకులకి చిరపరిచితుడైన భమిడిపాటి రామగోపాలం చాలా సీరియస్ కథలు రాసినప్పటికీ, ఆయనకి హాస్య రచయితగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. హాస్యానికి ఉన్న ఆకర్షణ అలాంటిది మరి. 1990 లో యాభై రెండు కథలతో వచ్చిన ఈ సంకలనం 2001 నాటికి ముప్ఫై తొమ్మిది కథలకి చిక్కిపోయింది. అయితేనేం, సంకలనానికి బయట ఉన్న కథలు చాలా వరకు చదివేసినవే కావడం కొంత ఊరట.

సంకలనం లో మొదటి కథ 'వెన్నెల నీడ.' ముళ్ళపూడి వెంకట రమణకి ఇష్టమైన కథ, ఆయన ఎప్పటికైనా సినిమా తీయాలనుకున్న కథ. ఇప్పుడు రాసినాయనా, సినిమా తీయాలనుకున్నాయనా కూడా మన మధ్యన లేరు. కథానాయిక శ్యామలకి పెళ్లై ఏడేళ్ళయ్యింది. ఇద్దరు పిల్లలు. భర్త కలెక్టరాఫీసులో గుమస్తా. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు శ్యామలనీ, పిల్లలనీ. భర్తా, పిల్లలతో పుట్టింటికి వెళ్లి తిరిగి వస్తుండగా రైల్లో కనిపించిన ఒకతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది శ్యామలకి.

అతను కొంచం మొహమాట పడుతుంటే తనే మాట కలిపి, ఎక్కడ కలిశామని అడుగుతుంది. పూర్వాశ్రమంలో ఆమెని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు అతను. ఆస్తి పరులు కాదని అ సంబంధం వద్దనుకున్నారు శ్యామల పెద్దవాళ్ళు. అతను ప్రస్తుతం "ఒంగోల్లో సబ్-కలెక్టర్ గా" ఉంటున్నాడు, త్వరలో కలెక్టరూ అవుతాడు. తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. అన్నట్టు ఇది 'వంశీకి నచ్చిన కథ' కూడా. సంకలనం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క కథా చాలేమో.మెజారిటీ కథల్లో ఇతివృత్తం మధ్యతరగతి జీవితమే. 1960 లో మొదలు పెట్టి, తర్వాతి ముప్ఫై ఏళ్ళ కాలంలో సమాజంలో వచ్చిన మార్పులని మధ్య తరగతి దృక్కోణం నుంచి రికార్డు చేశారు భరాగో ఈ కథల ద్వారా. కథా నాయకులు గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తాలు, కింది స్థాయి అధికారులు, తప్పితే కలెక్టర్లు. నిజానికి కలెక్టర్ల కథల కన్నా, గుమాస్తాల కథలే బాగా చెప్పారని అనిపించింది. ఈ చట్రానికి బయట ఉన్న కథలూ ఉన్నాయి.

భరాగో పేరు చెప్పగానే గుర్తొచ్చే కథల్లో మొదటి వరుసలో ఉండేది 'వంటొచ్చిన మొగాడు' లో కథానాయకుడు రామనాధం తనకి వంట వచ్చిన ఏకైక కారణంగా ఎదుర్కొన్న చిన్న చూపుని సరదా సరదాగా చెప్పారు. గంభీరంగా సాగే కథ 'త్రివర్ణ చిత్రం.' ఓ భార్య, భర్త, వాళ్ళకో స్నేహితుడు. అతనెవరో కాదు, ఆమెని ప్రేమించి కులం ఒకటి కాని కారణంగా పెళ్లి చేసుకోలేక పోయిన వాడు. అయినప్పటికీ వాళ్ళు ముగ్గురూ స్నేహితులే. కానీ ఆ ముగ్గురిలో ప్రతి ఒక్కరికీ మిగిలిన ఇద్దరిమీదా ఒక లాంటి అనుమానం. బుచ్చిబాబు 'నిరంతరత్రయం' కథని గుర్తు చేసే కథ ఇది.

చదివాక చాలా కాలం పాటు వెంటాడే కథల్లో మొదట ఉండేది 'మనోధర్మం.' శ్రీపాద వారి 'కలుపు మొక్కలు' తో కేవలం రేఖామాత్రంగా పోలిక ఉన్న కథ ఇది. సరస్వతి పాత్రని మర్చిపోవడం అంత సులువు కాదు. ఓ హెన్రీ తరహా మెరుపు ముగింపు 'వై డోంట్యూ మేరీ మీ' 'పడమటి గాలి' 'చక్రం' లాంటి కథల్లో కనిపిస్తుంది. 'గతి తప్పిన కరుణ' కథ చదువుతుంటే వడ్డెర చండీదాస్ రాసిన ఒకానొక కథ గుర్తొచ్చింది, పేరు గుర్తు రావడం లేదు. అయితే భరాగో ఈ కథని నడిపిన తీరు చాలా బాగుంది.

భరాగో కథ చెప్పే పధ్ధతి చాలా నిదానంగా, సాఫీగా ఉంటుంది. అలా అని బోర్ కొట్టదు. ఒకసారి చదవడం మొదలు పెడితే, అలా చదువుకుంటూ పోవడమే. చిన్న చిన్న వాక్యాల్లో జీవిత సత్యాలని మెరిపిస్తారు. "అబద్ధం అని తెలిసిపోయినంత మాత్రాన అందం నశించి పోయేటట్లయితే కావ్యాలు కాయితప్పడవలూ, ప్రబంధాలు పకోడీ పొట్లాలూ ఎప్పుడో అయిపోయి ఉండేవి.." పుస్తకం బరువుగానే ఉన్నప్పటికీ పేజీలు (415) తేలికగా, వేగంగా కదిలిపోతాయి. అలా అని ఇవేవీ కేవలం కాలక్షేపం కథలు కావు కూడా. చినవీరభద్రుడు, మధురాంతకం రాజారాం, చందు సుబ్బారావుల సమీక్షలనీ పొందు పరిచారు ఈ సంకలనంలో. రచయితే ప్రచురించుకున్న ఈ సంకలనం అని పుస్తకాల షాపులతో పాటు, ఏవీకెఎఫ్ లోనూ దొరుకుతోంది. వెల రూ. 160.

6 వ్యాఖ్యలు:

 1. మీరు చదివినన్ని నేను చదువుతున్నా(మీ సమీక్షల్లో పుస్తకాలు చదివిననవి అవుతున్నాయి),మీరు రాసినంత వేగంగా రాయలేక పోతున్నానేంటో.పైగా ఈ నెలలో అన్ని రాసేస్తున్నారేంటండీ..ఒక్క టపా స్థాయీ తగ్గకుండా.
  వెన్నెలనీడలు కథ మావాళ్లలో ఎవరికి పెళ్లి చూపులన్నా(ముఖ్యంగా అమ్మాయిలు) నాకు గుర్తొస్తూంటుంది. చెప్పేందుకు వయసు సరిపోకపోయినా కూడా చనువు తీసుకుని తొందర పడొద్దని సలహా చెప్తూంటాను.
  --సూరంపూడి పవన్ సంతోష్.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సంకలనం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క కథా చాలేమో..థాంక్స్ ..భాగ్యనగరం వెళ్ళేటపుడు తీసుకోవాలి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేనూ చదివాను ఈ పుస్తకం. మంచి పుస్తకం. మీ రివ్యూ చూసాక..మళ్లీ ఇంకోసారి తీసి చదవాలనిపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @పక్కింటబ్బాయి: కొని చదవకుండా ఉంచేసిన పుస్తకాలని తగ్గించడంతో పాటుగా, చాలా రోజుల క్రితం చదివిన పుస్తకాలని ఓసారి తిరగేసే కార్యక్రమం పెట్టుకున్నానండీ.. అందువల్ల మీక్కొంచం ఎక్కువ పుస్తకాలు కనిపిస్తున్నట్టున్నాయి ఇక్కడ.. ఇక 'వెన్నెల నీడ' విషయానికి వస్తే, అవి అప్పటి రోజులు. ఇప్పటి అమ్మాయిలూ, తల్లిదండ్రులూ కూడా ఏమాత్రం తొందర పడడం లేదు లెండి :)) ...ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: డిస్ప్లే లో లేకపోయినా అడిగి తీసుకోండి.. బాగున్నాయి కథలు.. ధన్యవాదాలు.
  @కృష్ణప్రియ: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళిగారూ. చాలా మంచి పుస్తకం. నా దగ్గర ఉంది. ఇదే కాదు.. శ్రీ పాద వారి కలుపుమెక్కలు కూడా ఉంది. :). మీ పరిచయం చాలా బావుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @ప్రసీద: పోలిక రేఖామాత్రమే అయినా నాకెందుకో 'మనోధర్మం' 'కలుపు మొక్కలు' ఒకదాని వెంట మరొకటి గుర్తొస్తాయండీ.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు