బ్లాగుల్లోకి వచ్చిన తొలి సంవత్సరంలాగే మూడో సంవత్సరం కూడా తెలియకుండా గడిచిపోయింది. అవును, 'నెమలికన్ను' కి మూడేళ్ళు నిండి నాలుగో వసంతంలోకి అడుగుపెడుతోందివాళ. అప్పుడే మరో ఏడాది గడిచిపోయిందా అనిపిస్తోంది. గడిస్తే మరీ బిజీగానూ, లేకపొతే బహు తీరికగానూ గడిచింది జీవితం. గడిచిన ఏడాది బ్లాగింగ్ దానిని ప్రతిఫలించింది. అన్నట్టు, గడిచిన సంవత్సరం నా బ్లాగు నాకు తెచ్చిపెట్టిన కొత్త మిత్రుల సంఖ్య కొంచం ఎక్కువే!
తొలిసంవత్సరం లో నా టపాల జోరు చూసిన బ్లాగ్మిత్రులు కొందరు, మొదట్లో అందరూ ఇలాగే రాస్తారు కానీ, పోను పోను ఈ వేగం ఉండదు అన్నారు. వారి మాటలని నిజం చేసింది రెండో సంవత్సరం. రాయాలని ఉన్నా రాయలేని పరిస్థితులు. కానైతే, మూడో సంవత్సరానికి వచ్చేసరికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఒడిదుడుకులు లేకపోలేదు. ఫలితమే, వస్తే రోజుల తరబడి విరామం, లేకుంటే వందరోజుల పాటు నిర్విరామంగా టపాల ప్రచురణ.
తొలి రెండేళ్ళలోనూ కాసిన్ని కథలు ప్రయత్నించిన నేను, మూడో సంవత్సరంలో వాటి జోలికి వెళ్ళలేకపోయాను. కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నా వాటిని కాగితం మీద పెట్టేంత స్పష్టత లేకపోవడం ఒక కారణం. కథలు రాయాలంటే మరికొంచం చదువు అవసరమేమో బహుశా. ఇక చదువు విషయానికి వస్తే, మునుపటితో పోలిస్తే పుస్తకాలు కొంచం బాగానే చదవగలిగాను. వీటిలో కొన్ని పుస్తకాలని గురించి మాత్రమే చెప్పడం అంటే కష్టమే అయినా, 'కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయ చరిత్ర' పుస్తకం చదవగలగడం మిక్కిలి సంతోషాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు.
ఏడాది కాలంలో నేను రాసుకున్న వాటిలో నాకు కొత్తవిగా అనిపించిన అంశాలు రెండు. మొదటిది అనువాద వ్యాసాలు కాగా, రెండోది యాత్రా కథనం. వంశీ, పాలగుమ్మి విశ్వనాథం గురించి ఆంగ్ల పత్రికలో వచ్చిన వ్యాసాలని తెనిగించే ప్రయత్నం చేశాను. అలాగే, కుటుంబంతో కలిసి చేసిన ఉత్తరాంధ్ర యాత్ర ని నాకు తోచ్చినట్టుగా టపాయించాను. మొదటిది యాదృచ్చికంగా జరిగింది కాగా, రెండోది ఓ మిత్రులిచ్చిన సలహా మేరకి కొంచం ముందుగానే ప్లాన్ చేసుకున్నది. వారికి కేవలం థాంకులతో సరిపెట్టలేను.
ఏ సంతాన లక్ష్మినైనా నీ పిల్లల్లో ఎవరంటే ఇష్టం అని అడిగి జవాబు రప్పించడం కష్టం. అసలు ఆ ప్రశ్నే వృధా. బ్లాగరు-టపాలకీ ఇదే సామ్యం వర్తిస్తుందని నా అనుకోలు. రాసిన అన్ని టపాలమీద ఒకేలాంటి ప్రేమ ఉన్నా, యాదృచ్చికంగా రాసిన 'భామిని విభునకు వ్రాసిన' పత్రికనూ, మా ఊరు పలికించిన 'పదనిస'లనూ మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు 'నేనే రాశానా ఇవి?' అన్న ఆశ్చర్యం కలిగింది చాలాసార్లు. అలాగే నాకు చాలా ఇష్టమైన 'సాగర సంగమం' గురించి గత పుట్టిన రోజుకి కొంచం ముందర రాసుకున్న టపా కూడా.
ఆన్లైన్లో మెయిలూ, బ్లాగూ మాత్రమే ప్రపంచంగా ఉన్న నేను గడిచిన ఏడాది కాలంలో బజ్జులో ప్రవేశించి, దాని అంతం చూసి, ప్రస్తుతం ప్లస్సులో నేనున్నా అంటున్నాను. బ్లాగ్మిత్రులు సన్నిహితం కావడంతో పాటు, కొత్త మిత్రులు పరిచయం అవుతున్నారక్కడ. మంచి పరిణామమే కదా. మెచ్చుకోళ్ళు, సద్విమర్శలతో పాటుగా వ్యక్తిగత దూషణలూ విన్నానీ సంవత్సరం. వేటిని ఎక్కడవరకూ తీసుకెళ్ళాలో, అక్కడివరకూ మాత్రమే తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రయాణాలని ఆస్వాదించే నేను, ఈ బ్లాగు ప్రయాణాన్నీ ఆస్వాదిస్తున్నాను. అందుకు కారకులైన మీ అందరికీ పేరుపేరునా మనః పూర్వక కృతజ్ఞతలు. ఊహించని బహుమతితో నన్ను ఆశ్చర్య పరిచిన బ్లాగ్లోకపు పక్కింటబ్బాయి సంతోష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.