మంగళవారం, జులై 07, 2009

'ఇల్లేరమ్మ' కొత్త కథలు

పుస్తకాల షాపుకెళ్ళి చాలా రోజులైందన్న విషయం నిన్న సాయంత్రం హఠాత్తుగా గుర్తొచ్చింది. నేను లేడి ని కాదు కానీ, ఇలాంటి విషయాల్లో మాత్రం నాకు లేచిందే పరుగు. సాయంత్రం షాపుకెళ్ళి, తీరిగ్గా ఒక్కోటీ చూస్తూ, నచ్చినవి ఎంపిక చేసుకుంటున్నానా..ఓ చోట కళ్ళు ఆగిపోయాయి. 'దీపశిఖ' కథలు అని పేరు..కింద బాపు బొమ్మ. బాపు బొమ్మ గీశారంటే రచయిత ఎవరై ఉంటారా అన్న కుతూహలంతో చూశా.. ఓ చిన్న షాకూ, సర్ప్రైజూ.. అక్కడున్న పేరు 'డా.సోమరాజు సుశీల.'

అప్పుడెప్పుడో హైదరాబాదు గోషా స్కూల్లో చదువుతుండగా తనకో తమ్ముడు పుట్టిన విషయం కబురు చెప్పి, తన బాల్య స్మృతులు 'ఇల్లేరమ్మ కతలు' ని ఆపేసి మాయమైపోయిన సుశీల ఇలా సడన్ గా ప్రత్యక్షమయ్యేసరికి ఆ మాత్రం ఆశ్చర్యం సహజమే కదా. 'ప్రధమ ముద్రణ: శ్రీ విరోధి నామ సంవత్సర జ్యేష్ఠ పూర్ణిమ 7 జూన్ 2009' అని ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకుని, అక్కడితో షాపింగ్ ఆపేసి, ఇంటికొచ్చి పుస్తకం పూర్తి చేసి కానీ నిద్రపోలేదు.

మొన్నటిదాకా అమ్మ గురించీ, నాన్న గురించీ, చిన్నారి, ఇందూ, బుజ్జీల గురించీ చెప్పిన పిల్ల ఒక్కసారిగా మా అత్తగారు, ఆయన, పిల్లలు, మనవలు అంటూ చెబుతుంటే సర్దుకోడానికి కొంచం టైం పట్టింది..బోల్డంత ముచ్చట గానూ అనిపించింది. మన కళ్ళ ముందు పిల్ల అలా పెరిగి పెద్దైపోతే సంతోషం కలగదూ.. ? సుశీల గారు అనడానికి మనసొప్పడం లేదు, ఇల్లేరమ్మ బాగా అలవాటైపోయి. కానీ తప్పదు.. పెద్దరికాన్ని గుర్తించాల్సిందే.

జీవితంలో తనకెదురైన రక రకాల అనుభవాలని సుశీల కథలుగా మలిచారనిపిస్తుంది ఈ పుస్తకం పూర్తి చేశాక. గడిచిన తొమ్మిదేళ్ళ కాలంలో వివిధ పత్రికల్లోఅచ్చైన పదమూడు కథల సమాహారం ఈ 'దీపశిఖ.' ముందుగా అభినందిచాల్సిన విషయం ఏమిటంటే రచయిత్రి తనదైన శైలిని కొనసాగించడం..నిష్టుర జీవిత సత్యాలని కూడా సరదా మాటల్లో చెప్పడం. 'ఇల్లేరమ్మ' మార్కు చెణుకులకి ఏమాత్రం లోటుండదు ఈ కథల్లో. చాలా కథలు సాఫీగా సాగి చివర్లో ఓ మెరుపు మెరిపిస్తాయి, ఓ.హెన్రీ కథల్లా.

మొదటి కథ 'జవహరి' మార్వాడి సేట్ పెళ్లి ప్రయాణాన్ని కళ్ళకి కడితే, రెండో కథ 'చిట్టితల్లి' తండ్రి ఆస్తిలో తన వాటా సాధించుకునేందుకు ఓ కూతురి ప్రయత్నం. తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన చివుక్కు మనిపిస్తుంది. పనిమనిషి, ఆమె చంటిపిల్లతో అనుబంధం పెంచుకునే ఓ కుటుంబం కథ 'మరచెంబులో మందారపూలు.' ఆద్యంతమూ వ్యంగ్యోక్తులతో సాగుతుంది. క్రికెట్ మాచ్ ఫిక్సింగ్ నేపధ్యంలో రాసిన కథ 'సంబంధం కుదిరింది.' అతి తక్కువ ఖర్చుతో తన మనవరాలి పెళ్లి జరిపించేసిన బామ్మ కథ 'ఈవెంట్ మేనేజర్.'

రిటైరైన ఓ ఆఫీసర్ గారు తన భార్యతో కలిసి చేసే తీర్ధ యాత్రల ప్రయాణం లో పదనిసలు 'యాత్రా స్పెషల్' కాగా, అమెరికాలో ఉద్యోగాలు ఎందుకు పెరుగుతున్నాయో, పదో తరగతి పాసైన వాడు అమెరికా ప్రయాణం కట్టడం లో మర్మం ఏమిటో వివరించే కథ 'అవుట్ సోర్సింగ్.' ప్రొఫెసర్ కీ పిచ్చివాడికీ మధ్య ఉన్న సన్నని విభజన రేఖని వివరిచే ప్రయత్నం 'నలుసంత నమ్మకం.' పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి బెంగటిల్లే ఓ పేదింటి తల్లి కథ 'కాబోయే తల్లి.' ఉద్యోగం చేయడాన్ని అవమానంగా భావించే ఓ వ్యాపారిని 'మిఠాయి కొట్టు' లో పలకరించి, అమ్మ ఉండడానికీ లేక పోడానికీ తేడాని 'కరువు' లో చూడొచ్చు.

'నేను చూసిన చిట్టితల్లి' కూడా చివర్లో మెరుపు మెరిపించే కథ. ఇక చివరిది 'దీపశిఖ' అమెరికా జీవితం గురించి, జీవితం తనకి పెట్టే పరీక్షలని ధైర్యంగా ఎదుర్కొన్న ఓ అమెరికన్ యువతి గురించి. "ఏ తరంలోనూ మన వాళ్ళు అనుభవించని క్షోభ మా తరం తలిదండ్రులు అనుభవించాల్సి వస్తోంది. ఎదురుగా ఉండి బాధలు పడుతుంటే చూడలేక ఎక్కడికో పోయి బతకండ్రా అని తోలేస్తున్నాం. ఈ పిల్లలూ అంతే. ఐసరబజ్జా అనుకుని పోయిన వాళ్ళు అదే పోత! పూర్వం మహాపరాధాలు చేసిన వాళ్లకి దేశాంతర వాస శిక్ష వేసేవారుట. ఇప్పుడా శిక్ష అమ్మలే వేస్తున్నారు. పోనీలే మీరెవరూ పిల్లల్ని దూరాలు పంపుకోనక్కరలేదు! అమెరికా కన్నా డబ్బున్న దేశం ఉండదు కదా" ఓ తల్లి తన కూతురితో చెప్పిన ఈ మాటలు వెంటాడతాయి.

"ఏది ఏమైనా మన పవిత్ర భారత దేశం లో నిమ్మళంగా సుఖంగా బతకాలంటే భగవంతుడు అష్ట దరిద్రాలని ఇచ్చినా పర్వాలేదు. అనుకూలవతి ఐన ఒక్క పెళ్లాన్నిస్తే చాలు.. వాడు చక్రవర్తే కదా!" (జవహరి) లాంటి జీవిత సత్యాలూ, "మా ఇంట్లో ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు అత్తలు వెరసి ముగ్గురం.." (మరచెంబులో మందారపూలు) లాంటి పొడుపు కథలూ, "టీవీలో ఏ ఆటల పోటీ లోచ్చినా, ఏ దేశాల, ఏ గ్రహాల మధ్య జరిగినా ఆవిడ రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంటారు" (సంబంధం కుదిరింది) అంటూ అత్తగారిమీద చెణుకులూ చాలానే ఉన్నాయి.

రైలు ప్రయాణాల్లో రచయిత్రికి చాలా అనుభవం ఉందనిపించక తప్పదు ఈ కథలు చదివినప్పుడు. 'మిఠాయి కొట్టు' చదువుతున్నప్పుడు నాకు అనుకోకుండా శ్రీరమణ 'ధనలక్ష్మి' గుర్తొచ్చింది, పోలిక లేకపోయినప్పటికీ. అన్నట్టు శ్రీరమణ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో కథలు ఏ వరుసలో చదవాలో సూచించారు కానీ, నేనా ముందుమాటని చివర్లో చదివా. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పదల్చుకున్నది 'కరువు' కథ గురించి. ఇల్లేరమ్మ కతల్లో చివరి కథలో పుట్టిన తమ్ముడి గురించిన కథ ఇది. అతని పేరు రవి. కథంతా సరదాగా సాగినా, చివరి వాక్యం చదువుతుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

'కాబోయే తల్లి' కథాంశం బాగున్నా. పల్లెటూరి యాస రాయడంలో రచయిత్రి సఫలం కాలేకపోయారనిపించింది. కథ జరిగేది రాజమండ్రి దగ్గర పల్లెటూళ్ళో.. అక్కడక్కడా తెలంగాణా, రాయలసీమ పదాలు పంటికింద రాళ్ళలా తగిలాయి. మొత్తం 116 పేజీల ఈ పుస్తకం వెల రూ. 80. ప్రింటు కంటికింపుగా ఉంది. అచ్చుతప్పులు తక్కువే. ఉమా బుక్స్ ప్రచురణ. ప్రచురణ సంస్థ తో పాటు, నవోదయ, విశాలాంధ్రలలోనూ దొరుకుతుంది. ఇక్కడితో ఆపకుండా డా.సోమరాజు సుశీల మరిన్ని మంచి రచనలు చేయాలని కోరుకుంటూ...

15 కామెంట్‌లు:

  1. Good one!!! I need to buy and read immediately after coming back to hyderabad. Thanks for interesting review. Sorry for english comments, time crunch

    రిప్లయితొలగించండి
  2. భలే మంచి కబురు చెప్పారండి. మీకు బహుదా ధన్యవాదాలు. అర్జెంటుగా కొని చదవాలి. ఇల్లేరమ్మ కథలు మా ఇంటిల్లిపాదీ ఎన్నిసార్లు చదివామో! అవునూ మీ ఇల్లెక్కడంటారూ?

    రిప్లయితొలగించండి
  3. బాగుంది.
    "ముందుమాటలో కథలు ఏ వరుసలో చదవాలో సూచించారు కానీ, నేనా ముందుమాటని చివర్లో చదివా."
    That's the way to go! :)

    రిప్లయితొలగించండి
  4. కొనకుండానే ఈ పుస్తకం నా దగ్గరకు వచ్చిచేరిపోయింది. ఇక చదివే పార్టు మిగిలుంది. మీరు పచ్చజెండా ఊపేసారుగా, ఇక ముందుకు పోవాలి :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. కొనాల్సిన లిస్టులో ఇంకో పుస్తకాన్ని జమ చేసారు.విశ్లేషణ చాలా బాగుందండీ.

    రిప్లయితొలగించండి
  6. @సుబ్రహ్మణ్య చైతన్య: ఈ పుస్తకం చదివిన వెంటనే మీ అందరితో విశేషాలు పంచుకోవాలని అనిపించిందండి.. అందుకే బ్లాగులో ప్రచురించేశాను.. ధన్యవాదాలు.
    @హరేకృష్ణ: ధన్యవాదాలు.
    @లక్ష్మి: అంత హడావిడిలో కూడా బ్లాగు చదివేందుకు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  7. @సిరిసిరిమువ్వ: ఈ పుస్తకం అప్పుడే ఓ ఫ్రెండు దగ్గరికి వెళ్లి పోయిందండి.. చదివాక మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోవద్దు.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: నేను చదివే పధ్ధతి అదేనండి.. ధన్యవాదాలు.
    @మెహెర్: ఎలా ఉందొ చెప్పడం మర్చిపోకండి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: తప్పక చదవండి.. మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. ఈ సారి బుక్స్ కి వెళ్ళినప్పుడు మరచిపోకుండా కొనలండీ ,మీరు భలే పట్టేస్తారే కొత్తవ్వి యేమివచ్చిన..

    రిప్లయితొలగించండి
  9. @చిన్ని: తప్పక చదవండి.. నాకు చాలా యాదృచ్చికంగా దొరికిందండీ.. ...ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. ఐతే ఇల్లేరమ్మ సుశీల గారైపోయారన్న మాట ! కధల గురించి మీ వివరణ ఆసక్తికరంగా ఉంది . మీ పఠనాస్తి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు !

    రిప్లయితొలగించండి
  11. @పరిమళం: వీలయితే తప్పక చదవండీ పుస్తకం.. మిమ్మల్ని నిరాశ పరచదు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. ధన్యవాదాలు మురళి గారు. నేను కూడా ఇల్లేరమ్మ అభిమానినే అండి.

    రిప్లయితొలగించండి
  13. @ఇద్దరు: ధన్యవాదాలండీ.. ఇప్పుడే మీ బ్లాగు చూశాను.. తీరికగా చదవాలి..

    రిప్లయితొలగించండి