శుక్రవారం, సెప్టెంబర్ 08, 2017

నాయుడు

"యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజు ఇప్పించారు కారుగదా?" ఇది 'కన్యాశుల్కం' నాటకం ఆరో అంకంలో ప్రవేశించే వకీలు నాయుడు పాత్ర మొట్ట మొదటి డైలాగు. కేవలం రెండంకాల్లో, కొద్ది సన్నివేశాల్లో మాత్రమే కనిపించే నాయుడు తన 'పార్టీ' కేసు ఓడిపోడానికి తిరుగులేని కృషి చేశాడు!  పద్దెనిమిది వందలు శుల్కమిచ్చి సుబ్బిని పెళ్లి చేసుకుంటాడనుకున్న లుబ్ధావధాన్లు అప్పటికే మాయగుంటని మనువాడేయడం సుబ్బి తండ్రి అగ్నిహోత్రావధానులుని పుండులా సలిపితే, పెళ్లి  ప్రయాణంలో పెద్దకూతురు బుచ్చమ్మని గిరీశం లేవదీసుకు పోవడం పుండుమీద కారం రాసినట్టు అవుతుంది.

రామప్పంతులు సలహా మేరకి, గిరీశం మీద అబ్ డక్షన్ కేసు ఫైలు చేసిన అగ్నిహోత్రావధానులుకి, వకీలు నాయుడు పనితనం మీద మొదటినుంచీ సందేహమే. పైగా, కేసు విషయం తేలకపోగా రామప్పంతులు ధారాళంగా చేయిస్తున్న ఖర్చుని భరించడానికి శక్తి చాలడం లేదు అవధానులుకి. సరిగ్గా అప్పుడే నాయుడు ఫీజు విషయం కదపడంతో కోపం నషాళానికెక్కి "మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్తగారన్నారష!" అనేయడంతో నాయుడు కోపం తారాస్థాయి చేరుతుంది. "నా దగ్గర హైకోర్టుకి కూడా ప్లయింట్లు రాసుకుపోతారు. యీ కుళ్ళు కేసనగా యేపాటి?" అని చప్పరించేస్తాడు.

రామప్పంతులు లౌక్యం చూపించి, కేసు వకాల్తీనమాని 'ఇంగ్లీషు చదువుకున్న' భీమారావు పంతులుకి మార్పించేస్తాడు. ఈ గడబిడలో, నాయుడికిచ్చిన వకాల్తా రద్దు పరచకపోవడంతో అగ్నిహోత్రావధానులు తరపున పరస్పర విరుద్ధంగా వాదించే ఇద్దరు వకీళ్లు తయారవుతారు కోర్టులో. "స్మాలెట్ దొరగార్ని (ఆరోజుల్లో విశాఖ కలెక్టర్) మెప్పించిన ముండాకొడుకుని, నాకు లా రాకపోయితే యీ గుంట వెధవలికిటోయ్ లా వస్తుంది? పాస్ పీసని రెండు యింగ్లీష్ ముక్కలు మాట్లాడటంతోటే సరా, యేమిటి? అందులో మన డిప్టీ కలక్టరు గారికి ఇంగ్లీష్ వకీలంటే కోపం. అందులో బ్రాహ్మడంటే మరీని, ఆ మాట ఆలందరికి బోధపరచండి" అంటాడు నాయుడు. (పాపం, డిప్టీ కలెక్టర్ గారికి మాత్రం ఇంగ్లీష్ చదువుకున్న బ్రాహ్మణ వకీలు సౌజన్యరావు పంతులుతో మాంచి స్నేహం).

నాయుడంత చెప్పినా రామప్పంతులు కరగడు, అగ్నిహోత్రుడు మారు మాట్లాడడు. "అయితే నన్నీలాగు మర్యాద చేస్తారూ? యీ బ్రాహ్మడి యోగ్యత యిప్పుడే కలక్టరు గారి బసకు వెళ్లి మనవి చేస్తాను" అని చెప్పి మరీ వెళ్ళిపోతాడా వకీలు. తనకి ఫీజు బాకీ చెల్లించకపోగా మరో లాయర్ని కుదుర్చుకున్నందుకు గాను అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటాడు,  డిప్టీ కలెక్టరు కచేరీ (కోర్టు)లో.  కన్యాశుల్కానికి ఆశించి బుచ్చమ్మని ముసలి వరుడికిచ్చి పెళ్లి చేయడం, ఆ 'సహస్ర మాసైక జీవి' పరమపదం వేంచేస్తే, ఆస్తి నిమిత్తం కేసు తేవడం, ఆపై ఇరుగు పొరుగులతో సరిహద్దు తగాదాలన్నీ విడమరిచి చెప్పి "వీరు తమవంటి  గవర్నమెంట్ ఆఫీసర్లకు తరచుగా పని కలుగజేసి ప్లీడర్లని పోషిస్తూ ఉంటారు" అని మనవి చేయడంతో డిప్టీ కలెక్టర్ "బలే శాబాష్!" అని కేసు వినడానికి సరదా పడతాడు.

భీమారావు పంతులుకి మాటిమాటికీ అడ్డంపడి ఇంగ్లీష్ వకీలు పరువూ, అగ్నిహోత్రావధానులు పరువూ కూడా నిలువునా తీసేస్తాడు నాయుడు. బుచ్చమ్మకి మైనారిటీ తీరలేదనడానికి సాక్ష్యంగా భీమారావు పంతులు దాఖలు చేసిన జాతకాన్ని గురించి నాయుడి మాట: "యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారు చేయబడ్డది. అదుగో! ఆ మూల నిలబడ్డ రామప్పంతులు గారికి యీ జాతకంలో మంచి ప్రవేశం ఉందండి" అని రామప్పంతులునీ ఇరికిస్తాడు. పేస్డ్ వకీలు తానుండగా, నాయుడు మాట్లాడడం ఏమిటని అభ్యంతరం లేవదీస్తాడు భీమారావు. నాయుడు ఏమాత్రం తొణకడు. "డబ్బు పుచ్చుకున్నందుకు నా పార్టీ తరపున నాలుగు మాటలు చెప్పి తీరుతాను గాని ఇంగ్లీషు చదువుకున్న కొందరు వకీళ్ళ లాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి" అని తేల్చి చెప్పేసి, భీమారావుని ఎత్తిపొడుస్తాడు.

చార్జి కాగితం చూసిన కోర్టు గుమస్తా "ఇందులో ముద్దాయి ఇంటిపేరూ, సాకీనూ (చిరునామా) లేదండి" అనడంతోనే, డిప్టీ కలక్టరు కన్నా ముందు నాయుడే అందుకుని "ఈ ఆర్జీ వల్లకాట్లో రామనాధాయ వ్యవహారంలాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలు చేసే కాగితాలు ఈ రీతినే ఉంటాయండి" అంటూ భీమారావు మీద తన కడుపుడుకు తీర్చుకుంటాడు. "సాకీనూ మొదలైనవి లేనిదీ కేసు అడ్మిట్ చేయడానికి లేదు" అని చెప్పి టిఫిన్ కి వెళ్ళిపోతాడు డిప్టీ కలెక్టరు. "ఏమండోయ్ కేసు అడ్డంగా తిరిగిందే?" అని అగ్నిహోత్రావధానులు అడగడంతోనే, భీమారావు పంతులు ఏమాత్రం తొణక్కుండా "ఇచ్చిన ఫీజుకి పనైపోయింది. మళ్ళీ ఫీజిస్తే కానీ మాట్లాడేది లేదు" అని తెగేసి చెప్పేస్తాడు. భాషలు వేరయినా ఫీజుల విషయంలో వకీళ్ళందరూ ఒక్కటే అని మనకి బోధ పడుతుంది.

ఇంత జరిగినా కూడా, అవధాన్లు మీద నాయుడి కోపం చల్లారదు. డిప్టీ కలెక్టరు వేసిన చీవాట్ల తాలూకు అవమానభారంతో ఉడికిపోతున్న అవధాన్లు దగ్గరికి వచ్చి "ఇంగ్లీషు వకీలు సరదా తీరిందా? ఫోర్జరీకి (బుచ్చమ్మ జాతకం) తమక్కూడా మఠ ప్రవేశం (జైలు) అవుతుంది" అని చల్లగా చెబుతాడు. అసహాయతలోంచి పుట్టిన కోపంతో నాయుణ్ణి "నీ ఇంట కోడి కాల్చా" అని శపిస్తాడు అగ్నిహోత్రావధానులు. ఆ శాపాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్న నాయుడు "రోజా కాలుస్తూనే ఉంటారు" అంటాడు, అగ్నిహోత్రుడికే అగ్గెత్తుకొచ్చేలా. ఇంత జరిగినా నాయుడు, అవధానులుని విడిచిపెట్టడు. "ఫోర్జరీ కేసు ఖణాయించకుండా డిప్టీ కలెక్టరు తో సిఫార్సు చేశాను కదా, నాకేమిస్తారు?" అని అడిగేయడమే కాదు, డబ్బు లేకపోతే ప్రోనోటు రాయమనీ, అదీ కుదరకపోతే ఒక బండెడు ధాన్యం ఇవ్వమనీ పీడిస్తాడు. చివరికి రెండు పుట్లు మిరపకాయలకి బేరం స్థిరపడుతుంది.

బ్రిటిష్ పాలిత భారతదేశంలో ప్లీడర్ల పని తీరు ఎలా ఉండేదన్నది విప్పి చెబుతాడు నాయుడు. కేఎన్వై పతంజలి 'పిలక తిరుగుడు పువ్వు' లో కనిపించే వకీలు 'తాడి మోహనరావు నాయుడు' పాత్రకి స్ఫూర్తి ఈ నాయుడే! 'కోర్టు వ్యవహారాల్లో నాటికీ నేటికీ ఏమన్నా తేడా ఉందా' అన్నది మాత్రం  ప్రశ్నార్థకమే..

7 వ్యాఖ్యలు:

 1. అగ్నిహోత్రావధానులు "నీ ఇంట కోడి కాల్చా" అని మరో సందర్భంలో అన్నప్పుడు నాయుడు "అమోఘమైన ఆశీర్వచనం" అని అంటాడనుకుంటా. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. 🙂🙂. రోజూ కాలుస్తూనే వుంటారు అని కూడా అంటాడు నాయుడు 🙂.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. "వకీళ్ళు ఇలా అబద్ధాలాడేస్తూ ఉంటే జడ్జిగారు ఏంచేస్తారండీ?" గిరీశం అడిగిన ప్రశ్నకు సౌజన్యారావు గారి సమాధానం"పాపం చెయ్యి పీకేట్టు రాసుకుంటూ ఉంటాడు"..
  చూస్తున్న ప్రేక్షకులు చప్పట్లు..అప్పటికీ,ఇప్పటికీ,ఎప్పటికీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వోలేటి గారూ, ఆ నాటకంలో ప్రతి వాక్యమూ ఓ ఆణిముత్యమే కదా 👏.
  మీరు అగ్నిహోత్రావధానుల వేషం వేస్తున్న రోజుల్లో గిరీశం పాత్ర జే.వీ.రమణమూర్తి గారు చేసేవారా?
  (మీ బ్లాగ్ వైపు కూడా ఓ చూపు చూస్తుండండి వోలేటి గారూ 🙂)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మీ అభిమానానికి కృతజ్ఞతలు..
  నేను సుమారు 25 ఏళ్ళ క్రితం శ్రీ.కొండవలస లక్ష్మణరావు గారి దర్శకత్వంలో కరటకశాస్త్రి శిష్యుడు వేషం (ఆడపిల్ల) చేసాను..ఆ అబ్బాయి ఎవరో బాగా చేసాడని ఆ నోటా, ఈనోటా పాకి శ్రీరమణమూర్తి గారి చెవినబడింది..అందులో బుచ్చమ్మ పాత్ర చేసే శివజ్యోతి (మా టీమ్ లో కూడా ఆవిడే)..."అబ్బాయి..పెట్టె సర్దుకొని రెడీగా ఉండు, ఏ క్షణాన్నైనా వారి నుండి కబుర్రావచ్చు అన్నారు.
  కాని ఆ అవకాశం ఆయనకు బాగా పరిచయం ఉన్నవారు పట్టుకుపోయారు..
  కె.వి.మోమోరియల్ అను మా సంస్థలో 15 ఏండ్ల క్రితం లుబ్ధావధానులు చేయమని గా, నాకు నాటకం మొత్తంమీద పట్టు ఉండటం మూలాన, నేను తెరవెనుక నుండి కో-డైరక్టరు పాత్ర వహించాను..
  6 ఏండ్ల క్రితం అగ్నిహోత్రావధానులు వేసే VKS Prasadఅను మిత్రుడు మరణించడంతో ఆ పాత్రతో సుమారు పది సార్లు వేసాను..
  గురజాడ వారి జన్మస్థలమైన రాయవరంలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు ఒకేసారి వేసాను..
  కువైట్ లో గిరీశం శిష్యుడు వెంకటేశం, పూటకూళ్ళమ్మ ఏక కాలంలో వేశాను..
  మా దర్శకుడు శ్రీ శివప్రసాద్ నేతృత్వంలో ఇప్పటికీ చేస్తున్నారు..కానీ గత సంవత్సర కాలంగా నుండి మా తల్లితండ్రులు వృద్ధాప్యం లో ఉండటం వలన నాటకాలకు దూరంగా ఉన్నాను..
  2.PC నుండి అరచేతి చరవాణికి మారడం వలన, WhatsApp, Facebook లు వలన బ్లాగులోకానికి దూరమయ్యారు..కానీ మీ ప్రోద్బల్యంతో అక్కడ పైత్యం ఒలకపోసాను..thank you sir.
  Murali గారూ..సారీ..కాస్త length ఎక్కువైంది...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @DG : అవునండీ, చివరి డైలాగు.. ధన్యవాదాలు
  @ విన్నకోట నరసింహా రావు, Voleti : మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలండీ. 'కన్యాశుల్కం' గురించి చక్కని చర్చ.. వోలేటి గారూ, లెంగ్త్ అస్సలు ఎక్కువ కాలేదు.. మీరు ఇంకా విశేషాలు చెప్పాలి..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వోలేటి వారూ, అసమానమైన సాంఘిక నాటకం "కన్యాశుల్కం" లో వివిధ పాత్రల వేషాలు వేసి ధన్యులయ్యారు మీరు. మీ బహుముఖ ప్రజ్ఞకు అభినందనలు.
  పైన బ్లాగులోకం గురించి మీరు వ్రాసిన వ్యాఖ్యకు నా స్పందన మీ స్వంత బ్లాగ్ లో ఇచ్చాను, చూడగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు