బుధవారం, జులై 08, 2009

సహకారం

పుష్కర కాలం క్రితం అట్టహాసంగా ఆరంభించిన 'ఇజ్రాయిల్ తరహా కాంట్రాక్టు వ్యవసాయం' ఓ చారిత్రిక తప్పిదమని తెలిశాక, వ్యవసాయ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తాజా ప్రతిపాదనకి తెర తీసింది. చైనా నుంచి అరువు తెచ్చుకున్న 'సహకార వ్యవసాయం' అన్ని సమస్యలనీ పరిష్కరించేస్తుందని ప్రకటిస్తోంది.కేవలం 'జలయజ్ఞం' ద్వారా మాత్రమే హరితాంధ్ర సాధన సాధ్యపడదనే గ్రహింపు వల్లనో లేక 'కొత్తొక వింత' అన్న నానుడి మీద నమ్మకంతోనో తెలియదు కానీ, ఈ సహకార వ్యవసాయం మీద ప్రభుత్వం బాగానే దృష్టి కేంద్రీకరిస్తోంది.

దాదాపు ఐదు దశాబ్దాల క్రితం దేశం లో హరిత విప్లవాన్ని ఆరంభించి తిండిగింజల సమస్యని పరిష్కరించిన శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ సహకార వ్యవసాయానికి పచ్చ జెండా ఊపడం ప్రభుత్వానికి సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. ఐతే సహకార వ్యవసాయం రైతుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న అంశమనీ, చాలా జాగ్రత్తగా అమలు పరచాలనీ పెద్దాయన చేసిన సూచనని ఎంతవరకూ పట్టించు కుంటుందన్నదే సందేహం. ప్రతిపక్షాల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకునే అలవాటు ఆది నుంచీ లేదు కాబట్టి, వాళ్ళ ఘోష వట్టి కంఠశోషే.

ప్రస్తుతం వ్యవసాయం చిన్న చిన్న కమతాల్లో జరగడం వల్ల పెట్టుబడులు పెరిగి, ఆదాయం తగ్గుతోందని ప్రభుత్వం అభిప్రాయం. ఈ చిన్న కమతాలన్నింటినీ కలిపి వ్యవసాయం చేస్తే ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచ వచ్చుననీ, చైనా వంటి దేశాలు దీనిని ఆచరించి నిరూపించాయనీ తెలుసుకుని రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. రాజు తల్చుకుంటే కానిదేముంది? ప్రతి జిల్లా లోనూ రెండేసి గ్రామాల్లో ఈ వ్యవసాయాన్ని ప్రారంభించాలని నిర్ణయమయిపోయింది. "రైతుల ఇష్టంతోనే సహకార వ్యవసాయం మొదలు పెడతామని" ప్రకటనలు వస్తున్నాయి.

ఓ ఊళ్ళో ఉన్న కమతాలన్నీ కలిపి ఓ వ్యవసాయ క్షేత్రంగా మలచి వ్యవసాయం చేయాలన్నది ప్రభుత్వ అభిమతం. రైతులు భూమి మీద తమకున్న హక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసే సొసైటీ కి బదలాయించాలి. ఇందుకు ప్రతిగా సొసైటీ లో వారికి భాగస్వామ్యం లభిస్తుంది. వ్యవసాయంలో వచ్చిన లాభాల్లో రైతులకి వాటా ఉంటుంది. నష్టం వస్తే భరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడైనా రైతులు ఈ వ్యవసాయం నుంచి విరమించుకోవాలంటే తమ భాగస్వామ్యాన్ని మరో భాగస్తుడికో లేదా ప్రభుత్వానికో అమ్మేసుకోవచ్చు. భూమి మీద హక్కు మాత్రం తిరిగి రాదు.

రైతులు భూమిని కేవలం వ్యాపార వస్తువుగా మాత్రమే చూస్తే, గ్రామ స్థాయిలో ఎలాంటి రాజకీయాలు లేకుండా రైతులంతా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే, సకాలంలో పెట్టుబడులు పెట్టగల ఆర్ధిక పరిపుష్టి సొసైటీ లకి ఉంటే, నాణ్యమైన విత్తనాల సరఫరా మొదలు పంట కొనుగోలు వరకు ప్రభుత్వ సహాయం చిత్తశుద్ధితో కొనసాగితే ఈ పథకం విజయవంతం కావడం అసాధ్యమేమీ కాదు. కానీ మన రైతులకి నేలతో అనుబంధం ఎక్కువ.. చాలామంది రైతులకి వ్యవసాయ భూమి అన్నది తెంచుకోలేని ఒక బంధం. ఇక గ్రామ రాజకీయాల గురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రభుత్వం చిత్తశుద్ధి తో రైతులకి సాయం చేసేతట్టయితే వ్యవసాయ సంక్షోభమే ఉండదు.

సహకార రంగంలో పాడి పరిశ్రమ విజయవంతం అయినట్టే, వ్యవసాయమూ విజయవంతం అవుతుందని అంటున్నారు స్వామి నాథన్. ఈ రెండు రంగాలకీ మౌలికంగానే ఎన్నో భేదాలున్నాయి. పాడి పరిశ్రమ ఒక అనుబంధ పరిశ్రమ. ఇక్కడ పశువుల మీద యాజమాన్య హక్కు రైతు దగ్గరే ఉంటుంది. ఉత్పత్తిని ఎవరికి అమ్మాలన్నది ఐచ్చికం. కానీ వ్యవసాయానికి వస్తే భూమి అనేది తరతరాల వారసత్వం. తండ్రి నుంచి వారసులకి సంక్రమించే ఒక హక్కు. సహకార వ్యవసాయంలో ప్రవేశించాలనుకునే రైతు ఈ హక్కుని వదులుకోవాలి. ఇది ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది వేచి చూడాల్సిన విషయం.

వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయాల్సినవి చాలానే ఉన్నాయి. స్వతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు పూర్తయినా కౌలు రైతుల సమస్య అలాగే ఉంది. వారికి తాము వ్యవసాయం చేసే భూమి మీద ఎలాంటి హక్కూ లేదు. ఈ కారణంగా రుణాలు, ఇతర సహాయమూ అందవు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళలో నూటికి డెబ్బై మంది కౌలు రైతులే అన్నది ఇక్కడ గమనించాలి. ఎరువులు, పురుగుమందుల ధరలపై నియంత్రణ లేదు. విత్తనాల నాణ్యత పై భరోసా లేదు. ప్రకృతి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ఇన్ని సమస్యల నడుమ గడిచిన సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు మన రైతులు. సమస్యలలో ఏ కొన్నింటిని పరిష్కరించినా మరింత దిగుబడి సాధించ గలరన్నది నిస్సందేహం. మరి 'సహకారం' పై ప్రభుత్వానికి మొదలైన మోజు వ్యవసాయ రంగాన్ని ఎటు తీసుకెడుతుందో?

4 కామెంట్‌లు:

  1. సహకార సేద్యం గురించి స్వామినాధన్ గారు హిందూ లో ఒక వ్యాసం వ్రాసారు.. అయితే, దానికి ప్రతిగా ఒక రైతు దాని వల్ల ఎన్ని నష్టాలున్నాయో చూపిస్తూ సవివరంగా విశదీకరించారు.. దాని ఆంగ్లమూలం ఉంది, కుదిరితె తెనిగీకరించాలి..
    భూమి కేవలం వస్తువు కాదు, దానితో రైతులకి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి.. చూద్దాం ఈ ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుందో..

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు విధానం బాగనే వుంది కానీ, పొలం ను బిడ్డలగా చూసుకునే రైతులు దీనికి అంగీకరస్తారా అని? ఇదే అమలులోకి వస్తే ఊర్లలో చేల గట్లదగ్గర జరిగే పెద్ద పెద్ద తగాదాలకు పరిష్కారం కూడా దొరికినట్లే.

    రిప్లయితొలగించండి
  3. @మేధ: మంచి ఆలోచన.. తప్పక తెనిగీకరించండి.. ధన్యవాదాలు.
    @భాస్కర రామిరెడ్డి: కొన్ని సమస్యలు పరిష్కారమైనా, చాలా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందండి.. అంతా ప్రభుత్వం చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. kottha gha prayatninchatam lo tappu ledhu.nijangha impliment chestey, chala poorathana samasyalakhu parishakaralu dorikinattey.ee prayathananikhi mana vanthu sahayanni andhinchatam lo tappu ledhu ani anipisttunnadhi.

    రిప్లయితొలగించండి