గురువారం, జూన్ 23, 2011

ఓ ప్రేమకథ

"అమ్మనీ మర్చిపోలేను.. అంబికనీ మర్చిపోలేను.. అదంకుల్ నా పరిస్థితి," అన్నాడతను ఏదో ఒకటి చెప్పమన్నట్టుగా. అంబిక అంటే అగరుబత్తి కాదు, అతగాడు ప్రేమించిన అమ్మాయి. ఎలాగూ ఇలాంటి విషయాలు రాసేటప్పుడు పేర్లు మారుస్తాం కదా, సమయానికి అగరుబత్తి ప్రకటన గుర్తు రావడంతో ఆ పేరు వాడేశాను. అప్పటికి రెండు గంటలనుంచీ సుదీర్ఘంగా తన ప్రేమ కథని చెబుతున్నాడతను. నేను 'ఊ' కొడుతూ వింటున్నాను. ఎందుకంటే, అంతకన్నా చేయడానికి ఏమీ లేని పరిస్థితి.

బస్ లో నా పక్క సీట్ లో ప్రయాణం చేస్తున్నాడా కుర్రాడు. పేరు ప్రేమ్ కుమార్ అనుకుందాం. పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. స్వస్థలం మా గోదావరే. సెలవులకి ఇంటికి వెళ్తున్నాడు. నేను కూడా అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. అందుకని బస్ పట్టుకున్నాను. ఇది జరిగింది సుమారు రెండేళ్ళ క్రితం. మన పక్క సీట్లో ప్రయాణించే వాళ్ళని మనం నిర్ణయించుకోలేం కదా. అర్ధ రాత్రి కావడంతో బస్ లో అందరూ మాంచి నిద్రలో ఉన్నారు. నేను నిద్రపోక పోడాన్ని గమనించి కబుర్లు మొదలు పెట్టాడు ప్రేమ్. నేను కేవలం శ్రోతని.

అతని ప్రకారం, వాళ్ళిద్దరూ ఇంటర్ వేరు వేరు కాలేజీల్లో చదివారు. పరిచయం ఎక్కడ జరిగిందంటే, వాళ్ళ కేస్ట్ స్టూడెంట్స్ అందరూ వన భోజనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు. ప్రేమ్ వాళ్ళింట్లో కేస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఇతనికేమో లవ్ మేరేజ్ చేసుకోవాలని కోరిక. వన భోజనాల దగ్గర అంబికని చూసి పరిచయం చేసుకున్నాడు. ఆ అమ్మాయి హాబీస్ అన్నీ నచ్చాయి మనవాడికి, ఆమె అభిమాన హీరో తప్ప. కేస్ట్ లో అంతమంది హీరోలుండగా, వేరే కేస్ట్ హీరోని అభిమానించడం మాత్రం అస్సలు నచ్చలేదు. ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫ్రెండ్షిప్ మొదలు పెట్టారు.

ప్రేమ్ వాళ్ళింట్లో మనవాడే చివరివాడు. మమ్మీకి, డాడీకి ఇతనంటే ప్రాణం. కొత్త కార్ కొంటే మొదట ఇతను డ్రైవ్ చేయాల్సిందే. అంబిక ఇంట్లో కూడా పరిస్థితి సేం. రెండు ఫ్యామిలీల ఫైనాన్షియల్ పొజిషన్ దాదాపు ఒకటే. ఇంటర్ పూర్తయ్యేసరికి ప్రేమ్ కష్టపడి కష్టపడి ఆమె అభిమాన హీరోని మార్చగలిగాడు. ఇద్దరూ ఎంసెట్ రాశారు. మనవాడు పోరుగురాష్ట్రాల సెట్లు కూడా రాశాడు. అంబికకి మెరిట్లో సీట్ వచ్చింది. అది కూడా దగ్గర కాలేజీలో.హీరోకేమో పొరుగు రాష్ట్రంలో డొనేషన్ సీట్.

ఇద్దరిదీ ఒకటే గ్రూప్ కావడంతో, అంబిక ఫోన్ చేసినప్పుడల్లా సబ్జక్ట్ విషయాలే ఎక్కువ మాట్లాడుతోంది. ప్రేమ్ డైవర్ట్ చేస్తున్నాడు. సెం (సెమిస్టర్) ఎగ్జామ్స్ లో ప్రేమ్ కన్నా తనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. అసలు ప్రాబ్లం ఏమిటంటే, ప్రేమ్ చదువుకుందామని పుస్తకం తీసేసరికే అంబిక ఫోన్ చేస్తోంది. చాలాసేపు మాట్లాడుకోవడం నేచురల్ కదా.. అలా మాట్లాడి మాట్లాడి తర్వాత ప్రేమ్ నిద్ర పోతున్నాడు. అంబికేమో ఎప్పుడు చదివేస్తోందో, చదివేస్తోంది. ప్రేమ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ గాళ్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి.

ఓ టూ యియర్స్ లో ఇద్దరి స్టడీస్ అయిపోతాయ్. ఇద్దరికీ కేంపస్ వస్తుంది. ప్రేమ్ కి ఫారిన్ వెళ్ళడం ఇష్టం. గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. కానీ, అంబిక కి ఫారిన్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇక్కడే ఉందాం అంటుంది. తనని కన్విన్స్ చేయగలనని ప్రేమ్ కి కాన్ఫిడెన్స్ ఉంది. కానైతే ఓ ప్రాబ్లెం వచ్చింది. ప్రేమ్ వాళ్ళ మమ్మీ ఇతనికి మామయ్య కూతురుతో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తోంది. డాడీకి కూడా అభ్యంతరం ఏమీ లేదు. ఆ అమ్మాయి బాగుంటుంది కానీ, ఇంజనీరింగ్ చదవడం లేదు. పైగా విలేజ్ లో ఉంటారు వాళ్ళు. ...ఇదీ ప్రేమ్ సమస్య.

నేను తను చెప్పేది ఊ కొడుతూ, ఇంగ్లిష్ లో పదాలు, వాక్యాలు తప్పులు మాట్లాడుతున్నప్పుడల్లా నిర్మొహమాటంగా సరి చేస్తూ, మొత్తం స్టోరీ పూర్తి చేయనిచ్చాను. రెండేళ్ళ నుంచి పొరుగు రాష్ట్రంలో ఉంటున్నా మాటల్లో గోదారి యాస పూర్తిగా పోలేదు. చెప్పొద్దూ, ఆ కుర్రోడి కాన్ఫిడెన్స్ చూసి భలే ముచ్చటేసింది. సదరు అంబిక ఇతగాడితో ఎందుకు స్నేహం చేస్తోందో (తను ఏమేం గిఫ్ట్స్ ఇచ్చిందో కూడా చెప్పేశాడు) నాకు అర్ధం కాలేదు.

మరి నాకంత పెద్ద మనిషి హోదా ఇచ్చినందుకు నేను ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని, "లెట్స్ సీ, ఇప్పుడే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా.. ఇంకో టూ యియర్స్ లో ఏమన్నా జరగొచ్చు," అన్నాను, ఏమీ తేల్చకుండా. నిజానికి నాకు అంతకన్నా ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. "సమస్య లేదు. నేను చెప్తే ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే" అన్నాడు ధీమాగా. మొదట్లో తరచుగానూ, తర్వాత అప్పుడప్పుడూ ఆ కుర్రాడు గుర్తొచ్చే వాడు. చాన్నాళ్ళ తర్వాత ఇవాళెందుకో మళ్ళీ గుర్తొచ్చాడు. రెండేళ్ళు అయ్యింది కదా. అతని కథ ఏమై ఉంటుందా అని ఆలోచన...

15 కామెంట్‌లు:

 1. హమ్మ బాబోయ్.. రెండేళ్ల ముందు బస్సు ప్రయాణంలో విన్న 'ప్రేం'కథని ఇంత బాగా గుర్తుంచుకున్నారా.. మీ ఙ్ఞాపక శక్తి అద్భుతం మురళి గారు:)
  ఆహా ప్రేమించడంలో కూడా అన్నీ బ్యాలన్స్ అయ్యేలా చూసుకుని మరీ( క్యాస్ట్, స్టేటస్) ప్రేమించాడా ఆ అబ్బాయి. ఇదేదో బాగుంది, ఫెయిల్ అయ్యే చాన్సెస్ తక్కువ;) హ్యాపీగా అంబికనే చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు:)

  రిప్లయితొలగించు
 2. అంబికని ప్రేం ఒప్పించగలిగాడా?
  ప్రేం తన ఇంట్లో అంబిక గురించి చెప్పాడా?
  ఒకవేళ చెబితే ప్రేం తల్లి ఒప్పుకుందా?
  ప్రేం అంబికని పెళ్ళి చేసుకుంటే ఊళ్ళో మావయ్య కూతురి గతి ఏంటి??

  ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం బ్రేక్ తర్వాత!

  చూస్తూనే ఉండండీ టీవీ నైన్!!

  :))

  [Just kidding ;)]

  ఏమయిఉంటారు?? వాళ్ళ ఇద్దరి మధ్య ఆకర్షణ కాకుండా నిజంగా ప్రేమే ఉంటే...అందుకు కట్టూబడి నిలబడే ధైర్యమే ఉంటే కథ సుఖాంతమౌతుంది :)

  రిప్లయితొలగించు
 3. రోజూ ఎదో ఒక విషయం మీద అనర్గళంగా భలే బ్లాగుతున్నారు.

  ఇంతకీ ప్రేమకథ ఏమయిందో మాకు తొందరగా చెప్పండి.

  రిప్లయితొలగించు
 4. "అంబిక అంటే అగరుబత్తి కాదు, అతగాడు ప్రేమించిన అమ్మాయి." Bagundi :-)

  రిప్లయితొలగించు
 5. కరక్టుగా శ్రీ ఏమనుకున్నారో నేనూ అదే అనుకుంటున్నాను...విరామం లేకుండా రోజూ ఏదో ఒకటి బ్లాగులో రాస్తున్నారు. అంత ఓపిక, అంత ధారాళంగా రాయగలిగే శక్తి, అన్ని విషయాలు(కబుర్లు) మీకున్నందుకు జోహర్లు.

  రిప్లయితొలగించు
 6. హ హ.... చాలా బాగుంది. ఈ మధ్య విన్న/చూసిన సవాలక్ష ప్రేమల్లాగే. అంబిక ఒప్పేసుకునుంటుంది లెండి (తన క్లాస్మేట్స్ అంతా అమెరికాలోనే గదా సెటిలయ్యారు ఈ రెడేళ్ళల్లో). అమ్మా ఒప్పేసుకుంటుంది (ముద్దుల కొడుకు + ఒకే కాస్ట్ + ఒకే స్టేటస్సు) శుభం !
  వాళ్ళంతా బాగానే ఉంటారు గానీ మిగతా వాళ్ళతోనే వచ్చిన చిక్కంతా. పైనెవరో అన్నారు కదా కాస్ట్ కూడా చూసుకునే ప్రెమించాడే అని. అసలు ఎదో ఒకటి చూసే కదా ప్రేమించేది! అందం, చందం, డబ్బూ గిబ్బూ.... పెద్దవాళ్ళు మాత్రం సంబంధాలు చూసేటప్పుడు ఇవేకదా చూసేది. మరి పిల్లలె ఆ పని చేస్తే తప్పేంటి? ఐనా పెళ్ళి అంటేనే కంపాటిబిలిటీ అలాంటిది ఒకే కాస్ట్ ఐతే ఎక్కువ కంపాటిబిలిటీ అనుకుంటే తప్పేమీ లేదని నా ఉద్దేశం. ఈ కాలం పిల్లలు ఎవ్వరూ అంత ఆలోచించకుండా పెళ్ళిలాంటి సీరియస్ విషయాలాలో తప్పుడు నిర్ణయాలు తీసుకో తీసుకోవట్లేదనే అనుకుంటున్నా.

  రిప్లయితొలగించు
 7. హ్మ్ ప్రేమ్ కుమార్ ప్రేమకథ బాగుందండీ.. టపా చదవగానే నేను కూడా మొదట మీఙ్ఞాపక శక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఏమై ఉంటుందో అని మీతోపాటు ఇప్పుడు నేను కూడా ఆలోచించేలా చేశారు :-) మీకు తెలిస్తే మాత్రం మళ్ళీ చెప్పండేం..
  రూత్ గారు పిల్లలే ఆ పని చేస్తే తప్పులేదు కానీ దానికి మ్యాచ్ ఫిక్సింగ్ అనో పెళ్ళి సంబంధాలు చూస్కుంటున్నాననో నిజాయితీగా ఒప్పుకుని చేస్తే ఎవరూ ఏం అనరు కానీ ప్రేమ అని పేరు పెట్టుకోవడం సరి కాదేమో అని నా అభిప్రాయం. కాకపోతే ఆ కులం పార్టీ కేవలం ఒక వేదిక మాత్రమే అక్కడ అనుకోకుండా పరిచయమైన వ్యక్తిపై ఇతరకారణాల వల్ల ప్రేమ పుట్టింది అని చెప్తే ఏమీ అనలేం.

  రిప్లయితొలగించు
 8. @మనసు పలికే: ఇదేమన్నా మర్చిపోగలిగే విషయమా చెప్పండి? :-) మొదట అతనిది అమాయకత్వం అనుకున్నా.. రాను రాను అతనెంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడో అర్ధమయ్యింది.. ...ధన్యవాదాలండీ..
  @ఇందు: అంబిక ని ప్రేమ్ ఒప్పించగలిగాడా? ...అభిమాన హీరోనే మార్చి పడేసిన వాడు, ఒప్పించ లేడంటారా చెప్పండి.
  ప్రేమ్ తన ఇంట్లో అంబిక గురించి చెప్పాడా? ...ఆరేడు గంటలు కలిసి ప్రయాణం చేసిన నాతోనే చెప్పినప్పుడు, ఇంట్లో చెప్పకుండా ఉంటాడా..
  ఒకవేళ చెబితే ప్రేమ్ తల్లి ఒప్పుకుందా? మేనమామ కూతురు విషయం తప్పించి, ఒప్పుకోక పోవడానికి ఇతరత్రా కారణాలేవీ కనిపించడం లేదండీ..
  ప్రేమ్ అంబిక ని పెళ్లి చేసుకుంటే ఊళ్ళో మావయ్య కూతురి గతి ఏంటి? ...పాత సినిమా హీరోయిన్లా అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఐతే వెళ్ళదండీ :-) :-)
  ....ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 9. @శ్రీ: రాయడానికి తీరిక ప్లస్ విషయాలు దొరుకుతున్నాయండీ.. అందుకే ఇలా... ధన్యవాదాలు.
  @హరిచందన: :)) :)) ..ధన్యవాదాలండీ..
  @ఆ.సౌమ్య: మరియు మీ అందరి అభిమానం, ప్రోత్సాహం కూడానండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 10. @రూత్: నేను చెప్పాలనుకున్న విషయాన్ని వేణూ శ్రీకాంత్ గారు చెప్పేశారు.. నిజమేనండీ ఇప్పటి పిల్లలు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: జ్ఞాపక శక్తి అంటే, అతను నాకు ఆవిధంగా చెప్పాడండీ.. బొత్తిగా అపరిచితుడికి అంత బోల్డ్ గా ఎలా చెప్పెయ్య గలిగాడా అని ఆశ్చర్యం నాకు.. తర్వాత ఏమైందో తెలిసే అవకాశం చాలా తక్కువండీ.. ఒకవేళ యాదృచ్చికంగా తెలిస్తే మాత్రం, తప్పక పంచుకుంటాను :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. @ వేణు గారు, మురళి గారు, అసలు ముందుగా మీరు "ప్రేమ" వివాహం అని దేనిని అంటున్నారు? ప్రేమ ఏ కారణాల వల్ల పుడితేనే "ప్రేమ" అని మీ ఉద్దేశం? ఇంకా, ప్రేమించడానికి అవసరమైన ఆ వేరే ఇతర కారణాలేవొ? చెప్తే నెను నా ఉద్దెశాలు ఇంకొంచెం క్లారిఫై చెయ్యగలను. హి హీ .....

  రిప్లయితొలగించు
 12. @రూత్: నాకు బాగా తెలిసిన రెండు ప్రేమ జంటల గురించి : ఓ జంట సాహిత్య సమావేశాల్లో ఒకరికొకరు పరిచయమై, స్నేహం పెరిగి, దాదాపు నాలుగైదేళ్ళ తర్వాత ఇద్దరూ కూడా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే కంక్లూజన్ కి వచ్చి, పెద్ద వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కులాలు, ఆస్తులు చూసుకుని ప్రేమించుకోలేదు. అందువల్లే పెద్దవాళ్ళని ఎదిరించి, చాలా కాలం పాటు ఎవరి సపోర్టూ లేకుండా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండో జంట కి పోటీ పరిక్షల ప్రిపరేషన్ లో నోట్సులు మార్చుకోవడం దగ్గర మొదలైన పరిచయం, ఆరేళ్ళ తర్వాత పెళ్లి దగ్గరకి వచ్చింది. వీళ్ళిద్దరూ చెరో రాష్ట్రం వాళ్ళు కూడా. స్నేహం మొదలు పెట్టె ముందే వీళ్ళెవరూ ఈక్వేషన్స్ చూసుకోలేదు. అసలు ప్రేమ కోసం స్నేహం చేయలేదు (నాకు బాగా తెలుసు). అయితే ఒకటండీ, వీళ్ళు పాతకాలం వాళ్ళు. మన ప్రేమ కి ఉన్నంత ప్రాక్టికల్ థింకింగ్ లేదు వీళ్ళకి. అంబిక కి కూడా ప్రేమ కి ఉన్నంత ప్రాక్టికల్ థింకింగ్ ఉంటె పర్లేదు.. కాకుండా తను సీరియస్ గా తీసుకుంది అనుకోండి, తర్వాత ఏమవుతుంది?

  రిప్లయితొలగించు
 13. మురళి గారు, మీరు కొంచెం సీరియస్ గా తీసుకున్నట్టున్నారు నా కామెంట్. ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, మరీ ముక్కూ ముఖం తెలియకుండా తల్లితండ్రులు చూపించిన వాళ్ళను పెళ్ళి చేసుకోవటం అనే పద్ధతి ఇష్టం లేనివాళ్ళు.... అలాగని మరీ అడ్వెంచరస్ గా ఇంటర్ కాస్ట్లు, ఇంజినీరింగ్ చదివిన అమ్మాయి టైలర్ ని ప్రేమించడాలూ కాకుండా మధ్యే మార్గం గా ఇలా అమ్మవాళ్ళని నొప్పించకుండా కొన్నివిషయాలు చూసుకుని ప్రేమించడం (ఇష్టపడటం)తప్పేమీ కాదంటాను. ఇలాంటి వాటిని ప్రేమే కాదనటం కూడా అంత సమంజసం గా అనిపించదు నాకు.
  మీరు చెప్పిన జంటల విషయమే తీసుకుంటే, ఒక వేళ వారిద్దరి కులాలూ ఒక్కటే అయినట్టయితే, వారి అంతస్థులు ఒక్కటే అయ్యుంటే, లేక వారి తల్లితండ్రులు వారి ప్రేమని అంగీకరిస్తే వారి ప్రేమ క్వాలిటీ తగ్గిపోదు కదా ?

  రిప్లయితొలగించు
 14. @రూత్: అయ్యో, సీరియస్ కాదండీ.. ఇక్కడ విషయం ప్రేమ క్వాలిటీ కూడా కాదు.. నాకు తెలిసిన ప్రేమ కథల్లో ఇలా 'ఈక్వేషన్స్' చూసుకుని స్నేహం చేసి, ప్రేమించడం లేదు.. అందువల్ల ఈ కథ తెలియగానే కొంచం ఎక్కువగానే ఆశ్చర్యం కలిగింది.. అలాగని తప్పు పట్టను.. ఇప్పటి జనరేషన్ చాలా ఎక్కువ ప్రాక్టికల్ గా ఉంటున్నారని అర్ధమయ్యింది నాకు.. అదండీ సంగతి..

  రిప్లయితొలగించు
 15. రూత్ గారు: మురళి గారు ప్రేమ గురించి తనకు తెలిసిన ప్రేమజంటల ఉదాహరణలతో సహా చెప్పేశారు.. నా ఉద్దేశ్యంలో కూడా ప్రేమ్ చేసింది తప్పు అని కాదు కానీ ప్రేమలో అంత ప్రాక్టికాలిటీని నేను అంగీకరించలేక పోతున్నాను (బహుశా ఈ జెనరేషన్ వేగాన్ని నేను అందుకోలేకపోతున్నానేమో). ఫలానా వ్యక్తిని ఫలానా క్వాలిటీస్ ని బట్టి ప్రేమిద్దాం అని డిసైడ్ అయి మాటేసి వలేసి పట్టడం తనని ప్రేమలోకి దింపడం లాంటి సినిమా ప్రేమ పై నాకంత గౌరవం లేదు. బేసిక్ గా ప్రేమించడం అనేది ప్లాన్ చేసుకుని చేసేది కాదని నా ఉద్దేశ్యం.

  రిప్లయితొలగించు