ఆదివారం, జూన్ 05, 2011

సగ్గుబియ్యం ఉప్మా

నేను అప్పుడపుడూ గరిటె తిప్పుతూ ఉంటాను. రకరకాల ఉప్మాలు చేయడం వచ్చన్న సంగతి 'నూడుల్స్' ఎలా వండాలో చెప్పినప్పుడు చెప్పాను కదా. ఉప్మాలలో సగ్గుబియ్యం ఉప్మా ఎలా చేస్తానో చెబుతాను. ముందుగా డిస్క్లైమర్లూ అవీ అయిపోతే మనం సూటిగా మరియు స్పష్టంగా వంటకంలోకి వెళ్లిపోవచ్చు. ఇది నేను దాదాపు రెండేళ్ళ క్రితం ఏదో పత్రికలో చదివి నేర్చుకున్న వంటకం. అంటే చదివింది చదివినట్టు యధాతధంగా చేసేయకుండా కొన్ని కొన్ని మార్పులూ అవీ చేశానన్న మాట. మొత్తం నాలుగు సార్లు చేసిన ప్రయోగంలో ఫలితాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ గా వచ్చాయి.

నా టపా స్పూర్తితో మగ పురుషులెవరైనా ఈ వంటకం ప్రయత్నించాలనుకుంటే వాళ్లకి స్వాగతం. ఓ చిన్న సూచన ఏమిటంటే, కావాల్సిన పదార్ధాలన్నీ ఒకేసారిగా ఎదురుగా పెట్టించేసుకుంటే చివరి నిమిషం టెన్షన్లూ అవీ లేకుండా వంటకం మాంచి రుచిగా వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక పుణ్యస్త్రీలు ఎలాగూ వంటలో చేయి తిరిగిన వాళ్ళు కాబట్టీ, వాళ్ళ వంటకి వంక పెట్టే ధైర్యం ఎవరూ చేయరు కాబట్టీ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏవీ లేవు. మీరు నేరుగా కార్యరంగంలోకి దూసుకు పోవచ్చు.

ఉప్మానే కదా ఇప్పటికిప్పుడు చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ సగ్గుబియ్యం ఉప్మా అప్పటికప్పుడు చేయగలిగేది కాదు. కనీసం ఆరేడు గంటలు సమయం పట్టేది. ముందుగా కొంచం పల్చగా ఉన్న మజ్జిగ తీసుకుని, ఫ్రిజ్ చల్లదనం నుంచి నార్మల్ టెంపరేచర్ కి వచ్చే వరకూ ఓపిక పట్టండి. వచ్చాక అందులో సగ్గుబియ్యం నానబొయ్యండి. గిన్నె మీద మూత పెట్టేశారంటే ఓ ఐదారు గంటల వరకూ అటు చూసే పనుండదు. ఉదయాన్నే ఉప్మా చేయాలనుకుంటే రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ నానబెట్టే పని పెట్టుకోవాలన్న మాట.

సగ్గుబియ్యం చక్కగా నానిపోయి, పైన మీగడ తరక కూడా కట్టింది కదూ. ఓ స్పూన్ తో నానిన సగ్గుబియ్యాన్ని కదపండి. నానిన సగ్గుబియ్యంలో మూడో వంతు పరిమాణంలో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని బట్టి ఎన్ని ఉల్లిపాయలు కావాలో నిర్ణయించుకోండి. పచ్చిమిర్చి పెద్దవైతే రెండు, చిన్నవైతే మూడు.. అంతకన్నా ఎక్కువ అనవసరం.. ఇది కమ్మగా ఉండే వంటకం కాబట్టి కారం బాగుండదు. ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరుక్కుని, పచ్చిమిర్చిని నిలువుగా సన్నగా చీల్చుకోండి.

ఇష్టదైవాన్ని తల్చుకుని బాండీ స్టవ్ మీద పెట్టండి. స్టవ్ వెలిగించాక, ఓ నాలుగు స్పూన్ల నూనె పోయండి. ఈ నూనె కాగుతుండగానే తగుమాత్రం పల్లీలు (మీకు ఇష్టమైతే కొంచం ఎక్కువగానే వేసుకోవచ్చు), అవి వేగుతున్నాయనగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించండి. డీప్ ఫ్రై అన్న మాట. ఇప్పుడు పచ్చి మిర్చి వేసి ఓ తిప్పు తిప్పి, ఉల్లి ముక్కలు బాండీలోకి జారవిడవండి. పక్క స్టవ్ ఖాళీగానే ఉంది కదా, దాని మీద ఓ గిన్నె పెట్టి, ఓ అర గ్లాసు నీళ్ళు పోసి, అవి మరుగుతుండగా ఓ చిటికెడు పసుపు వేయండి.

ఓ నాలుగు చెంచాల పెసరపప్పు ఓ చిన్న బౌల్ లోకి తీసుకుని బాగా కడిగి, మరుగుతున్న పసుపు నీళ్ళలో జారవిడవండి. ఈ పప్పుని మరీ ఎక్కువగా ఉడకనివ్వకుండా, వడపప్పు లా అవ్వగానే స్టవ్ కట్టేసి, మిగిలిన నీళ్ళు పారబోసేయండి. బాండీలో ఉల్లి ముక్కలు బంగారు రంగు వస్తున్నాయనగా నానిన సగ్గుబియ్యాన్ని జాగ్రత్తగా బాండీ లోకి దించండి. గరిటెతో నెమ్మదిగా కలుపుతూ ఉంటే ఓ ఐదు నిమిషాల్లో సగ్గుబియ్యం పెద్దవై ముత్యాలని తలపిస్తాయి. సరిగ్గా ఇప్పుడే ఉడికిన పెసరపప్పుని బాండీ లోకి దించి, ఓ తిప్పు తిప్పి, తగినంత ఉప్పు వేసి మరో తిప్పు తిప్పాలి. పచ్చి కొబ్బరి తురుము ఉంటే అది కూడా ఓ కప్పు వేసుకోవచ్చు. లేకపోయినా నష్టం లేదు.

ఒక్క నిమిషమాగి స్టవ్ కట్టేసి, సన్నగా తురిమిన కొత్తిమీర గార్నిష్ చేసేస్తే సగ్గుబియ్యం ఉప్మా రెడీ. చట్నీలు, సాస్లు ఏవీ అవసరం లేకుండా నేరుగా ఆరగించేయడమే. వేడిగానూ, చల్లగానూ కూడా బాగుండే వంటకం ఇది. ఉప్మా మజ్జిగ వాసన అస్సలు రాదు. మజ్జిగ వాడామని మనం చెబితే తప్ప తెలీదన్న మాట. బాగుంటే నా పేరు చెప్పుకుని తినేయండి. సగ్గుబియ్యం ఉడుకు తక్కువైనా లేదా ఎక్కువైనా, అదే విధంగా ఉప్పు తక్కువైనా లేదా ఎక్కువైనా రుచి దెబ్బ కొట్టేస్తుంది. ఇలాంటప్పుడు మగవాళ్ళు రెండు రకాలుగా పరిస్థితిని ఎదుర్కోవచ్చు.

ఒకటి, ఇల్లాలిని గంభీరంగా పిలిచి, "ఫ్రిజ్ లో ఇడ్లీ పిండి ఉంది కదా" అని అడిగి, రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్టుగా డ్రాయింగ్ రూం లోకి వెళ్లి టీవీలోనో, పేపర్లోనో, పుస్తకంలోనో తల దూర్చేసి ఓ పావుగంట పాటు ప్రపంచాన్ని మర్చిపోవడం. ఇంక రెండో ఆప్షన్ ఏమిటంటే, హోటల్కి వెళ్లి పూరీ కూరో, మసాలా దోశలో పార్శిల్ తెచ్చేయడం. అదృష్టం బాగుండి రుచిగా వస్తే మాత్రం ఫలితాలు మహత్తరంగా ఉంటాయ్.

29 వ్యాఖ్యలు:

 1. యావండోయ్ ఆ ఉ ఫ్ ఫ్ మా....మీద బ్లాగుల్లో రాయటం నిషేదించాం మీకు తెలీదా?సగ్గుబియ్యమైనా,పెగ్గు బియ్యమైనా సరే అది ఉ ఫ్ ఫ్ మా...నా జీవితంలో నేను చేయబోయే... మొదటి...చివరి హత్య ఆ ఉ ఫ్ ఫ్ మా.... ను కనిపెట్టి వెలుగులోకి తెచ్చి జనాలచేత తినిపింపజేసున్న వాడ్ని.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కెవ్వు కేక, మా ఆవిడ ఊరినుంచి వచ్చాక ట్రై చేస్తా, ఎందుకంటే బాగా కుదరకపోతే తప్పు తనమీదకి తోసేయ్యోచ్చు కదా! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. meeru racha masteru emina cheppara last lo ending keka and mundhu intro inka bagundhi nenu naa engineering books mee blog la roju chusi chadivi unte gurantee edoka first vachedhi antha addict ayyanandi mee blog ki murali garu.telugu cinema release kuda wait cheyyani nenu mee blog lo next post kosam chala wait chesthunna , naa kosame annatu e madhya meeru frequency pencharu :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హ హ మురళి గారు చివరి పేరా మాత్రం సూపరండీ :-)
  హ్మ్ ఉప్మా అంటే ఏదో పదినిముషాల్లో అదీ నాకిష్టమైన ముత్యాలను తలపించె సగ్గుబియ్యంతో చేసేసుకోవచ్చేమో అని సంబరపడిపోయా... చాలా తతంగమున్నట్లుంది కదండీ.. నానబెట్టే బదులు పెసరపప్పులాగా వాటిని కూడా లైట్ గా ఉడికిస్తే కుదరదా :)
  >>ఇష్టదైవాన్ని తల్చుకుని బాండీ స్టవ్ మీద పెట్టండి.<< హ హ హ కనపడకుండా ఇలాంటి చిన్న చిన్న చెణుకులు భలే వదుల్తారండీ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఫోటోలో చూడ్డానికి బాగుంది...కానీ రిస్క్ తీసుకోవడం అంత అవసరమా చెప్పండి???:)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇప్పుడే సగ్గుబియ్యం నానేసి వచ్చాను. రాత్రికి టిఫిన్ ఇదే. :) మా ఇంట్లో సగ్గుబియ్యం కిచిడి కూడా బాగా అలవాటు. సగ్గుబియ్యం ఉప్మాలో పెసరపప్పు వెయ్యటం తెలీదు. అలానే మజ్జిగలో నానెయ్యటం కూడా. ట్రై చేస్తానీసారి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Good Good. I like this upma very much ! btw సగ్గు బియ్యం మజ్జిగ లో నానెయ్యాలా ? అయ్యో - నీళ్ళలో నానబెట్టి దెబ్బ తిన్నాను రెండు మూడు సార్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. హ హ భలే రాసారు మరీ ముఖ్యం గా లాస్ట్ పేరా :)

  ఇంతకీ నానా పెట్టిన మజ్జిగ తో సహా వేసేయాలంటారా సగ్గుబియ్యాన్ని ?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. >>ఇష్టదైవాన్ని తల్చుకుని బాండీ స్టవ్ మీద పెట్టండి.
  >>ఇలాంటప్పుడు మగవాళ్ళు రెండు రకాలుగా పరిస్థితిని ఎదుర్కోవచ్చు.
  >>అదృష్టం బాగుండి రుచిగా వస్తే మాత్రం ఫలితాలు మహత్తరంగా ఉంటాయ్.

  శీర్షిక చూడగానే పూర్తిగా చదవకుండా ఒక కే‌జి సగ్గుబియ్యం కొనుక్కోచ్చా. కానీ ఆ పై కండిషన్స్ చూసి ఆలోచనలో పడ్డాను. నాకు తు.చ. తప్పకుండా వంట చేసే అలవాటు.ఈ కింది వివరములు తెలియచేయ ప్రార్ధితులు.
  1. మీరు తలచుకొన్న ఇష్ట దైవమెవరు?
  2. మీరు ఏరకం గా ఎదుర్కొంటారు (ఎక్కువగా)?
  3. అదృష్టం బాగుండాలంటే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ముహూర్త బలం, జాతకం etc. అని భావం.
  సుజాత గారి లాంటివాళ్లే దెబ్బతిన్నాం అని ఒప్పుకున్నారు.
  శ్రావ్య గారు రామాయణ మంతా విని ఏదో అడుగుతున్నారు. :):)
  చేయాలనే ఉంది కానీ ధైర్యం చాలటం లేదన్నమాట. :))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నేనూ సగ్గుబియ్యం ఉప్మా చేస్తాను కాని ఇలా కాదు . ఇదేదో వెరైటీ గా వుంది . ప్రయత్నము చేస్తాను .

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @సుధ: తప్పక ప్రయత్నించండి.. ధన్యవాదాలు.
  @రాజేంద్రకుమార్ దేవరపల్లి: నిషేధమా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ..నాకు తెలియనే తెలియదండీ.. జూనియర్ని కదా (మీ కన్నా) ..ఇంతకీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం లాంటిది ఏమన్నా ఉందంటారా? ...ధన్యవాదాలు.
  @Creative Oracle: నా అభిప్రాయంలో అయితే మీరు కొత్తగా పెళ్ళైన వారన్నా అయి ఉండాలి, లేదా అత్యంత అదృష్ట వంతులన్నా అయిఉండాలి.. "బాగా కుదరకపోతే తప్పు తనమీదకి తోసేయ్యోచ్చు కదా! :)" ...ఇలా అనగలిగేది వాళ్లిద్దరే కదండీ మరి :)) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @బాలు: అవునండీ.. ఈమధ్యన కొంచం టైం దొరుకుతోంది.. అందుకే తరచుగా టపాలు.. చాలా సంతోషం కలిగించింది మీ వ్యాఖ్య.. శ్రద్ధగా చదువుతున్నందుకూ, మీ అభిప్రాయాలు పంచుకుంటున్నందుకూ ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: నీళ్ళలో వేస్తే ఏమవుతుందో మన ఇంగ్లీష్ సుజాత గారు చెప్పారు చూడండి :)) పర్లేదండీ, కళ్ళు మూసుకుని నానబెట్టేయండి.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: అబ్బే.. ఫోటో నా ప్రతిభ కాదండీ, గూగులమ్మని అడిగాను.. ఇకపోతే అప్పుడప్పుడూ అన్నా సాహసం శాయకపోతే ఎలా చెప్పండి? ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @పద్మ: మీ ఫ్యామిలీ అంతా నాకు థాంక్స్ చెప్పుకుంటూ ఉప్మా రుచి చూసి ఉంటారు, కదండీ? :)) ..ఒక వేళ ఏదన్నా తేడా జరిగితే మాత్రం చెప్పకండి, ప్లీజ్ :-) ..ధన్యవాదాలు.
  @Sujata: అబ్బే.. నీళ్ళు పనికిరావండీ.. ఈ పధ్ధతి ఫాలో అయిపోండి.. చక్కగా బుల్లెమ్మకి కూడా రుచి చూపించొచ్చు.. ధన్యవాదాలు.
  @ఐశ్వర్య: అయ్యయ్యో.. ఫోటో నాది కాదండీ.. గూగులమ్మది.. టపా రాసే ఆలోచన ముందుగా లేకపోవడం వల్ల ఫోటో తియ్యలా :(( ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @శ్రావ్య వట్టికూటి: ఇంకెక్కడి మజ్జిగండీ.. సగ్గుబియ్యం పీల్చేసుకుంటాయి కదా.. కొంచం తడి తడిగా ఉంటాయి అంతే.. వాటిని బాండీ లోకి దించేయడమే.. ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ప్రయత్నించండి, తప్పకుండా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. ఈ వంటకం మగ పురుషులు మాత్రమే చేయాలా అండి. ఆడ స్త్రీ లు కూడా చేయొచ్చా.:)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. @బులుసు సుబ్రహ్మణ్యం: ముందుగా సగ్గుబియ్యం కొన్నందుకు అభినందనలండీ.. నా టపాకి దొరికిన గౌరవంగా దీనిని భావిస్తున్నా! ఇక మీ సందేహాలు వరుసగా.. నెంబర్వన్: ఇష్టదైవం ఎవరైనప్పటికీ ఫలితంలో పెద్దగా మార్పు ఉండదు కాబట్టి, మీరు నా ఇష్ట దైవం కన్నా మీ ఇష్ట దైవాన్ని తల్చుకోవడమే అన్ని విధాలుగా శ్రేయస్కరం అని మనవి..
  నెంబర్టూ: నేను నాలుగు సార్లు ప్రయోగం చేసియుంటిననీ, ఫలితాలు ఫిఫ్టీ-ఫిఫ్టీ అనీ రాసియుంటిని. ఎదుర్కొను మార్గములు రెంటిని మాత్రమే వివరించితిని.. కాబట్టి నా టపాలోనే జవాబు ఉన్నదని తెలియజేయడమైనది..
  నెంబర్త్రీ: చిట్కాలు ఉన్నట్టయితే ఇక దానిని అదృష్టం అని ఎలా అనగలం చెప్పండి? కాబట్టి, ఆప్రకారం ముందుకు పోవడమే.. అదృష్టం ఉన్నదా లేదా అన్నది చివరికి తెలియును. "వంట అంటే నాక్పెద్ద గౌరవం లేదు. అది ఒక ఇది అంతే" అని గడ్డిపూల సాక్షిగా చెప్పిన ఇంగ్లీష్ సుజాత గారి మాటలు (చూడుడు 'సూపర్ వుమన్ సిండ్రోం పార్ట్ వన్' టపా) విని మీరు రెండో ఆలోచన చేయ వలదు. ఇక శ్రావ్య గారికి, శ్రీరామునికి సీతా మహాసాద్వి ఏమగునో ఈసరికే వివరించితిని.
  కాబట్టి, ఇందు మూలముగా, మీరు "సాహసం శాయరా డింభకా" అన్న 'పాతాళ భైరవి' నేపాల మాంత్రికుడి మాటలు గుర్తు చేసుకుని సాహసము చేసినచో, ఏమో ఎవరు చెప్పగలరు? ప్రభావతీదేవిగారికి ఒక సవ-- (అనగా మీకు రాజకుమారి) దొరక వచ్చునేమో :)) :)) .......ధన్యవాదాలండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @జయ: "ఇక పుణ్యస్త్రీలు ఎలాగూ వంటలో చేయి తిరిగిన వాళ్ళు కాబట్టీ, వాళ్ళ వంటకి వంక పెట్టే ధైర్యం ఎవరూ చేయరు కాబట్టీ ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏవీ లేవు. మీరు నేరుగా కార్యరంగంలోకి దూసుకు పోవచ్చు." ...ఇంత చెప్పాక కూడా ఇలా అడిగితే ఎలా అండీ? ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. హహహహహ్ భలే బాగుంది మీ పోస్ట్ .... సగ్గుబియ్యం మా ఇంట్లో సేల్ అవ్వదని మొన్నే ఒంపేసాను ..మళ్ళీ కొనాలిరా దేవుడా..కాని వండి తీరతాను..రెసెపీ వినడానికి కూడా సింపుల్ గా ఉంది

  ప్రత్యుత్తరంతొలగించు
 19. హ హ అంటే నానపెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త గా ఉండాలన్న మాట , ఒక కప్పు కి , ఒక లీటర్ మజ్జిగ పోయకూడదన్న మాట :)
  బులుసు గారు :)))))))))))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 20. టపా ఎంత రుచిగా ఉందో, వ్యాఖ్యలు అంత రంజుగా ఉన్నాయి.
  మురళిగారు - సాహసము శాయరా, ఘృతాచి లభించునురా అంటే గాని సుబ్రహ్మణ్యం గారికి ఇన్స్పిరేషను కలక్కపోవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @నేస్తం: వినడానికి సింపుల్గా ఉన్నా తినడానికి మాత్రం మాంచి రుచిగా ఉంటుందండీ.. అన్నట్టు మీరు చేస్తారా, చేయిస్తారా? :-) :-) ..ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: అవునండీ.. మరీ ఎక్కువ మజ్జిగ కూడదు.. :)))
  @కొత్తపాళీ: నిజమేనండీ.. బులుసుగారికి అందుకేనేమో ఇన్స్పిరేషన్ కలగలేదు :(( ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మీరు చెప్పిన పధ్ధతిలోనే తు.చ తప్పకుండా చేసానండీ నిన్న! కెవ్వ్వ్! సూపరుందీ ఉప్మా :) మీరన్నట్టే ముత్యాల్లగా పెద్దపెద్దగా అయిపోయాయి సగ్గుబియ్యం! మజ్జిగ చుక్క మిగల్లేకుండా పీల్చేసుకున్నాయి! చక్కగా కుదిరింది! ఉడుకు ఎక్కువా కాలేదు...ఉప్పు సరిపోయింది :) మొత్తానికి మా చందుగారితో సహా.....శభాష్ అనెరీతిలో ఉంది మీ ఉప్మా! థాంక్యూ అండీ :))

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @ఇందు: హమ్మయ్య! అసలు నా టపా చదివి ఒకరైనా ధైర్యం చేస్తారా? చేసినా సక్సెస్ అవుతారా? అనుకున్నానండీ.. ధైర్యం చేసినందుకు మీకూ, చందూ గారికీ కృతజ్ఞతలు. సక్సెస్ అయినందుకు అభినందనలు.. పంచుకున్నందుకు ధన్యవాదాలు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 24. @Unkonwn: ఈసారేమన్నా అలాంటివి నేర్చుకుని తప్పకుండా రాస్తానండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. Nenu saggubiyyam kichidi vinnanu , tinnanu kaani upma eappudu vinaledu, tappukunda chesthanu.. mee kadanam chala bagundi sir. chakkaga telugu lo vrayalente nenu emi cheyyialo cheppagaluru.. please let me know ..

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @గోదావరి: భలే మంచి పేరు పెట్టుకున్నారండీ మీరు!! తప్పకుండా ప్రయత్నించండి.. మిత్రులు ఒకరిద్దరు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు కూడా.. ధన్యవాదాలు. తెలుగులో రాయడానికి www.lekhini.org లేదా http://www.google.com/transliterate/
  ప్రయత్నించండి. గూగుల్ లో అయితే ఎడమ వైపు పైన ఉండే బాక్స్ లో మీకు కావాల్సిన భాష సెలక్ట్ చేసుకోవాలి.. మొదట్లో కొంచం తప్పులొచ్చినా, రాయగా రాయగా అలవాటైపోతుంది.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు