సోమవారం, సెప్టెంబర్ 04, 2017

అగ్నిహోత్రావధానులు

"తాంబోళం ఇచ్చేశాను తన్నుకు చావండి" అంటూ 'కన్యాశుల్కం' నాటకంలో అగ్నిహోత్రావధానులు పలికిన మాట తెలుగు భాషలో జాతీయమై నిలిచిపోయింది. అతగాడి మాటే "ఆడముండలతోనా ఆలోచన?" అన్న ప్రశ్న నూట పాతికేళ్ల క్రితం మన సమాజంలోని కొన్ని కుటుంబాల్లో ఇల్లాలి స్థానం ఏమిటో ఒక్కముక్కలో చెప్పేసింది. కన్యాశుల్కాన్ని తలచుకోగానే తటాలున గుర్తొచ్చే పాత్రల్లో అగ్నిహోత్రావధాన్లు ఉండకపోతేనేమీ, అతగాడి ప్రత్యేకతలు కోకొల్లలు. సాక్షాత్తూ బావమరిది కరటక శాస్తుర్లే "మూర్ఖప గాడిద కొడుకు" అనేయడంతో, అగ్నిహోత్రుడి గురించి పెద్దగా ఆలోచించే పని పెట్టుకోము.

చాలామంది తండ్రుల్లాగే కొడుకు చదువుకి బోల్డంత ఖర్చయిపోతోందని బెంగ. దానితో పాటే, కొడుకు పెద్ద ఉద్యోగస్తుడై బాగా గడించాలన్న కోరిక. అంతలోనే, తన కొడుక్కి అంతటి ప్రయోజకత్వం ఉందా అన్న అనుమానం. నిజం చెప్పాలంటే మనిషిని చూడగానే లోతుపాతులు నిగ్గు తేల్చి చెప్పడం అగ్నిహోత్రావధాన్లు ప్రత్యేకత. గిరీశంతో పాటు బండి దిగిన వెంకటేశాన్ని చూడగానే, "వెధవాయా, ఈ మారైనా పరీక్ష పాసయినవా?" అని సూటిగా విషయంలోకి వచ్చేస్తాడు. వెంకటేశం పరీక్ష తన్నేసి ఉంటుందని ఎంత కచ్చితంగా అంచనా వేశాడో కదా.

శిష్యుణ్ణి రక్షించడం కోసం గిరీశం రంగంలోకి దిగి అతి నటన ప్రదర్శించబోతే ఏమాత్రం లక్ష్యం చెయ్యకుండా "ఈ తురకడెవడోయ్" అని మొహాన్నే అనడమే కాదు, "ఈ శషభిషలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఇక్కడే బస వేసేట్టు కనిపిస్తోంది. మా ఇంట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు" అని కుండ బద్దలుకొట్టేస్తాడు కూడా. గిరీశం ఎందుకొచ్చాడో బాగా తెలిసింది అగ్నిహోత్రుడొక్కడికే అనడానికి అనుమానమా? పుస్తకాలకి పదిహేను రూపాయలవుతుందని కొడుకు చెప్పగానే, "ఒక్క దమ్మిడీ ఇవ్వను. వీళ్ళిద్దరూ కూడి ఆ రూపాయలు పంచుకు తినేట్టు కనబడుతూ ఉంది" అనడానికి అస్సలు మొహమాట పడడు.

'కన్యాశుల్కం' ద్వితీయాంకంలో అగ్నిహోత్రావధాన్లు పరిచయం అయింది మొదలు, మళ్ళీ అతగాడు ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అన్న ఆత్రుత సహజంగానే కలుగుతుంది. ఆ తర్వాతి అంకంలోనే కొడుకు చదువు బాగోగులు, కోర్టు వ్యవహారాలు గిరీశంతో మాట్లాడుతూ కనిపిస్తాడు తెల్లవాళ్ళ చదువులు, పద్ధతుల గురించి గిరీశం చెప్పింది విని, "ఈ రెయిళ్లూ గియిళ్ళూ యావత్తూ మన వేదంలో ఉన్నాయిష" అని వాకృచ్చుతాడు. మందడి గోడల విషయమై ఇరుగు పొరుగుల మీద కోర్టు కేసులు వేసి, సిరిపురం భూవులు అమ్మేసుకున్న 'అగ్రహారపు చెయ్యి' పరిచయమయ్యేది ఇక్కడే. అయినప్పటికీ, కోర్టు కేసు అనేసరికి కొత్త ఉత్సాహం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది అగ్నిహోత్రావధాన్లుకి.

చిన్న కూతురు సుబ్బిని లుబ్ధావధాన్లు కి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ఏనుగు, గుర్రాలు, అంచీ బళ్లతో రామచంద్రపురం అగ్రహారంలో దిగిన అగ్నిహోత్రుడు ఆరో అంకంలో కనిపిస్తాడు మళ్ళీ. "మనకి బావగారి వరసా ఏవిషండీ?" అని రామప్పంతులుతో సరసమాడినంత సేపు పట్టదు, మాట తప్పి మరో పెళ్లి చేసేసుకున్న లుబ్ధావధాన్లు మీద కోర్టు కేసుకి సిద్ధ పడిపోడానికి. కేసు తీసుకెళ్లి రామప్పంతులు చేతిలోనే పెట్టేస్తాడు కూడా. దాసరి వేషంలో ఉన్న మహేశం పాడే చావు పాట రామప్పని భయ పెడుతుంది కానీ, అగ్నిహోత్రుణ్ణి కదిలించదు. "నీలాలకా ఏల నీ యలుకా?" అని పాడుతుంటే "యలకేవిటి నీ శ్రార్థం!" అని తిట్టగలడు.

పెద్ద కూతురు బుచ్చమ్మ బాల్య వితంతువై పుట్టింటికి తిరిగొచ్చినా, చిన్న కూతురు సుబ్బికి ముదుసలి వరుడితో బాల్య వివాహం తలపెట్టడమే కాదు, ఆ పెళ్లి అల్లరయినా, బుచ్చమ్మ గిరీశంతో లేచిపోయినా తన అభిప్రాయాలని ఏమాత్రం మార్చుకోడు అగ్నిహోత్రావధాన్లు. బుచ్చమ్మ అబ్ డక్షన్ కేసులో తప్పుడు జాతకం  దాఖలు చేసినందుకు జడ్జీ చీవాట్లేసినా చలించడు. మార్పు తేవడం కోసం ప్రయత్నం చేసిన సౌజన్య రావు పంతులంతడి వాడిని కూడా "మీ గృహకృత్యాల వూసుకి నేనొచ్చానా ఏవిటి? నా గృహకృత్యాల ఊసు మీకెందుకూ?" అని కడిగేయగలడు.

మనుషుల నైజాలని పసిగట్టగలిగీ అవతలి వాళ్ళ బుట్టలో పడిపోవడం, తాను నిర్ణయించుకున్నదే తప్ప మరో ఆలోచన చేయకపోవడం అగ్నిహోత్రావధాన్లు వ్యక్తిత్వం. తాను నమ్మిన విషయాలకి అనుకూలంగా ఓ వాదాన్ని నిర్మించుకోవడం, ఎవరేమన్నా లెక్కచేయక రెండో ఆలోచన జోలికి వెళ్ళకపోవడం అతగాడి లక్షణాలు. చాలా నవలల్లో క్లైమాక్స్ లో వచ్చే ఒక్క డైలాగుకీ, సినిమాల్లో అయితే ఒక చెంపదెబ్బకీ మారిపోయే పాత్రల్ని చూసినప్పుడు తప్పక గుర్తొచ్చే వాడు అగ్నిహోత్రుడు. మారిపోవడం ఏమంత సులభం కాదని ఒక సజీవ పాత్ర ద్వారా నిరూపించిన గురజాడకు - నూట పాతికేళ్ల తర్వాత - జోహార్లు!!

11 వ్యాఖ్యలు:

  1. అగ్నిహోత్రావధానులి పెద్దకూతురు బుచ్చమ్మ కదండి. మీనాక్షి లుబ్దావధానులి కూతురు (మీ టపాలో కిందనుంచి రెండో పేరా).

    ప్రత్యుత్తరంతొలగించు
  2. >>>మారిపోవడం ఏమంత సులభం కాదని ఒక సజీవ పాత్ర ద్వారా నిరూపించిన గురజాడ

    అక్షర సత్యం!

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు
  3. విన్నకోట నరసింహారావు: సరిచేశానండీ.. ఏదో పరాకు.. చాలా చాలా ధన్యవాదాలు..
    జిలేబి: ధన్యవాదాలండీ..

    ప్రత్యుత్తరంతొలగించు
  4. మీ టపా బావుంది..నేను "అగ్నిహోత్రావధానులు" పాత్ర చెయ్యడం ద్వారా చాలా తృప్తి, ప్రేక్షకుల మన్నన పొందగలిగాను..
    మీ కింది పేరాల్లో ఇంకా ఓ రెండుసార్లు మీనాక్షి అని ఉంది..సరిచెయ్యగలరు..

    ప్రత్యుత్తరంతొలగించు
  5. @Voleti: ఒహ్హ్.. అగ్నిహోత్రావధానులు వేశారా! చాలా కష్టమైన పాత్ర అంటారు.. రంగస్థలం మీద ఎక్కువసార్లు చూడలేక పోయానండీ.. 'మీనాక్షి' సరిచేశాను.. ధన్యవాదాలు..

    ప్రత్యుత్తరంతొలగించు
  6. చమ్మక్ చల్లో అన్న మాట అన్నందుకు కోర్టు ఒక వ్యక్తికి 8 సంవత్సరాల తర్వాత శిక్ష(కొద్దిగానేలెండి) వేసింది. "చమ్మక్ చల్లో" తప్పయితే ఆ పదాన్ని ఆ పాటని తీసేయాలి కదా ? అనిపించింది. ఆడముండలతోనా ఆలోచన ? అన్న వాక్యమూ అలాంటిదే మరి ! అగ్నిహోత్రావధానులాంటివాళ్ళను మార్చడం అంత సులువేమీ కాదు. మేము మారడం ఈజీ !

    మగముండాకొడుకులతోనా పగెట్టుకోడం ?

    ప్రత్యుత్తరంతొలగించు
  7. Voleti వారూ, బహుకాల దర్శనం.
    ఎన్టీఆర్, సావిత్రి నటించిన అలనాటి (1950వ దశకం) "కన్యాశుల్కం" సినిమాలో అప్పటి ప్రసిద్ధ నటులలో ఒకరైన మా విన్నకోట రామన్న పంతులు గారు పోషించిన అగ్నిహోత్రావధానుల పాత్ర రంగస్థలం మీద మీరూ వేశారా? సంతోషం. అది ఆ నాటకంలో కీలకమైన పాత్రలలో ఒకటి. నాటకరంగంలో active గా ఉండే ఊళ్ళల్లో మీ విశాఖపట్నం ఒకటి.

    ప్రత్యుత్తరంతొలగించు
  8. విన్నకోట నరసింహారావు గారు..ధన్యవాదములు..సినిమాలో చాలా బాగా జీవించారు అందరూ..కాస్త భాష మీద పట్టు ఉంటే అలవోకగా కన్యాశుల్కం లోని సంభాషణలు పలుకవచ్చు..ఆ గొప్పదనం గురజాడ వారిది...

    ప్రత్యుత్తరంతొలగించు
  9. @నీహారిక: 'కన్యాశుల్కం' నాటకాన్ని నిషేధించాలని కూడా ఏదన్నా ఉద్యమం మొదలవుతుందేమో నండీ.. ఆ గొడవ వంకన మరికొందరు పుస్తకం చదివితే సంతోషమే.. ఉద్యమం లేవదీసిన వాళ్లకి బోల్డంత పేరు కూడా వస్తుంది.. ..ధన్యవాదాలు..
    @విన్నకోట నరసింహారావు, వోలేటి: మీ ఇద్దరికీ మరోమారు ధన్యవాదాలండీ.. 'కన్యాశుల్కం' గురించి మీరు ఇక్కడ మాట్లాడుకోడం సంతోషం కలిగించింది.

    ప్రత్యుత్తరంతొలగించు
  10. మీ టపా చూసింతర్వాత, మళ్ళా మరోసారి కన్యాశుల్కం పుస్తకం తిరిగెయ్యాలనిపించింది. బాగా ఔపాసన పట్టారు. హాస్య నటుడు ఏ వీ యస్, కన్యాశుల్కం సినిమాలో ఈ పాత్ర వేసిన విన్నకోట రామన్న పంతులు గార్ని అనుకరించినట్లు అనిపిస్తుంది (ముఖ్యంగా మూతి).

    ప్రత్యుత్తరంతొలగించు

  11. @Madhav Kandalai : తప్పకుండా చదవండి.. ఏవీఎస్ ఒక్కరే కాదండీ, చాలామంది అనుకరించారు పంతులు గారిని .. అన్నట్టు 'ఔపోసన' మాట.. విద్యార్థినే.. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు