గురువారం, జూన్ 16, 2011

చే గువేరా మోటార్ సైకిల్ డైరీ

చే గువేరా.. హై సొసైటీ యువకుల టీషర్టుల మీది ఒకానొక డిజైన్ గా ఇప్పుడు చాలామందికి పరిచయం. వైద్యుడిగా, క్యూబా విముక్తి కోసం పోరాడిన వ్యక్తిగా, వివిధ హోదాల్లో క్యూబా అభివృద్ధి కోసం పనిచేసిన వాడిగా, అన్నింటికీ మించి అలుపెరుగని యాత్రీకుడిగా చే గువేరా ను గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే. ముఖ్యంగా వైద్య విద్యార్ధిగా ఉన్న కాలంలో తన ఇరవైనాలుగో ఏట మిత్రుడు అల్బెర్టో తో కలిసి ఓ మోటర్ సైకిల్ పై చిలీ, పెరు, కొలంబియా, వెనిజులాల్లో ఏడు నెలల పాటు చేసిన యాత్ర సాహసోపేతమైనది.

ఎర్నెస్ట్ గువేరా ఆలోచనల్లో మార్పు తెచ్చి అతని జీవిత గతిలో మార్పు తెచ్చిన ఈ యాత్రా కాలంలో 'చే' రాసుకున్న నోట్సులూ, రాసిన లేఖల ఆధారంగా వెలువరించిన సంకలనానికి తెలుగు అనువాదం 'చే గువేరా మోటర్ సైకిల్ డైరీ.' నిజానికీ యాత్రకి పునాది గువేరా కన్న ఒక పగటి కల. "మనం ఉత్తరమెరికా ఎందుకు వెళ్ళకూడదు?" అన్న ప్రశ్న మొదలవ్వడం మొదలు, తన మోటర్ సైకిల్ 'లా రొడెరోసా' మీద ప్రయాణం ప్రారంభం అయ్యేంతవరకూ పేజీలు చక చకా తిరిగి పోతాయి.

సరదాగా మొదలైన ప్రయాణం మెల్లమెల్లగా గంబీరంగా మారుతుంది. ఈ యాత్రికులిద్దరికీ కొన్ని చోట్ల స్థానికుల నుంచి ఘన స్వాగతం లభిస్తే, మరి కొన్ని చోట్ల పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇక మోటర్ సైకిల్ పెట్టే ఇబ్బందులకైతే లెక్కే లేదు. పెద్దగా డబ్బు వెంట తీసుకెళ్లకుండా, దారిలో ఆగుతూ జనానికి వైద్యం చేయడం ద్వారా కొద్దో గొప్పో సంపాదిస్తూ ప్రయాణాన్ని కొనసాగించారు చే గువేరా, అల్బెర్టోలు. ట్రక్ డ్రైవర్ మొదలు, పోలీసులు, సైనికాధికారుల వరకూ ఎందరో సహాయపడ్డారీ మిత్రులకి, యాత్రని పూర్తి చేయడంలో.


అనారోగ్యం, ప్రకృతి సహకరించక పోవడం లాంటి సమస్యలెన్నో ఎదురయ్యాయి. ఇక స్థానిక సమస్యలు సరేసరి. భాష, సంస్కృతికి మారిపోతూ ఉండడం, కొన్ని చోట్ల కొత్త వారిని అనుమానంగా చూసే స్థానికులు, సవాలక్ష ప్రశ్నలతో వేధించే రక్షణ అధికారులు.. వీటన్నింటినీ అధిగమిస్తూ ప్రజల సమస్యలని అధ్యయనం చేస్తూ సాగిన యాత్రలో వినోదానికీ కొదవ లేదు. ప్రారంభంలో కొంత దూరం వెంటాడిన కుక్క పిల్ల మొదలు, చివర్లో ఓడ కెప్టెన్ తో సాగే బేరసారాల వరకూ చిన్న చిన్న సంఘటనలని హాస్యస్పోరకంగా వివరించిన తీరు బాగుంది.

ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన ఈ పుస్తకం చదవడాన్ని పూర్తి చేయడానికి నాకు అక్షరాలా రెండు సంవత్సరాలు పట్టింది. అలాగని ఇదేమీ పెద్ద పుస్తకం కాదు. కేవలం నూట అరవై పేజీలు అంతే! చాలా చోట్ల కృతకంగా అనిపించిన అనువాద శైలి, కనీసం పేజీకి ఒకటికి తక్కువ కాకుండా కనిపించిన ముద్రా రాక్షసాలు, ఎప్పటికప్పుడు పుస్తకం చదవాలన్న ఆసక్తిని తగ్గించేశాయి. ఫలితంగా, చదవడం మొదలు పెట్టడం, ఓ నాలుగైదు పేజీలు చదివి పక్కన పెట్టడం. ఎలాగైనా పూర్తి చేయాలన్న సంకల్పం ఒకటైతే, యాత్ర ఎలా ముగిసిందో తెలుసుకోవాలన్న కుతూహలం మరికొంత కలిసి ఈ పుస్తకాన్ని పూర్తి చేయించాయి.

అనువాదకుడు (కె. వీరయ్య) వాడిన భాష బాగుండక పోగా, అపార్ధాలకి తావిచ్చేవిధంగా ఉంది. ఉదాహరణకి ఒక చోట, చే గువేరా, అల్బెర్టోలకి ఎక్కడా భోజనం దొరకదు. వాళ్ళు పస్తు ఉంటే, ఒక పోలీసు తనకోసం తెచ్చుకున్న భోజనంలో వీళ్ళకీ భాగం పంచుతాడు. ఆ భోజనాన్ని చే 'దరిద్రపు భోజనం' గా భావించినట్టుగా రాయడం అయోమయానికి గురిచేసింది. ఆ పరిస్థితిలో దొరికిందే పరమాన్నం అనుకుంటారు ఎవరైనా. బహుశా 'రుచి లేని భోజనం' అనడానికి బదులు ఇలా రాశారేమో అనుకున్నాను. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

పదాల వాడుక చాలా చోట్ల అర్ధాన్ని మార్చేసేదిగా ఉంది. దానికి తోడు అచ్చు తప్పులు. మొత్తం మీద పుస్తకం పూర్తి చేయడం అన్నది సహన పరీక్షగా మారింది. కాకపొతే, పుస్తకం ఇంగ్లిష్ వెర్షన్ చదవాలన్న కుతూహలం కలిగింది. ముఖ్యంగా ప్రదేశాలని మాత్రమే వర్ణించి ఊరుకోకుండా, అక్కడి భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, ప్రజల స్థితిగతులు వంటి అంశాలని స్పృశించడం నచ్చింది. చే గువేరా తో పాటుగా అల్బెర్టో కూడా వెంటాడతాడు పాఠకులని. (ప్రజాశక్తి పుస్తక కేంద్రాలన్నీ, వెల రూ. 75). అన్నట్టు 'గమ్యం' సినిమా కి స్ఫూర్తి ఈ రచన ఆధారంగా తీసిన విదేశీ సినిమానే.

14 కామెంట్‌లు:

 1. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.మురళి గారు. వెంటనే మా అబ్బాయి కోసం ఆ పుస్తకం కొని ఉంచాలి. ఎందుకంటే.. నాలుగేళ్ల క్రితం చే గువేరా .. నాకే తెలియదు. ఒక రోజు..చే గువేరా జయంతి సభలో..పాల్గొని.. ఇంటికి వచ్చి.. ఆ ఇన్ స్పైరర్ గురించి చెప్పాను. చాలా ఇంటరెస్ట్ గా విన్నాడు.బుక్ గురించి అడిగితే ఇవ్వలేక పోయాను. మీ..సమీక్ష బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 2. పుస్తకం మీద నా అభిప్రాయం కూడా అదే...నిజానికి పుస్తకం కన్నా మూవీ చాలా బాగుంటుంది

  రిప్లయితొలగించు
 3. motorcycle diary సినిమా చూశారా ? నేను చూశాను . బాగుంది . ఈ సినిమా లూజ్ అడాప్టేషన్ ' గమ్యం ' అనే తెలుగు సినిమా .

  రిప్లయితొలగించు
 4. అనువాదకుని పేరు ఏమిటి ?

  రిప్లయితొలగించు
 5. నిజమే! నేను ఈ పుస్తకం సంవత్సరం క్రితం కొన్నాను కానీ, మీరు చెప్పిన కారణాల వల్లే చదవాలనిపించక ప్రక్కన పెట్టేశా.. ఇంగ్లీష్ వర్షెన్ ప్రయత్నిస్తే బెటరనిపిస్తోంది..

  రిప్లయితొలగించు
 6. తెలుగు లో అనువాదం ఉందని తెలియదు నాకు. ఆంగ్ల మూలం కథ చదివాను. సినిమా అయితే బాగా కదిలిస్తుంది.. బాగా రాసారు. అన్నట్టు చిన్న కరెక్షన్.. వాళ్లు వెళ్లింది దక్షిణ అమెరికా దేశాలు.

  రిప్లయితొలగించు
 7. నాకు ఈ పుస్తకం చదవాలని ఎప్పటినించో ఉంది!బేసిక్గా నాకు ట్రావెలాగ్స్ చాలా ఇష్టం! ఇలా ప్రయాణంలో సాగే కథలు,వాటి విచిత్రమైన మలుపులు నాకు నచ్చుతాయి! ఇంకా చేగువేరా పుస్తకం అనేసరికి కూడా కొంచెం ఆసక్తి ఎక్కువైంది కానీ....ఏవో కారణాలవల్ల కొనలేకపోయా! ఈ-బుక్ లింక్ కోసం చూస్తున్నా! లేదంతే కనీసం ఇక్కడ లైబ్రరీలో అయినా ట్రై చేయాలి! :) మొన్నే సర్చ్ చేసా గూగుల్ లో! మీరు ఇలా టపా వేసేసారు :)

  రిప్లయితొలగించు
 8. @వనజ వనమాలి: నా దగ్గర ఉన్నది జూన్ 2008 ప్రచురణ. ఇది మాత్రం తీసుకోకండి.. పూర్తిగా చదవడం కష్టం. దీని తర్వాత ప్రచురణ వచ్చి ఉంటే సరే.. ధన్యవాదాలు.

  @సంజు: ధన్యవాదాలండీ..

  @రమణ: చూడలేదండీ.. చూడాల్సిన జాబితాలో మాత్రం ఉంది :)) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. @చంద్రబోస్: అవునండీ.. కానీ మొదట ప్రయాణం అయ్యింది ఉత్తరమెరికాకి.. ధన్యవాదాలు.

  @oremuna: కే. వీరయ్య అండీ.. (ప్రచురణకర్తలు ఇచ్చిన పేరు) ..ధన్యవాదాలు.

  @మేధ: వేరే పుస్తకాలు ఏవీ లేనప్పుడో, లేదా ఎలాగైనా పూర్తి చేయాలి అని నిర్ణయించుకున్నపుడో మాత్రమె పూర్తిగా చదవగలం అండీ.. (నేను రెండో కారణానికి పూర్తి చేశాను).. ఇంగ్లీష్ వెర్షన్ చదివితే మాతో పంచుకోవడం మర్చిపోకండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. @కృష్ణప్రియ: సినిమా చూడాలండీ అయితే.. నేను రాసిన దాంట్లో తప్పు అర్ధం ధ్వనిస్తున్నట్టుంది అయితే.. వాళ్ళు వెళ్ళింది దక్షిణమెరికాకే కానీ, చే కి వచ్చిన మొట్ట మొదటి ఆలోచన ఉత్తరమెరికా వెళ్లాలని అండీ.. ధన్యవాదాలు.

  @ఇందు: ఇంగ్లీష్ వెర్షన్ చదవండి.. కథనం చాలా బాగుంది కానీ అనువాదం, అచ్చు తప్పులే సమస్య ఇక్కడ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. మీరు చెప్పినది నిజమే .. నేను తప్పుగా చదివాను.

  రిప్లయితొలగించు
 12. నేను "ప్రవహించే ఉత్తేజం చే గెవేరా" చదివానండి ఇది కాత్యాయిని గారు రాసారు. అది కూడా బాగుంది. really inspiring one.

  రిప్లయితొలగించు
 13. @కృష్ణప్రియ: హమ్మయ్య.. నేను 'ఎలా సరిచెయ్యాలా?' అని ఆలోచిస్తున్నానండీ..
  @భాను: హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసిందా అండీ? నేను చూశాను కానీ, అప్పటికే ఈ పుస్తకం ఉంది కదా అని తీసుకోలేదు :(( ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు