ఆదివారం, సెప్టెంబర్ 24, 2017

హెడ్ కనిష్టీబు

ఏడంకాల 'కన్యాశుల్కం' నాటకంలో ప్రతీ అంకంలోనూ ప్రస్తావనకి వచ్చే పేరు హెడ్ కనిష్టీబు. పేరు కూడా తెలియని ఈ పాత్ర ప్రత్యక్షంలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లోనే అయినా, పరోక్షంలో ఇతడి ప్రస్తావన చాలాసార్లే వస్తుంది. ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థ పనితీరు కంపెనీ పాలనా కాలంలో ఎలా ఉండేదో తెలుసుకోడానికి బహు చక్కగా ఉపయోగ పడే పాత్ర ఇది. ప్రధమాంకంలో పూటకూళ్ళమ్మ చేతా, గిరీశం చేతా దెబ్బలు తిన్న రామప్పంతులు "మధురవాణీ, యేవీ బేహద్బీ? కనిష్టీబుక్కబురంపించూ" అని పురమాయిస్తాడు, అక్కడికి హెడ్ కనిష్టీబు తన ఇంట్లో నౌఖరైనట్టు. ఇక రెండో అంకంలో గిరీశం లెక్చరు విన్న బండి అతనైతే "మాఊరి హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెస్ వారు యెప్పుడు బదిలీ చేస్తారు?" అని అడిగేస్తాడు.

హెడ్ కనిష్టీబు పాత్ర ప్రత్యక్షంగా కనిపించేది తృతీయాంకంలో రామచంద్రపురం అగ్రహారంలోని రామప్పంతులు ఇంట్లో. మధురవాణితో పంతులు సరసమాడుతున్న సమయంలో చుట్ట కాలుస్తూ ప్రవేశించి, కుర్చీ మీద కూర్చుని "రావప్పంతులూ.. యిన స్పెక్టరికే టోపీ వేశావటే?" అని ఏకవచనంలో అడిగి పంతులు పరువు తీసేస్తాడు. తన లౌక్య ప్రజ్ఞ ఉపయోగించి, దాన్ని హాస్యంగా తీసిపారేసే ప్రయత్నం చేసిన పంతుల్ని అడ్డుకుని, "యినస్పెక్టరు పేరు చెప్పి రావినాయుడి దగ్గర పాతిక రూపాయల్లాగావట. యిలా యందరి దగ్గర లాగాడో రావప్పంతుల్ని నిల్చున్న పాట్లాని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతొ ఖచ్చితంగా చెప్పి ఇనస్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు" అంటూ ఇక పరువన్నది మిగల్చడు. అయితే, అప్పటికే పంతులు వ్యవహారం అంతా 'పైన పటారం లోన లొటారం' అని మధురవాణికి తెలుసు కాబట్టి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు.

రామప్పంతుల్ని తీసుకుని వెళ్తూ వెళ్తూ మధురవాణికి సౌజ్ఞ చేస్తాడు హెడ్ కనిష్టీబు. "అతడు ఇచ్చేది చచ్చేది లేదు గాని, జట్టీలేవైనా వొస్తే ఓ వొడ్డు కాస్తాడు" అంటుకుంటుంది ఆత్మగతంగా. పంతులటు వెళ్ళగానే మాయగుంట వేషంలో ఉన్న శిష్యుణ్ణి వెంటబెట్టుకుని మారువేషంలో వచ్చిన కరటక శాస్త్రితో లుబ్దావధాన్లు సంబంధం నిశ్చయం చేసే విషయం మాట్లాడుతూ కూడా హెడ్ ప్రస్తావన తెస్తుంది మధురవాణి. "హెడ్ కనిష్టీబుకి మాత్రం కొంత నిజం చెబుదాం. అతగాడు ఇప్పుడే వస్తాడు" అంటుంది. "స్వాధీనుడేనా?" అని శాస్త్రి ప్రశ్నకి, "గులాం" అని జవాబిస్తుంది. ఇక చతుర్ధాంకంలో మాయగుంటకీ, లుబ్దావధాన్లుకీ జరిగే పెళ్ళిలో సందడంతా హెడ్ కనిష్టీబుదే. మధురవాణి హెడ్డుని తప్ప మరొకర్ని కన్నెత్తి చూడలేదు. బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకుని బతిమాలినా పాడక పోగా, హెడ్ కనిష్టీబుమీద విరగబడి నవ్వుతూ కబుర్లు చెప్పింది.

నాటకం పంచమాంకంలో మధురవాణి కంటెతో సహా మాయగుంట మాయమైపోయిన దగ్గర్నుంచీ నిజమైన పోలీసు డ్యూటీలో కి దిగుతాడు హెడ్ కనిష్టీబు. మొదట రామప్పంతులుతో కలిసి, ఖూనీ కేసని ఎత్తు ఎత్తి లుబ్దావధాన్లుని బెదరగొట్టి నాలుగు రాళ్లు లాగుతాడు. సారాయి దుకాణానికి తరచూ వచ్చే బైరాగి మహిమల మీద గుడ్డి నమ్మకం హెడ్డుకి. బైరాగిని కూడా సాక్షిగా వేసి, రెండు రాళ్లు ముట్టజెపుతాడు కూడా. సారాయి దుకాణంపు చర్చల్లో వితంతు వివాహాలని గట్టిగా సమర్థిస్తాడు. తీరా మాయగుంట కేసు అడ్డం తిరిగి,  అప్పటివరకూ తనకి అండగా ఉన్న ఇనస్పెక్టరు చీవాట్లు వేసేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోతాడు. మాయగుంటని వెతికి కోర్టులో ప్రవేశ పెట్టక తీరని పరిస్థితి వచ్చినప్పుడు తన ఆశలన్నీ బైరాగి మీదే పెట్టుకుంటాడు హెడ్ కనిష్టీబు.

బైరాగి దగ్గర మహిమలేవీ లేవనీ, అతడికి తెలిసిందల్లా సారాయి దుకాణాల్లో బాకీలు పెట్టి ఇంకో ఊరు పారిపోవడమే అనీ పెద్దగా చదువుకోని సారాయి దుకాణ దారుకి అర్ధం అవుతుంది తప్ప, ఎంతో కొంత చదువుకుని ప్రభుత్వంలో పోలీసు ఉద్యోగం చేస్తున్న హెడ్డు మాత్రం బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచోకీ కనిపెడతాడనీ, తనని కేసు నుంచి బయట పడేస్తాడనీ ఎదురు చూస్తూనే ఉంటాడు. "భాయీ! నీ రూపాయలు నేనిస్తాను. తెలివిమాలిన మాటలాడకు. గురువు గారికి కళ్ళు మొయ్యా ఆగ్రహవొస్తే మనం మండిపోతాం," అంటాడే తప్ప, బైరాగి మహిమలు నిజమే అయితే, సారాయి దుకాణ దారుడికి బాకీ పడాల్సిన అగత్యం ఏమిటని ఆలోచించడు. పవనం బంధించి వాయువేగం మీద ప్రయాణం చేసే శక్తి బైరాగికి ఉందనడంలో హెడ్ కనిష్టీబుకి ఏ సందేహమూ లేదు.

శత్రువులకు వాగ్బంధం చేస్తానని మాటిచ్చిన బైరాగి, "యినస్పెక్టరుకి మీ మీద యిష్టవని చెప్పేవారే?" అని గుర్తుచేసుకుంటాడు. "ఈ పెద్ద వుద్యోగస్తులకి దయలూ దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ?వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కారక్టు వొస్తుందనిగాని, ప్రమోషను వొస్తుందనిగాని ఆశ పుట్టినప్పుడు తెగని కత్తితో పీకలు తెగ గోస్తారు. మా యినస్పెక్టరుకి సూపరెంటు పని కావాలని ఆశుంది. తాసిల్దారికీ వాడికీ బలవద్విరోధం వుంది. ఆ విరోధం మధ్య నన్ను కొట్టేస్తూంది," అంటూ అధికార్ల గుట్టు విప్పుతాడు హెడ్ కనిష్టీబు. బైరాగి అంజనం వేసి మాయగుంట ఆచోకీ కనిపెడతానని హామీ ఇవ్వగానే, "అది మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా భాయీ?" అని అడుగుతాడు. మధురవాణి 'కొంత నిజం' చెప్పింది కదా మరి.

"యవిడెన్సు యాక్టులో అంజనాలు, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా?" అని గిరీశం నిలదీస్తే కూడా, "ఆ బైరాగిని మీరెరగరు. ఆయన గొప్ప సిద్ధుడు. ఏం జెయ్యాలంటే అది చెయ్యగల్డు. అతడు పక్కని వుంటే నాకు కొండంత ధైర్యం వుండేది" అని వాపోతాడే తప్ప రెనో ఆలోచన చేయడు హెడ్ కనిష్టీబు. సారాయి దుకాణ దారుని బైరాగి నుంచి బాకీ వసూలు చేసుకోనివ్వడు. యంతసేపూ బైరాగినీ, అతడు వేయబోయే అంజనాన్నీ నమ్ముకుని ఎదురు చూస్తాడే తప్ప, కేసు విచారణకి ఇంకా ఏమన్నా మార్గాలున్నాయా అనే ఆలోచనే రాదనికి. ప్రపంచంలోనే శక్తివంతమైన పోలీసు వ్యవస్థగా పేరున్న బ్రిటిష్ పోలీసు వ్యవస్థలో క్షేత్రస్థాయి పనితీరు మీద గురజాడ విసిరిన వ్యంగ్య బాణమే హెడ్ కనిష్టీబు పాత్ర అనిపిస్తుంది. ఇవాళ్టికీ ఈ వ్యవస్థలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం దురదృష్టకరం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి