వ్యవసాయం అంటే ఏమిటి? నేలను చదును చేసి విత్తనాలు చల్లడం.. పండిన పంటని కోసి మార్కెట్లో అమ్ముకోవడం. పల్లెలతో పరిచయం లేని చాలా మందికి వ్యవసాయం గురించి తెలిసింది ఇదే. విత్తనం నాటడానికి, పంట కోయడానికి మధ్య రైతుకి ఎదురయ్యే కష్టనష్టాలు, పడే శ్రమ, గురయ్యే ఒత్తిడి వీటిని గురించి ఆలోచించే వారు తక్కువ. ఈ నేపధ్యంలో వ్యవసాయ రంగాన్ని, ఈ రంగంలో ఉండే సమస్యలని, లోటుపాట్లని వివరిస్తూ వచ్చిన పుస్తకం 'ఇట్లు ఒక రైతు.'
చిత్తూరు జిల్లాకి చెందిన ఆదర్శ రైతు, సామాజిక ఉద్యమ కార్యకర్త గొర్రెపాటి నరేంద్రనాథ్ రాసిన ఈ చిరు పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. పెద్ద నగరంలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, వ్యవసాయం మీద మక్కువతో స్వగ్రామానికి పయనమైన నరేంద్రనాథ్, ఉమాశంకరి దంపతులు నేలతో చేసిన ప్రయోగాలను వివరించారు ఈ పుస్తకంలో. అలాగే ప్రపంచీకరణ ఫలితంగా వ్యవసాయ రంగంలో పెరిగిన పోటీ, దానిని ఎదుర్కోడంలో రైతులకి ఎదురవుతున్న సమస్యలనీ కళ్ళకి కట్టారు.
పుస్తకం ప్రారంభంలో కొన్ని పేజీలు సిద్ధాంత వ్యాసాన్ని తలపించినా, నరేంద్రనాథ్ తన స్వానుభవాలను వివరించడం మొదలు పెట్టగానే పాఠకులు పుస్తకంలో లీనమై పోతారు. వ్యవసాయానికి కొత్తైన నరేంద్రనాథ్, పొరపాట్లు చేస్తూ, వాటినుంచి నేర్చుకుంటూ సేంద్రీయ వ్యవసాయం చేసిన తీరు ఆపకుండా చదివిస్తుంది. అలాగే, 'ఆర్గానిక్ ప్రొడక్ట్స్' ని సూపర్ మార్కెట్లలో రెట్టింపు ధరలకి అమ్ముతున్నా, వాటినుంచి రైతులకి వచ్చే ప్రతిఫలం, మామూలు పంటలపై వచ్చే ఆదాయం కన్నా ఎక్కువ ఉండదన్న సత్యం బోధపడుతుంది.
సేంద్రీయ పద్ధతిలో చెరకు, మామిడి సాగు, 'శ్రీ వరి' పద్ధతిలో వరిసాగు చేసే విధానాన్ని కూలంకుషంగా వివరించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమ గురించి, పంటలు పోయినా పాడి పరిశ్రమ రైతులని ఎలా ఆదుకుంటుందో చెప్పారు నరేంద్రనాథ్. ఈ రంగంలోనూ సమస్యలకి కొదవ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహమూ అంతంత మాత్రమే. డైరీల నిర్వహణ, విజయాలూ వైఫల్యాలనూ తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ద్వారా.
వ్యవసాయాన్నీ, గ్రామీణ జీవితాన్నీ వేరు చేసి చూడలేము. గ్రామీణ సమాజంలో బలంగా పాతుకు పోయిన వర్ణ, వర్గ వ్యవస్థలనూ, కాలక్రమంలో వాటిలో వస్తున్న మార్పులనూ నిశితంగా పరామర్శించారు రచయిత. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల గ్రామీణ భారతం ఎదుర్కొనే సమస్యలనూ, వాటి తాలూకు పరిణామాలనూ తెలుసుకోవచ్చు.
రచయిత స్వయంగా అనేక ఉద్యమాలలో పాల్గొన్న వారు కావడం వల్ల, వివిధ సమస్యలపై నాయకులు, అధికారుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆయనకి తెలుసు. కుల వివక్షకి వ్యతిరేకంగా జరిపిన ప్రచారంలో తాను గమనించిన అంశాలనూ, భూ పంపిణీ విషయంలో నాయకుల, అధికారుల వైఖరినీ స్థూలంగా వివరించారు. వ్యవసాయ రంగంలో భవిష్యత్తులో రాబోయే మార్పులనీ రేఖామాత్రంగా స్పృశించారు.
ఏ రాజకీయ భావజాలానికీ అనుకూలంగానో లేక వ్యతిరేకంగానో లేకపోవడం ఈ పుస్తకం ప్రత్యేకతగా చెప్పాలి. నరేంద్రనాథ్ కేవలం రైతు పక్షపాతి అనిపించక మానదు, పుస్తకం పూర్తి చేశాక. ముందుమాట రాసిన ప్రొఫెసర్ కే.ఆర్. చౌదరి చెప్పినట్టుగా ఈ పుస్తకానికి ఒక్కటే లోపం. వివిధ చాప్టర్ల మధ్య లంకె లేకపోవడం. పుస్తకంలో ప్రస్తావించిన విభిన్న అంశాలను అనుసంధానించే విధంగా కథనం ఉంది ఉంటే మరింత బాగుండేది.
నరేంద్రనాథ్ జీవించి ఉంటే వ్యవసాయంపై మరిన్ని ప్రయోగాలు చేసి ఉండేవారు కదా..అనిపించింది, పుస్తకం పూర్తి చేశాక. గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది. ('ఇట్లు ఒక రైతు, వెల రూ. 50, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)
ఆ మధ్యన పరిచయం చెసిన "రేగడి విత్తులు","సహకారం" అనె టపా,ఇవాల్టి "ఇట్లు ఒక రైతు"..మీకు వ్యవసాయం పట్ల,రైతుల పట్లా చాలా ఆసక్తి ఉన్నట్లు తెలియచేస్తున్నాయండి!!
రిప్లయితొలగించండి"గ్రామీణ జీవితం తో పరిచయం ఉన్న వారు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది."
రిప్లయితొలగించండిఅంతే కాక సమాజంలో ఏం జరుగుతోంది అని కొద్దిగా పట్టించుకునే వాళ్ళు కూడా చదవాల్సిన పుస్తకం. పట్టణ, నగర వాసులకి రైతు జీవితం గురించి ఉండే అపోహలు తొలిగిపోయేందుకు కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగ పడుతుంది.
బాగుంది మురళి పరిచయం... భారత దేశానికి రైతే పట్టుకొమ్మ కాని అందరం పారిశ్రామికరణ వైపు తీసే పరుగు లో రైతరికమే వదిలేసేము ఇంక రైతు సమస్యల గురించి ఆలొచించటం కూడా... తప్పక చదవవలసిన పుస్తకాల లిస్ట్ లో ఇంకొకటి కలిసింది...
రిప్లయితొలగించండిe madhylo nenu oka navala Dec-09 chaturalo vachindandi...
రిప్లయితొలగించండిDevuni Rajaym...Elikatte shankarrao garidi, chala bagundhi.... chadhavaka pothe oka kannu veyyadi atu kuda....
@తృష్ణ: నిజమేనండి.. ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@కొత్తపాళీ: కానీ రైతు గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? ..ధన్యవాదాలు.
@భావన: ధన్యవాదాలు
@మహిపాల్: డిసెంబర్-09? బహుశా డిసెంబర్-08 అనుకుంటానండి.. తప్పక ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.
మురళిగారు , మాదీ రైతు కుటుంబమే అయినా వ్యవసాయం గురించి పెద్దగా తెలీదు :(
రిప్లయితొలగించండిచదవాల్సిన పుస్తకాల లిస్టు పెరిగిపోతోంది ...ఒక జీవిత కాలం సరిపోదేమో :(
@పరిమళం: చక్కగా సరిపోతుందండీ.. చదవడం మొదలుపెడితే ఎంతసేపు..? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి