సోమవారం, జులై 27, 2009

పెళ్లిచూపులు

నేను మొదటిసారి పెళ్లిచూపులు చూసినప్పుడు నాకు ఆరేళ్ళో, ఏడేళ్ళో.. అబ్బే.. పెళ్లిచూపులు నాకు కాదు. మా పక్కింటి అమ్మాయికి. తనని నేను 'అక్క' అని పిలిచేవాణ్ణి. వాళ్ళ నాన్నగారు, తాతయ్య స్నేహితులు. ఆ స్నేహాన్ని పురస్కరించుకుని ఆయన తాతయ్యని ఆహ్వానించారు, కుర్రాడిని చూడడానికి. పెద్దమనిషి హోదాలో తాతయ్య, చిన్నమనిషి హోదాలో నేనూ వెళ్ళాం పెళ్ళిచూపులకి.

పెళ్ళికొడుకు, వాళ్ళమ్మగారు గుర్రబ్బండి మీద వచ్చారు. అతను తెల్ల ఫేంటు, చొక్కా తొడుక్కుని కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. అక్కేమో పట్టు పరికిణీ, వోణీ, తలలో బోల్డన్ని పూలు. రోజూ నాతో బోల్డన్ని కబుర్లు చెప్పేదా? ఆవేళ నాతో అస్సలు మాట్లాడనే లేదు. నాకైతే చాలా కోపం వచ్చింది తన మీద. ఈ పెళ్ళికొడుకు నన్ను చూసి నవ్వేడు కానీ, నేను నవ్వలేదు. తన వల్లే అక్క నాతో మాట్లాడ లేదు కదా..

ఇటు చూస్తే తాతయ్య కూడా నన్నసలు పట్టించుకోకుండా ఆ పెళ్లికొడుకుతో ఒకటే కబుర్లు. అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు.. ఏమిటో ఒకటే హడావిడి. నేనేదో మాట్లాడబోతే తాతయ్య నన్ను ఇంటికి వెళ్ళేదాకా నోరెత్తొద్దని హెచ్చరించేశాడు. నాకు మాత్రం మహా విసుగ్గా ఉంది. ఇంతలో ఇంట్లోనుంచి కారప్పూసలు వచ్చాయి. అక్క వాళ్ళ నాన్నే నాతోసహా అందరికీ ఇచ్చారు. మామూలు రోజుల్లో నాకు ఆయన్ని చూస్తే భయం..కానీ ఆవేళ ఆయనే అందర్నీ చూసి భయ పడుతున్నట్టు ఉన్నారు.

వచ్చిన వాళ్ళిద్దరూ పళ్ళాలు పక్కన పెట్టేశారు కానీ, తాతయ్య తినడం చూసి, నేను కూడా కారప్పూస నమలడం మొదలు పెట్టాను. కాసేపటికి పెద్దవాళ్ళందరికీ కాఫీలు, నాకు పాలు వచ్చాయి. అప్పుడు పెళ్ళికొడుకు తనకి కాఫీ అలవాటు లేదన్నాడు. తనకి కూడా ఇంకో గ్లాసుతో పాలు తెచ్చారు. నాకు భలే చిత్రంగా అనిపించింది.. నాకు ఇంట్లో కాఫీ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని నేను త్వరగా పెద్దై పోవాలనుకునే వాడిని, అప్పుడైతే కాఫీ తాగొచ్చు కదా.

ఇంత పెద్దవాడు కూడా హాయిగా కాఫీ తాగకుండా పాలెందుకు తాగుతున్నాడా? అని ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యంతో నేను అతన్ని నోరు తెరుచుకుని చూస్తుంటే, తాతయ్య నా వీపు మీద తట్టి, పాలగ్లాసు చూపించాడు. మొత్తానికి ఆ పెళ్ళికొడుకు మీద నాకు ఆసక్తి పెరిగింది. కాఫీలవ్వగానే అక్కని తీసుకొచ్చారు. తనకన్ని బంగారు గొలుసులూ అవీ ఉన్నాయని అప్పటి వరకూ తెలియదు నాకు. పెద్ద వాళ్ళందరికీ (తాతయ్య కి కూడా) కాళ్ళకి దణ్ణం పెట్టి చాప మీద కూర్చుంది. పెళ్లికొడుకు తల్లేమో అక్క పేరు, ఏం చదువుకుందో అడిగారు.

ఓ ఐదు నిమిషాలకి అక్కని లోపలి తీసుకెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు, వాళ్ళమ్మగారు వెళ్లడానికి బయలుదేరుతున్నారు. నాకసలే మనసులో ఏమీ దాచుకోడం తెలియదు. అతను కాఫీ తాక్కుండా పాలెందుకు తాగుతున్నాడో అడగాలి? కానీ ఎలా? తాతయ్య వద్దన్నాక మరి మాట్లాడడానికి లేదు. అతను రోడ్డు మీదకి వచ్చేశాడు కానీ ఆవిడింకా ఇంట్లోనే ఉన్నారు. 'మీ పేరేంటి?' అని అడిగాను దగ్గరకెళ్ళి. తన పేరు చెప్పి, 'ఎందుకు' అని అడిగాడు. సరిగ్గా అప్పుడే నాన్న రోడ్డు మీంచి వెళ్తున్నాడు. ఆ కంగారులో నాకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు. 'అక్క అడగమందా?' అని ఇంట్లోకి చూపించి అడిగాడు. నేను గబగబా నిలువుగానూ,అడ్డంగానూ తలూపేసి మా ఇంటికి పరిగెత్తాను, తాతయ్యని అక్కడే వదిలేసి.

కొన్నాళ్ల తర్వాత అక్కకి అతనితో పెళ్ళైపోయింది. అప్పుడు తెలిసింది, అతనికి కాఫీ వాసన ఇష్టం ఉండదని. కానీ పేరు గొడవ అలాగే ఉండిపోయింది. 'నువ్వు అడిగించావు' అంటాడు అతను, 'నేను అడిగించలేదు' అంటుంది అక్క.. ఈ విషయాన్ని నేను మర్చిపోకుండా పదే పదే జ్ఞాపకం చేశారు వాళ్ళిద్దరూ.. ఇప్పటికీ ఎప్పుడైనా కలిసినప్పుడు అక్క తన మనవల కబుర్లు చెబుతూనే, మధ్యలో 'ఆవేళ నిన్ను పేరు అడగమన్నానా?' అని నన్ను ఇరుకున పెడుతూ ఉంటుంది.

26 కామెంట్‌లు:

  1. ఆహా! పొద్దున్నే, మంచి కాఫీలాంటి టపా. ఇక రోజంతా ఉల్లాసమే. చాలా బావుంది.

    రిప్లయితొలగించండి
  2. hmmm.. నాకేదో అనుమానంగా ఉంది. పెళ్లిచూపులు. ఆషాడమాసం, గట్రా.. అసలు సంగతి చెప్పండి నాన్చకుండా.. ఉపోద్గాతం లేకుండా.. మేమేమీ అనుకోము.ర్యాగింగ్ చేయము మురళిగారు... :)))

    రిప్లయితొలగించండి
  3. కంగారు పడ్డా కరెక్టుగానే చెప్పారే!!:) :)

    రిప్లయితొలగించండి
  4. అదేంటో మా ఇళ్ళలో పెళ్లి చూపులు ఎప్పుడు ఇలా జరగాలా ... ఫలానా వాళ్ళ అబ్బాయి కి మన అమ్మాయి అనుకోవడం.. వాళ్ళకి ఏదో చుట్టరికం ఉండటం తో ఈ చూపులు లాంటివి మా ఇళ్ళల్లో జరగలేదు ..ఇంతకీ మీవి ఎలా జరిగాయో చెప్పనే లేదు ...

    రిప్లయితొలగించండి
  5. భలే ఉంది పెళ్ళిచూపుల అనుభవం...అయినాగానీ అక్కడ పెట్టిన కారప్పూసని చక చక లాగించే పనిలో ఉండక ఎందుకండీ అనవసర సందేహాలు:))..టైటిల్ చూసి మీ పెళ్ళి చూపులేమో అనుకున్నాను..అదిసరే కానీ జ్యోతిగారి లానే నాక్కూడా ఏదో ఉందని అనుమానం:).

    రిప్లయితొలగించండి
  6. మురళిగారు బాగుందండి మీ పెళ్లి చూపులు ,పనిలో పని మీ పెళ్లి చూపులు చెప్పండి .

    రిప్లయితొలగించండి
  7. భలే మురళి గారు :-) ఆరేడేళ్ళకి పెళ్ళి చూపులేవిటా అని కాస్త ఖంగారు పడ్డాను, ఓ క్షణం రెండురెళ్ళారు లో వెంకట శివం గుర్తొచ్చాడు :-)

    రిప్లయితొలగించండి
  8. మురళిగారు , భలే ప్రారంభం ! బాల్య వివాహాల్లాగా ...బాల్య పెళ్లిచూపులేమో అనుకున్నానండీ :)
    అన్నట్టు ఇప్పుడు పెద్దై పోయారు కదా ...కాఫీ ప్రేమికుల్లో మీరూ చేరిపోయారా మరి ?

    రిప్లయితొలగించండి
  9. మొన్నెప్పుడొ "ఆషాఢమాసం"...ఇవాళ "పెళ్ళి చూపులు"....జ్యోతి గారు చెప్పినట్లు..ఏమిటండీ సంగతి..?

    రిప్లయితొలగించండి
  10. మరి మీ పెళ్ళిచూపుల్లో ఖుమ్మేసి ఉంటారు...అవునా?

    రిప్లయితొలగించండి
  11. నేను కూడా మీ పెళ్ళిచూపుల గురించే అనుకున్నా :)
    అంత చిన్నప్పుడే దగ్గరుండి పెళ్లిచూపులు జరిపించారన్నమాట కారప్పూస తినుకుంటూ :)
    ఇంతమంది పురజనుల కోరిక మీద.. మీ పెళ్లి చూపుల కబుర్లు ఇహ మీరు చెప్పాల్సిందే ఇప్పుడు ;)

    రిప్లయితొలగించండి
  12. @భైరవభట్ల కామేశ్వర రావు: మీ వ్యాఖ్య చూశాక నాక్కూడా ఉల్లాసమే.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: ధన్యవాదాలు
    @వెంకటరమణ: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  13. @జ్యోతి: మీ వ్యాఖ్య చూశాక నాకిప్పుడు పెళ్ళిచూపులకి వెళ్లాలనిపిస్తోంది.. పరిణామాలకి మీరే బాధ్యత వహించాలి మరి.. ర్యాగింగ్ అంటారా? ఇలాంటివి ఉంటాయనే మన 'స్వర్ణముఖి' సుబ్రహ్మణ్య చైతన్య ఓ సంఘం పెట్టి నాకు సభ్యత్వం కూడా ఇచ్చేశారు.. కాబట్టి అలాంటి భయాలేవీ లేవు. ధన్యవాదాలు.
    @వినయ్ చక్రవర్తి గోగినేని: ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: నాకు అర్ధమైంది ఏమిటంటే మీరు భైరవభట్ల వారితో ఏకీభవించారని.. నిజమేకదా? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @పద్మార్పిత: ఏదోనండి.. ఆ టైంకి అలా వచ్చేసింది.. ధన్యవాదాలు.
    @శ్రీ అట్లూరి: ఇవి బాల్య జ్ఞాపకాలు కదండీ.. ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: కారప్పూస అయిపోవడం వల్లే సమస్య వచ్చిందండి :) జ్యోతిగారికి సమాధానం చెప్పేశాగా.. మీరుకూడా బాధ్యత వహిస్తారా? :) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @లలిత: ధన్యవాదాలండీ..
    @చిన్ని: ప్రస్తుతం బాల్యంలో ఉన్నాం.. కొంచం ఓపిక పట్టండి :) ధన్యవాదాలు.
    @భాస్కర్ రామరాజు: :):) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @వేణూ శ్రీకాంత్: చాలా రోజులైపోయిందండీ వెంకట శివాన్ని చూసి..భలే గుర్తు చేశారు. ఓసారి చూడాలి.. ధన్యవాదాలు.
    @పరిమళం: నేను కాఫీతో బతికేయగలనండీ.. (అయినా బోయినం కూడా చేస్తూ ఉంటాననుకోండి) ..ధన్యవాదాలు.
    @సునీత: ధన్యవాదాలు
    @Sujata: మీరూ బాధ్యత వహించాలి మరి :-) ..చేపల వాసన? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @తృష్ణ: ప్రత్యేకంగా ఏమీ లేదండీ.. అక్క గురించి మాతలోచ్చాయి ఇంట్లో.. అలా గుర్తొచ్చింది ఇది.. ధన్యవాదాలు.
    @సృజన: కొంచం ఓపిక పట్టాలండీ :) ..ధన్యవాదాలు
    @మధురవాణి: నేనేమీ చెప్పను అనడం లేదు కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. అయ్యయ్యో పెళ్ళిచూపులు లేని కేసే మనది. పెళ్ళిచేసుకుని ప్రేమించాల్సింది ;) చూడను కూడా లేదు. నిజానికి నేను వీటికి వ్యతిరేకిని. ఇంకేమి కలపను. ఒకసారి అమ్మ మేము మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నపుడు " బయట ఏమీ తినకండి" అని చెప్తే మా చిన్న అత్తయ్యకి నా మాటల్లో "మీ ఇంట్లో ఏమీ తినవద్దు" అని అమ్మ చెప్పింది అని ఒక కలహాన్ని సృష్టించాన[ట!] ;)

    రిప్లయితొలగించండి
  19. @ఉష: చిన్నప్పుడు మీరు కలహప్రియులన్న మాట :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి