ఆదివారం, జనవరి 08, 2012

ఉత్తరాంధ్ర యాత్ర-2

వేళ్ళు కొంకర్లు పోయేంత చలేమీ కాకపోయినా, ధనుర్మాసపు ఉదయం చలచల్లగానే ఉంది. విశాఖ నగర పొలిమేర దాటిన కారు జాతీయ రహదారి మీద దూసుకుపోతోంది. మామూలుగా అయితే బద్ధకంగా నిద్రపోవాలని అనిపించాలి. కానీ, ఉద్యమాలకి పుట్టిల్లైన ప్రాంతాన్ని చూడబోతున్నానన్న ఉత్సాహంలో ఉన్నాన్నేను. 'శ్రీకాకుళం-90 కిమీ' బోర్డు కనిపించింది. వెంపటావు సత్యం మొదలు కారా మాష్టారు వరకూ ఎందరో మహానుభావులు గుర్తొచ్చారా ప్రాతః సమయంలో.

తూర్పున సూర్యుడింకా కనిపించడం లేదు. మంచు దుప్పటి చాటున బద్ధకంగా కదులుతున్నాడు. మేము మొదటగా చూడబోయేది ఆయన్నే! అంతటా కనిపిస్తున్న ప్రత్యక్ష దైవానికి కూడా ఓ గుడి ఉండడం, దానిని చూడబోతుండడం ఓ చిత్రమైన అనుభూతి. 'ఎలా ఉండబోతోంది శ్రీకాకుళం?' ఈ ప్రశ్న ఎన్నిసార్లు వేసుకున్నానో లెక్కలేదు. నేను చూడని అతి కొద్ది జిల్లాలలో ఇదీ ఒకటి మరి. విశాలమైన హైవే కి రెండు పక్కలా అక్కడక్కడా దాబాలూ, ఇంజినీరింగ్ కాలేజీలూ, కొత్తగా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ లే-అవుట్లూ కనిపిస్తున్నాయి. కారు అద్దాన్ని కిందకీ, కంటి అద్దాలని పైకీ జరిపాను, అప్రయత్నంగా.

అతికొద్ది నీటి ప్రవాహంతో పలకరించింది నాగావళి. ఎందుకో తెలీదు కానీ స్వర్ణముఖి గుర్తొచ్చింది. బ్రిడ్జీ మీద కారు వెళ్తుంటే 'బాణం' సినిమాలో ప్రారంభ దృశ్యం తలపుకొచ్చింది. వచ్చేశాం శ్రీకాకుళం! రోడ్డుకి రెండు వైపులా షాపులు, టీ కొట్ల దగ్గర గుంపులుగా చేరిన జనం. స్కూళ్ళు, కాలేజీలకి వెళ్ళే హడావిడిలో ఉన్న పిల్లలు. అప్పుడే డ్యూటీ ఎక్కుతున్న కానిస్టేబుళ్లు. ప్రత్యేకంగా ఏమన్నా కనిపిస్తుందా అని వెతుకుతుండగా ప్రత్యక్షమైన దృశ్యం.. బస్సులు, కార్లు, హడావిడి మధ్య నుంచి నెత్తిన చేపల బుట్టలతో తాపీగా నడుచుకుంటూ వస్తున్న జాలారత్తలు. నేత చీరని కుడిపైటతో కట్టుకుని, ముక్కున తళుక్కున మెరిసే అడ్డబాస, నోట్లో అడ్డపొగతో ప్రపంచంలో ఉన్న ప్రశాంతతనంతా ముఖంలో నింపుకుని వెళ్తున్న వాళ్ళని కించిత్ ఆరాధనతో చూశాన్నేను. ఏ సంపద ఇవ్వగలదు ఆ సంతృప్తిని??

శ్రీకాకుళాన్ని పూర్తిగా పరికించకముందే అరసవిల్లి వచ్చేసింది. 'అరె, ఇంత దగ్గరా?' అని ఆశ్చర్యపోయాను. అరసవిల్లి కూడా శ్రీకాకుళం పట్టణంలో భాగమేనని డ్రైవర్ చెబితే తెలిసింది. రోడ్డుని ఆనుకునే సూర్యుడి గుడి. రోడ్డంతా చిరు వ్యాపారుల సందడి. ఆశ్చర్యంగా, గుడి ఖాళీగానే ఉంది. అయినప్పటికీ అనేకానేక మలుపులున్న, సుదీర్ఘమైన క్యూలో నడిచి నడిచి గర్భాలయం చేరుకోవాల్సి వచ్చింది. గుడి ప్రాంగణం మొత్తం క్యూ తాలూకు స్టీలు బారికేడ్లతో నిండిపోడంతో ఏమాత్రం ఊపిరి సలపనట్టుగా అనిపించింది. అర్చనాదికాలయ్యాక, సెక్యూరిటీ గార్డు కళ్లుగప్పి గుడి ఆవరణలో ఫోటోలు తీసేశారు మావాళ్ళు. గుడి ఎదురు వీధిలో తాజా చేపలమ్ముతున్న జాలర్ల ఇళ్ళు దాటుకు వెడితే కనిపించిన కోనేరు, గట్టున ఉన్న గోకులం బాగా నచ్చాయి నాకు.

అరసవిల్లి నుంచి శ్రీకూర్మానికి ప్రయాణం. దారిపొడుగునా రోడ్డుకి ఇరుపక్కలా కళ్ళు విప్పార్చుకుని చూస్తుండగా నన్ను దొల్చేసిన ప్రశ్న ఒక్కటే. శ్రీకాకుళోద్యమం పుట్టిందీ, నక్సల్బరీ ఉద్యమం విస్తరించిందీ ఇక్కడేనా? నిన్నమొన్నటి కొవ్వాడ ఉద్యమం జరిగింది ఈ నేల మీదేనా? అని. ఉద్యమాల కోణం నుంచి చూసినప్పుడు శ్రీకాకుళాన్ని గురించి నా అంచనా వేరు.. కనిపిస్తున్న దృశ్యం వేరు. శ్రీకూర్మం ఆలయంలోకి అడుగుపెట్టగానే ఐహిక ప్రపంచం తాలూకు ఆలోచనలతో లంకె తెగిపోయింది నాకు. పురాతనమైన ఆ ఆలయ నిర్మాణం చూడగానే చిర పరిచితంగా అనిపించింది. విశాలమైన ఆవరణ, కోనేరు, తాబేళ్ల పార్కు దాటుకుని గుడిలోకి అడుగు పెడుతుండగానే ఒకలాంటి ప్రశాంతత ఆవహించింది. సుభద్రాచార్యుల వారి ఇల్లాలు వరదమ్మ పుట్టిన ఊరు ఇదే అని గుర్తు రావడంతోనే నా కళ్ళు 'పోటు' కోసం వెతికాయి. ఆ కథ కల్పితమన్న నిజాన్ని ఒక్కోసారి ఒప్పుకోలేన్నేను.

అరసవిల్లి ఆలయం నుంచి ఎంత తొందరగా బయట పడదామా అనిపిస్తే, శ్రీకూర్మంలో ఎంత ఎక్కువ సేపు గడుపుదామా అనిపించింది. పెద్దగా రద్దీ లేదు. మిగిలిన ఆలయాల్లా కాకుండా, ప్రతి భక్తుడూ గర్భగుడిలోకి నేరుగా వెళ్ళే సౌకర్యం ఉందిక్కడ. తాపీగా పూజ చేసి, ప్రసాదం ఇచ్చి, ఆలయ ప్రాశస్త్యం గురించీ, తెల్లవారు జామున జరిగే అభిషేకాన్ని గురించీ వివరంగా చెప్పారు ఆచార్యులు. ప్రతి స్తంభాన్నీ పలకరించి, ప్రతి గోడనీ పరిశీలించి, 'రియల్ స్టార్' రఘుముద్ర శ్రీహరి, శ్రీమతి శాంతి దంపతులు పునః ప్రతిష్టించిన ధ్వజ స్తంభాన్ని తడిమి చూశాక, ఆవరణలో ఫోటోలు దిగి, తాబేళ్ళతో కాసేపు గడిపి అప్పుడు బయట పడగలిగాను, కృత్యదవస్థ మీద.

శ్రీకాకుళంలో మిత్రుడి ఇంట్లో ఆతిధ్యం, ఆ మధ్యాహ్నం. మాటల్లో "శ్రీకాకుళం అంటే 'బాణం' సినిమాలో లాగా ఉంటుందనుకున్నా" అన్నాను. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అలాగే ఉంటుందనీ, ఆ సినిమా షూటింగ్ అక్కడ జరిగిందనీ చెప్పారు తను. సంభాషణ ఏజెన్సీ మీదకీ, ఏటా ఊళ్ళ మీదకి వచ్చి పడుతున్న ఏనుగుల సమస్య మీదకీ మళ్ళింది. జిల్లా రాజకీయాలు, జరుగుతున్న ఉద్యమాలూ ఇవన్నీ చర్చకి వచ్చేశాయి. భోజనం అవుతుండగానే 'తర్వాత ఎక్కడికి?' అన్న ప్రశ్న వచ్చేసింది. శైవ క్షేత్రం 'శ్రీముఖ లింగం' చూసి, సాయంత్రానికి విశాఖ వెళ్ళొచ్చు అన్నది డ్రైవర్ సూచన. కానీ నా ఆలోచన వేరుగా ఉంది. శ్రీముఖలింగం గురించి మిత్రుడిచ్చిన ఫీడ్ బ్యాక్ విన్నాక, మావాళ్ళ మొగ్గు అటునుంచి తగ్గింది. ఇదే అదనుగా నేను 'అయితే విజయనగరం వెళ్దాం' అనేసి, రియాక్షన్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. మా హోం డిపార్ట్మెంట్ 'సరే' అనడంతో నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు(ఇంకా ఉంది).

23 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

బాగుందండి, మీ ప్రయాణ ముచ్చట్లు. మొత్తానికి నేను కూడా మొత్తం ఉత్తరాంధ్రా చూడబోతున్నానన్నమాట.

గీతిక బి చెప్పారు...

మురళీ గారూ.. మేమూ మీతోపాటే వస్తున్నట్టు ఉందండీ.

'Padmarpita' చెప్పారు...

Interesting...

కొత్తావకాయ చెప్పారు...

" కారు అద్దాన్ని కిందకీ, కంటి అద్దాలని పైకీ జరిపాను, అప్రయత్నంగా.." :)

"నేత చీరని కుడిపైటతో కట్టుకుని, ముక్కున తళుక్కున మెరిసే అడ్డబాస, నోట్లో అడ్డపొగతో ప్రపంచంలో ఉన్న ప్రశాంతతనంతా ముఖంలో నింపుకుని వెళ్తున్న వాళ్ళని కించిత్ ఆరాధనతో చూశాన్నేను. ఏ సంపద ఇవ్వగలదు ఆ సంతృప్తిని??" :) :)

ఇలా ఒక్కో వాక్యం రాస్తే కనీసం సగం టపా కాపీ పేస్ట్ చెయ్యాలి. పేరాకో మణిపూసని పొదిగారు. :)

సుభద్రాచార్యుల వారిని పరిచయం చేసే టపా లింక్ (మీ బ్లాగ్ లో) లేకపోవడం కొంచెం వెలితిగా ఉంది.

Vasu చెప్పారు...

ఇజీనగరం కూడా సూసీసారన్నమాట.
ఆ సంగతులు కూడా చెప్పీసినారు కాదు.

రాజ్ కుమార్ చెప్పారు...

sooper gaa raasaarandi

రసజ్ఞ చెప్పారు...

కారు అద్దాన్ని కిందకీ, కంటి అద్దాలని పైకీ జరిపాను, అప్రయత్నంగా. అత్యద్భుతం!

"నేత చీరని కుడిపైటతో కట్టుకుని, ముక్కున తళుక్కున మెరిసే అడ్డబాస, నోట్లో అడ్డపొగతో ప్రపంచంలో ఉన్న ప్రశాంతతనంతా ముఖంలో నింపుకుని వెళ్తున్న వాళ్ళని కించిత్ ఆరాధనతో చూశాన్నేను. ఏ సంపద ఇవ్వగలదు ఆ సంతృప్తిని?? ఇంత చక్కగా కనులకు కట్టినట్టు వర్ణిస్తూ మమ్మల్ని అలా భూతల స్వర్గంలో విహరింప చేసిన మీకు మేమేమి ఇవ్వగలం? విజయనగర వర్ణనతో కూడిన రాబోయే మీ టపా కోసం నిరీక్షిస్తూ.........

సుభగ చెప్పారు...

మా ఇజీనారానికి ఎప్పుడొస్తారా అని చూస్తున్నా, రండి, రండి, త్వరగా రండి

Sujata చెప్పారు...

శ్రీకూర్మం చాలా బావుంటుంది. కాలం ఒక fullstop పెట్టుకుని ఆగిపోయినట్టు ! పెద్దగా అభివృద్ధి లేకుండా, పల్లెటూరి గుడి లాగా అందంగా, ముగ్ధ లా వుంటుంది ఈ గుడి. ఇక్కడ సంవత్సర్కీకాలూ, తద్దినాలూ చేస్తుంటారు చాలా మంది. పూర్వీకులపట్ల వుండే నాస్టాల్జియా అంతా రంగరించి, బ్రీఫ్ గా.. ఊపిరి కొంచెం సేపు ఆగినట్టనిపిస్తుంది. చాలా థాంక్స్! మంచి పోస్టు.

Sujata చెప్పారు...

విజీనారం అంటే పెద్దగా తెలీదు గానీ మా అత్తయ్య బీ.ఈ.డీ చేసింది అత. మా అమ్మా నాన్న కూడా చాలా మాటాడేసుకుంటుండే వారు.. ఆ వీధులు, సినిమా హాళ్ళ గురించీ, కోట గురించిన్నీ, పైడితల్లి గుడి, రైల్ స్టేషన్ గురించీ, ప్రతి ఒక్కరూ పాటలు పాడేస్తుంటారంట అక్కడ. అదో Mystic, musical లోకం ! గురజాడ, ఘంటశాల, లేటెస్టు గా గొల్లపూడీ, మా విజీ నారం అంటుంటే, నాక్కూడా కొంచెం ఫాన్సీ ! విజీనారం అంటే. Music College and Kanyasulkam are the best things abt Vijianagaram.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

అయితే శ్రీముఖలింగం చూడలేదన్నమాట,ఇజీనారం విశేషాలకోసం ఎదురుచూస్తున్నాం

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

నాస్టాల్జియా.. నాస్టాల్జియా.. నా ఇంజనీరింగ్ రోజులు.. అరసవిల్లి ప్రయాణం.. విజయనగరంలో ఓ నేస్తం పెళ్ళికి వెళ్లిన రోజులు.. అన్నీ గుర్తొస్తున్నాయండీ.. అదీ మీమాటల్లో నాకిష్టమైన ప్రదే్శాల గురించి చదువుతుంటే మరింత బాగుంది :-)

Ruth చెప్పారు...

అరే, మురళిగారు ఏమైపొయారూ అని అనుకుంటూ ఉంటే మీరేమో గప్చుప్ గా మా వూరెళ్ళొచ్చేసారు. హ్మ్మ్... బావుంది, వైజాగ్ బీచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.RK బీచ్ వెళ్ళడం అస్సలు వేస్ట్. కాని పక్క పక్కనే ఉన్న యారాడ, గంగవరం, తంతడి లాంటి బీచెస్ బాగుంటాయి.
ఇంకా అసలు సంగతేంటంటే, మీరు మా అస్సలు వూరు కూడా వెళ్ళొచ్చేసారు! (మరి మా ఇంటి పేరు అరసవల్లి కదా) మాకు శ్రీకాకుళం చుట్టుపక్కలంతా ఇప్పటికీ చుట్టాలున్నారు. వాళ్ళల్లో పెద్దవాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు అలా కుడి పైటతో చీరకడితే నాకు భలే విచిత్రంగా ఉండేది. మా పెళ్ళి రిసెప్షన్లో ఒక మామ్మ గారిని ఆ చీర కట్టుతో ఫొటో తీసుకుందామని మా అప్పారావ్ ట్రై చేసారు గాని ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు :)

సుభగ చెప్పారు...

@Sujata garu..

అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ ..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

70- 80 లలో శ్రీకాకుళం 3 మాట్లు వెళ్ళాను. అన్నీ గుర్తుకు వచ్చాయి.

పర్యటన ను సాహిత్యాన్ని, ఉద్యమాల కోణం లోంచి కూడా పరిశీలిస్తున్న మీ టపా చాలా బాగుంది.

చిన్ని చెప్పారు...

మూడేళ్ళ క్రితం నే చేసిన ఉత్తరాంధ్ర యాత్రలో ఇల్లాగే ఆలయ ఆవరణలో వరదమ్మ జ్ఞాపకాలు తడిమిచూసాను :)కొన్ని కల్పితాలయిన "నిజం "అనే బ్రమలో మనసుకు తీసేసుకుంటాం :) నా యాత్ర గుర్తుకొస్తుంది .
"కంటి అద్దాలని పైకీ జరిపాను, అప్రయత్నంగా.":):)

మురళి చెప్పారు...

@జయ: టూర్ బాగా జరిగిందండీ.. ధన్యవాదాలు.
@గీతిక బి: పెద్ద కాంప్లిమెంట్.. ధన్యవాదాలండీ..
@పద్మార్పిత: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: ఇచ్చాను, చూడండి. లంకెలని గుర్తు చేసినందుకు ధన్యవాదాలండీ..
@వాసు: సెప్పకుండా ఎలాగుంతానండీ.. బలేటోరే!! ..ధన్యవాదాలు.
@రాజ్ కుమార్: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@ రసజ్ఞ: ధన్యవాదాలండీ..
@సుభగ: వచ్చేస్తున్నామండీ.. ధన్యవాదాలు.
@సుజాత: "కాలం ఒక ఫుల్ స్టాప్ పెట్టుకుని ఆగిపోయినట్టు" ..యెంత బాగా చెప్పారో కదా అసలు.. నిజంగా అలాగే ఉందండీ.. అందుకేనేమో బాగా నచ్చేసింది.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉంది.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@శ్రీనివాస్ పప్పు: చూడలేదండీ :( ఒక చోటికి వెళ్ళడానికి మాత్రమే వీలుంది.. ధన్యవాదాలు.
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@రూత్: యాదృచ్చికం!! మాకూ అదే అనుభవం అండీ.. ఫోటోకి వాళ్ళు ఒప్పుకోలేదు.. మీ ఊరు బాగా నచ్చినండీ మాకు.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం: అక్కడికి వెళ్ళగానే అవన్నీ గుర్తొచ్చాయండీ, అప్రయత్నంగా.. ధన్యవాదాలు.
@చిన్ని: :-) :-) ధన్యవాదాలండీ..

శ్రీకర్ బాబు చెప్పారు...

Murali garu,

I don't know what feedback your friend has given about Srimukhalingam, but its really very good place. If you visited this place, I bet you say that its the best place that you ever visit. Beautiful old temple maintained by Archeology Dept. If you visit again Srikakulam, plan to visit Srimukhalingam also.

మురళి చెప్పారు...

@శ్రీకర్ బాబు: నెగటివ్ గా ఏమీ చెప్పలేదండీ.. మరోసారి వెళ్తే తప్పక చూస్తాం.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి