గురువారం, సెప్టెంబర్ 14, 2017

మధురవాణి

సుబ్బి అనే చిన్నపిల్లకీ, లుబ్ధావధాన్లు అనే ముసలివాడికీ నిశ్చయమైపోయిన పెళ్లిని చెడగొట్టి,  బాల్య వివాహం బారినుంచి సుబ్బిని కాపాడడమే 'కన్యాశుల్కం' నాటకం  ప్రధాన కథ. ఈ పెళ్లిని చెడగొట్టేందుకు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషిచేసినా, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మధురవాణి అనే వేశ్యని గురించి. ఆమె వృత్తి చేత వేశ్య కనుక చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తుందే తప్ప, దయాదాక్షిణ్యాలున్న మనిషి. 'మంచి వారి యెడల మంచి గాను, చెడ్డవారి యెడల చెడ్డగానూ' ఉండమని చిన్ననాడు తల్లి చేసిన బోధలని అక్షరాలా ఆచరణలో పెడుతోంది. సుబ్బి పెళ్లి చెడగొట్టడానికి ఎవరి కారణాలు వాళ్లకి ఉన్నప్పటికీ, ఏ కారణమూ లేకపోయినా, తనేనాడూ సుబ్బి ముఖం చూడకపోయినా ఆ పిల్లకి అన్యాయం జరగకూడదన్న తాపత్రయం మధురవాణిది.

నాటకం ప్రధమాంకంలో, మధురవాణి బసలో "పిలా.. అగ్గిపుల్ల"  అన్న రామప్పంతులు పిలుపు ద్వారా మధురవాణి పరిచయం జరుగుతుంది, ఆమె పిల్ల కాదు అగ్గిపుల్ల అని. ఇక ఆమె మొట్ట మొదట మాట్లాడే మాటే "మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి" అని! వేశ్య పాత్ర చేత నీతిని గురించి మాట్లాడించడమే కాదు, నాటకం కడవరకూ ఆమె తన నీతికి కట్టుబడి ఉన్నదని చిత్రించారు రచయిత గురజాడ అప్పారావు పంతులు. మధురవాణి ఊరు విజయనగరం. నాటి కాలపు సానులందరిలాగే తల్లి దగ్గర లోకజ్ఞానం, సంగీతం అభ్యసించింది. వాళ్ళ కన్నా ఓ మెట్టు పైగా కొంత కాలం ఇంగ్లీష్ కూడా చదువుకుంది, గిరీశం దగ్గర. ఈ కారణానికి గిరీశం మీద మాట రానివ్వదు. ఎంతటి వాళ్ళనైనా సరే, తన ఎదురుగా గిరీశాన్ని దూషించే మాటైతే తన ఇంట్లో నుంచి విజయం చేయమంటుంది. గిరీశం ఆమెని ఉంచాడు కూడా.

నెల రోజుల కిత్రం గిరీశం ఇచ్చిన ఇరవై రూపాయల (పూటకూళ్ళమ్మ గిరీశానికిచ్చిన సంత బాపతు) తర్వాత అతని నుంచి మరి పైసా రాలలేదు. డబ్బుకి యటాముటీ రావడంతో మరో కొమ్మ వెతుక్కోడానికి నిశ్చయించుకున్న మధురవాణికి రామచంద్రపురం వాసి రామప్పంతులు తారసపడతాడు. ఆమెని ఉంచుకోడానికి అంతా సిద్ధం చేసి, రెండు వందల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇస్తాడు. అతగాడు మాట మీద నిలబడే మనిషి కాకపోవడంతో కాలక్షేపం చేయడం కష్టం అనుకుంటుంది మొదట. ఆ తర్వాత, అతడి స్థితి 'పైన పటారం లోన లొటారం' అని తెలిసినప్పుడు, తెలియక మోసపోయినట్టు గ్రహించి, శీఘ్రమే మరో కొమ్మ వెతుక్కోవాలని నిశ్చయించుకుంటుంది. ఇంతలో ఆమెకి రామప్పంతులు స్నేహితుడు లుబ్ధావధాన్ల పెళ్లి వార్త తెలుస్తుంది.

వధువెవరో తనకి తెలియకపోయినా, వృద్ధుడు, రోగిష్టీ అయిన లుబ్ధావధాన్లుని కట్టుకుని సుఖపడేది ఏమీ ఉండదని తెలుసు కనుక, ఆ పెళ్లి తప్పించమని రామప్పంతులుని కోరుతుంది మధురవాణి. పంతులు ససేమిరా అంటాడు. ఇంతలో మరువేషం వేసుకుని శిష్యుడితో సహా రామచంద్రపురం వచ్చిన కరటక శాస్త్రి, పంతులింట లేని వేళ చూసి ఇంటి తలుపు తడతాడు. మధురవాణికీ, శాస్త్రికీ మునుపే స్నేహం. పెళ్లి చెడగొడితే, మధురవాణికి డబ్బిస్తానని శాస్త్రి ఆశ చూపినప్పుడు "మీ తోడబుట్టువుకి ప్రమాదం వొచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?" అని అడుగుతుంది. అంతే కాదు, ఆ క్షణం నుంచీ, లుబ్ధావధాన్లుకి మాయగుంటతో పెళ్లి జరపడానికి తెరవెనుక నుంచే విశేషమైన కృషి చేస్తుంది. హెడ్ కానిస్టీబుతో చనువు నటించి, మాయగుంట పెళ్లి జరగడానికి, అటుపైని కరటక శాస్త్రీ, శిష్యుడూ ఒకరి వెనుక ఒకరు ఊరు విడిచి పారిపోడానికి పోలీసుల అడ్డు లేకుండా కాస్తుంది.

స్త్రీల పట్ల గొప్ప ఆదరభావం మధురవాణికి. అందుకే, గిరీశాన్ని వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చిన పూటకూళ్ళమ్మకి నోటితో "లేడ" ని చెబుతూనే, నొసటితో మంచం కిందకి చూపుతుంది. లుబ్దావధాన్లు కూతురు మీనాక్షితో మంచి స్నేహం, ఆమె స్థితి పట్ల సానుభూతీను. ఆమెని గురించి చెడ్డ మాట వినడానికి సిద్ధ పడదు. మీనాక్షిని వివాహం చేసుకోవలసిందిగా రామప్పంతులు పై ఒత్తిడి తెస్తుంది కూడా. చదువు చెప్పాడన్న కారణానికి గిరీశం మీద గౌరవం ఉన్నా, కేవలం బుచ్చమ్మ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకునే అతగాడి నిజస్వరూపాన్ని సౌజన్యారావు పంతులు ముందు ఉంచుతుంది. రామప్పంతుల్ని గాడిద అంటూ ఏడిపించినా, లుబ్ధావధాన్లు ఛాతీ కొలిచి బులిపించినా అదంతా వాళ్ళ బలహీనతలతో ఆడుకోవడమే అనిపిస్తుంది. కంటె చేతికిస్తూ ఆమె కరటక శాస్త్రికి పోసిన తలంటి కూడా సామాన్యమైనది కాదు. అది విన్నాక, అంతటి పండితుడికీ తెల్లవెంటుకలు లావయ్యాయి.

రామచంద్రపురంలో తగుమాత్రం పెద్దమనుషులు - సిద్ధాంతి, భుక్త, పూజారి గవరయ్య, పోలిశెట్టి లాంటి వాళ్ళు - అందరినీ తన బస చుట్టూ తిప్పుకుని లుబ్దావధాన్లు ఇంట్లో జరిగే నాటకాన్ని రక్తి కట్టిస్తుంది. ఇక హెడ్ కానిస్టీబైతే మధురవాణికి "గులాం." మాయగుంట పారిపోయాక, కంటె విషయంలో గడబిడ జరిగి, వరస కేసులు దాఖలైనప్పుడు భయపడ్డ కరటక శాస్త్రి - డిప్టీ కలెక్టరు కి మధురవాణి మీద మోజుందని తెలిసి - చూసి రమ్మంటాడు. "చూడదల్చుకోలేదు" అన్నప్పుడు "హెడ్డు కనిస్టీబు పాటి చేశాడు కాదా?" అని శాస్త్రి మాట జారితే, "హెడ్డుని నౌఖరులా తిప్పుకున్నాను కానీ, అధికం లేదే. ఆ నాలుగురోజులూ, సర్కారు కొలువు మాని అతడు నా కొలువు చేశాడు" అని గుర్తు చేస్తుంది. అంత మాత్రం చేత, తాను గొప్పదాన్నని కానీ, తవ వృత్తిలో హైన్యత లేదని కానీ భావించదామె.

"నీ తల్లి తరిఫీదు చేతనే నువ్వు విద్యా సౌందర్యాలు రెండూ దోహదం చేసి పెంచుకున్నావు" అని కరటకుడు మెచ్చుకోలు మాటాడితే, "అంతకన్నా కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవితమూ కాపాడే తనన్న వాళ్ళు ఉందురేమో" అంటుంది. అంగడి వాడికి మిఠాయి మీద ఆశా, సానికి వలపూ మనసులోనే మణగాలని నమ్మే మధురవాణికి, తాను కొద్దికాలం ఉండే యవ్వనాన్ని జీవనాధారం చేసుకున్నానని అనుక్షణం గుర్తుంటుంది. ఆమెకున్న తిక్క నేస్తులకి ఉపచరించేదే కానీ, ఎవరికీ హాని చేసేది కాదు. వృత్తిని మానేస్తే అందుకు ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఆమెని వెంటాడే ప్రశ్న. మాయగుంట పెళ్లి నాటకానికి తెరదించడానికి మారువేషంలో సౌజన్యారావు పంతులు బసకి వెళ్లిన మధురవాణి, అదే ప్రశ్నని అతగాడి ముందు ఉంచుతుంది, కానీ జవాబు మాత్రం రాదు.

వృత్తి చేత అనేకరకాల మనుషులని చూస్తూ వచ్చిన మధురవాణికి సౌజన్యారావు పంతులు సౌజన్యం మీద రవ్వంత అనుమానం. అతగాడికి నిజంగా ప్రచారంలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఉన్నాయా లేక పైకి తెలియని బలహీనతలు ఏమన్నా ఉన్నాయా అన్న స్త్రీ సహజమైన కుతూహలం. అందునా, స్త్రీ వ్యసనం లేని మగవాడిని చూడడం ఆమెకి బొత్తిగా కొత్త. మనుషుల్ని ఆడించే స్వభావం ఉండనే ఉంది. అందుకే, సౌజన్యారావు తనని ముద్దు పెట్టుకునేందుకు అంగీకరిస్తేనే, లుబ్ధావధాన్లు కేసు ముడి విప్పుతానని షరతు విధిస్తుంది. తీరా కేసు విషయం తేలిపోయాక, సౌజన్యరావుకి తన మీద ఆకర్షణ లేదని అర్ధమవుతుంది. అందుకే, "మంచి వారిని చెరపవద్దని మా అమ్మ చెప్పింది," అంటూ ముద్దుని తిరస్కరిస్తుంది. "వట్టి రంగువేసిన గాజుపూస" అని గిరీశం మధురవాణిని అంటే అని ఉండవచ్చు గాక, మధురవాణి మనసు మాత్రం "ప్యూర్ డైమండ్" అంతే, మరో మాట లేదు.

9 వ్యాఖ్యలు:

 1. ఆహా, at last ... ఎట్టకేలకు మధురవాణి 🙂. ఆమె పాత్రను excellent గా విశ్లేషించారు. నిజంగా అరుదైన వ్యక్తిత్వం 👌. కర్ణుడు లేని భారతం లేనట్లు .... మధురవాణి లేని "కన్యాశుల్కం" నాటకం లేదు (పోలిక ఆ నానుడి వరకే).

  ఈ పరంపరలో మీరు తరవాత ఏ పాత్ర మీద వ్రాస్తారా అని రోజూ నాకు నేనే క్విజ్ పెట్టుకుంటుంటాను. ఈ విషయంలో నా అంచనా సాధారణంగా ...... తప్పుతోంది 😩.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మధురవాణి గురించి ఏం వ్రాస్తారా అని ఎదురుచూసాను. డైమండ్ అనేసాక ఇంక ఏం పోట్లాడతాను ? మంచివాళ్ళతోనే పోట్లాడమని మా అమ్మ చెప్పింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "మా కులానికందరూ బావలే" అన్న డైమండ్ రాణీ, అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేసే గోల్డెన్ గిరీశం ఈ తరానికి ఆదర్శవంతులు...
  ఉంకో వెయ్యేళ్ళు వర్థిల్లుగాక..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @విన్నకోట నరసింహారావు: మీరు చెప్పిన సామెతతో పూర్తిగా ఏకీభవిస్తానండీ.. నేనొక వరస అనుకుని ఆ ప్రకారం ముందుకు పోతున్నా.. శ్రద్ధగా చదివి అభిప్రాయాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.
  @నీహారిక: You are impossible! చాలా రోజుల తర్వాత గట్టిగా పైకి నవ్వాను.. పోట్లాట వద్దు కానీ, మధురవాణి డైమండ్ ఎందుకు కాదో చెప్పండి తెలుసుకుంటాను :) ..ధన్యవాదాలు.
  @Voleti: లుబ్ధావధాన్లు, రామప్పంతులికి 'మావ' ఎలా అయ్యారన్న కొంటె ప్రశ్న ఉందండీ అక్కడే. మధురవాణి లాంటి సత్తెకాలపు మనుషుల సంగతేమో కానీ, గిరీశం లాంటి వాళ్ళు మాత్రం పదికాలాలు చల్లగా ఉంటారు.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Please give Small suggestion :
  I have gone to settings and put comments as "moderation" and only user id...
  అజ్ఞాత ల కామెంట్లు నిరోధించాలి ఉంటే, ఇది సరిపోతుందా?? ఇంకా ఏమైనా చెయ్యాలా??

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @Voleti: 'Who can comment' దగ్గర 'Registered user' సెలెక్ట్ చేయండి
  అలాగే 'Comment moderation' దగ్గర 'Always' సెలెక్ట్ చేసి, సేవ్ చేయండి, సరిపోతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Thank you sir..కానీ moderation అయిన comments మనకు ఎలా కనిపిస్తాయో తెలియజేయగలరు.‌

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @శ్రీనివాస్ పప్పు: వూ వూ.. :)
  @Voleti: డాష్ బోర్డు లో కామెంట్స్ సెక్షన్స్ లో 'awaiting moderation' క్లిక్ చేసి చూడొచ్చండీ.. పబ్లిష్, డిలీట్, స్పామ్ అషన్స్ ఉంటాయి. కామెంట్ పక్కన బాక్స్ ని క్లిక్ చేసి, మీకు నచ్చిన ఆప్షన్ని ఎంచుకోవచ్చు..

  ప్రత్యుత్తరంతొలగించు