సోమవారం, అక్టోబర్ 29, 2012

నిర్జన వారధి

"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది. మనసులో ఆమెకి నమస్కరించ కుండా ఉండలేక పోయాను. ఈమధ్య కాలంలో మళ్ళీ మళ్ళీ చదివిన ఆ పుస్తకం పేరు 'నిర్జన వారధి.' లోతైన, బరువైన కథనం.. పుస్తకం పేరులాగే.

'నిర్జన వారధి' చదవక మునుపు నాకు తెలిసిన కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త. పార్టీలో కొంతకాలం పనిచేసి, తర్వాత నక్సల్బరీ ఉద్యమంలోకి వెళ్ళిన కొండపల్లి సీతారామయ్య భార్య. ఈ రెండు పాత్రలూ ఆమె జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసి ఉంటాయో, ఎన్ని పరిక్షలు పెట్టి ఉంటాయో, ఎన్నెన్ని మలుపులు తిప్పి ఉంటాయో అన్న ఆలోచన ఎప్పుడూ కలగలేదు. అందుకే కావొచ్చు, ఈ పుస్తకం ద్వారా నాకో సరికొత్త కోటేశ్వరమ్మ పరిచయం అయ్యారు.

ఇద్దరు పిల్లలు పుట్టాక, కట్టుకున్న భర్త కారణం చెప్పకుండా వదిలేసినా, ఏ పార్టీ కోసమైతే తను ప్రాణాలకి తెగించి బలవంతపు గర్భ స్రావానికి సిద్ధ పడిందో ఆ పార్టీయే తనని వదులుకునే పరిస్థితులు వచ్చినా, తోడు నిలబడాల్సిన పిల్లలు, అండగా నిలిచిన కన్నతల్లి ఒకరి తర్వాత ఒకరుగా తన కట్టెదుటే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా...ఇవన్నీ తట్టుకుని నిలబడ్డమే కాదు, తనకంటూ ఓ జీవితాన్ని నిర్మించుకుని నిలదొక్కుకున్న మహిళ ఆమె.

కృష్ణా జిల్లా పామర్రులో ఓ సంప్రదాయ కుటుంబంలో 1920 లో జన్మించారు కోటేశ్వరమ్మ. ఆమె ఆమెకి ఓ తమ్ముడు. తండ్రికి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం ఉండేది. చదువుతో పాటు, ఆటపాటల్లో చురుగ్గా ఉండే ఆమెకి తానో బాల వితంతువుననే విషయం యవ్వనారంభంలో తెలిసింది. ఆమెకి పునర్వివాహం చేయాలన్న తల్లిదండ్రుల తలంపుకి స్నేహితుల ప్రోత్సాహం, బంధువుల విమర్శలు వీటన్నింటినీ ఏక కాలంలో గమనించింది. అంతే కాదు, అటు గాంధీ మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమాన్ని కళ్ళారా చూసి, తన నగలని మహాత్ముడికి సమర్పించడంతో పాటు, ఇటు కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.


సీతారామయ్య తో వివాహం జరిగాక, అతని ప్రోత్సాహంతో, అత్తమామల ఇష్టానికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన కోటేశ్వరమ్మ, కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఇద్దరు పిల్లలు కలిగాక, పార్టీ కార్యకలాపాల మీద ప్రభుత్వం నిషేధం విధించిన సందర్భంలో, పార్టీ ఆదేశాల మేరకు పిల్లలని తన తల్లి రాజమ్మ దగ్గర వదిలి అజ్ఞాత జీవితం గడిపారు. పార్టీ ఆదేశం మేరకే గర్భం వద్దనుకుని, మృత్యువుతో పోరాడి గెలిచారు.

పార్టీ మీద ఉన్న నిషేధం తొలగే సమయానికి ఆమె వ్యక్తిగత జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. సీతారామయ్య జీవితంలో మరో స్త్రీ ప్రవేశించడం, అతను పార్టీకి దూరం జరగడం, సిద్ధాంత పరమైన కారణాలతో పార్టీ రెండు ముక్కలు కావడం దాదాపు ఒకేసారి జరిగిన సంఘటనలు. ఆ కష్ట కాలంలో, అప్పటి వరకూ కలిసి పనిచేసిన పార్టీ సహచరులతో కూడా రహస్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి. సీతారామయ్య సొంత పార్టీ నిర్ణయం ఒకపక్కా పార్టీ లో చీలిక మరోపక్కా... ఈ రెండూ ఆమెకి సంబంధం లేని విషయాలే అయినా, ఆమె జీవితం మీద ఇవి చూపిన ప్రభావం మాత్రం తక్కువది కాదు.

పిల్లలని తల్లి సంరక్షణలో ఉంచి, ముప్ఫై ఐదేళ్ళ వయసులో ఆంద్ర మహిళా సభలో చేరి చదువు నేర్చుకుని, అటుపై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్న కోటేశ్వరమ్మ ఆ తర్వాత ఎదుర్కొన్న ఆటుపోట్లూ తక్కువవి కావు. కొన్ని కొన్ని సంఘటనలు చదువుతుంటే "అసలు వీటిని తట్టుకుని ఈమె ఎలా నిలదొక్కుకో గలిగారు?" అన్న సందేహం కలగక మానదు. తన కథ మొత్తాన్నీ ఎంతో ప్రశాంతంగా చెప్పారు కోటేశ్వరమ్మ. ఎక్కడా, ఎవ్వరినీ తూలనాడలేదు. కారణం ఏమీ చూపకుండానే తనని నడి రోడ్డున వదిలేసిన భర్తని గురించీ, పార్టీని గురించీ చెప్పినప్పుడూ, తన సంసార జీవితంలో ప్రవేశించిన మూడో వ్యక్తిని గురించి ప్రస్తావించి నప్పుడూ అదే సంయమనం.

"మగవాళ్ళు అందరూ ఒకటే. కానీ పార్టీలో మగవాళ్ళు మిగిలిన వాళ్ళ కన్నా కొంచం నయం" అని చెప్పినా, సీతారామయ్య కి కేవలం 'ఉద్యమ సహచరుడి' గానే కడపటి వీడ్కోలు ఇచ్చినా వాటన్నింటి వెనుకా ఉన్నవి ఆమె అనుభవాలే అని సులభంగానే బోధ పడుతుంది. కోటేశ్వరమ్మ తర్వాత అంతగా ఆకట్టుకునే మరో వ్యక్తి ఆమె తల్లి రాజమ్మ గారు. బాల వితంతువైన కూతురు లోకం బాధ పడలేక బొట్టూ పూలూ తీసేస్తే, ఆమె కోసం పునిస్త్రీ అయి ఉండీ తను కూడా వాటిని త్యజించడం మొదలు, సిద్ధాంతాలు ఏవీ తెలియక పోయినా తను దాచుకున్న కొద్దిపాటి మొత్తాన్ని మరణానంతరం పార్టీకి చెందేలా చేయడం వరకూ...ఆమె చేసిన ప్రతి పనీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

'నిర్జన వారధి' కేవలం కోటేశ్వరమ్మ ఆత్మకథ మాత్రమే కాదు, గడిచిన తొంభై ఏళ్ళలో ఆంధ్ర దేశంలో జరిగిన అనేక ఉద్యమాలని, సమాజంలో వచ్చిన మార్పులనీ ఆ మార్పులు రావడం వెనుక కారణాలనీ ఆవిష్కరించే పుస్తకం. జీవితం పట్ల భయాలు ఉన్న వాళ్లకి కావలసినంత ధైర్యాన్ని అందించే పుస్తకం. కాల పరీక్షలకి తట్టుకుని నిలబడి, జీవితంతో పోరాడి గెలిచిన ఓ యోధురాలి స్పూర్తివంతమైన గాధ. తొలి ప్రచురణ జరిగిన నెల రోజులకే మలి ప్రచురణ పనులు మొదలైన పుస్తకం ఇది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'నిర్జన వారధి' (పేజీలు 179, వెల రూ. 100) అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

10 వ్యాఖ్యలు:

 1. కొందరి జీవితాలు మేరు పర్వతాన్ని గుర్తుచేస్తాయంటారు, ఇలాంటివారి గురించే కాబోలు ఆ అనడం!! పుస్తకం పేరులోనే గంభీరత, ఉదాత్తత కలిసి ఉన్నాయి.. ఎవరెవరిని/వేటిని కలపడానికి వేసిన వారధో మరి జనరహితమైందనా!? మీ సమీక్ష చదువుతూనే మనసు నిశ్శబ్దమైపోయింది.. ఒక స్పూర్తిభరితమైన జీవితాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సమీక్షలు చదువుతుంటేనే చాలా ఇంట్రస్టింగ్‍గా అనిపిస్తున్నాయి. వీలయినంత తొందరలో పుస్తకం కొని చదవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు


 3. "జీవితం పట్ల భయాలు ఉన్న వాళ్లకి కావలసినంత ధైర్యాన్ని అందించే పుస్తకం. కాల పరీక్షలకి తట్టుకుని నిలబడి, జీవితంతో పోరాడి గెలిచిన ఓ యోధురాలి స్పూర్తివంతమైన గాధ."

  వాచవి చూడగానే అర్ధమయిన విషయం ఇదేనండీ.. ఆసక్తికరంగా ఉంది. తప్పక చదవాలనిపిస్తోంది. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీరు ఎవరైనా నవలా నాయికల గురించి రాసినప్పుడు నేను పెద్దగా ఆసక్తి చూపను. నవలలను ఎప్పుడూ చదవకపోవడమే కారణం కావచ్చు. మొదట టపా చూసి అలానే పక్కకెళ్లాను. అలాచేసి ఒక గొప్పస్త్రీమూర్తిని గురించి తెలుసుకునే అవకాశం ఆలస్యం చేసుకున్నాను.

  ప్రతిభారత స్త్రీలోనూ సీత, సావిత్రి, ద్రౌపది అంశలుంటాయని ఊరికే అనలేదండీ పెద్దవాళ్ళు. ఇలాంటివాళ్ళను చూశాకే ఆఅభిప్రాయానికి వచ్చుంటారు. ఏమాత్రం అవకాశం వచ్చినా తప్పకుండా చదవాలి ఈపుస్తకాని. ఇంత మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @నిషిగంధ: "మీ సమీక్ష చదువుతూనే మనసు నిశ్శబ్దమైపోయింది.. " ...పుస్తకం చదువుతున్నప్పటి నా స్థితి కూడా ఇదేనండీ... ధన్యవాదాలు.
  @ఒరెమున: ధన్యవాదాలండీ...
  @శిశిర: తప్పక చదవండి శిశిర గారూ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @కొత్తావకాయ: ఏమాత్రం అవకాశం ఉన్నా చదవండి... ధన్యవాదాలు.
  @శ్రావ్య: ధన్యవాదాలండీ...
  @సుబ్రహ్మణ్య చైతన్య: సీత, సావిత్రి, ద్రౌపది మాత్రమె కాదండీ, ఇంకా చాలా మంది స్త్రీమూర్తులు కనిపిస్తారు.. తప్పక చదవండి పుస్తకం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. chaalaa goppa review. hat off to u muralijee! kanta tadi pettinchina review idi.
  bhasker koorapati.

  ప్రత్యుత్తరంతొలగించు