మంగళవారం, జూన్ 07, 2011

నటరాజ పాద సుమరజం

నాట్య 'గురు' నటరాజ రామకృష్ణ ప్రస్తావన లేని తెలుగు నాట్య చరిత్ర అసంపూర్ణం, అసమగ్రం. ఎనభై ఎనిమిదేళ్ళ క్రితం భూమ్మీదకి వచ్చిన రామకృష్ణ, కాలికి గజ్జె కట్టనట్టైతే తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైన ఒక నాట్యరీతి చరిత్ర శిధిలాల మధ్య శాశ్వితంగా కనుమరుగై పోయేది. ఇప్పుడిప్పుడు 'ఆంధ్ర నాట్యం' 'విలాసినీ నాట్యం' పేరిట ఖ్యాతి పొందుతున్న దేవదాసీ నాట్యం పునరుజ్జీవనం పొందిందంటే దానికి ఏకైక కారణం 'పద్మశ్రీ' రామకృష్ణ. ఆయన మరణం ఈ నాట్యరీతికి కచ్చితంగా పెద్ద లోటే.

తెలుగు నాట దేవదాసీ నాట్యానిది వేల ఏళ్ళ చరిత్ర. ఒకనాటి ఈనేల సంస్కృతిలో ఒక ముఖ్య భాగం. భగవంతునికి తమను తాము భక్తితో అర్పించుకున్న స్త్రీమూర్తులు, ఆలయ ప్రాంగణంలోనే నివాసం ఏర్పరుచుకుని, పరంపరగా వచ్చే దేవదాసీ నాట్యాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకుని, కేవలం భగవంతుని ఎదుట త్రికాలాలలోనూ ప్రదర్శించడం ఇప్పటి మన ఊహకి కూడా అందని చరిత్ర.

కాలం మారింది. రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. ఆలయాలకి నిధులు తగ్గాయి. దేవదాసి 'కళ' ని ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఆలయాల్లో "నృత్యం సమర్పయామి" అంటూ చేసే 'రంగ భోగం' కేవలం ఒక తంతుగా మారిపోయింది. రంగాన్ని పాండు రంగడికి వదిలేసి, భోగాన్ని తమ కులంగా మార్చేసుకున్నారు ఆ కళాకారిణులు. సమాజాన్ని దేవదాసీల కళ కన్నా, కుటుంబ వ్యవస్థకి అతీతంగా ఉన్న వారి నేపధ్యం, అంతకు మించి వారి సౌందర్యం ఆకర్షించాయి.

అంతవరకూ ఆలయాలకి పరిమితమైన నాట్యం ధనవంతుల ఇళ్ళ జరిగే వివాహాది శుభకార్యాలలో వినోద ప్రదర్శనగా మారింది. దైవాన్ని సేవించుకునే దాసీ వేశ్యగా మారింది. తమ సంతానానికి బతుకు తెరువు నేర్పే క్రమంలో, తమంతటి వాళ్ళని చేయడం కోసం తాము నేర్చిన కళనూ నేర్పించారు ఆనాటి కళాకారిణులు. ఫలితంగా దేవదాసీ నాట్య పరంపర మరికొంతకాలం కొనసాగింది. 'యాంటీ నాచ్' ఉద్యమం ఊపందుకోవడంతో వేశ్యా వృత్తి మీద ఆంక్షలు మొదలై, తీవ్ర రూపం దాల్చడంతో పరంపరానుగతంగా వస్తున్న విద్య తర్వాతి తరానికి అందడం ఆగిపోయింది.

ఈ పరిణామాన్ని మొదట గమనించిన నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ. అప్పటికే సమగ్రాంధ్ర సాహిత్య రూపకల్పనకి నడుం కట్టిన ఆరుద్ర, కొందరు నాట్య కళాకారుల సాయంతో దేవదాసీ నాట్య రీతుల్ని రికార్డు చేసే ప్రాజెక్టు ప్రారంభించారు రామకృష్ణ. ఆసరికే ఈ నాట్యరీతిని ఆకళింపు చేసుకున్న చివరి తరం అవసాన దశలో ఉంది. ఊరూరా తిరుగుగూ, వృద్ధ వేశ్యలని కలుసుకుంటూ, నాట్యరీతిలోని మర్మాలని అలుపెరగకుండా రికార్డు చేశారు రామకృష్ణ. ఇందుకోసం తన వివాహాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశారు. ఫలితంగా 'ఆంధ్ర నాట్యం' వెలుగు చూసింది.

'మర్యాదస్తులకి' ఈ కళ ని నేర్పించడానికి చాలా ఇబ్బందులే పడ్డారు రామకృష్ణ. అప్పటికే 'కూచిపూడి' రీతికి గ్లామర్ పెరగడం, దేవదాసీ నాట్యం అంటే అదేదో అంటరానిదన్న దృష్టీ కారణంగా ప్రారంభంలో అతి కొద్ది మంది మాత్రమే ఈ నాట్యాన్ని నేర్చుకున్నారు. 'కూచిపూడి' కన్నా పురాతనమైనదైన ఈ నాట్యరీతి ఒక అద్భుతం. ప్రదర్శనని చూడాల్సిందే తప్ప మాటల్లో వర్ణించడం కష్టం. నర్తకి ప్రదర్శించే 'మధుర భక్తి' లో శృంగారం పాళ్ళు తక్కువ, భక్తి పాళ్ళే ఎక్కువ.

ఆహార్యం నుంచి, నట్టువాంగం వరకూ ప్రతి ఒక్క అంశం విభిన్నమైనదే. మూల నాట్యం లో మార్పులు చేయకుండానే, మొత్తం రీతిని కాలానుగుణంగా తీర్చిదిద్దారు రామకృష్ణ. కా....నీ, ఇప్పటికీ నాట్యంలో 'కూచిపూడి' కే అగ్రస్థానం. నేర్చుకోడానికైనా, ప్రదర్శనకైనా. 'ఆంధ్ర నాట్యం' పట్ల ఎంతోకొంత వివక్ష కొనసాగుతోందన్నది నిర్వివాదం.

దీనిని తొలగించడానికి రామకృష్ణ చాలా కృషి చేశారు. కొంత మేరకి సాధించారు కూడా. ఆయన శిష్య పరంపరలో కళాకృష్ణ, ఉమామహేశ్వరి గురువు గారి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. ఆంధ్రనాట్యాన్ని సమున్నతంగా ఆదరించడమే నటరాజ రామకృష్ణకి అందించే నిజమైన నివాళి అవుతుంది.

7 కామెంట్‌లు:

 1. ధన్యవాదాలు...ఇంతమంచి నాట్యరీతిని గురించి వ్రాసినందుకు! మీరు చెప్పిన చాలా విషయాలు చదువుతుంటే బాధేసింది! అంతమంచి కళ ఎలా మసకబారిపొయిందో కదా! ఇదంతా మనవాళ్ళు స్వయంగా చేసిందే కదా! ఏది ఏమయినా నాట్యమంటే ఇష్టమైన నాకు ఈ టపా చాలా చాలా నచ్చింది :)

  రిప్లయితొలగించు
 2. నాట్య రీతుల్ని ఆదరించాలంటే.. ప్రజలకి..వాటి గురించి.. వివరంగా తెలియాలి.. చాలా తక్కువ మందికి..ఆంద్ర నాట్యం గురించి.. తెలుసు.. కళారధుకులుగా మిగేలేకన్న కళని వ్యాపింపజేయడమే..విజ్ఞుల భాద్యత. తన జీవితమంతా ఆంద్ర నాట్య రీతికి..అంకితం చేసిన ..ఆ మహానుభావునికి.. నివాళులు అర్పిస్తూ.. ఎవరికైనా నాట్యం పట్ల ఆసక్తి.. ఉన్నట్లు.. నా దృష్టికి వస్తే.. తప్పక.. నట రాజ రామకృష్ణ గారి గురించి.. ఆంద్ర నాట్యం గురించి..తప్పక తెలియ జేస్తాను.. మంచి విషయం తెలియజేసినందులకు.. ధన్యవాదములు.. మురళి గారు.

  రిప్లయితొలగించు
 3. ఆయన గురించి వినడమే కానీ, వివరాలు తెలియవు. ఇప్పుడు మీ వ్యాసం చూశాక కొంచెం తెలిసింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 4. ప్రముఖ భారతీయ ఆజన్మ-బ్రహ్మచారులు

  డాక్టర్ అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి):
  అటల్ బిహారి వాజపేయి (మాజీ ప్రధాని):
  స్వామి వివేకానంద
  జిడ్డు క్రిష్ణమూర్తి , భారతీయ తత్వవేత్త
  అరబిందో
  మాయావతి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)
  ఉమాభారతి (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి):
  పింగళి నాగేంద్రరావు (తెలుగు సినిమా పాటల రచయిత)
  కట్టమంచి రామలింగారెడ్డి, బహుముఖ ప్రజ్ఞాశాలి.
  రతన్ టాటా లక్షరూపాయల నానో కారు నిర్మాత
  మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు
  సాధ్వి రితంబర
  లతా మంగేష్కర్
  నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి
  జస్టిస్‌ ధరమ్‌వీర్‌ శర్మ అయోధ్య వివాదంలో తీర్పునిచ్చిన జడ్జి
  ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ఐ.ఏ.యస్.అధికారి
  నటరాజ రామకృష్ణ నాట్యాచార్యుడు

  రిప్లయితొలగించు
 5. "ఆంధ్రనాట్యము" నూ, "పేరిణి శివతాండవాన్ని" కూడా శిష్యుల ద్వారా బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చిన గొప్ప అంకితభావమున్న కళాకారులు వారు. ఒకసారి విజయవాడ రేడియో స్టేషన్ సందర్శించటానికి రామకృష్ణ గారు వచ్చినప్పుడు వారితో ప్రత్యేక జనరంజని చేసే సదవకాశం వచ్చింది మా నాన్నగారికి. పొద్దున్న "ఆంధ్ర జ్యోతి"లో ఆయన గురించి పడిన ఆర్టికల్ గురించి మాట్లాడుతూంటే.. నాన్నగారు ఆ ఇంటర్యూ గుర్తు చేసుకున్నారు. ఆ రికార్డింగ్ అన్నయ్యతో పంపిస్తాను బ్లాగ్ లో పెట్టమని చెప్పారు.
  బావుందండి టపా.

  రిప్లయితొలగించు
 6. @ఇందు: నిజమేనండీ, స్వయంకృతం కూడా ఉంది.. ధన్యవాదాలు.
  @వనజవనమాలి: మంచి నిర్ణయమండీ.. ధన్యవాదాలు.
  @S: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 7. @యెన్. రెహమతుల్లా: ఆసక్తికరమైన సమాచారం.. ధన్యవాదాలండీ..

  @తృష్ణ: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు