శనివారం, జూన్ 18, 2011

ఉద్వేగాలు

పాతికేళ్ళ క్రితం మాట. ఒక వేసవి మధ్యాహ్నం ఇల్లు సద్దుతూ ఉండగా యువో, జ్యోతో గుర్తు లేదు కానీ అప్పటికే పాతబడ్డ పుస్తకం కనిపిస్తే పేజీలు తిప్పడం మొదలు పెట్టాను. 'ఉద్వేగాలు' అన్న పేరు చూసి ఆగాను. కథకి బాపూ గీసిన బొమ్మ ఇంకా జ్ఞాపకం ఉంది. 'పాప' అన్న పేరు చూసి ఎవరో రచయిత్రి అనుకున్నాను. కథ మాత్రం చాలా బాగా గుర్తుండి పోయింది. నలుగురి ఎదుటా కన్నీళ్లు పెట్టుకోడాన్ని చిన్నతనంగా భావించే ఓ అన్నగారూ, అందుకు ఏ మాత్రం సంశయించని ఓ చెల్లెలి కథ ఇది.

అదేదో టీవీ ప్రోగ్రాం లోలాగా 'కట్ చేస్తే..' ..రెండేళ్ళ క్రితం పుస్తకాల షాపులో 'పాలగుమ్మి పద్మరాజు రచనలు మొదటి సంపుటం' కనిపిస్తే ఆసరికే 'గాలివాన,' 'పడవ ప్రయాణం' లాంటి కొన్ని కథలు చదివి ఉండడంతో రెండో ఆలోచన లేకుండా పుస్తకం తీసేసుకున్నాను. ఇంటికొచ్చి వరుసగా ఒక్కో కథా చదువుతూ మూడో రోజుకి ఏడో కథకి వచ్చాను. పద్మరాజు కథల్ని వరస పెట్టి గబగబా చదివేయడం అసంభవం అన్నది ఆయన కథలు చదివిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే.

ఇంతకీ సదరు ఏడో కథ మరేదో కాదు, 'ఉద్వేగాలు.' టైటిల్ మొదలు, కథ ఆసాంతమూ, చదువుతున్నంత సేపూ ఆ పాత కథే గుర్తొచ్చింది. కొంచం ఆలోచించాక లైటు వెలిగింది, 'పాప' అన్నది పాలగుమ్మి పద్మరాజు సంక్షిప్త నామమని. ఇన్నాళ్ళ పాటు గుర్తుండి పోయిన ఈ కథ అంత పెద్దదేమీ కాదు కేవలం ఆరు పేజీలు. ఎందుకు గుర్తుండి పోయిందో ఇదమిద్దంగా చెప్పడం కష్టం కాబట్టి కథేమిటో క్లుప్తంగా చెబుతాను.

రాజిగాడికి తొమ్మిదేళ్ళ వయసప్పుడు, వాడి చెల్లెలు శేషి కి ఐదేళ్ళు. ఉద్వేగాలని ప్రదర్శించే వాళ్ళంటే రాజిగాడికి చిరాకు. వాడికీ కన్నీళ్లు వస్తాయి కానీ వాటిని బయటికి ప్రదర్శించడు. పిల్లలిద్దరికీ అమ్మమ్మ ఇల్లు అలవాటే కాబట్టి, వాళ్లనక్కడ వదిలేసి, రాజిగాడి తల్లీ తండ్రీ తీర్ధ యాత్రలకి వెళ్తారు. శేషిని ముద్దు చేస్తూ వాళ్ళత్త "అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి వెళ్ళాలి" అనే పాట నేర్పుతుంది. ఆపాట పాడుకుంటూ ఆడుకుంటున్న శేషి, వారం రోజులు గడిచేసరికి అమ్మ కోసం బెంగ పెట్టుకుంటుంది. ఓదార్చడు రాజిగాడు.

శేషికి జ్వరం రావడంతో తంతి ఇచ్చి తల్లిదండ్రులని రప్పిస్తారు. శేషిని చూసి బావురుమంటుంది వాళ్ళమ్మ. "శేషి అంటే చిన్న పిల్ల. అమ్మ ఎందుకు ఏడవాలి?" అంటూ తల్లిమీద కోపగించుకుంటాడు రాజుగాడు. కాలక్రమంలో శేషి 'శేషు' అవుతుంది. వాళ్ళాయన అలాగే పిలుస్తాడు మరి. అతగాడు బారిస్టర్ పరీక్షకి ఇంగ్లండ్ బయలుదేరతాడు. కన్నీళ్ళని దాచుకోవడం చేతకాదు శేషుకి. వెళ్ళిపోతున్న రైలును చూస్తూ బావురుమంటుంది. అన్నగారిది ప్రేక్షక పాత్ర.

కాలం పరిగెత్తి పరిగెత్తి శేషుని కాస్తా శేషప్పని చేసేస్తుంది. అంతా బాగా జరుగుతుండగా, ఓ ఆడపిల్ల కలిగాక అకాల వైధవ్యం ప్రాప్తిస్తుంది ఆమెకి. అన్నగారింట చేరుతుంది. భర్త తాలూకు ఆస్తులు ఉండడంతో ఆర్ధిక ఇబ్బందులేవీ లేవు. కూతుర్ని పెంచి పెద్ద చేసి, ఓ యోగ్యుడికిచ్చిపెళ్లి చేస్తుంది. బీయే ప్యాసయిన ఆ కుర్రాడు బి.ఎల్. చదివే ఉద్దేశంతో మద్రాసులో కాపురం పెట్టదలచుకున్నాడు. కూతురిని విడిచిపెట్టి ఉండలేక, వాళ్ళతో పాటు తనూ మద్రాసు వెళ్తే బాగుండునని ఉంటుంది ఆవిడకి.

అత్తగారి ఉద్దేశం అల్లుడు గ్రహించినా, పైకి తేలడు. అల్లుడిని అలా అడగడం పధ్ధతి కాదని శేషప్ప అన్నగారి అభిప్రాయం. కూతురూ అల్లుడూ మద్రాసు బయలుదేరే వేళకి అల్లుడు ఎదురుగా ఉన్నాడన్న సంగతి కూడా మరచిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది శేషప్ప గారు. వాళ్లెక్కిన బండి వెళ్ళిపోయినా ఆవిడ ఏడుపు మాత్రం మానలేదు. అన్నగారిది ఎప్పటిలాగే ప్రేక్షక పాత్ర. "మనసులో ఉన్న విచారన్నంతా పైకి వదిలేయడం తప్పా?" అన్న ప్రశ్న మొదలవుతుంది ఆయనలో. (మొత్తం అరవై ఆరు కథలున్న ఈ సంకలనాన్ని విశాలాంధ్ర ప్రచురించింది. పేజీలు 499, వెల రూ. 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

3 కామెంట్‌లు:

 1. ఈ కథను దాని భావాన్ని క్లుప్తంగా చక్కగా వివరించారు. నేను ఈ కథను వెదికి చదువుతాను.

  రిప్లయితొలగించు
 2. మురళి గారూ,
  ఇప్పుడే తొందరగా లేచి (ఇంకా ఇంట్లో ఎవ్వరు లేవని సమయంలో కంప్యూటర్ ఖాళీగా దొరికింది, యీ భాగ్యం ప్రతి సారీ రాదు) పెండింగ్ టపాలన్నీ చదువుతున్నా..అన్ని టపాలకీ సమయాభావం వల్ల కామెంట్లు పెట్టట్లేదు...అన్ని టపాలు బాగున్నాయండీ.

  రిప్లయితొలగించు
 3. @తొలకరి: ధన్యవాదాలండీ..
  @ఎన్నెల: పర్లేదండీ.. చదివారు కదా.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు