బుధవారం, జూన్ 08, 2011

తుపాను

అడివి బాపిరాజు నాయిక అంటే ఎలా ఉంటుంది? అందం, అణకువ, తగుమాత్రం తెలివితేటలు, కథానాయకుని యందు విపరీతమైన ప్రేమ, అతని తోడిదే లోకంగా జీవించే అమ్మాయి..కదా! కానీ, ఈ అంచనాని తలకిందులు చేసింది హేమ, బాపిరాజు నవల 'తుపాను' లో ఒక నాయిక. నవలా ప్రారంభమే హేమ తన నలుగురు స్నేహితులు తీర్ధమిత్రుడు, నిశాపతి, కల్పమూర్తి, త్యాగతిలని పరిచయం చేయడంతో. బీయే ఆనర్స్ ప్యాసైన హేమ టెన్నిసులో దిట్ట, సంగీత సాహిత్యాలలో ప్రవేశం ఉంది.

అయితే, హేమవి ఆధునిక భావాలు. స్త్రీకి స్వేచ్చ ఉండాలన్నది ఆమె వాదం. స్త్రీ కేవలం వంటింటికీ, పిల్లలని కనడానికీ పరిమితమై పోరాదనీ, దేశాభివృద్ధిలో పురుషునితో సమాన పాత్ర పోషించాలనీ ఆమె కోరిక. తనని తాను బోల్షువిక్కు గా అభివర్ణించుకోవడం హేమకి ఇష్టం. మద్రాసు నగరంలో తన తల్లిదండ్రులతో నివాసం ఉండే హేమ, తన నలుగురు మగ స్నేహితులతో టెన్నిస్ ఆడుతూ, బీచిలకీ, సినిమాలకీ తిరుగుతూ కాలం గడుపుతూ ఉంటుంది.

అవకాశం దొరికినప్పుడల్లా స్త్రీ స్వేచ్చ గురించి మిత్రులతో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. అలాగని 'చలం' రాతలని సమర్ధించదు. "గుడిపాటి వెంకటాచలం చచ్చు రాతల స్వేచ్చ, ఆడది అందరి మొగ వెధవల పక్కలో పడుకునే స్వేచ్చ!" అని నిరసిస్తుంది. ఊహించగలిగేట్టుగానే, నిశాపతి, కల్పమూర్తిలు హేమ దగ్గర పెళ్లి ప్రస్తావన తెస్తారు. హేమ ఆలోచనలకు దగ్గరగా ఆలోచనలు చేసే తీర్ధమిత్రుడు -- ఆసరికే వివాహితుడు -- ఆమెని వాంఛిస్తాడు. పేజీలు బరువుగా కదులుతూ ఉండగా, త్యాగతిగా పిలవబడే త్యాగతి శర్వరీ భూషణ్ కేవలం హేమ కోసమే రాసిన తన ఆత్మకథ 'తుపాను' ని హేమకి అందజేస్తాడు.

ఆమె చదవడం ప్రారంభించడంతోనే కథనం వేగాన్ని అందుకుంటుంది. త్యాగతి అసలు పేరు శ్రీనాధ మూర్తి. ఇతను అచ్చమైన బాపిరాజు కథానాయకుడు. అందచందాలవాడు, ఆటపాటల్లో మేటివాడు, చదువు సంధ్యల్లో, తెలివితేటల్లో ఇంకెవరూ అతనికి సాటిరారు. మామయ్య కూతురు శకుంతల పుట్టగానే అతనికి పెండ్లామై పోయింది. అదే భావనతో పెరిగారు ఇద్దరూ. బాల్య వివాహం జరిపించేశారు పెద్దలు. ఈడేరిన శకుంతల కాపురానికి వచ్చింది. వారి అన్యోన్య దాంపత్యం ఇరు కుటుంబాలకీ కన్నుల పండుగ.

పదహారణాలా బాపిరాజు మార్కు నాయిక శకుంతల. బంగారంలో గులాబీరేకులు కలిపిన మేని చాయ, చెంపకి చారెడు కళ్ళు, కోటేరు ముక్కుకి ఏడు రాళ్ళ బేసరీ.. ఆడవాళ్ళు అసూయ పడే అందం శకుంతలది. ఆకుచాటు పిందెలా భర్త చాటు భార్య. భర్త తోడిదే లోకం ఆమెకి. దినదిన ప్రవర్ధమానమయ్యే శకుంతల సౌందర్యం వివశుణ్ణి చేసింది మూర్తిని. వాళ్ళిద్దరికీ రోజులు క్షణాలుగా గడిచిపోతూ ఉండగా, ఉన్నట్టుండి పెద్ద జబ్బు చేసి శకుంతల మరణించడంతో దాదాపు పిచ్చివాడై పోతాడు శ్రీనాధ మూర్తి. తల్లి, మేనబావ సుబ్రహ్మణ్యం కలిసి అతణ్ణి బలవంతంగా దేశాటనకి తీసుకెడతారు. కాశీలో సుశీల అనే ఒక స్త్రీతో శారీరక సంబంధం ఏర్పడుతుంది అతనికి.

హరిద్వారంలో కనిపించిన స్వామి కైలాసానంద మహర్షి, శ్రీనాధ మూర్తిని తనతో హిమాలయాలకి తీసుకు వెళ్లి, మామూలు మనిషిని చేసి తీసుకు వస్తానని మూర్తి తల్లికి మాటిస్తాడు. సుదీర్ఘంగా సాగే హిమాలయ ప్రయాణం. చదువరులందరికీ ఒక్కసారైనా హిమాలయాలు చూసి రావాలనిపించేలా వర్ణించడం బాపిరాజుకి మాత్రమే సాధ్యం. ఆ యాత్ర మూర్తి లో కొంత మార్పుని తీసుకొస్తుంది. శకుంతల లేని జీవితం వ్యర్ధం అనుకున్న అతనిలో జీవితేచ్చ మొదలవుతుంది. మహర్షి సూచన మేరకు దేశ దేశాలు తిరిగి శిల్ప, చిత్ర కళలు అభ్యసిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి డచ్ కన్య 'విల్హెల్మినా' పరిచయం అవుతుంది. కళల్లో ఆరితేరిన శ్రీనాధ మూర్తి 'త్యాగతి శర్వరీ భూషణ్' గా మారతాడు.

బాపిరాజు నాయకులు 'నారాయణరావు' 'కోనంగి' వలెనే, త్యాగతి కూడా గాంధీ మహాత్ముని శిష్యుడు అవుతాడు. దేశం కోసం తనవంతుగా ఏమన్నా చేయాలని, శకుంతల పేరిట ఒక స్త్రీ విద్యాలయం తెరవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తాడు డబ్బుకి లోటు లేని త్యాగతి. హేమని చూడగానే శకుంతలే తిరిగి వచ్చినట్టు అనిపించడంతో ఆమెని వివాహం చేసుకోవాలన్న అభిలాషని వ్యక్తం చేస్తూ తన ఆత్మకథని ముగిస్తాడు. చదవడం పూర్తి చేసిన హేమకి త్యాగతి మీద వెర్రికోపం మొదలవుతుంది. అతని దృష్టిలో స్త్రీ కేవలం భోగ వస్తువు మాత్రమే అని నిందిస్తుంది. ఎవరికీ చెప్పకుండా తీర్ధమిత్రునితో కలిసి బొంబాయికి రహస్యంగా ప్రయాణమవుతుంది. హేమ-త్యాగతిల నిర్ణయం ఏమిటన్నది ముగింపు.

నవల శృంగార, దుఃఖరస ప్రధానంగా సాగుతుంది. శ్రీనాధమూర్తి ఎంతటి శృంగార పురుషుడో, శకుంతల ఏవిధంగా అతనికి తగిన జోడీనో సాదృశంగా వర్ణించారు బాపిరాజు. అలాగే శకుంతల మరణించాక శ్రీనాధమూర్తి దుఃఖాన్ని కూడా. "ప్రపంచం అంటే కేవలం శకుంతల మాత్రమే కాదయ్యా పిచ్చివాడా" అని అతనికి చెప్పి రావాలనిపించేలా ఉంటుంది ఆ దుఃఖం. త్యాగతి గురించి చదువుతుండగా 'వేయిపడగలు' నాయకుడు ధర్మారావు గుర్తొచ్చాడు చాలాసార్లు. మళ్ళీ ఓసారి ఆ బృహత్ గ్రంధాన్ని చదవాలనిపించింది.

బాపిరాజు సృష్టించిన హేమ నుంచి పొందిన స్పూర్తితోనే నవలదేశపురాణి యద్దనపూడి సులోచనారాణి తన రాజశేఖరం 'సెక్రటరీ' జయంతి ని సృష్టించి ఉంటారని చాలాసార్లు అనిపించింది. ఆత్మాభిమానం విషయంలోనూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇద్దరికీ పోలికలున్నాయి మరి. అడివి బాపిరాజు శైలిని గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? చదివి ఆనందించ వలసిందే. స్వాతంత్రానికి పూర్వపు భారత దేశ పరిస్థితులతో పాటు, నాటి అంతర్జాతీయ రాజకీయాలనీ నిశితంగా పరామర్శ చేసిన నవల ఇది.

విశాలాంధ్ర వారు ప్రచురించిన ఈ సంకలనంలో అచ్చుతప్పులు లెక్కకి మిక్కిలిగా ఉన్నాయి. కారల్ మార్క్స్ 'కేపిటల్' ని 'కేనిటల్' అని అచ్చేయడాన్ని విశాలాంధ్ర నుంచి అస్సలు ఊహించలేం. శ్రీనాధ మూర్తి పేరు స్త్రీనాధమూర్తి గా మారిపోయింది కొన్ని చోట్ల. మరికొన్ని సందర్భాలలో అచ్చుతప్పుల కారణంగా అర్ధాలు మారిపోయి, కొంత కన్ఫ్యూజన్ ఏర్పడి, కొంత కథ జరిగాక అచ్చుతప్పు అర్ధమైంది. వీటిని పరిహరించడంతో పాటు, ఈనవల తొలి ప్రచురణ విశేషాలతో కూడిన 'ముందుమాట' తో తర్వాతి ప్రింటు తీసుకొస్తే బాగుంటుంది. (పేజీలు 275, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు: