బుధవారం, జూన్ 15, 2011

కరణంగారిల్లు

అమ్మమ్మ వాళ్ళింటికి నాలుగిళ్ళ అవతలే కరణంగారిల్లు. ఒకప్పుడు వాళ్ళు తగుమాత్రం జమిందార్లు అవడం వల్లనూ, ఆ వాసనలు ఇంకా పోకపోవడం వల్లనూ వాళ్ళింట్లో వాళ్ళు పెద్దగా ఎవరితోనూ కలిసేవాళ్ళు కాదు. కాకపొతే కరణంగారి భార్యకి ఎలా కుదిరిందో కానీ అమ్మమ్మతో స్నేహం కుదిరింది. ఒకరిళ్ళకి ఒకరు రాకపోకలు తక్కువే అయినా, రెండిళ్ళలోనూ ఎవరికే అవసరం వచ్చినా పిల్లలు అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాళ్ళు. కరణంగారి పిల్లలు గొప్పవాళ్ళు కదా, అందుకని బయటికి వచ్చే వాళ్ళు కాదు. దాంతో, ఏ ఇంట్లో పనున్నా అమ్మా వాళ్ళకీ తప్పేది కాదు.

కరణంగారి పిల్లలు, అమ్మ వాళ్ళు ఓకే ఈడువాళ్ళు. అందువల్ల, వీళ్ళు అత్యంత సహజంగా ఆవిడని 'అత్తయ్యగారూ' అని పిలవబోయారు. కానీ ఆవిడ అస్సలు ఊరుకోలేదు. "అదేంటర్రా! నేను ఏమంత పెద్దదాన్ని? వదినగారూ అని పిలవండి?" అని ఆర్డరేశారు లాలనగా. వీళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ పిల్లలతో వరసల గోల లేదు. ఒకళ్ళనొకళ్ళు పేరు పెట్టుకునే పిలుచుకునే వాళ్ళు. పిల్లల సంభాషణలన్నీ వదినగారి పరోక్షంలోనే జరిగేవి.

కరణంగారిది కోట లాంటి ఇల్లు. నాకు ఊహ తెలిసేనాటికి శిధిలావస్థకి వచ్చి, పాడుబడ్డ కోటని తలపించినా, ఒకప్పటి వైభవం బాగానే అర్ధమయ్యేది. ఇంటి ఎదురుగా రోడ్డు అవతల చెరువు. ఆ చెరువు గట్టున కాడ మల్లె చెట్లు. ఇంటి పెత్తనమంతా వదినగారిదే. కరణం గారు చాలా బిజీగా ఉండేవారు. పేకాటతో పాటు ఇతరత్రా వ్యవహారాలూ చాలానే ఉండేవిట. ఈ కారణం వల్ల ఆయన ఇంట్లో ఉండేవారు కాదు పెద్దగా. ఆయన ఉన్నప్పుడు పిల్లలెవరూ వాళ్ళింటికి వెళ్ళేవారు కాదు.

వాళ్ళింటి నౌకరు వస్తే కానీ, కరణం గారింట్లో వాళ్ళెవరి దినచర్యా ప్రారంభం అయ్యేది కాదు. నౌకరు వస్తూనే కొట్టుమీదకి వెళ్లి ఆవేల్టికి సరిపడా కాఫీ పొడి, పంచదార పట్టుకురావాలి. వెళ్ళిన వాడు ఓ పట్టాన వచ్చేవాడు కాదు. అతని కోసం మరో నౌకరుని పంపడం, ఇలా సాగి సాగి ఏ తొమ్మి దింటికో కాఫీలు అయ్యేవి. వంట కూడా అదే పధ్ధతి. ఒక్కో సరుక్కీ ఒక్కో నౌకర్ని కొట్టుమీదకి పంపడం, అతనికోసం మరొకర్నీ ఇలా పంపుతూ పోవడం. అన్ని సరుకులూ ఒక్కసారి తెప్పించుకునే అలవాటు ఉండేది కాదు. దీనివల్ల పాపం నౌకర్లకి చేతినిండా పని.

కిరాణా కొట్టు ఒక్కటేనా? చాకలింటి చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందీ నౌకర్లే. ఇంటిళ్ళపాదీ చాకలి బట్టలు తెచ్చేవరకూ మాసినవే మళ్ళీ మళ్ళీ కట్టుకునే వారు కానీ, పొరపాటున కూడా ఉతుక్కునే వారు కాదు. "మామూలింట్లో పుట్టాం కాబట్టి, మాబట్టలు మేం ఉతుక్కున్నా శుభ్రమైనవి కట్టుకునే వాళ్ళం," అనేది అమ్మ సరదాగా. అమ్మ వాళ్ళు సినిమా ప్రయాణం అయ్యారంటే వదినగారింట్లో చెప్పి తీరాలి. వాళ్ళెవరూ రాకపోయినా, చెప్పకుండా వెళ్లిపోయారని నిష్టూరం వేస్తారు మరి.

ఇంటికెవరైనా వెళ్ళడం పాపం. ఇంటిళ్ళపాదీ వచ్చిన వాళ్ళని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ గత వైభవ గాధలు వినిపించే వాళ్ళు, కనీసం కాఫీ నీళ్ళన్నా పోయకుండా. జమీ కరిగిపోయినా జమిందారీ వ్యవహార శైలి మాత్రం వాళ్ళ పిల్లలందరికీ బాగానే అలవాటైపోయింది, వదినగారి పెంపకం పుణ్యమా అని. అయితే, రోజులు ఒకేలా ఉండవు కదా. పిల్లలు కొంచం పెద్దయ్యాక కళ్ళు తెరిచారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం చివరి వరకూ అదే భ్రమలో ఉండనిచ్చారు.

అమ్మ వాళ్ళ అక్కచెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేసరికి కరణం గారి కుటుంబం ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటికే వాళ్ళ ఆస్తులన్నీ హరించుకు పోయాయి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. మగ పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలలో కుదురుకున్నారు. నా చిన్నప్పుడు తాతగారింటికి వెళ్లినప్పుడల్లా తాళం వేసి ఉన్న కరణం గారింటి వీధిలో ఆడుకునే వాడిని. పెద్ద పెద్ద స్తంభాలున్న వీధరుగు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతోంది. చివరిసారి నేనా ఊరికి వెళ్లేసరికి ఆ భవంతి కూలగొట్టి, కొబ్బరితోట చేసేశారు.

16 కామెంట్‌లు:

 1. మీ జ్ఞాపకాలు బాగున్నాయి.

  చిన్ననాటి గురుతులు మనం ఎంత పెద్దయితే అంత అపురూపంగా, ఆహ్లాదంగా ఉంటాయేమో...

  గీతిక

  రిప్లయితొలగించు
 2. మా తాతలు నేతులు తాగారు అన్నది..గుర్తుకు వచ్చింది. కొంత మంది అంతే. పిల్లలు అయినా వాస్తవాలు గుర్తించారు.. ఇలా పంచుకోవడం బాగుంది.

  రిప్లయితొలగించు
 3. you made me nostalgic, మా ఊళ్లోనూ ఇలానే ఓ కుటుంబం ఉండేది (ఉంది) , వాళ్ళు మాకు బంధువులే, మేమూ కరణాలమే. కానీ వాళ్ళకీ మాకూ చాలా తేడా ఉండేది, మీరన్న ఆ జమీందారు లక్షణాలు, పిల్లలు అందరితో కలవకపోవడం, కోట లాంటి ఇల్లు, ఆర్భాటాలు అన్నీ ఉండేవి. నేను చూసినంత వరకు వాళ్ళు బాగానే బ్రతికారు, అప్పులు, ఆస్తులు అమ్ముకోవదాలు, వ్యాపారం (ఓ సినిమా ధియేటర్ ఉండేది లెండి)లో నష్టాలు మరి కామన్.

  రిప్లయితొలగించు
 4. మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.

  రిప్లయితొలగించు
 5. బావుందండీ మీ జ్ఞాపకాలు. కానీ కొంచం కలుక్కుమంది. ఎందుకంటే మేమూ కరణాలమే. ఇప్పటికీ మా వాళ్ళు ఎన్.టీ.రామారావు కరణీకాలూ,వంశపారంపర్య గుడిమాన్యాలూ ఒక్కసారిగా తీసేయడం..మా పెద్దలు కష్టాలు కష్టాలు పడడం లాంటివి చెప్తూ ఉంటారు. నాకు అలా తెలిసిన వాటిలో కొన్ని వింతైనవి ఏంటంటే.. మా దూరపుబంధువుల్లో ఒకరింట భోజనాల్లోకి పల్చటి బంగారు రేకులు వేడివేడన్నంలో వేస్తే(వెంటనే కరిగిపోతుంది కదా) ఆ అన్నం తినేవార....ట. ఒక నియోగి జమీందారు కం కరణం పులి పిల్ల మెడలో కుక్కపిల్లకి కట్టినట్టు బెల్టు కట్టి పట్టుకున్న ఫోటో ఉంది(ట కాదు స్వయంగా చూశాను).
  --సూరంపూడి పవన్ సంతోష్.

  రిప్లయితొలగించు
 6. మా తాతగారు కరణం గారే. కాని ఇలా కాదులెండి:) అంత పెద్ద పెద్ద అరుగుల ఇల్లు అలా కనుమరుగైపోతే మటుకు బాధగా ఉంది:(

  రిప్లయితొలగించు
 7. మీరు చెప్పే కబుర్లన్నింటిలో మీ చిన్నప్పటి కబుర్లు నాకు చాలా ఇష్టం.

  రిప్లయితొలగించు
 8. హ్మ్ ఏం రాయాలో తెలీట్లేదు మురళి గారు.. నాకు సితార సినిమాలో శరత్ బాబు గుర్తొచ్చాడు. పెద్ద అరుగుల ఇల్లు కొబ్బరితోటగా మారడం బాధేసింది..

  రిప్లయితొలగించు
 9. టపా అంతా బాగుంది కానీ ఆ చివరిలో అలా ఆ ఇల్లుని పడగొట్టేసి కొబ్బరితోట చేసేయడం బాలేదండీ! :(

  రిప్లయితొలగించు
 10. @గీతిక: ఇవి నావీ అమ్మవీ కలిపండీ.. ధన్యవాదాలు.
  @వనజ వనమాలి: అవునండీ.. నిజం ఒప్పుకోవడం కొంచం కష్టమేమోనండీ.. ధన్యవాదాలు.
  @వనమాలి: ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారండీ.. ఏమీ చేయలేం.. అంతే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. @రత్నమాల: ధన్యవాదాలండీ..
  @పక్కింటబ్బాయి: అలా బంగారం తిని, తినిపించీ చివరికి ఏమీ లేకుండా అయిపోయారండీ.. అన్నట్టు పులితో ఫోటో ల స్పూర్తితోనే మన తెలుగు సినిమాల్లో హీరోలు పులుల్ని కుక్క పిల్లల్లా వెంట తిప్పుకోవడం, వాటికి అరకలు కట్టడం లాంటివి చేస్తున్నారేమో :)) ..ధన్యవాదాలు.
  @జయ: కాల మహిమ అంతేనండీ.. ఎంతటి చరిత్రైనా కలవాల్సింది మట్టిలోనే కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 12. @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..

  @వేణూ శ్రీకాంత్: నాకూ సితార చూసినప్పుడు వీళ్ళు గుర్తొచ్చారండీ.. ఇప్పటికీ ఆ సినిమా చూసినప్పుడల్లా అప్రయత్నంగా గుర్తొస్తూనే ఉంటారు.. ధన్యవాదాలు.

  @ఇందు: జరిగింది అదేనండీ మరి.. చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 13. ఎప్పటిలాగే బాగా రాశారు. మా తాతగారు (అమ్మకి నాన్న) కూడ కరణీకం చేసినట్లు తెలుసును, వారికి ఆ ఊర్లో వున్న గౌరవం గుర్తుగానీ, వారికి ఇలా భవనాలు, ఆస్తులు లేవులేండి.

  రిప్లయితొలగించు
 14. రామారావు గారు వచ్చి కారణీకాలు తీసేయడం వలన చాలామంది ఇబ్బంది పడ్డారు అని మా తాతగారు చెప్తుండేవారు. మీ పోస్ట్ చూస్తుంటే నాకు వంశి గారి సితార సినిమా గుర్తుచేసింది.కాని అప్పట్లో చక్కగా వదిన, అత్తయ్య ,పిన్ని గారు , ఇలా పిలుచుకునే వారు ఆ పిలుపులు ఇప్పుడు వినబడటం లేదు.

  రిప్లయితొలగించు
 15. @కల్లూరి శైలబాల: నాకు 'సితార' సినిమా ఎక్కువగా నచ్చడానికి ఈ ఇల్లు కూడా కొంత కారణమేమో అనిపిస్తూ ఉంటుందండీ. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు