శుక్రవారం, జూన్ 24, 2011

పెళ్లిపుస్తకం

"అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో.. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో.. ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని.. మసకేయని పున్నమిలా మనికి నింపుకో..." రెండున్నర గంటల సినిమా సారాంశాన్ని నాలుగులైన్లలో చెప్పేశారు ఆరుద్ర. బాపు గా పిలవబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ, రమణ గా పిలవబడ్డ ముళ్ళపూడి వెంకటరమణ ద్వయం అందించిన అచ్చ తెలుగు సినిమాల జాబితాలో మొదటివరుసలో ఉండే సినిమా 'పెళ్లిపుస్తకం.' పెళ్లికి అర్ధాన్నీ, పరమార్దాన్నీ ఇంత సున్నితంగా, హృద్యంగా, అందంగా, రొమాంటిగ్గా అన్నింటినీ మించి హాస్య భరితంగా చెప్పిన తెలుగు సినిమా మరొకటి లేదనడం అతిశయోక్తి కాదేమో.

రావి కొండలరావు అందించిన అందించిన మూలకథని విస్తరించి స్క్రీన్ ప్లే, సంభాషణలు రాయడంతో పాటు నిర్మాణ బాధ్యతనీ వహించారు రమణ, తమ శ్రీ సీతారామా ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'ఉత్తమ చిత్రం' గా నంది బహుమతి అందుకుంది. ఉత్తమ దర్శకుడిగా 'ఫిలిం ఫేర్' అందుకున్నారు బాపు. నిజానికి ఈ సినిమాని అలనాటి ఆణిముత్యం 'మిస్సమ్మ' కి రిమేక్ గా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఓ సన్నివేశంలో నాయిక చేత పలికించేశారు కూడా.

కథానాయకుడు కే. కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) - అందరూ కెకె అని పిలుస్తూ ఉంటారు - బాంబేలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి కొచ్చిన్ (కొచ్చి) లో టైపిస్ట్ గా పనిచేస్తున్న భామ గా పిలవబడే సత్యభామ (దివ్యవాణి) తో పెళ్లి నిశ్చయం కావడం సినిమాలో ప్రారంభ దృశ్యం. ఇద్దరికీ బాధ్యతలు ఉన్నాయి. ఆమెకి తన అక్క పెళ్లిబాకీ తీర్చడం, అతనికేమో చెల్లెలికి పెళ్లి చేయడం. పెళ్ళయ్యాక ఉద్యోగానికి అతను బాంబే, ఆమె కొచ్చి. వాళ్ళ కోసమే అన్నట్టుగా హైదరాబాద్ కి చెందిన మంగళ టెక్స్టైల్స్ ఆర్ట్ డైరెక్టర్, టైపిస్ట్ పోస్టులకి ప్రకటన ఇస్తుంది. కంపెనీ యజమాని శ్రీధర రావు (గుమ్మడి) ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం అని కండిషన్ పెడతాడు.

కేవలం ఉద్యోగాల కోసం, బాధ్యతలు తీర్చుకోవడం కోసం, ఒకే చోట కలిసి ఉండడం కోసం కెకె తను అవివాహితుడిననీ, భామేమో జబ్బు పడ్డ తన భర్తకి కేరళలో వైద్యం చేయిస్తూ అతని కుటుంబాన్ని పోషిస్తున్నాననీ అబద్ధాలు చెప్పి ఉద్యోగాలలో చేరతారు. ఇక మొదలవుతాయి ఇబ్బందులు. ఓకే చోట అపరిచితుల్లా పనిచేయడం. బాస్ కూతురు వసుంధర కెకె వెంట పడుతున్నా, బాస్ బావమరిది గిరి భామని ఇబ్బంది పెడుతున్నా ఇద్దరూ కూడా చూస్తూ ఊరుకోలేకా, బయట పడలేకా పడే అవస్థ వర్ణనాతీతం. ఇది చాలదన్నట్టుగా భామకేమో వసుంధరకి డేన్స్ నేర్పాల్సిన బాధ్యత, కెకె కేమో ఆమెకి ఆర్ట్ నేర్పాల్సిన బాధ్యతా వచ్చి మీద పడతాయి.

వాళ్ళు కోరుకున్న డబ్బొస్తున్నా, భార్యా భర్తలిద్దరికీ కలిసి ఉండే సమయం దొరకడం లేదు. భర్త మీద భామకి చిన్నగా మొదలైన అనుమానం, ఇద్దరి మధ్యా అపార్ధాలని పెంచి, పెళ్ళైన ఆరు నెలలకే విడిపోవాలనే నిర్ణయం తీసుకునే దగ్గరికి వస్తుంది. ఇంతలోనే జరిగే బాస్ షష్టిపూర్తి వేడుకలో కెకె, భామలిద్దరూ వివాహ బంధానికి అసలైన అర్ధం ఏమిటో తెలుసుకోడంతో పాటు, ఒకరినొకరు క్షమించుకుని తమని క్షమించాల్సిందిగా బాసుని కోరడం సినిమా ముగింపు. మధ్య తరగతి నేపధ్యాన్ని ఎక్కడ మిస్ చేయకుండా, ఏ పాత్రా కూడా నేల విడిచి సాము చేయని విధంగా సినిమాని తీర్చి దిద్దారు బాపూ రమణలు.

రాజేంద్రప్రసాద్-దివ్యవాణి పోటీపడి నటించారు. అసలు దివ్యవాణి ఈ సినిమాలో కనిపించినంత అందంగా అసలే సినిమాలోనూ కనిపించలేదు. నేనీ సినిమా పదే పదే చూడడానికి ముఖ్య కారణాలలో ఒకటి దివ్యవాణి. పెద్దగా మేకప్ ఏమీ లేకుండానే, మామూలు వాయిల్, నేత చీరల్లోనే ఎంతో అందంగా అచ్చమైన బాపు బొమ్మలా కనిపిస్తుంది. సహాయ పాత్రలు వేసిన వాళ్ళలో శ్రీధర రావుగా గుమ్మడి, వసుంధరగా సింధూజ, గిరి గా శుభలేక సుధాకర్ గుర్తుండిపోయే నటన ప్రదర్శించారు. ఒకటి రెండు సన్నివేశాల్లో నాటకీయత కొంచం శృతి మించినట్టుగా అనిపించినా, మొత్తం మీద చూసినప్పుడు సినిమా అంతా నేల మీదే నడిచింది.

మిగిలిన సినిమాల కన్నా ముళ్ళపూడి ఈ సినిమాకి రాసిన సంభాషణల్లో నాటకీయత తక్కువగా ఉంది, సహజత్వం ఎక్కువగా ఉందనిపిస్తుంది. "పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం.." "నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వుతాడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వే వాడే హీరో.." "అసూయ అసలైన ప్రేమకి ధర్మా మీటరు.." "నమ్మకం లేని చోట నారాయణా అన్నా బూతులాగే వినిపిస్తుంది..." లాంటి జీవిత సత్యాలు ఎన్నో. నవ్విస్తూనే ఆలోచింపజేసే సంభాషణలు. గుమ్మడి 'నేనూ..' అంటూ తాపీగా డైలాగు మొదలు పెట్టడం, దివ్యవాణి ముద్దుగా ముద్దుగా సంభాషణలు పలకడం ఇలా ప్రతి పాత్రకీ ఒక మేనరిజం ఉంటుంది. బాబాయ్ వేషం వేసిన రావి కొండల రావు, గుమ్మడి మాట్లాడినప్పుడల్లా బధిరుల వార్తల్లా వెనకనుంచి సైగలు చేయడం మంచి కామెడీ.


పాటల విషయానికి వస్తే, ఆరుద్ర సాహిత్యానికి మహదేవన్ సంగీతం. "శ్రీరస్తూ... శుభమస్తూ.." పాట ఇవాల్టికీ పెళ్లి వీడియోల్లో వినిపిస్తూనే ఉంటుంది. శైలజ పాడిన నారాయణ తీర్ధ తరంగం 'కృష్ణం కలయసఖి సుందరం' పాట, చిత్రీకరణ కూడా నాకు ప్రత్యేకమైన ఇష్టం. ఇక, 'సరికొత్త చీర ఊహించినాను' పాట వింటుంటే 'చుట్టూ చెంగావి చీర..' గుర్తు రాక మానదు. సుశీల సోలో 'హాయి హాయి శ్రీరంగ శాయి..' లాలిపాట బాణీలో సాగగా, 'అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ.. ' 'పపపప పప పప్పు దప్పళం' సరదాగా వినిపిస్తాయి. చిత్రీకరణ మరీ హడావిడి గా కాకుండా కంటికింపుగా ఉంటుది.

ఇద్దరు రచయితలు - బి.వి.ఎస్. రామారావు, శ్రీరమణ -- ఈ సినిమాకి తెర వెనుక పనిచేశారు. ఆర్కే రాజు ఫొటోగ్రఫి, అనిల్ మల్నాడ్ ఎడిటింగ్ లని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాకి ఎంతవరకూ అవసరమో, అంతవరకూ తూకం వేసినట్టుగా సరిగ్గా చేశారు ఇద్దరూ. ఎక్కడా ఒక్క అనవసర దృశ్యం కానీ, ఏ ఒక్క దృశ్యమూ నిడివి పెరిగినట్టుగాకానీ అనిపించవు. బడ్జెట్ కంట్రోల్ ఎలా చేశారో బాపూ రాసింది చదివినప్పుడు భలే ఆశ్చర్యం వేసింది. మొత్తం మీద, ఎన్నిసార్లు చూసినా ఏమాత్రమూ బోర్ కొత్తని సినిమా ఈ 'పెళ్లిపుస్తకం.'

21 కామెంట్‌లు:

 1. hello muraliagaru,
  another good film u remainded.nice review on it.ma sister pelli monna jarigindi tana video casstelo kuda aa paata vundi.antha baaga gurthundi poye paata adi.

  రిప్లయితొలగించు
 2. మురళి గారూ, మనసు అట్టడుగు పొరల్లో నిద్దరోతున్న భలే భలే ఙ్ఞాపకాల్ని నిద్ర లేపుతారండి. నిజంగా కొన్ని సినిమాలు కాలక్షేపం కోసమే చూసేవి ఉండవు. ఆయా సినిమాలకి సంబంధించిన ఙ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంచుకోగలిగేలా ఉంటాయి. అటువంటి మంచి సినిమాల్లో పెళ్లి పుస్తకం ఒకటి:) నాకిప్పుడు ఈ సినిమా మళ్లీ చూడాలని ఉంది:))

  రిప్లయితొలగించు
 3. మా పెళ్ళి వీడియోలో కూడా ఈ పాటే!

  మంచి సినిమాని మళ్ళీ గుర్తు చేసారు. నెనర్లు.

  నవతరంగం టపా చదివాక రైలు పెట్టె గురించి కొత్త సంగతి తెలిసింది.

  రిప్లయితొలగించు
 4. Needless to mention, Pelli Pustakam is a beautiful movie. Nice post.

  రిప్లయితొలగించు
 5. Needless to say, Pelli Pusthakam is a beautiful movie from Bapu and co. Nice post.

  రిప్లయితొలగించు
 6. చంపేసారు సారూ! ఈ వారాంతం సినిమాలు చూడకుండా బోలెడు పనులు పూర్తి చేసుకుందామని చాంతాడంత లిస్టు రాస్కున్నానా? అబ్బే, ప ప ప్పప్ప పప్పు ధప్పళం లాంటి పెళ్ళిపుస్తకాన్ని గుర్తు చేసేసి నా పనుల్లో హంసపాదు వేయించారు. హ్మ్..

  టపా, మీ విశ్లేషణ సూపరని చెప్పక్కర్లేదు కదా ప్రత్యేకం గా! :)

  రిప్లయితొలగించు
 7. మురళి గారూ. చాలా బాగా రాసారు. మంచి పరిచయం. పాటలూ, పాత్రలూ కంటికింపుగా, చెవులకి సొంపుగా సాగే చిత్రం. మీరన్నట్టు కొన్ని సన్నివేశాలలో కొద్దిగా నాటకీయత ఎక్కువయినట్టు అనిపించినా ఇది నిజంగానే గొప్ప సినిమా. అన్నట్టు వసుంధర పాత్రని ధరించిన నటి పేరు 'సింధుజ ', పూజిత కాదు.

  రిప్లయితొలగించు
 8. చాలా మంచి సినిమా, మంచి పాటలు. పోస్ట్ బాగుంది

  రిప్లయితొలగించు
 9. చెప్పాల్సిందంతా చెప్పేస్తే ఇంక మాకు రాయడానికేముందిషా?
  తప్పకుండా చూసితీరాల్సిన సినిమా,మనిషికి ఉల్లాసం మానసికోల్లాసం కూడా కలిగించే చిత్రం,చాలా బాపూ-రమణల సినిమాల్లాగే

  రిప్లయితొలగించు
 10. 'ధర్మేచ అర్ధేచ కామేచ త్యయేషా నాతిచరితవ్యా నాతిచరామి' ధర్మార్ధ కామములందు ఒకరికొకరు తోడుగా వుంటామని ఇద్దరు కలసి చేసే ప్రతిజ్ఞ ను అందరికి అర్ధం అయ్యే భాషలో చాల చక్కగా చెప్పారు ఈ సినిమాలో బాపురమణ గార్లు.

  రిప్లయితొలగించు
 11. @స్వాతి: ధన్యవాదాలండీ..
  @మనసు పలికే: చూసేయండి.. మన వీడియో లైబ్రరీలో శాశ్వితంగా దాచుకోవలసిన డిస్కుల్లో ఒకటి.. ధన్యవాదాలు.
  @శ్రీ: ఈ సినిమా వచ్చాక దాదాపు అన్ని తెలుగు పెళ్లి వీదియోల్లూనూ ఉన్న పాటండీ ఇది.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 12. @మయూఖ: ధన్యవాదాలండీ..
  @కొత్తావకాయ: ఇంతకీ చూశారా లేదా? :)) ..ధన్యవాదాలు.
  @ప్రసీద: నాకెప్పుడూ ఆ ఇద్దరూ కన్ఫ్యూజన్ అండీ.. సరి చేశాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..
  @హరి చందన: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 14. @శ్రీనివాస్ పప్పు: ఈసారి నుంచి కొంచం ఉంచుతానండీ (ముఖ్యంగా వీరోవిన్ గురించి :-) ) ..ధన్యవాదాలు.
  @శ్రీ: అవునండీ.. ఒక్కమాటలో చెప్పేశారు మీరు !! ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 15. మంచి సినిమా.
  ఈ సినిమా చూసిన కొన్ని వారాల పాటు గుమ్మడిలాగా .. "నేనూ..." అని దీర్ఘం తీసుకుంటూ మాట్లాడుతుండిపోయాను.

  రిప్లయితొలగించు
 16. @కొత్తపాళీ: :-) మీరు 'నేనూ' అన్నప్పుడల్లా, చుట్టుపక్కల వాళ్ళ స్పందన ఎలా ఉండి ఉంటుందో ఊహిస్తున్నానండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. మీనుండి ఈ టపా చూడగానే నేను మొదట చేసిన పని మీ పాత సినిమా రివ్యూలన్ని వెతకడం. ఎందుకంటే ఒకటి ఈ సినిమా గురించి మీ మాటల్లో ఇదివరకు చదివినట్లు అనిపించడం. మరొకటి ఇంత మంచి సినిమా గురించి మీరు ఇప్పటి వరకూ రాయలేదంటే నమ్మలేకపోవడమూ కారణాలు అనమాట :-)
  సినిమా గురించి బ్రహ్మాండంగా పరిచయం చేసారు... ఈ సినిమాలో ఫలానా సీను బాగుందని చెప్పడం బహు కష్టమైన పని ఏ సీన్ ను ఎన్నుకున్నా మిగిలిన వాటికి అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది కాబట్టి ... హీరో హీరోయిన్ల ద్వారానే కాకుండా గుమ్మడి దంపతుల ద్వారా కూడా అక్కడక్కడా కొన్ని చక్కని సన్నివేశాలద్వారా దాంపత్యం గురించి చక్కని మెసేజ్ ఇప్పిస్తుంటారు.
  ఇక గుమ్మడి గారు రావికొండలరావు గారు కలిసి ఉన్న ఎపిసోడ్స్ నాకు చాలా ఇష్టం. మీరన్నట్లు అక్కడక్కడా కాస్త నాటకీయత తొంగి చూసినా.. సినిమా అంతా మన పక్కింట్లో ఉన్న ఒక కొత్తగా పెళ్ళైన జంట జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ప్రత్యేకించి ఆ రోజుల్లో జంటలు.. ఇప్పుడలాంటి జంటలు అరుదే అనుకోండి.

  రిప్లయితొలగించు
 18. @వేణూ శ్రీకాంత్: లేదండీ, గతంలో రాయలేదు.. కాకపోతే ఒకటి రెండు టపాల్లో పాసింగ్ రిఫరెన్స్ గా ఈ సినిమా గురించి రాశాను. బహుశా మీరిక్కడ చూసి ఉంటారు.
  http://nemalikannu.blogspot.com/2009/06/blog-post_11.html
  ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు