గురువారం, సెప్టెంబర్ 07, 2017

గిరీశం

ఒకే ఒక్క ఆత్మగతంతో ఓ పాత్ర  తాలూకు రూపు రేఖా విలాసాలను అలవోకగా వర్ణించారు మహాకవి గురజాడ అప్పారావు. 'కన్యాశుల్కం' నాటకం ఆరంభ ఘట్టంలో గిరీశం తనలో తాను మాట్లాడుకునే మాటలద్వారా అతడి తాలూకు సమస్త (అవ) లక్షణాలనీ రూపుకట్టారు. నాటకానికి గిరీశమే కథా నాయకుడేమో అన్న సందేహం లేశమాత్రం కలగని విధంగా పూటకూళ్ళమ్మ దగ్గర డబ్బు తీసుకుని డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టేయడం మొదలు, అందిన చోటల్లా అప్పులు చేయడం, ఇది చాలదన్నట్టు వెంకు పంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాయడం వరకూ విజయనగరం బొంకులదిబ్బ మీద నిలబడి జ్ఞాపకం చేసుకుంటాడు గిరీశం.

ఈ సృష్టిలో గిరీశానికి తెలియని విషయం లేదు. పూర్తిగా తెలిసిన సంగతీ లేదు. కబుర్లతో కాలక్షేపం చేయడం, ఎదుటి వాళ్ళ బలహీనతలు ఆసరా చేసుకుని వాళ్ళ మీద పెత్తనం చేయాలని చూడడం, సులువుగా డబ్బు, కీర్తి సంపాదించే మార్గాలని నిరంతరం అన్వేషిస్తూనే ఉండడం, ఏదన్నా విషయం పీకల మీదికి వచ్చినప్పుడు ఎవరో ఒకరిని బలిచేసి తాను జాగ్రత్తగా తప్పుకునే నేర్పు... వీటన్నింటి కలబోతే గిరీశం. ఆశ్చర్యం ఏమిటంటే అమాయక ప్రజతో పాటు, ఒక్క చూపుతో మనుషుల్ని అంచనా వేయగల మధురవాణి, కాస్త సంభాషణ చేసి అవతల మనిషి ఏమిటన్నది తెలుసుకోగల వకీలు సౌజన్యరావు పంతులూ కూడా గిరీశం బుట్టలో పడడం.

'కన్యాశుల్కం' నాటకం ఆరంభం నుంచి చివరి వరకూ ప్రతి అంకంలోనూ కనిపించే ప్రధాన పాత్ర గిరీశం. నిజానికి "సాయంకాలమైంది..." అన్న గిరీశం ఆత్మగతంతో ఆరంభమయ్యే ఈ నాటకం, "డామిట్! కథ అడ్డంగా తిరిగింది" అన్నఅతగాడి అనుకోలుతో ముగుస్తుంది. విజయనగరంలో ఇక తన పప్పు ఉడకదని అర్ధమై, క్రిస్మస్ సెలవుల్లో ప్రియ శిష్యుడు వెంకటేశానికి చదువు చెప్పే మిషమీద వాళ్ళ ఊరు కృష్ణరాయపురం అగ్రహారం బయల్దేరతాడు గిరీశం. బయల్దేరే ముందు మధురవాణి ఇంట్లో, తనకి తగలవలసిన పూటకూళ్ళమ్మ చీపురుదెబ్బలకి రామప్పంతుల్ని బలిచేసి, అతగాడి నెత్తి చరిచి లఘువేసి మరీ నేర్పుగా బయట పడతాడు.

కృష్ణరాయపురంలో వెంకటేశం అక్కగారు, బ్యూటిఫుల్ యంగ్విడో బుచ్చమ్మని చూడగానే మనసు పారేసుకుని, ఆమెకి అత్తవారి ఆస్థి కూడా ఉందని తెలిశాక ఆమెని వలలో వేసుకోడానికి న్యాయమైన దారి తొక్కాలని నిర్ణయానికి వస్తాడు. బుచ్చమ్మ చెల్లెలు సుబ్బి పెళ్లి, తనకి అన్న వరసయ్యే లుబ్దావధాన్లుతో నిశ్చయమయినప్పుడు, ఆ పెళ్లి చెడగొట్టడం కోసం అన్నగారికి ఓ (అత్యద్భుతమైన) ఉత్తరం రాస్తాడు గిరీశం. 'సుబ్బిమీద గిరీశానికి ఎందుకింత కనికరం?' అన్న సందేహం మనకి వచ్చే లోగానే, మాయగుంట హత్యకేసులో సతమతమవుతున్న లుబ్ధావధాన్లుని తన పేరిట దత్తత పత్రిక రాయమనీ, పవరాఫ్ టర్నామా గొలికి ఇచ్చేయమనీ ఇదే గిరీశం పీడించినప్పుడు కదా అసలు రహస్యం అర్ధమవుతుంది.

గిరీశం తనని తాను కొత్తవాళ్ళకి పరిచయం చేసుకునే పధ్ధతి మా గొప్పగా ఉంటుంది. పరీక్షలు పాసయిన వాడిననీ, లెక్చర్లిచ్చే పండితుడిననీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు తనని వెతుక్కుంటూ వచ్చినా సంఘ సేవ నిమిత్తం వాటిని వద్దనుకున్నాననీ... ఒకటేమిటి, విన్నవాళ్ళకి విన్నంత. ఎదుటివాళ్ళని బురిడీ కొట్టించడంలో గిరీశం దిట్ట. "యంతమందిని పంపినా ఇచ్చారు కారుంటుండి. నేను వాళ్ళలాగా ఊరుకునే వోణ్ణి కానండి" అంటూ ధుమధుమలాడుతూ వచ్చిన పొటిగరాప్పంతులు గారి నౌకర్ని "పెద్దమనిషివి కదా. నువ్వూ తొందర పడడం మంచిదేనా? నీ తండ్రి యంతటి పెద్దమనిషి" అని చల్లబరిచి, ఆ 'పెద్దమనిషి' కి హవానా చుట్టలు చదివించుకుని గండం గట్టెక్కుతాడు.

గంటల తరబడి లెక్చర్లు దంచడంలో గిరీశాన్ని మించిన వాడు లేడు. 'ది ఎలెవన్ కాజస్ ఫర్దీ డిజెనరేషన్ అఫ్ ఇండియా' మొదలుకొని 'భగవత్ సృష్టిలో పునరుక్తులు' వరకూ ఏ విషయం మీదైనా గాలిపోగేసి, ఇంగ్లీష్, ఉరుదూ పదాలు దట్టించి వినేవాళ్ళు 'డంగైపోయేలా' ఏకబిగిన మాట్లాడేయగలడు. 'నేషనల్ కాంగ్రెస్' విషయమై గిరీశం రెండు గంటల పాటు లెక్చరు ఇస్తే, అంతా విన్న బండి అబ్బాయి "కాంగ్రెస్ వాళ్ళు మా ఊరి హెడ్ కానిస్టేబిల్ని ఎప్పుడు బదిలీ చేస్తారు?" అని అడిగాడు (ఈ బండి అతనంటే నాకు చాలా ఇష్టం!). 'మనవాళ్ళొట్టి వెధవాయిలోయ్' లాంటి స్వీపెంగ్ స్టేట్మెంట్స్ మొదలు, విడో మీద కవిత్వాలు, 'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న సూత్రీకరణలు.. ఇవన్నీ గిరీశం సొంతం. ఇక ఒపీనియన్స్ చేంజ్ చేసుకునే విషయంలో ఇప్పటి మన పొలిటీషియన్లకి ముత్తాతే కదూ.

అమాయకురాలు, తల్లితండ్రుల చాటు బిడ్డ అయిన బుచ్చమ్మని తన దారికి తెచ్చుకోడానికి గిరీశం చేసిన ప్రయత్నాల్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఆత్మస్తుతి నిండిన మామూలు సంభాషణలతో ఆరంభించి, అటుపై అరేబియన్ నైట్స్, మదనకామరాజు కథలూ చెప్పి, ఇల్లూ, పిల్లలూ, సరుకూ జప్పరా అంటూ ఆశ పెట్టి, ఒట్టు పక్కన పెడితే తన తల మిగిలిపోతుందని భయపెట్టి, బుచ్చమ్మ లేచిపోతే తప్ప సుబ్బి పెళ్లి ఆగదని నమ్మించి, పెళ్ళికి బయల్దేరిన బళ్ళలో ఆమె బండిని దారి తప్పించేస్తాడు. అప్పుడైనా ఆమెని పెళ్లి చేసుకునే వాడేనా అంటే - లుబ్ధావధాన్లు కనుక దత్తత పత్రిక రాస్తే - సందేహమే. మధురవాణితో సహా ఎంతోమంది డాన్సింగ్ గర్ల్స్ తో వ్యవహారాలు సాగించి, తనని తాను 'నెపోలియన్ ఆఫ్ యాంటీ నాచ్' అని అభివర్ణించుకోవడం గిరీశానికి మాత్రమే సాధ్యం.

ఇంగ్లీష్ చదువుల్ని సమాజం సరిగా అర్ధం చేసుకోనట్టయితే, గిరీశం లాంటి ఆషాఢభూతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించేందుకే గురజాడ ఈ పాత్రని సృష్టించారేమో అనిపిస్తూ ఉంటుంది. అన్నట్టు, నాలుగైదేళ్ల క్రితం ఒక రచయిత్రి రాసిన తెలుగు నవల్లో కథానాయిక తండ్రికి  సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు 'కన్యాశుల్కం' చదివి, కొడుకు పుడితే 'గిరీశం' అని పేరు పెట్టుకోవాలి అనుకుంటాడు. కొడుకే పుడతాడు కానీ, అతని తండ్రి (చంటి పిల్లాడి తాత) ఆ పేరు పెట్టడానికి ఒప్పుకోడు. అసలు 'కన్యాశుల్కం' చదివిన వాళ్ళు ఎవరైనా కొడుక్కి 'గిరీశం' పేరు పెట్టుకోవాలి అనుకుంటారా??

6 వ్యాఖ్యలు:

 1. నాచ్చి కొశ్చను విషయమై లెక్చరు దంచటం లో వారిని మించిన వారు లేరు కదండీ. బొట్లేరు ముక్కలతో ఈయనా, మాటకారి తనంతో రామప్ప పంతులూ చేసిన మోసాలు ఈనాటి సమాజం లో కూడా విరివిగా జరుగుతున్నవనిపిస్తుంది. మిగతా ముఖ్య పాత్రల విశ్లేషణ కోసం ఎదురుచూస్తుంటాను (ముఖ్యంగా రామప్ప పంతులు).

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మధురవాణి గురించి కూడా ఓ మాటనేసుకుంటే పనై పోతుంది కదా?
  శారద

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మధురవాణి గురించీ,ఆమె నవ్వు గురించీ మీరు రాస్తే..బావుంటుంది. మా కోసం రాయరూ..ఎదురుచూస్తూ..
  భాస్కర్.కె

  ప్రత్యుత్తరంతొలగించు
 4. గిరీశం పాత్ర ద్వారా తాను చెప్పదలచుకున్న విషయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా వ్యక్తీకరించారు..ఆనాటి సమాజంలో లోటుపాట్లు సుధీర్ఘంగా చర్చించారు..కానీ మధురవాణి దగ్గర పప్పులుడకలేదు...
  మీ writing flow బావుంది...
  అభినవ గిరీశాలు ఇప్పటికీ ఉన్నారు..
  చాలామంది గిరీశం పాత్ర హీరోలాగ అనుకుంటారు..NTR కూడా ఆ పాత్రకి న్యాయం చెయ్యలేకపోయానని స్వయంగా ప్రకటించాడు.. అప్పుడప్పుడు కాదు నిముషానికోసారి ఒపీనియన్స్ చేంజ్ చేసే నాయకులు ఉన్నంత కాలము గిరీశం సజీవంగా ఉంటాడు..

  ప్రత్యుత్తరంతొలగించు

 5. @Madhav Kandalai: అవునండీ.. సజీవమైన పాత్రలు.. మీరు మళ్ళీ చదువుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు..
  @శారద: తప్పకుండానండీ.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @భాస్కర్: తప్పకుండానండీ.. ధన్యవాదాలు
  @Voleti: నాటకం చదువుకోవడంతో పోలిస్తే సినిమా చూడడం దివిటీ ముందు దీపం అండీ.. నటీనటులు బాగా చేయలేదని కాదు కానీ, ఊహల్లో ఆ పాత్రలు, సన్నివేశాలు మరింత బాగుంటాయి అనిపిస్తుంది నాకు. విచిత్రం ఏమిటంటే, నాటకం చూసినప్పుడు అందులో లీనమవుతాను.. బహుశా, గురజాడ రాసినదాన్ని మార్చకుండా యధాతధంగా ప్రదర్శిస్తున్నందుకేమో.. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు