గురువారం, జులై 16, 2009

ఆషాఢ మాసాన...

ఆషాఢం..కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి ఒకే సారి రకరకాల అనుభూతులని ఇచ్చేది.. అదే కొత్త పెళ్లికొడుకుతో ఐతే "తెలుగు కేలండర్ లో నాకు నచ్చని ఒకే ఒక్క నెల'' లాంటి డైలాగులేవో చెప్పించేది. మాట్లాడడం తెలియని మగ వాడిని కూడా మహాకవిని చేసేయగల శక్తి ఆషాఢానికి ఉందని ఊరికే అన్నారా పెద్ద వాళ్ళు?

చిన్నప్పుడు ఆషాఢం అంటే తెలగపిండి, మునగాకు కూర (చేదుగా ఉన్నా తప్పదు) ఇంకా గోరింటాకు. టీనేజి కి వచ్చాక కొన్ని కలలు.. ఆ తర్వాతి సంగతి చెప్పడానికి లేదు.. ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు గోరింటాకు పెట్టించుకోడం సరదాగానే ఉండేది కానీ, హైస్కూలికి వచ్చేసరికి ముఖ్యంగా పెద్ద క్లాసులకి వచ్చాక కొంచం ఇబ్బందిగానే ఉండేది. అరచేతిలో ఓ చుక్కైనా పెట్టించుకోకపోతే ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు.

బళ్ళోనేమో అబ్బాయిల చేతులు చూసి వోణీ నోటికి అడ్డుపెట్టుకుని నవ్వుకునే అమ్మాయిలు. అక్కడికీ ఒకరిద్దరు మేష్టార్లు కూడా గోరింటాకుతో వచ్చేవాళ్ళు..కానీ అమ్మాయిలకి అబ్బాయిలే లోకువ కదా. కాలేజీ కి వచ్చేసరికి గోరింటాకు వద్దని గట్టిగా చెప్పే ధైర్యం వచ్చేసింది. వీడితో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ వదిలేశారు.

ఒక వయసు వచ్చేసరికి మనం ఏమీ ప్రయత్నించక పోయినా కొన్ని కొన్ని విషయాలు వాటంతట అవే తెలిసిపోతూ పోతూ ఉంటాయి. ఆషాఢం ప్రత్యేకత కూడా అలాగే తెలిసింది. వోణీ వెనుక మంగళ సూత్రాలు దాచుకుని ముఖాన ముసిముసి నవ్వులతో, భుజాన పుస్తకాల సంచీతో బడికొచ్చిన కొత్త పెళ్లి కూతుళ్ళకి ధన్యవాదాలు. ఐతే అంతగా బాధ/ఇబ్బంది పడడానికి కారణం ఏమిటో పూర్తిగా అర్ధం అవ్వడానికి మాత్రం కాలేజీ వరకూ ఆగాల్సి వచ్చింది. ఎంతైనా మావి మట్టి బుర్రలు.

కాలేజీలో ఒకసారి కొందరు మిత్రులం సమావేశమయ్యాం.. ఏదో క్లాసు కేన్సిల్ అయ్యింది.. ఆషాఢం నెల నడుస్తోంది.. చర్చకి అదే టాపిక్. భవిష్యత్తులో రాబోయే తొలి ఆషాఢాన్నిఎలా గడపాలి? అని. ఎవరు చేయాలనుకున్న వీరోచిత కార్యాలు వాళ్ళు చెప్పారు. (వాటిని ఇక్కడ చెప్పడం సభా మర్యాద కాదు) "నేను శ్రావణం లో పెళ్లి చేసుకుంటా.." అన్నాడో మిత్రుడు. మేమందరం చాలా ఆశ్చర్య పోయాం తన తెలివికి. అదే టైములో అమ్మాయిలు కూడా అదే విషయం మాట్లాడుకున్నారని అభిజ్న వర్గాల ద్వారా విని త్రిల్లైపోయాం.

ఆషాఢం మీద బోల్డన్ని కథలు, నవలలు, జోకులు, కార్టూన్లు, పాటలు, సినిమాలు వచ్చాయి. తెర మీద రొమాన్స్ ని చిత్రీకరించడం లో దిట్ట ఐన దర్శకుడు బాపూ కూడా ఆషాఢం బాధితుడే. భార్యని సినిమా హాల్లో కలుసుకోవాలని ప్లానేసి, ఆవిడ తన సమస్త బంధుగణం తోనూ తరలి రావడంతో అది కాస్తా వికటించడంతో ఆగ్రహించి, ఆ తర్వాత ఆమెకో ప్రేమలేఖ రాసి పంపి..లేఖ చదువుతున్నప్పటి ఆవిడ హావభావాలను రహస్యంగా గమనించి ఓ బొమ్మ గీసేశారు బాపు. ఈ కబుర్లు చెప్పింది ముళ్ళపూడి వెంకట రమణ, 'కోతి కొమ్మచ్చి' లో.

ఇప్పటి అమ్మాయిలని అబ్బాయిలని ఆషాఢం పెద్దగా బాధిస్తున్నట్టు లేదు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో 'అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు' అన్న రూల్ బ్రేక్ కావడం లేదు కాబట్టి విరహం తో వెక్కిళ్ళు పెడుతున్న వాళ్ళు చాలా తక్కువే. వీళ్ళకి జ్యేష్టము, శ్రావణము లాగే ఆషాఢము కూడా. ఈ ఏర్పాటు వల్ల ఎడబాటు లేదు. సందేశాలు మోసుకెళ్ళే పనిలేదని కాబోలు మేఘాలు కూడా ముఖం చాటేస్తున్నాయి. కానీ...దీర్ఘ ఎడబాటు తర్వాత వచ్చే పునస్సమాగమ మధుర క్షణాలను ఈ జంటలు మిస్సవుతున్నాయేమో కదా? కొత్త దంపతులు నా మీదకి దాడికి రావొద్దని మనవి.

35 కామెంట్‌లు:

  1. బాగుందండి, ఇంతకీ మి తొలి ఆషాడమాస విశేషాలు ఎమిటొ వినాలని వుంది.

    రిప్లయితొలగించండి
  2. మురళి గారు,
    కొంపదీసి మీరు ఆషాడం ఎడబాటులో ఉండి ఈ టపా రాయలేదుకదా!!:)
    అన్నట్టు మీ ఇంట్లో కూడా తెలగపిండి తో వడియాలు పెట్టేవారా? బిర్యానీలు తినీ తినీ నాలిక చచ్చినప్పుడు ఒక తెలగపిండి వడియం నోట్లో పెరుగన్నంతో వేసుకుంటే..హ్మ.హ్మ్.మ్మ్.

    రిప్లయితొలగించండి
  3. హ..హ ..హ ఆషాడం ముచ్చట్లు ఎంత చెప్పుకొన్నా తరగవులెండి. మావారు ఆషాడ బాధితులే. గోడ ఎందుకు అంత ఎత్తుగా కట్టారు దూకడానికికూడా లేకుండా అని తెగ బాధపడిపోయేవారు.

    రిప్లయితొలగించండి
  4. సందేశాలు మోసుకెళ్ళే పనిలేదని కాబోలు మేఘాలు కూడా ముఖం చాటేస్తున్నాయి.చాలా బాగుంది.
    అమ్మో మెదటి కామెంటు నాదేనా.......

    please watch my latest posting

    రిప్లయితొలగించండి
  5. ee kalamlo, kodaluni vunchi athagaru puttintiki vellina ghatana okati chusanu. ashadaniki, kodaliki nalugo nela. 5 vachevaraku puttintiki vella koodadhu. anduku, kodalini vunchi athagaru puttintiki vellindhi.

    రిప్లయితొలగించండి
  6. ఇంతకీ మీకు ఈ ఆషాఢ మాసం మీద రాయాలని ఎందుకనిపించిందీ ?

    రిప్లయితొలగించండి
  7. ఆషాఢం .కొత్తదంపతులకు ఒక మధుర అనుభవం .దానిని మిస్సవటం అంటే జీవితం లో మధురమైన గుర్తులను దూరం చేసుకోవటమే .

    రిప్లయితొలగించండి
  8. ఎక్కడో డిటెయిల్సు మిస్సవుతున్నాయి మురళీ...ఏంటయ్యుంటాయబ్బా?సెప్తాగానీ...
    ఈలోపున ఈ లింక్ మీదో లుక్కెయ్...
    http://pappusreenu.blogspot.com/2009/07/blog-post_16.html

    రిప్లయితొలగించండి
  9. మురళి గారు అసలు నన్ను అడిగితే పెళ్ళి అయిన ఒకటి రెండు నెలల్లో ఆషాడం వస్తే భలే ఉంటుంది..అసలు మన పెద్ద వాళ్ళు తక్కువ వారు కాదండి ,ఇలాంటి చిన్న చిన్న ఎడబాట్లు ,విరహాలే రాబోయే జీవితానికి గట్టి పునాది వేస్తుంది అని చక్కని పద్దతులు పెట్టారు.. ఇప్పటి వేరుకాపురాలు ఇవన్నీ నిజంగానే మిస్ చేస్తున్నాయి

    రిప్లయితొలగించండి
  10. భలే ఉంది మురళి గారు.. మేఘాలు మొహం చాటేయడం నిజంగా అందుకేనేమో అనిపించింది.

    రిప్లయితొలగించండి
  11. >>విరహం తో వెక్కిళ్ళు
    కేక.
    ఐనా ఆషాఢం ఆడోళ్ళకే ఎందుకుపెట్టారో. అత్తా కోడలు ఒకే గడపదాటొద్దు అన్నారు. అల్లుడు మాంగోరు దాటొచ్చు ఏంపర్లేదు అన్నారు. ఇదెట్టా?

    రిప్లయితొలగించండి
  12. తెలగపిండి మునగాకు ఒక కొత్త కూర పేరు విన్నాను మీ టపా ద్వారా!
    త్వరలో ఆ కూర ఎలా చేయాలో వివరాలు తెలియ చేస్తారా??
    (మురళీగారు మీకు రాకపోతే, ఎవరైనా రాస్తరేమోనని ఆశ అంతే)

    రిప్లయితొలగించండి
  13. asala ...lovers ki kooda ashaada maasam unte bhale baguntundi kadooo...ante no phones ...no meetings anna maata

    రిప్లయితొలగించండి
  14. మీ టపా చదివాక నాకూ గుర్తొచ్చాయిగా మా ఆషాడమాసం ముచ్చట్లు...
    మావారు గడప తొక్కరాదని గోడదూకి వచ్చిన సంగతులు.....

    రిప్లయితొలగించండి
  15. పైన ఎవరో అన్నట్టు ప్రస్తుతం మీరు ఆషాఢమాస బాధితులా ఏమిటి?ఆ సంగతి చెప్పారు కాదు?
    మాకు పెళ్లైన కొత్తలో.. ఒక నెలకే వచ్చింది ఆషాఢం...!!

    రిప్లయితొలగించండి
  16. Murali garu,
    ide chala anyamandhi,malantivallaku lene asalanu kalugachesthunaru.......ide chusin ma avida nenu putintiki valthanu ticket book cheyyamani okete godava! ila rayadam malanti kotaga pelliai vachinna vallaki koncham ibbande.....pls pls...ardham chesukoru.

    రిప్లయితొలగించండి
  17. యాదృచ్చికంగా నేను అదే పుస్తకం చదువుతున్నానండి. పేజీ పేజీకి చెణుకులు, విసుర్లు, కొన్ని కంటతడిబెట్టిస్తే కొన్ని పగలబడి నవ్విస్తున్నాయి.రమణగారూ, అదరహో..
    అచంట జానకిరాం గారి పుస్తకం కూడా మార్కెట్లోకి వచ్చింది. వీలైతే చదవండి.
    -బు

    రిప్లయితొలగించండి
  18. Nenu maa vaaru hyd lo work valla attayya ki durame....So ashada masam maku ledu.... meeruannattuga ashada virahanni miss ayyamu.. poni aligi puttintiki velladam ante mari amma valladi pakka illu.. emi cheyadammm??????

    రిప్లయితొలగించండి
  19. @రఘు: ధన్యవాదాలు. కొన్ని విశేషాలు పంచుకుంటే బాగుంటాయి..మరికొన్ని దాచుకుంటే బాగుంటాయి. కాదంటారా?
    @శేఖర్ పెద్దగోపు: మీ మొదటి ప్రశ్నకి సమాధానం 'కాదు' అని రెండో ప్రశ్నకి జవాబు 'లేదు' అని మనవి చేసుకుంటున్నా.. తెలగపిండి వడియాల గురించి మొదటిసారి వింటున్నానండి.. ఆసక్తికరం.. మీఋ గాని ఓ టపా రాస్తే వెంటనే 'గృహ హింస' మొదలు పెట్టేస్తా! ..ధన్యవాదాలు.
    @రమణి: తర్వాత నవ్వుకోడానికి బాగుంటాయి కానీ, పడేటప్పుడు అవి కష్టాలే కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @మిర్చివర్మ: చూస్తానండి.. ధన్యవాదాలు.
    @లక్ష్మి: :)) ...ధన్యవాదాలు
    @కొత్తపాళీ: ధన్యవాదాలు
    @మోహనవంశీ: బాగుందండి ఈ విశేషం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. @Sujata: ఇది ఆషాఢ మాసం కదండీ..అందుకని!! ..ధన్యవాదాలు
    @దుర్గేశ్వర: నిజమేనండి.. ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: మిస్సయితేనే బాగుంటుంది !! ...ధన్యవాదాలు
    @సుబ్రహ్మణ్య చైతన్య: పైన రఘు గారికి చెప్పాను చూడండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. @నేస్తం: నిజం చెప్పారు.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలు
    @భాస్కర్ రామరాజు: అబ్బే..మన సొంత కవిత్వం కాదు.. 'పెళ్లి పుస్తకం' సినిమాలో 'అమ్ముకుట్టీ..' పాటలోంచి సంగ్రహించా.. ధన్యవాదాలు.
    @పద్మార్పిత: నాకు తినడం మాత్రమే తెలుసండి.. చూద్దాం ఎవరైనా చెబుతారేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. @Testing Wheel: మీ అడ్రస్ ఎవరికీ చెప్పకండి..దాడికి వస్తారు. ధన్యవాదాలు.
    @సృజన: వస్తున్నాం..మీ బ్లాగు వైపు, స్మృతుల సవ్వడి వినడానికి.. ధన్యవాదాలు.
    @తృష్ణ: పైన చెప్పేశాను కదండీ కాదని.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. @మహీపాల్: ఇంతకీ పంపిస్తున్నారా లేదా? :-) :-) ..ధన్యవాదాలు.
    @బుడుగు: చదువుతానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  25. @హరిప్రియ: పెద్ద చిక్కే తెచ్చారు. అలిగి అత్తగారి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందంటారు? :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. కొంచెం ఆలస్యం గా చూసాను
    బావుంది మీ ఆషాడ మాస టపా
    :)

    రిప్లయితొలగించండి
  27. "virahamu kuda sukhame kaada..viyoga velala virise premala viluvanu kanaleva" ani...

    murali garu adbhutamga visleshincharandi aashadamasapu premapoorvaka vilanizanni..!!

    america lo vunde jantalaki aashadhamasapu villan to fight chese avakasam ledandi..meerannattu ippati vallu aa anubhootulu missavutunnaru..!!

    రిప్లయితొలగించండి
  28. @హరేకృష్ణ: ధన్యవాదాలు
    @ప్రణీత: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. ఆషాడం గురించి కబుర్లు చెబుతూనే ముళ్ళపూడి వెంకట రమణ గారి 'కోతి కొమ్మచ్చి'నీ పరిచయం చేసేశారే !
    "సందేశాలు మోసుకెళ్ళే పనిలేదని కాబోలు మేఘాలు కూడా ముఖం చాటేస్తున్నాయి"
    మీరో కవిత రాస్తే చూడాలని ఉంది.

    రిప్లయితొలగించండి
  30. @పరిమళం: ఏమోనండి, రాస్తానేమో.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. కొత్త పెళ్లికొడుకు: తెలుగు కేలండర్ లో నాకు నచ్చని ఒకే ఒక్క నెల ఆషాఢం...lol

    రిప్లయితొలగించండి