శుక్రవారం, సెప్టెంబర్ 15, 2017

మహేశం

సంస్కృత పండితుడూ, విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూ అయిన కరటక శాస్త్రికి ప్రియశిష్యుడు మహేశం. సంస్కృత విద్యార్థి. కరటకుడి మేనల్లుడు వెంకటేశం ఈడువాడు. అవతలున్నది గురువుగారైనా, మరెవరైనా ఎలాంటి శషభిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం మహేశం నైజం. అందుకే. "ఈ రోజుల్లో సంస్కృతం చదువు ఎవరికి కావాలి?" అని గురువు గారడిగితే, "దరిద్రులకి కావాలి" అని ఠపీమని జవాబిస్తాడు. అవును, ఇంగ్లీషు చదువుకోడం హోదాకి చిహ్నంగా మారిన కాలంలో, తన ఈడు వాడైన వెంకడు తనకి ఇంగ్లీషు వచ్చునని గర్రా వెలిగిస్తూ ఉన్నప్పుడు మహేశానికి ఆ మాత్రం కడుపు మండడం సహజమే. అంతే కాదు, ఇంగ్లీష్ చదువంటే ఆషామాషీ కాదని కూడా తెలుసునా కుర్రాడికి. అందుకే, "నీకు ఇంగ్లీషు చదువుకోవాల్నుందా?" అన్న కరటక శాస్త్రి ప్రశ్నకి, "చెప్పించే దాతేడీ?" అని ఎదురు ప్రశ్న వేస్తాడు.

ఇంగ్లీషు చదువులు దేశంలో ప్రవేశించిన తొలినాళ్లలో, ఆ చదువులపై మోజు పెంచుకుని, చదువుకునే స్తోమతు లేని తొలితరం యువతకి ప్రతినిధి మహేశం. వెంకటేశం ద్వారా పరిచయమైన గిరీశం ఓ అద్భుతమైన మనిషిగా తోస్తాడు అతనికి. ఇంగ్లీషు మీద మోజుతో పాటు, తాను నేర్చుకుంటున్న సంస్కృతం ఎందుకూ కొరగానిదన్న భావనా బలపడుతూ ఉంటుంది. "పనికొచ్చే ముక్క ఒక్కటీ ఈ పుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశి కట్టడం కాళిదాసుకేం తెలుసు?  తెల్లవాడిదా మహిమ! ఏ  పట్నం యెక్కడుందో, ఏ కొండలెక్కడున్నాయో అడగవయ్యా గిరీశం గార్నీ; నిలుచున్న పాట్న చెబుతాడు" అని ముచ్చటపడతాడు మహేశం. అంతే కాదు "నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చేంతాళ్ల లాంటి హిందుస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్ధం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని, నాకు నాల్రోజులకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధ లేదుకదా?" అని గురువుగారిని నిలదీయగలడు.

శిష్యుడి  చురుకుదనం తెలిసిన వాడు కాబట్టే, మేనకోడలు సుబ్బికి లుబ్ధావధాన్లుతో జరగబోయే పెళ్లిని చెడగొట్టడానికి మహేశాన్ని సాయం కోరతాడు కరటక శాస్త్రి. "నీకు తలదువ్వి కోక గడితే పజ్వండేళ్ల కన్నె పిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగు పూటలు వాళ్ళింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేసి పారిపోయిరా. నిజవైన పెళ్ళిముహూర్తం చాలా వ్యవధి ఉంది," అంటూ పధకం వివరించగానే, "యిదెంతపని!" అని సులువుగా అనేస్తాడు. భయవక్కర్లేదని గురువు గారికి హామీ ఇస్తాడు. వేషానికి ప్రతిగా మహేశానికి తన పిల్లనిచ్చి ఇల్లరికం ఉంచుకుంటాననీ, ఇంగ్లీషు చెప్పిస్తాననీ మాటిస్తాడు కరటకశాస్త్రి. అప్పటికే సంస్కృతం పుస్తకాల మీద నమ్మకం పోగొట్టుకున్న మహేశం, ఒట్టు కోసం గిరీశం గారినడిగి ఇంగ్లీషు పుస్తకం తెస్తానంటాడు. "ఎగేస్తే భూవి తోడ్రా" అని కరటకుడంటే, "మీరు ఎగేస్తే భూవేం చేస్తుందిలెండి" అని జీవితసత్యం పలుకుతాడు.

మాయగుంట వేషం వేయించిన గురువుగారు, తనని మధురవాణి బసకి తీసుకు వెళ్లడంతోటే  ఆమె మాయలో పడిపోతాడు మహేశం. నిజంగా ఆడపిల్లేనని భ్రమ పడిన మధురవాణి సరసం ఆడబోతే, "కొడుతుంది కాబోలురా నాన్నా. ఇంటికెళ్లిపోదాం రా" అంటాడు. మధురవాణి ముచ్చటపడి బలవంతంగా ముద్దు పెట్టుకుంటే, "నేరని పిల్లని చెడగొడుతున్నావు" అంటాడు కరటకుడు. "నాలాంటి వాళ్లకి  నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరి శిష్యుడు? ఈ కన్నెపిల్ల నోరు కొంచం చుట్ట వాసన కొడుతూంది" అంటూ రహస్యం బయట పెట్టేస్తుంది. ఈ గడబిడకి పాపం, తాను పోషిస్తున్న పాత్ర పేరేవిటో కూడా మర్చిపోయి "ఇంతకీ నా పేరేవిటండోయి" అని కరటక శాస్త్రిని అడుగుతాడు. "సబ్బు అనే పేరు జ్ఞాపకం ఉంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకం ఉంటుంది" అని చిట్కా చెబుతారు గురువుగారు.

రామప్పంతులు ఎదుటా, లుబ్ధావధాన్లు ఎదుటా నిజంగానే నిపుణతతో మెసలుతాడు మహేశం. మధురవాణి కంటె తెచ్చి వధువుకి అలంకరిస్తాడు రామప్పంతులు. మీనాక్షి అయితే "అది ఒట్టి సత్తెకాలపు పిల్ల నాన్నా.. నాకెంతో ఉపచారం చేస్తోంది" అని చెబుతుంది తండ్రితో. పెళ్ళిలో రామప్పంతులు చేసిన అల్లరి కారణంగా, పెళ్లికూతురు రెండో పెళ్లి పిల్లేమోనన్న అనుమానం బలపడుతుంది లుబ్ధావధాన్లుకి. దాంతో, ఆ పిల్ల మొదటి మొగుడొచ్చి తన పీక నులిమేస్తున్నట్టు భ్రమలు మొదలవుతాయి. ఆ ఇంట్లోనుంచి పారిపోడానికి ఇదే మంచి అవకాశంగా తోస్తుంది మహేశానికి. తనకు అంతకు ముందే పెళ్ళయిందన్న 'రహస్యాన్ని' మీనాక్షి చెవిన వేసి, ఆమె దెబ్బలు కొడుతుంటే తప్పించుకోడానికి చెయ్యి కొరికేసి మరీ ఓ రాత్రి వేళ గోడదూకి పారిపోతాడు, కంటెతో సహా. ఆ కంటెని లుబ్ధావధాన్లు ఇంట్లోనే వదిలేస్తే ఖూనీ కేసులూ అవీ ఉండకపోయేవి.

పారిపోయిన మహేశం మధురవాణి బసకి చేరి, పేకాట సంరంభంలో ఉన్న మధురవాణినీ, ఆమె స్నేహితుల్నీ రామప్పంతులు గొంతుని అనుకరించి భయపెడతాడు. "వాళ్ళింట  ఏవేవి చిత్రాలు చేశావో చెప్పు?" అని అడిగినప్పుడు, "ముద్దెట్టుకోనంటే చెబుతాను" అని చెప్పి, "ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది" అంటూ తనకున్న బుద్ధి తన పెద్దలకి లేదని నిరూపించుకుంటాడు. ఆమె కంటె ఆమెకి ఇచ్చేసి, వేషం విప్పేసి, దాసరి వేషంలో ఊరు దాటేస్తాడు, రామప్పంతులు భయపడే చావు పాటలు పాడుకుంటూ. మళ్ళీ మహేశం కనిపించేది, ఖూనీ కేసు హడావిడికి భయపడిన కరటక శాస్త్రి, శిష్యుడితో సహా విశాఖపట్నంలో ఉన్న మధురవాణి బసకి వచ్చినప్పుడే.

ఆడిన నాటకానికి గాను గురుశిష్యులిద్దరికీ మఠ ప్రవేశం తప్పదని మధురవాణి హడలగొడితే, "మా గురువుగారి మాటకేం. అయన పెద్దవారు. ఏం వచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం ఎరగని పసి పిల్లవాణ్ణి. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డువేశావంటే కీర్తి ఉండి పోతుంది" అనడమే కాదు, అప్పటికప్పుడు గురువుగారితో తెగతెంపులు చేసుకుని ఆమె శిష్యరికం చేయడానికి సిద్ధపడిపోతాడు. "నీళ్లు తోడుతాను, వంట చేస్తాను. బట్టలు వుతుకుతాను గాని బ్రాహ్మణ్ణి కదా, కాళ్ళు పట్టమనవు గద?" అన్న అమాయకపు ప్రశ్నతో ఆమెని నవ్విస్తాడు. మధురవాణి కంటెని లుబ్ధావధాన్లుకి పోస్టులో పంపితే, ఖూనీ జరగలేదని పోల్చుకుంటారని కరటకుడి ఆలోచన. కంటె తిరిగి వచ్చేవరకూ మహేశాన్ని, మధురవాణి తాకట్టులో ఉంచుతాడు. వెళ్తూ వెళ్తూ జాగ్రత్తలు చెప్పబోయిన గురువుగారితో "ఎవరిదగ్గర ఉన్నప్పుడు వారు చెప్పిందల్లా చేయడవే నా నిర్ణయం" అని తెగేసి చెబుతాడు మహేశం.ఇంగ్లీషు చదువులు చదివాక మహేశం ఇంకెన్ని చిత్రాలు చేశాడో తెలుసుకునే వీలు లేదుకదా అనిపిస్తూ ఉంటుంది, 'కన్యాశుల్కం' చదివినప్పుడల్లా.

2 వ్యాఖ్యలు:

 1. "లేళ్ళు పరుగెత్తుతే యవడికి కావాలి? పరుగెత్తక పోతే యవడికి కావాలి?" ... ప్రేక్షకులు ఘొల్లున నవ్వు...
  "మా గురువు గారికి దొండకాయ కూరంటే ఇష్టం లేదు..కాని గురువు గారి పెళ్ళాం పెరట్లో దొండపాదు ఉందని రోజూ ఆ కూరే వండుతుంది..బతికున్న వాడి ఇష్టాలే ఇలా తగలడితే..ఇక చచ్చినవాడి ఇష్టాలతో ఏంటని?" ఈ డైలాగ్ మధ్యలో గురువు వెనకాతలే వచ్చి వింటూ..ముఖం మాడ్చుకుంటాడు... ప్రేక్షకులు చప్పట్లు, ఈలలు, నవ్వులు..
  నేను నిజంగా చాలా ఎంజాయ్ చేసాను..
  ఆడపిల్ల వేషంలో లుబ్ధావధాన్లు వేపు ఓరగా చూడ్డం, పెళ్ళికూతురు గా పసుబ్బట్టలతో తలొంచుకుని కూచోడం.. friends కూడా పోల్చుకోలేనంతగా మేకప్ అవడం..మధురస్మృతులు...
  ధన్యవాదములు మళ్ళీ గుర్తుచేసినందుకు...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @Voleti: ప్రేక్షకుల్లో కూర్చుని స్టేజీ మీద నాటకం చూస్తున్నట్టుగా ఉందండీ, మీ జ్ఞాపకాలు చదువుతూ ఉంటే.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు