బుధవారం, సెప్టెంబర్ 13, 2017

బైరాగి

హరిద్వారంలో మఠం కట్టించడమే బైరాగి లక్ష్యం. అందుకోసం ఎక్కడ డబ్బొచ్చినా కాదనకుండా స్వీకరిస్తాడు. కాకపొతే, ఆ మఠం పనులు ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పటికి పూర్తవుతాయో నరమానవుడికి తెలియదు. సిద్ధుడు కాబట్టి బైరాగికి మాత్రమే తెలుసు. బైరాగి ఆదీ అంతం లేదు. నాటికి ఆరొందల ఏళ్ళ క్రితం నాటి వేమన బైరాగికి తాత. రెండొందల యాభై ఏళ్ళ క్రితం కాశీలో జరిగిన ఓ సంఘటనకి బైరాగి ప్రత్యక్ష సాక్షి. చూడగానే 'సిద్ధుల్ని' పోల్చగల రామచంద్రపురం సారా దుకాణదారుడు బైరాగిని పోల్చి, ఆతిధ్యం ఇస్తాడు. కాళీ మందిరం దగ్గరున్న సారాయి దుకాణం దగ్గర బైరాగికి భక్త బృందం తయారవుతుంది. ఆ బృందానికి నాయకుడు సారాయి దుకాణదారే.

"అమృతమనేది ఏమిటి? సారాయే! నాడు ఇదే గదా తాగడానికి దేవాసురులు తన్నుకు చచ్చారు" అంటూ భక్తులకి జ్ఞానబోధ చేసే బైరాగి, తనకి తెలిసిన రస విద్యని ఉపయోగించి బంగారం తయారు చేసి తన శిష్యులకి కానుగ్గా ఇస్తానని ఊరిస్తూ ఉంటాడు. ఆ బంగారంతోనే మఠం కట్టొచ్చు కదా అని అడిగిన అజ్ఞానపు శిష్యుడితో "మేం చేసే స్వర్ణం మేమే వాడుక చేస్తే తల పగిలిపోతుంది" అని సెలవిస్తాడు. తనబోటి సిద్ధులకి చలీ, వేడీ, సుఖం దుఃఖం లేవని కూడా జ్ఞానం పంచుతాడు. ఇంతా చేసి బైరాగి లౌకిక విషయాలకి పూర్తిగా దూరంగా ఉంటాడనుకోవడం పొరబాటు. మాయగుంట ఖూనీ కేసులో సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైపోతాడు. ఏవైనా దొరికితే, హరిద్వారంలో మఠానికి పనికొస్తాయని!

"సాక్ష్యం అంటే మావంటి వాళ్ళే చెప్పాలి. యోగ దృష్టి వల్ల చూశావంటే ఎక్కడ జరిగినదీ, ఎప్పుడు జరిగినదీ కళ్ళకి కట్టినట్టు అప్పుడు కనిపిస్తుంది," అనడమే కాదు, అవసరమైతే కల్పించడానికి కూడా సిద్ధ పడిపోతాడు. "వెర్రి! వెర్రి! నిజవేఁవిటి, అబద్ధవేవిఁటి? మేం సిద్ధులం. అబద్ధం నిజం చేస్తాం. నిజం అబద్ధం చేస్తాం. లోకవే పెద్ద అబద్ధం" అన్నాకా ఇంక తిరుగేవుంటుంది. పైగా, హెడ్ కనిస్టీబు బైరాగికి ప్రియ శిష్యుడు కూడా. అందుకే ఖూనీ కేసు పేరు చెప్పి లుబ్ధావధాన్లుని పీడించి తెచ్చిన పజ్యండు రాళ్ళలో గురోజీకో తులసిదళం సమర్పిస్తాడు. బైరాగి అసలు రంగుని మొదట పోల్చిన వాడు కూడా సారాయి దుకాణదారే. తన దుకాణంలో తాగిన సారాయికి బైరాగి సొమ్మివ్వకుండా మాయమైపోవడంతో ఆ సిద్ధుడి మహిమల మీద నమ్మకం పోతుందతనికి.

మాయమైపోయిన బైరాగి, మళ్ళీ కూనీ కేసు కోర్టులో విచారణకి వచ్చేనాటికి మళ్లీ ప్రత్యక్షం అవుతాడు. ఈ మారు, కొత్త శిష్యుల మధ్యన. ప్రాతః కాలమే గంగని సేవించి కాశీలో బయల్దేరానంటాడు. వాళ్లలో ఒక శిష్యుడు "యోగులకి సిద్ధులుండవురా? ఈయనేరా ఉప్మాక లోనూ సింవాచెలం లోనూ మొన్న శివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు" అని మిగిలిన వాళ్లకి పరవశంగా చెబుతాడు. శివరాత్రి నాడు రెండు వైష్ణవ క్షేత్రాల్లో ఒకే మారు కనిపించిన బైరాగి గొప్పదనాన్ని వాళ్లలో కొందరు నమ్ముతారు, మరికొందరు నమ్మరు. "తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటుకి ఉత్తరం దేశ దేశాలకి వెళ్లదా?" అంటాడు నమ్మని వాళ్లలో ఒకడు.

తన సదావృత్తి ఏర్పాటు చూసుకున్న బైరాగి, కొత్త శిష్యుల్ని ఊళ్ళో విశేషాలు అడుగుతాడు. అప్పుడు తెలుస్తుంది, మాయగుంట ఖూనీ కేసు విచారణకి వచ్చిందని. సాక్ష్యుల్లో తానూ ఒకడు కాబట్టి ప్రమాదాన్ని శంకిస్తాడు. "ఈ వూరు పాపంతో నిండినట్టు కనబడుతూంది. మేం ఉండజాలము" అని జారుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతలోనే దుకాణదారు అదాటున వచ్చి, తన బాకీ తీర్చే వరకూ కదలనివ్వనని చెప్పేస్తాడు. అప్పుడు, తనవంటి మరో దాసరిని గురించి కథ కల్పిస్తాడు బైరాగి. కొత్త శిష్యులు కూడా దుకాణదారుని తప్పు పడతారు. ఇంతలో హెడ్ కానిస్టీబు వచ్చి బైరాగిని రక్షిస్తాడు. అప్పుడు కూడా దుకాణదారు డబ్బివ్వాల్సిందే అని కూర్చుంటే, "నలుగురిలోనూ మర్యాద తీయడం ధర్మవేనా తమ్ముడూ? యోగరహస్యాలు పామరుల దగ్గరా వెల్లడి చేయడం?" అని బాధ పడతాడు.

ఎంతటి వాళ్ళనీ తన మాట చాతుర్యంతో ఆకర్షించడం, ఆ పూటకి పబ్బం గడుపుకోవడం బైరాగికి వెన్నతో పెట్టిన విద్య. కాశీ కబుర్లు, హరిద్వారం విశేషాలు ఎప్పుడూ నాలిక చివరనే ఉంటాయి. ఎలాంటి వాళ్ళనీ ఆకర్షించడానికి బంగారం తయారు చేసే రసవిద్య ఉండనే ఉంది. దుకాణదారు లాంటి వాళ్ళు ఒక్క అనుభవంతోనే బైరాగి మాయ నుంచి బయటపడితే, హెడ్ కానిస్టీబు లాంటి వాళ్ళు మాత్రం ఎప్పటికీ అతగాడి మహిమలని నమ్ముతూనే ఉంటారు. అంజనం వేసి మాయగుంట జాడ కనుక్కుంటానని కానిస్టీబుకి మాటిచ్చిన బైరాగి, అటు తర్వాత కనిపించకుండా మాయమైపోతే, ఆ నాటకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తాడు పూజారి గవరయ్య. అవసరాలు గడుపుకోడానికి, కష్టపడకుండా సౌకర్యవంతమైన జీవనం గడపడానికి మతాన్ని, అమాయక భక్తుల్ని అడ్డుపెట్టుకునే వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారని చెబుతుంది 'కన్యాశుల్కం' నాటకంలో బైరాగి పాత్ర.

3 వ్యాఖ్యలు:

 1. చూడగానే నేను సిద్ధుల్ని పోలుస్తాను అని సారాదుకాణదారుడంటే చుక్కేసేవోళ్ళని మాబాగా పోలుస్తావు అంటాడు మునసబు 😀.
  బైరాగి లాంటి కపటయోగులు అన్ని కాలాల్లోనూ ఉన్నారని "కన్యాశుల్కం" నాటకం చెబుతోంది అన్న మీ విశ్లేషణ అక్షరాలా నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఏది ఏమైనా బైరాగి సీను మా విశాఖపట్నంలో జరగడం వలన తెలియని మధురానుభూతి కలుగుతుంది..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @విన్నకోట నరసింహారావు : మాట్లాడింది తక్కువే అయినా, మునసబు మాటలు అక్షర సత్యాలండీ.. ధన్యవాదాలు.
  @Voleti: అవునండీ, పన్లోపనిగా సింహాచలం, ఉపమాక ప్రస్తావన కూడా వచ్చేసింది :) ..ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు