శనివారం, జులై 25, 2009

నాయికలు-అమృతం

ఏం చెప్పాలి అమృతం గురించి? ఆమెని తలచుకోగానే అన్నీ ప్రశ్నలే.. ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి.. కానీ అవి సంతృప్తిగా అనిపించవు. అమృతం యెంతోదగ్గరగా అర్ధమైనట్టే అనిపిస్తుంది. అంతలోనే ఏమీ అర్ధంకాని పజిల్లాగా అనిపిస్తుంది. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలోని ప్రధాన స్త్రీ పాత్రల్లో ఓ పాత్ర అమృతం. కథానాయకుడు దయానిధి మరదలు, వివాహిత.

దయానిధి జీవితంలో ఎందరో స్త్రీలు.. కోమలి, నాగుమణి, సుశీల, ఇందిర, కాత్యాయని ఇంకా అమృతం. వీళ్ళలో కోమలి దయానిధి ప్రేమించిన అమ్మాయి. ఇందిర అతను తాళి కట్టి, కాపురం చేయని భార్య. నాగుమణి, కాత్యాయని లు లోకం దృష్టిలో అతనితో సంబంధం ఉన్న అమ్మాయిలు. ఇంక సుశీల, అమృతం అతని మరదళ్ళు.. ఒకరు తండ్రి తరపు, మరొకరు తల్లి వైపునుంచి.

దయానిధి తల్లిది 'మచ్చ' ఉన్న జీవితం.. ఆమె మరణం ఒక మిష్టరీ. ఆమె మరణించాక దయానిధిని పరామర్శించడానికి వస్తారు అమృతం, ఆమె తమ్ముడు జగన్నాధం. (ఈ నవల్లో అమృతం తర్వాత నాకు అంతగా నచ్చిన పాత్ర జగన్నాధం) దయానిధికి కోమలి పట్ల ఉన్న 'వ్యామోహాన్ని' అర్ధం చేసుకుంటుంది అమృతం, అతను చెప్పినట్టుగా అది 'ప్రేమ' అని అంగీకరించకపోయినా.. అతను కోమలికి దగ్గర కావడానికి తనవంతు సాయం చేస్తుంది అమృతం.

పెద్దగా చదువుకోని ఓ పల్లెటూరి అమ్మాయి అమృతం. భర్త కాంతారావు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. పిల్లలు లేరు. భర్త మరో స్త్రీతో సన్నిహితంగా ఉన్నాడని రూఢిగా తెలుసును అమృతానికి. ఆ విషయాలన్నీ 'బావ' దయానిధి తో పంచుకునే చనువు ఉంది.. 'కాపురం అన్నాక ఇలాంటివి మామూలే బావా' పైకి తేలిగ్గా తీసేయగల లౌక్యమూ ఉంది. బంధువుల్లో ఆమెకి 'మంచి వ్యవహర్త' అన్న పేరుంది.

కడుపులో అగ్నిపర్వతాలు దాచుకుని పైకి నవ్వగలగడం తెలుసు అమృతానికి.. ఎటొచ్చీ ఆ నవ్వు 'ఉద్యానవనం తగులడుతోంటే రాణీలు చూసి బాధతో నవ్వినట్టు' ఉంటుంది. దయానిధి పెళ్ళికి ముందు అతన్ని కోమలికి దగ్గర చేయడానికి ప్రయత్నించిన అమృతమే, వివాహం తర్వాత అతనికి మామగారితో వచ్చిన మాటపట్టింపుని సరిదిద్ది ఇందిరతో అతని కాపురం నిలబెట్టడానికీ విఫల యత్నం చేస్తుంది.

ఓ చీకటిరాత్రి దయానిధితో ఏకమవుతుంది అమృతం.. ఫలితంగా ఓ ఆడపిల్లకి జన్మనిస్తుంది. పసిపిల్లలో తన పోలికలు వెతుక్కోడానికి భయం భయంగా వెళ్ళిన దయానిధిని ఆశ్చర్య పరుస్తుంది అమృతం. వుయ్యాల్లో పిల్లని అతనికి చూపిస్తూ "అత్తయ్యా, అచ్చంగా బావ పోలిక కాదు?" అని తన అత్తగారితో అనగలదు అమృతం. అది గడుసుతనమా? అసహాయత నుంచి పుట్టిన తిరుగుబాటా?

"బావ పోలికంటే కాదంటున్నాడండోయ్.." అని తన భర్తతో అన్నప్పుడు మాత్రం, అతని చేతకాని తనాన్ని ఎత్తిపొడుస్తోందా? అనిపించక మానదు. అమృతానికి తన బలమూ, బలహీనతా తెలుసు. తనకేంకావాలో తెలుసు.. దానిని ఎలా సాధించుకోవాలో తెలుసు. తనకి నచ్చినట్టుగా ఉంటూనే సంఘం చేత వేలెత్తి చూప బడకుండా ఉండడమూ తెలుసు. నాకు మాత్రం ఈ నవల చదివిన ప్రతిసారీ అమృతాన్ని గురించి (ఆమాటకొస్తే మిగిలిన అన్ని పాత్రల గురించీ కూడా) తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలి ఉందనిపిస్తుంది. ('చివరకు మిగిలేది,' విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100)

20 కామెంట్‌లు:

  1. అమృతం 'మంచి వ్యవహర్త' అనే అనిపిస్తుంది నాకు.

    అదేమీ negative పదం కాదు.అలా బ్రతకనేర్వకపోతే "ఆడతనాన్ని" కాపాడుకోవడం అప్పటి/ఇప్పటి సమాజంలో కష్టమైన విషయం. సమాజానికి కావలసిన "నటన" చేస్తూనే, తన అవసరాల్నీ ఆకాంక్షల్నీ ప్రేమగా తీర్చుకునే నేర్పరి అమృతం.

    Unconditional ప్రేమ అందిస్తూనే తన తరఫున్నుంచీ అన్నికండిషన్లనూ తీర్చుకునే ఒక (అ)సాధారణమైన ఆడది అమృతం. తన పరిధిలో విప్లవాలు లేవదీయకుండా లౌక్యంతో అవసరాలు తీర్చుకునే తెలివిమంతురాలు. దయానిధికి సహాయపడుతూనే తన అవసరానికి ఉపయోగపడుతుంది అమృతం. ఒకరకమైన balancing act లో తను సిద్ధహస్తురాలు.

    బహుశా ఇలాంటి స్త్రీలే ఈ సమాజంలో పవిత్రంగా మనగలుగుతారు. ఆ survival instinct కి ప్రతీక అమృతం. ఆ "ముగ్ధజాణతనానికి" చిహ్నం అమృతం. అందుకే ఈ పాత్ర మగాడికి, ముఖ్యంగా దయానిధి వంటి తాత్వికుడికి అర్థం కాదు. సామాజిక "వ్యవహారాలు" తాత్వికులకి అర్థం కావు. పైగా స్త్రీలలోని వ్యవహర్తతత్వం అస్సలు కాదు.

    ఎందుకో నాకు బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’కీ గురుదత్ ‘ప్యాసా’కూ చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. రెండూ నా జీవితాన్ని ప్రభావితం చేసినవే.

    రిప్లయితొలగించండి
  2. బుచ్చి బాబు గారి 'నిరంతర త్రయం' చదివారా ? అందులో 'నిప్పులేని పొగ' కధ నాకు చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  3. "అదేమీ negative పదం కాదు.అలా బ్రతకనేర్వకపోతే "ఆడతనాన్ని" కాపాడుకోవడం అప్పటి/ఇప్పటి సమాజంలో కష్టమైన విషయం. సమాజానికి కావలసిన "నటన" చేస్తూనే, తన అవసరాల్నీ ఆకాంక్షల్నీ ప్రేమగా తీర్చుకునే నేర్పరి అమృతం."
    ఈ మాటలు పూర్తిగా ఖండిస్తున్నాను ..నెగటివ్ కాదంటూనే నటన అంటున్నారు ..అమృతం కి దయానిధి పట్ల వున్నా ఇష్టం కాని ,ప్రేమ కానీ ఆమెతో దయానిధికి దగ్గరయ్యే అవకాశం కలిగింది .ఆమెకి అతని పట్ల ఇష్టం వల్ల అతనికోసం tanu istapadinavarikosam ,atani kaapuram kosam sahayapadindhi ....indhulo samajanikosam natana kanapadadu ..nijaniki chaala teguva kaligina yuvathiga anpisthundhi.

    రిప్లయితొలగించండి
  4. చెప్పడం మరిచాను , మంచి పుస్తకం పరిచయం చేసారు , బహుశ చదవని వారుండరని (పుస్తక ప్రియులు
    ) అని అనుకుంటాను ,నాకు అమృతం ఇష్టమయిన పాత్రే .

    రిప్లయితొలగించండి
  5. @చిన్ని: అమృతం పాత్రకు నవలలో భావస్వేచ్చ లేదు. అమృతం ఎప్పుడూ తనకోసం తాను బ్రతకలేదు. ఇతరులను సంతృప్తిపరచి తన "స్థానాన్ని"కాపాడుకోవటానికి బ్రతికింది. అందుకే "నటన" అమృతానికి ఒక సహజమైన అవసరం. ఇందులో నెగిటివ్ గా ఫీలవ్వడానికి ఏమీ లేదు.

    భర్త జమాబందీ, అత్త జబర్దస్తీల మధ్య, పిల్లల లేమి తనను "తన ఇంటికి" దూరం చేస్తుందన్న కటికనిజం నేపధ్యంలో దయానిధితో అమృతం కలయిక జరుగుతుంది. దయానిధిపైన అమృతానికి ఎప్పుడూ ప్రేమ ఉండుండొచ్చుగాక, కానీ ఈ కలయికలోని అమృతం యొక్క ఉద్దేశం "కేవలం ప్రేమ" కాదు. అలా కాకున్నా తప్పులేదు. She did it for her survival. ఇందులో దయానిధికి జరిగిన నష్టంకూడా ఏమీ లేదు. He is rich by one experience. He got some thing more to think about.All he needed out of life was to "think about life", rather than living it.

    అమృతం నైతికతను నేను ప్రశ్నించడం లేదు. అలా ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నేను అమృతం ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను.

    ‘అమృతం selflessness లో selfishness ఉంది’ అనే ప్రతిపాదన ఆ పాత్రపట్ల కఠినంగా అనిపించినా, నవలలో దానికి ఆధారాలు బోలెడు.స్వార్థపరురాలిగా ఉండటంలో తప్పులేదే? self centered గా ఉంటేతప్పు. ఇతరుల జీవితాలతో ఆడుకునే స్వార్థం ఉంటే తప్పు. కానీ అమృతం ప్రేమించే స్వార్థపరురాలు.

    రిప్లయితొలగించండి
  6. @కత్తిమహేష్ కుమార్
    మీతో ఈ విషయమై చర్చించాలంటే బహుశా నేను మరల "చివరికి మిగిలేది " లోనికి వెళ్ళాలి , మీ దృక్పధం నుండి చదువుతాను .

    రిప్లయితొలగించండి
  7. మహేష్ విశ్లేషణ బావుంది. అసలు ఈ నవల గురించి ఒక పది టపాల సీరియల్ రాయాలండీ మురళీ మీరు. కేవలం అమృతం గురించి మాత్రమే కాదు.

    "అది గడుసుతనమా? అసహాయత నుంచి పుట్టిన తిరుగుబాటా?" గడుసుతనమే అనిపించింది నాకైతే! దయానిధి భయాన్ని అత్త, భర్త గమనించకుండా "బావ పోలిక కాదూ"అంటూ అడ్డు వేసిన గడుసుతనం! అంత మాత్రాన అమృతం తప్పు చేసిందనలేం!

    కోమలి కూడా ఒక నాయికే! ఇందిర ఏమిటో, ఎవరో అర్థం కాదు. సుశీల కథ అలా ఎందుకైందో అర్థం కాదు. దయానిధి జీవితం ఒక పజిలు! అసలు ఈ నవల చదవడమే ఒక పెద్ద ఎడ్యుకేషన్. ఎన్ని సార్లైనా చదువుతాను.

    రిప్లయితొలగించండి
  8. డిగ్రీ చదివే రోజుల్లో 2,3సార్లు చదవటానికి ప్రయత్నించి ఎందుకనో మధ్యలో ఆపేసిన పుస్తకాల్లో ఇదొకటి...పైని వ్యాఖ్యలన్నీ చదివాకా మళ్ళీ బుచ్చిబాబుగారిని పలకరించాలనిపిస్తోంది.. ఈ సారి పూర్తిగా చదవగలనేనో..!

    రిప్లయితొలగించండి
  9. ఏమిటో కధానాయకి అమృతం గడుసుదనం అర్ధం కావడం లేదు ,అనుకోకుండా జరిగిన సంఘటనే తప్ప అమృతం తన స్వార్ధం కొద్ది దయనిధిని ప్రలోభ పెట్టింది అర్ధం కావడం లేదు , తన బిడ్డను చూపించేప్పుడు ఆమె చతుర సంభాషణ కనిపిస్తుంది ......
    "బహుశ ఇటువంటి స్త్రీలే samajamlo పవిత్రంగా మనగలుగుతున్నారు ." పవిత్రము అంటే అర్ధం కాలేదు .
    అసలు మురళిగారు మీరు అమృతం గడుసుతనం ఏమిటో చెప్పండి , పిరికివాడి ముందు అమాయకంగా మాట్లాడుతున్న మనసులో ఏ సంకోచం లేకుండా అతని మీద వున్నా ప్రేమ తో అతనికి అన్ని విషయాల్లో తోడ్పాటు చేసిన అమృతం గురించి .
    తాంబూలలిచ్చేసాం తన్నుకు చావండి ......అనొద్దు :)
    చివరికి ఏమి మిగలదా?..........చర్చించకుండా వుండలేకపోతున్నానే ,:)

    రిప్లయితొలగించండి
  10. "నాకు మాత్రం ఈ నవల చదివిన ప్రతిసారీ అమృతాన్ని గురించి (ఆమాటకొస్తే మిగిలిన అన్ని పాత్రల గురించీ కూడా) తెలుసుకోవాల్సింది ఇంకా మిగిలి ఉందనిపిస్తుంది."
    మీ మాటలే ఇవి ...నావి కూడా ...నాకూ ఎందుకో అసంపూర్ణం అనిపిస్తుంది ...
    మీ పరిచయం బావుంది ఎప్పటిలాగే ...మహేష్ గారి విశ్లేషణా బావుంది .

    రిప్లయితొలగించండి
  11. @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు
    @Sujata: చదవలేదండీ.. తప్పక చదువుతాను.. ధన్యవాదాలు.
    @సుజాత: ఇందిర వల్ల దయానిధి లో 'వివాహితుడిని' అనే స్పృహ కలిగింది గమనించండి.. ఇందిర తో వివాహం కాకపొతే, అతను కోమలిని వజ్ర కరూరు కి ఆహ్వానించే తీరు వేరుగా ఉండేది కదా? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @భాస్కర్ రామిరెడ్డి: చర్చ వల్ల అభిప్రాయాలు తెలుస్తాయి కదండీ.. ధన్యవాదాలు.
    @తృష్ణ: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @పరిమళం: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @చిన్ని: అమృతం-దయానిధిల కలయిక అమృతం కోరుకున్నదే అనిపిస్తుందండీ.. ఇంట్లో వాళ్ళని బలవంతంగా సినిమాకి పంపుతుంది చూడండి.. కాకపొతే అది దయానిధికి మాత్రం యాదృచ్చికం. బిడ్డ తన బిడ్దేనా? అన్న సందేహం దయానిధి ది. అది అమృతానికి మాత్రమే తెలిసిన రహస్యం.. ఆ రహస్యాన్ని ఆమె చతుర సంభాషణ రూపం లో వెల్లడించడం వల్ల ఆమెది గడుసుదనమా అన్న సందేహం కలుగుతుంది. తనకి అలాంటి పరిస్థితుల్లో బిడ్డని కనాల్సిన పరిస్తితులు కల్పించిన కుటుంబ సభ్యుల పట్ల తిరుగుబాటు ధోరణి కూడా కావొచ్చు. ఇక 'స్త్రీల పవిత్రత' విషయం.. నేను నా టపా లో ఆ విషయం రాయలేదండి.. మరొకరి అభిప్రాయంపై నేను వ్యాఖ్యానించడం సరికాదేమో కదా? మీరు 'పిరికి వాడు' అన్నది దయానిధినా? అతను పిరికివాడే ఐతే తండ్రిని ఎదిరించడు, మామగారితో విభేదించడు. పరిస్థితులకి అనుగుణంగా రాజీ పడేవాడు కదా? అమృతానికి దయానిధి పట్ల ఉన్నది నిస్వార్ధ ప్రేమ అనే అనిపిస్తుంది నాకు.. వీలయితే ఒకసారి నవలని, మళ్ళీ నా టపాని చదవండి. మీ అభిప్రాయం చెప్పండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. సరేనండి మరల చదివే నా అభిప్రాయం రాయాలి .ఓకే. దయానిధి ముమ్మాటికి ఓ పిరికివాడు నా దృక్పధం లో ,ఇది అసలు మారదు ..ఇక్కడి అభిప్రాయాల్లో నాకు దమన నీతి గోచరిస్తుంది..ఏమైనా మరోసారి చదవనిదే మాట్లడకూడదేమో. ఇక్కడ నేను అమృతం ని సమర్ధించడం లేదు , అనుకోని పరిస్థితి గురించే నేను మాట్లాడుతున్నాను .మొదటి నుండి ఆమెకు అటువంటి ఉద్దేశ్యం వున్నట్లయితే తనకు ఎన్నో అవకాశాలు దయానిధి తో వున్నటువంటి భందుత్వం వలన ...సరేనండి ఎప్పుడో చదివినది మరల మీ అందరి దృక్పధం నుండి చదువుతాను .

    రిప్లయితొలగించండి
  15. ఒకసారే చదివినా అప్పటి నా ఆలోచనలని మహేష్, సుజాత గార్లు చెప్పేసారు. మళ్ళీ చదువుతాను. అపుడు చిన్ని ఆలోచనకి మూలమేదన్నా వుందా అని చూస్తాను. అమృతం ఏ తప్పూ చేయలేదనే నేను అంటాను. కాకపోతే ఆమెలో ప్రేమ లేదని మాత్రం అంగీకరించను. ఇది కేవలం అవసరం తీర్చుకున్న చర్య కాదేమో.

    రిప్లయితొలగించండి
  16. @చిన్ని: దయానిధిని కేవలం పిరికివాడైతే ఈ నవలకు సార్థకత వచ్చేది కాదు.

    నాదృష్టిలో దయానిధి ఒక తాత్వికుడు. తను జీవించలేక, జీవితం గురించి (ఒక స్థాయిలో విపరీతంగా) ఆలోచించి పాఠకులకు కొన్ని అనుభవాల్ని, ఆలోచనల్ని,అభిప్రాయాల్నీ, ప్రశ్నల్నీ, జవాబుల్నీ,జీవన పార్స్వాల్ని పరిచయం చేసి తను మాత్రం చివరికి ఏమీ మిగలదని తెలుసుకుంటాడు.

    నిజానికి జీవితానికి అర్థం ‘ఏం మిగిలింది’ అని కాదు. ఏం "నేర్చుకున్నాం" అనేది మాత్రమే. ఎలా జీవించాం అనేది మాత్రమే.దయానిధిది భౌతికజగత్తు కాదు. తాత్విక జగత్తు. మనందరం అలాంటి తాత్విక జగత్తులో బ్రతకలేం గనక, బుచ్చిబాబు దయానిధిని సృష్టించి తనద్వారా మనకు కొన్ని అనుభవాల్ని ఇచ్చాడు.

    మీరు ఆ అనుభవాల్ని భౌతిక విలువల కోణంలో చూసి దయానిధిని పిరికివాడంటున్నారు. ఆ అనుభవాల ఆధారంగా దయానిధి తెలుసుకున్న పాఠాల్ని గుర్తించండి. వాటిలోని జీవన మూల్యాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బహుశా అప్పుడు దయానిధి కొత్తగా కనిపిస్తాడేమో!

    రిప్లయితొలగించండి
  17. Thats an interesting comment!
    I have almost similar views on Amrutam... :)

    రిప్లయితొలగించండి
  18. నాకు దయానిధిపై అమృతానికి గల ప్రేమ స్వార్ధరహితమైనదిగానే కనిపిస్తున్నది. ఇక దయానిధి తో ఒక రాత్రి ఆమె దగ్గరవ్వడం అన్నది యాదృచ్చికంగానే జరిగినట్లు అనిపిస్తుంది. ఆ కలయికకు పరిస్థితులు అనుకూలించాయి అంతే. వారిద్దరూ ఏకాంతంగా ఉండటం ఒకటైతే, అతిముఖ్యంగా సహజంగా స్త్రీ కి మాతృత్వం పై ఉండే కోరిక(ఇది నా అభిప్రాయం మాత్రమే). ఈ విషయంలో అమృతమే చొరవ చూపిస్తుంది. దాన్ని స్వార్ధంతో కూడిన ప్రేమ అనుకోలేను. అమృతం, తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని ఒకసారి దయానిధితో చెప్తుంది. వీటన్నిటికీ మించి అమృతం దృష్టిలో దయానిధి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు. తన భర్తలో లేని 'ఆమె అనుకున్న ' సద్గుణాలు దయానిధిలో ఉండవచ్చు. ఈ అన్ని కారణాలవలనే అమృతానికి, దయానిధిపై సహజమైన ప్రేమ ఏర్పడిందని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  19. దయానిధి పై మహేష్ గారి అభిప్రాయాలతో, మురళి గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి