బుధవారం, జనవరి 11, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-5

ఉదయం ఐదూ యాభైకంతా విశాఖ రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫాం కి దగ్గరలో ఉన్న ఏపీ టూరిజం వారి కౌంటర్ చేరుకున్నాం. అప్పటికే మాలాంటి యాత్రికులు కొందరు వేచి ఉన్నారక్కడ. మా టిక్కెట్లు చెక్ చేసిన టూరిజం ఉద్యోగి, మమ్మలనందరినీ నాలుగో నెంబరు ప్లాట్ఫాం మీదకి అక్షరాలా ఈడ్చుకుపోయాడు. ఆ వేళకాని వేళలో కూడా రైల్వే స్టేషన్ శుభ్రంగా ఉంది. అంతేనా, కాఫీ రుచిగా ఉంది కూడా. కాసేపట్లోనే కిరండల్ పాసింజర్ రైలు కూతపెట్టుకుంటూ వచ్చేసింది. టూరిజం వారు ప్రత్యేకంగా రిజర్వు చేసుకున్న బోగీలోకి మమ్మల్ని ఒక్కొక్కరుగా ఎక్కించి, మా సీట్లలో సుఖాసీనుల్ని చేశారు.

గైడు వచ్చి తనని తను పరిచయం చేసుకుని యాత్ర ఎలా ఉండబోతోందో వివరించాడు. ట్రైన్ కదిలిన కాసేపటికి అల్పాహారం వచ్చింది. రెండు ఇడ్లీలు, ఉప్మా, రెండు చట్నీలు. సందేహిస్తూనే తినడం మొదలు పెట్టాను. ఆశ్చర్యంగా, టిఫిన్ చాలా బాగుంది. మినరల్ వాటర్ బాటిల్స్, పొగలుగక్కే టీ వచ్చాయి. అవయ్యేసరికి టూరిజం వాళ్ళ హాస్పిటాలిటీ బాగుండబోతోందన్న నమ్మకం కలిగింది. ఇంతలోనే టూరిజం వాళ్ళ ఉద్యోగి ఒకరు వచ్చి, యాత్ర సీడీలు కొనమని ఒక్కొక్కరినీ అడగడం మొదలుపెట్టాడు. సీడీలు కొనుక్కుని చూసే పనే అయితే ఇంతదూరం రావడం ఎందుకూ అనుకున్నాను మనసులో. ఇదే మాట పైకే అనేశారెవరో.

రైలు శృంగవరపు కోట దాటిన కాసేపటికి గైడు వచ్చి చెప్పాడు, మరి కాసేపట్లో టన్నెల్స్ మొదలవుతాయనీ, మొత్తం నలభై రెండు టన్నెల్స్ దాటుకుని ముందుకు వెళ్లాలనీను. నెహ్రూ హయాం లో వేసిన ఆ రైలు మార్గాన్ని గూడ్స్ రైళ్ళ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నరానీ, ఐరన్ ఓర్ ని విశాఖ పోర్ట్ కి చేరవేయడం కోసమే ఆ లైను వేయడం జరిగిందనీ చెప్పాడు. "ఈ సింగిల్ ట్రాక్ రూట్లో గూడ్స్ రైళ్ళు నడపడం రైల్వే కి లాభం. పాసింజర్ రైలు నడపడం నష్టం. అందుకే, గూడ్స్ రైలు ఎదురొస్తే మన రైలుని ఆపేస్తారు. పదకొండుకల్లా అరకు చేరుకుంటాం మనం," అని తెలుగులో చెప్పి, అదే విషయాన్ని ఇంగ్లిష్లోనూ చెప్పాడు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన టూరిస్టుల సౌలభ్యం కోసం.

అప్పటికే గూడ్సు రైలు కోసం రెండుసార్లు ఆగిన మా రైలు, నెమ్మదిగా సాగుతూ మొదటి టన్నెల్ లో అడుగుపెట్టింది. అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉన్న బోగీలో కోలాహలం మొదలయ్యింది. పిల్లలతో పాటు పెద్దలూ కేరింతలు కొట్టారు. కుడివైపు కిటికీలో లోయ, ఎడమవైపున అప్పుడప్పుడూ మెరిసి మాయమవుతున్న జలపాతాలు. ఒక్కో టన్నెల్ దాటుతుంటే రైలు పైపైకి వెళ్ళడం తెలుస్తోంది. ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియో షూట్ చేసేవాళ్ళు, సిగ్నల్ ఉన్న చోటల్లా ఫోన్లలో తమ వాళ్లకి లైవ్ కామెంటరీ చెప్పేవాళ్ళూ...ఇలా బోగీ అంతా గోలగోలగా ఉంది. ఇంతలో 'జార్ముడే' అంటూ వచ్చాడొకతను. ఏమిటా అని చూస్తే మరమరాలు అవీ ఉన్న సంచీతో కనిపించాడు. ఒరియా స్నాక్ అన్నమాట. కొత్త చోటికి వెళ్ళినప్పుడు అక్కడి రుచులు కూడా చూడాలికదా అని తీసుకున్నాం. పిడతకిందపప్పుని జ్ఞాపకం చేసింది రుచి.


చుట్టూ పరికిస్తుంటే, అరకుని నేపధ్యంగా తీసుకుని వంశీ రాసిన కథలూ, నవలలూ గుర్తొచ్చాయి. మరీముఖ్యంగా 'గాలికొండపురం రైల్వే గేటు' నవల. ఉన్నట్టుండి రైలాగింది. బయటికి తొంగిచూస్తే, స్టేషన్ పేరు 'బొర్రా గుహలు.' రైలు బయలుదేరాక చూస్తే, దాదాపుగా లోయ మొత్తం కనిపిస్తోంది. నేను ఊహించుకున్న దానితో పోల్చుకుంటే ఏదో తేడా అనిపిస్తోంది కానీ, అదేమిటో ఇదమిద్దంగా తెలియలేదు. పదకొండున్నరకి అరకు స్టేషన్ చేరుకుంది మా రైలు. బయట బస్సులు రెడీగా ఉన్నాయని చెబుతూ, ఎవరెవరు ఏయే బస్సులెక్కాలో ఒకటికి రెండుసార్లు చెప్పాడు గైడు. మరో పదినిమిషాల్లో బస్సులో ఉన్నాం. అది మొదలు, రాత్రి విశాఖ చేరుకునే వరకూ అదే బస్సు, అవే సీట్లు.

బయలుదేరిన పావుగంటకి అరకు ట్రైబల్ మ్యూజియం ఎదుట ఆగాయి బస్సులు. బిలబిల్లాడుతూ దిగాం. ఇరవై నిమిషాల్లో చూసి రావాలని చెప్పాడు గైడు. లోపల ఎగ్జిబిట్స్ అన్నీ సెల్ఫ్-ఎక్స్ప్లనేటరీ అని కూడా చెప్పాడు. మ్యూజియం చాలా బాగుంది. ఒకప్పటి అరకు గిరిజనులు జీవితాలను రికార్డు చేసేందుకు చేసిన మంచి ప్రయత్నం. వాళ్ళ జీవన శైలి, కళలు, కట్టుబాట్లు ఇవన్నీ ఎవరూ చెప్పకుండానే అర్ధమయ్యాయి. వెదురుతో చేసిన వస్తువులు అమ్మే స్టాళ్లు ఉన్నాయి, మ్యూజియం లోపలా, ఎదుటా కూడా. రేట్లు మరీ ఎక్కువగా ఏమీలేవు. మ్యూజియం ఎదురుగా ఉన్న కాఫీ షాపులో కాఫీ రేట్లు మాత్రం చుక్కల్ని తాకుతున్నాయి. టూరిజం వాళ్ళ ప్యాకేజీలో కాఫీ లేదు కాబట్టి, మా కాఫీలు మేమే తాగాం. మిట్ట మధ్యాహ్నం కూడా చిరు చలిగా అనిపిస్తున్న ఆ వాతావరణంలో, చిక్కని ఫిల్టర్ కాఫీ తాగడం ఓ చక్కని అనుభూతి.

మరో ఐదు నిమిషాల్లో బయలుదేరిన బస్సులు, పావుగంటలో 'పద్మాపురం గార్డెన్స్' ముందు ఆగాయి. దారంతా హోటళ్ళూ, రిసార్టులతో పాటుగా, ప్రభుత్వ ఆఫీసులూ, క్రైస్తవ మిషనరీలు నడిపే విద్యాలయాలూ కనిపించాయి. యూనిఫాం ధరించిన పిల్లలూ, నైటీలతో వంటలు చేసుకుంటున్న గిరిజన మహిళలూ అరకు మారుతోందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. రకరకాల పూలమొక్కలతో ఉన్న పద్మాపురం గార్డెన్స్ నిర్వహణ మరికొంచం బాగుండవచ్చు అనిపించింది. గార్డెన్ పక్కనే ట్రీ-టాప్ రిసార్టులున్నాయి. అలాగే తేనె, కుంకుళ్ళు అవీ అమ్మే స్టాల్స్ కూడా కనిపించాయి. గైడు మాకు అరగంట టైం ఇచ్చాడు. అందరూ చెప్పిన టైం కన్నా ముందే బస్సుల దగ్గరికి చేరుకున్నారు. రోడ్డు పక్కన, వెదురు బొంగుల్లో చికెన్, మసాలా కూరి, కాల్చి అమ్మే వంటకాన్ని వింతగా చూశారు కొందరు టూరిస్టులు. అటు అమ్మే వాళ్ళకీ, ఇటు కొనుక్కునే వాళ్ళకీ భాషే సమస్య.

తర్వాతి కార్యక్రమం మధ్యాహ్న భోజనం. టూరిజం వారి హరిత హోటల్ ముందు ఆగాయి బస్సులు. బఫే భోజనం. "ఆకొన్న కూడె అమృతము.." లాగా కాకుండా, నిజంగానే రుచిగా ఉంది భోజనం. పొరుగు రాష్ట్రాల టూరిస్టులకీ తెలుగు భోజనమే. ఒకరిద్దరు మినహా అందరూ ఆస్వాదించారు కొత్త రుచులని. గైడు వచ్చి అందరినీ పేరు పేరునా కనుక్కున్నాడు, 'భోజనం చేశారా?' అని. త్వరగా కానిమ్మని తొందరపెట్టలేదు సరికదా, 'కాసేపు విశ్రాంతిగా కూర్చోండి, అప్పుడు బయలుదేరదాం' అన్నాడు. అంతే కాదు, పర్యాటక శాఖ తరపున ఓ వినోద కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్పాడు(ఇంకా ఉంది).

4 వ్యాఖ్యలు:

Madhavi చెప్పారు...

5 చూసి ఒకటి నుంచీ చదువుకుంటూ వచ్చాను....
చాలా బాగున్నాయి మీ యాత్రా విశేషాలు....

పర్యాటక సంఘంవారు ఇంత చక్కటి వసతులు (భోజనాదులు....) కల్పించడం ఎంతో ఆనందించదగ్గ విషయం.....

కొత్తావకాయ చెప్పారు...

ఎంత నిశితంగా గమనిస్తారసలు!! ట్రావెలాగ్ రాసేందుకు ప్రత్యేకమైన కన్ను ఉండాలని ఒక స్నేహితురాలి విషయంలో అన్న మాట మళ్ళీ మీ విషయంలోనూ చెప్పాల్సివస్తోంది. అది నిజం!

యూనిఫాం ధరించిన పిల్లలూ, నైటీలతో వంటలు చేసుకుంటున్న గిరిజన మహిళలూ.. :)

రాజ్ కుమార్ చెప్పారు...

చాలా బాగుమ్దండీ.. ఇన్ని ఎలా గుర్తున్నాయ్ మీకూ? మీతో పాటూ వచ్చినట్టుంది ;)

నెక్స్ట్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నా

మురళి చెప్పారు...

@మాధవి: అవునండీ.. నాకు ఆశ్చర్యంగా అనిపించింది.. మంచి పరిణామం కదూ.. ధన్యవాదాలు.
@కొత్తావకాయ: బస్సు కిటికీ నుంచి చూస్తె కంట పడిన దృశ్యమండీ.. గుర్తొచ్చి రాశాను అంతే.. ధన్యవాదాలు.
@రాజ్ కుమార్: మొన్ననే కదండీ చూసింది.. అందుకే గుర్తున్నాయ్.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి