బుధవారం, ఫిబ్రవరి 11, 2009

నాయికలు-నవనీతం

నవనీతం చాలా సాహసం ఉన్న అమ్మాయి. తన పుట్టుకకి కారణమైన వాడు ఎదురుగా కనిపిస్తున్నా అతన్ని 'నాన్నా' అని పిలవలేని తనం.. తనని బలాత్కరించిన వాడిని పొడిచి పొడిచి హత్య చేసే తెగింపు.. తను ప్రేమించిన వాడితో ఆ ప్రేమను వ్యక్తం చేయలేని అసహాయ పరిస్థితి.. తనను పెళ్లి చేసుకున్నవాడికి పూర్తిగా తన ప్రేమను అందించగలుగుతున్నానా అనే సందేహం..వెరసి నవనీతం.

సంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలో కాలం తెచ్చే మార్పును కథావస్తువుగా తీసుకుని గొల్లపూడి మారుతిరావు రాసిన 'సాయంకాలమైంది' నవల్లో ఓ పాత్ర నవనీతం. నిజానికి ఈ నవలలో నాయికా నాయకులు ఉండరు.. ఉన్నవి పాత్రలు మాత్రమే.. కథలో కొన్ని కీలకమైన మలుపులకు కారణమైన నవనీతం పాత్ర మాత్రం నాకు నాయికలాగే అనిపిస్తుంది.

కుంతీనాధాచార్యులు, ఆయన కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, మనవడు సుభద్రాచార్యులు, ముని మనవడు చిన్న తిరుమలాచార్యులు ల కథే 'సాయంకాలమైంది.' సర్పవరం అగ్రహారం లో నియమ నిష్టలతో భావనారాయణ స్వామి ని సేవించుకునే కుంతీనాధాచార్యులు ఓ వేకువ జామున 'మ్లేచ్చుడు' తనకు ఎదురు పడ్డాడనే కారణంతో ఊరు విడిచిపెట్టి విజయనగరం జిల్లా పద్మనాభం చేరుకుంటాడు. అక్కడికి చేరగానే కుమార్తె హఠాత్తుగా మరణించడం తో ఆయన పక్షవాతం బారిన పడతాడు.

కొడుకు పెద్ద తిరుమలాచార్యులు పద్మనాభంలో కుంతీమాధవ స్వామి ని సేవించుకుంటూనే ఆ ఊరి రాజుగారి కోసం తను నేర్చుకున్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకి కూడా అందిస్తూ ఉంటాడు. తాను వైద్యం చేస్తూ ఆచారాన్ని మంట గలుపుతున్నానని బాధ పడుతున్న తండ్రిని సాంత్వన పరచడానికి తన కొడుకు సుభాద్రాచార్యులుని ఆయన సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెంచుతాడు పెద్ద తిరుమలాచార్యులు. రాజుగారి కొడుకు బుల్లిరాజు కీ, సుభద్రాచార్యులుకీ స్నేహం కుదురుతుంది.

పాము కాటు వేసిన తన భర్త పైడిబాబుని ఆచార్యులవారి దగ్గర వైద్యానికి తీసుకొచ్చిన కైకవశి, భర్త మరణించడంతో అనాధ అవుతుంది. మూగదైన కైకవశిని ఆలయంలో పనిచేయమంటారు ఆచార్యులు. బుల్లిరాజుకీ కైకవశికీ ఏర్పడ్డ సంబధం వల్ల నవనీతం జన్మిస్తుంది. చిన్నప్పటినుంచీ తిరుగుబాటు తత్త్వం ఈమెది. తండ్రికి ఇష్టంలేకపోయినా ఇంగ్లీష్ చదువు చదువుతున్న చిన్న తిరుమలాచార్యులంటే ఇష్టం నవనీతానికి.

ఆ విషయం అతనికి చెప్పే లోగానే దర్జీ పొన్నయ్య ఆమెని బలాత్కారం చేస్తాడు. కిరసనాయిలు సీసాతో పొడిచి పొడిచి పొన్నయ్యని హత్య చేసిన నవనీతం జైలు శిక్ష అనుభవిస్తూ, చిన్న తిరుమల ఏర్పాటు చేసిన లాయర్ సంజీవి సమక్షంలో 'ఈ ప్రపంచంలో నేను ప్రేమించే ఏకైక వ్యక్తి తిరుమల' అని చెబుతుంది. ఇంజనీరింగ్ చదివిన తిరుమల ఉద్యోగానికి దొరల దేశం వెళ్ళిపోతాడు. జైలు శిక్ష పూర్తయ్యాక నవనీతాన్ని పెళ్లి చేసుకుంటాడు సంజీవి. తల్లినీ తండ్రినీ కోల్పోయిన ఓ అంధ బాలుడు నారిగాడిని చేరదీసి వాడిని నారాయణ ను చేసి పెంచుతుంది నవనీతం.

'సదువు సెప్పించక సినబాబుని నీలాగా గోచీ పెట్టుకుని తిరగమంటావా పంతులు గారూ?' అని సుభాద్రాచార్యులుని ప్రశ్నించే చిన్నారి మొదలుకుని, 'నారిగాడిని మనం పెంచుకుందామండీ' అని సంజీవిని ఒప్పించే పరిపూర్ణమైన మహిళగా ఎదిగిన నవనీతం పాత్ర చిత్రణ గుర్తుండి పోతుంది. బుల్లిరాజు కొడుకు ని నడిరోడ్డు మీద చెంపదెబ్బ కొట్టే సీన్, జైల్లో తిరుమలని 'శ్రీరామ' దిద్దించమని అడిగినపుడు అతను జైలు గదిలో ఇసుక పోసి ఆమెచేత దిద్దించే సన్నివేశం, అమెరికా వెళ్లేముందు నవనీతాని జైల్లో కలిసిన తిరుమల ఆమెకో ఎరోగ్రాముల కట్ట ఇచ్చి ఉత్తరం రాయించమని చెప్పినప్పడు, అదే రోజు సాయంత్రం అన్ని ఎరోగ్రాముల నిండా 'శ్రీరామ' రాసి సంజీవి చేత రైల్వే స్టేషన్ కి పంపే సీన్.. ఇలా చెప్పుకుంటూ పొతే మొత్తం నవలంతా తిరిగి రాయాల్సి వస్తుందేమో.

నవనీతాన్ని పెళ్ళిచేసుకున్న సంజీవి అదే రోజు ఆమెకి పెళ్ళికానుకగా తిరుమలకి ఫోన్ చేయిస్తాడు.. 'మా ఆయనకి మంచి ఉన్నికోటు పంపు చినబాబూ' అంటుంది నవనీతం. ఈ నవల చదివిన కొన్నాళ్ళకి నేను, నా ఫ్రెండ్ పద్మనాభం వెళ్ళాము. అది కల్పిత కథే అని తెలిసినా ఆ ఊళ్ళో నవల్లో పాత్రలన్నీ వెతుక్కున్నా.. కుంతీ మాధవ స్వామి గుళ్ళో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ 'ఇక్కడే కదా, ఆచార్యులుగారిని ఎదిరించి మాట్లాడిన నవనీతాన్ని బుల్లిరాజు చెంప దెబ్బ కొట్టింది?' అన్నప్పుడు...నాకు ఏమనిపించి ఉంటుందో మీరే ఊహించండి.

9 కామెంట్‌లు:

  1. మీ వివరణంతా బాగుంది. కానీ.. నేను ఈ నవల చదవలేదు :(
    ఒక చిన్ని సలహా..!
    ఏమీ లేదు.. మీ పోస్టులన్నిటినీ వర్గాలుగా విభజించి వాటికి వివిధ labels పెట్టారనుకోండీ....!
    కొత్తగా వచ్చినవాళ్ళకి కూడా దేనికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి అని తెలుస్తుంది. అలా అలా తిరగేసే వీలుంటుంది. for ex. కథా పరిచయలన్నీ ఒక label, సినిమాల గురించి ఒక label, మీ చిన్నప్పటి అనుభవాలు ఒక label.. అలా అన్నమాట..!
    ఇలా చేస్తే బావుంటుందేమో అనిపించింది. మీకూ నచ్చితే అలా చేయండి. మొహమాటమేమీ లేదు సుమా :)

    రిప్లయితొలగించండి
  2. అన్నట్టు.. గుళ్ళో మీకేమనిపించిందో మీరే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  3. @మధురవాణి: ప్రతి పోస్టుకీ లేబిల్ ఇస్తున్నానండి.. జ్ఞాపకాలు, సాహిత్యం, సినిమా ఇలా.. వీటిని ప్రదర్శించడం ఎలాగో బ్లాగర్ గైడ్ చదవాలి.. మీరు సూచిస్తే ధన్యుడిని. మీ అభిమానానికి చాలా చాలా థాంకులు.. గుళ్ళో ఏమనిపించిందంటే.. మనలాగా మరొకరు కూడా అదే సమయంలో అదే విషయం ఆలోచిస్తుంటే మనకి ఏమనిపిస్తుందో అదే అనిపించింది..

    రిప్లయితొలగించండి
  4. ఈ పుస్తకంలో ఎన్నో పాత్రలున్నా మీరు ఎన్నుకున్న 'నవనీతం' తీరే వేరు! మనసులో మాట ఉన్నదున్నట్టుగా ఎలాంటి భేషజాలు లేకుండా చెప్పేస్తుంది.. నాకు తిరుమలాచార్యులి చెల్లెలిని పెళ్ళి చేసుకునే అబ్బాయి పాత్ర కూడా చాలా నచ్చింది (పేర్లు గుర్తు రావటం లేదు :( ).

    ఒక ఆరేడు నెలల క్రితం అనుకుంటా మొదటిసారి చదివానీ పుస్తకం.. చాలా రోజుల వరకూ ఆ పాత్రల ప్రభావం నించి బయటపడలేకపోయాను.. సాహిత్యాభిలాష ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను తప్పకుండా చదవమని :-)

    రిప్లయితొలగించండి
  5. @నిషిగంధ: ఇప్పుడే సుజాతగారు మీ గురించి చెప్పారు..మీ వ్యాఖ్య! నా ఫ్రెండ్స్ అందరూ నాకు 'గొల్లపూడి పీఆర్వో' అని బిరుదుకూడా ఇచ్చేశారు. ఆండాళ్ళు పెళ్ళిచేసుకున్న అబ్బాయి పేరు కూర్మయ్య అండి. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. మంచి పుస్తకం గురించి చెప్పారు. తప్పక చదవ్వలసిందే. ఓ సూచన. మీరు ఇలా పుస్తకాల గురించి చెప్పేటప్పుడు అవి దొరుకు స్థలం మరియు వెల కూడా చెపితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  7. @సిరిసిరిమువ్వ: మంచి సూచన, ధన్యవాదాలు. 'సాయంకాలమైంది' పుస్తకాన్ని Jyeshta లిటరరీ ట్రస్ట్ వారు ప్రచురించారండి. బాపు కవర్ డిజైన్ చేశారు. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది. వేళ రూ. 100 ఐతే ప్రస్తుతం ప్రింట్స్ అయిపోయాయని తెలిసింది. ఒక్క నవనీతమే కాదు, ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకమైనది. 'ఆధునిక సాహిత్యమ్లో వేయి పడగలు' అని కూడా అంటారీ పుస్తకాన్ని. ఇప్పటివరకు ఈ పుస్తకం చదివి 'బాలేదు' అన్నవారెవరూ నాకు కనిపించలేదు. అప్పటి వరకు పుస్తకాలు చదివే అలవాటు లేకుండా ఈ పుస్తకంతో ఆ అలవాటు ప్రారంభించినవారూ నాకు తెలుసు.

    రిప్లయితొలగించండి
  8. మురళిగారు,నాదొక విన్నపం ,నాయికలు మధురవాణి,నవనీతం గురించి పరిచయం చేసారు ,,మరి వేయిపడగలు లోని గిరిక గురించి ఎపుడు చెబుతారు,,వేయి కళ్ళ తో ఎదురుచూస్తోంటాను.

    రిప్లయితొలగించండి
  9. @చిన్ని: గిరిక గురించి రాయాలని నేనూ అనుకుంటున్నా. 'వేయి పడగలు' మరోసారి చదవాలి. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి