మంగళవారం, సెప్టెంబర్ 12, 2017

బుచ్చమ్మ

"నాన్నా, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్లి చెయ్యండి గాని దానికి కొంప ముంచి లుబ్ధావధాన్లుకి యివ్వొద్దు.." అత్యంత కోపిష్టీ, మూర్ఖుడూ అయిన తండ్రి ఎదుట నిలబడి బుచ్చమ్మ చెప్పిన మాట ఇది. ఇక్కడ "నా సొమ్ము" అంటే, భర్త మరణించిన తర్వాత ఆమెకి అత్తింటి నుంచి మనోవర్తిగా వచ్చిన సొమ్ము. తమ్ముడు వెంకటేశం చదువు ఆగిపోవడం ఆమెకి ఇష్టం లేదు. అలాగని, ఆ చదువు కోసం చెల్లెలు సుబ్బికి వృద్ధుడైన లుబ్ధావధాన్లుతో పెళ్లి జరగడం అంతకన్నా ఇష్టం లేదు. తలచెడి పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల బతుకెంత దుర్భరమో ఆమెకి అనుభవపూర్వకంగా తెలుసు. చెల్లిలికా స్థితి రానివ్వకూడదని తాపత్రయం. అందుకోసం, తన జీవితం మొత్తానికి ఆధారమైన సొమ్ముని వదులుకోడానికి సిద్ధపడింది.

'కన్యాశుల్కం' నాటకంలో ఉదాత్తమైన పాత్రల గురించి మాట్లాడేటప్పుడు బుచ్చమ్మ ఆట్టే ప్రస్తావనకు రాదెందుకో. ఆమెని ఒక అమాయకురాలిగా గుర్తిస్తారే తప్ప, ఆమెలోని ఉదాత్తత చర్చకు రాదు. ఇంతకీ బుచ్చమ్మ మాటని ఆ తండ్రి పూర్తిగా విననేలేదు. పెరుగూ అన్నం తింటున్నవాడల్లా అదాటున లేచి, ఆ విస్తరి ఆమె నెత్తిన రుద్దేశాడు. ఆమె మేనమామ అడ్డుపడబోతే అతగాడి నెత్తిన చెంబుడు నీళ్లు గుమ్మరించాడు. తన ఆలోచనని తండ్రి వినిపించుకోడని తెలిసీ ప్రయత్నం మానుకోలేదు తల్లిదండ్రుల చాటు అమాయకపు పల్లెటూరి పిల్ల బుచ్చమ్మ. ఆ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే ఆమెని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు గిరీశం, క్రిస్మస్ సెలవుల్లో వెంకటేశానికి చదువు చెప్పడానికి పట్నం నుంచి కృష్ణరాయపురం వచ్చిన మాస్టారు.

గిరీశం చెప్పే కబుర్లని తెల్లబోయి వింటుంది బుచ్చమ్మ. తండ్రి, తమ్ముడు, మేనమామ వినా ఆమె మాట్లాడిన మరో మగవాడు గిరీశం. అతగాడు మొదలే కబుర్ల పుట్ట. పైగా బుచ్చమ్మ మీదా, ఆమె సొమ్ముల మీదా కన్నేసిన వాడు. అందుకే ఆమె ఒంటరిగా దొరికే అవకాశం కోసం ఎదురుచూస్తూ, దొరికినప్పుడల్లా మామూలు విషయాలతో ఆరంభించి, ప్రేమ కబుర్లు, పెళ్లి కబుర్లు చెప్పి, విధవా వివాహం శాస్త్ర సమ్మతమని ఒప్పిస్తాడు. అప్పుడు కూడా, "మా నాస్తం రాంభొట్లు గారి అచ్చమ్మ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడుతానంది" అనే అంటుంది తప్ప, గిరీశాన్ని తాను పెళ్ళాడవచ్చునన్న ఆలోచన రాదు బుచ్చమ్మకి. వితంతువు కాబట్టి మిగిలిన జీవితం అంతా పుట్టింట గడపాలి తప్ప రెండో ఆలోచన చేయకూడదన్న పెద్దల మాటకి కట్టుబడిన యువతి ఆమె.

"తమ్ముడూ గిరీశం గారు గొప్పవారట్రా?" అని అక్క అడిగినప్పుడు, గిరీశానికి ప్రియశిష్యుడిగా వెంకటేశం కూడా తన గురువుగారి  గొప్పదనం గురించి అక్కయ్యకి పెద్ద లెక్చరు దంచుతాడు. "అయితే గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమి?" అన్న బుచ్చమ్మ ప్రశ్నలో ఒకింత అమాయకత్వము, దానితో పాటే చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగం కావాల్సిందే అన్న లోకరీతి ధ్వనిస్తాయి. "తమ్ముడూ, వెధవలు పెళ్ళాడ్డం మంచిదంటారు కదా, ఆయనెందుకు పెళ్లాడారు కార్రా?" అన్న ప్రశ్నలో కేవలం కుతూహలం మాత్రమే ఉందా అంటే చెప్పడం కష్టం. వెంకటేశం "నాన్న తన్నకుండా ఉంటే" వితంతువుని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు లోపల ఎంతగానో సంతోషించి ఉంటుంది బుచ్చమ్మ.

అమాయకంగా అనిపించినప్పటికీ, బోళా మనిషి కాదు బుచ్చమ్మ. అందుకే గిరీశం ఇచ్చకాలని విని ఊరుకుంటుందే తప్ప, అతగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకూలంగా జవాబు చెప్పదు. పుట్టింట్లో జీవితం కష్టంగానే ఉన్నా, ఎక్కడా ఆ మాటని పెదవి దాటనివ్వదు. "డబ్బుకాశించి ముసలి పెళ్లిళ్లు చేసే పెద్దవాళ్లది తప్పు" అని గిరీశం తన తల్లిదండ్రులని తప్పు పట్టినప్పుడు కూడా "నాకు తెలియదు" అంటుంది తప్ప అంతకుమించి మాట్లాడదు. "మాటవరసకు మనిద్దరం పెళ్లాడామే అనుకో.." అంటూ ఆరంభించిన గిరీశం మేడా, బండి, పిల్లలు, సరుకు జప్పరా అంటూ ఓ రంగురంగుల కలని ఆమె ముందుంచినప్పుడు కూడా ఏమీ మాట్లాడకుండా వింటుంది. "అప్పుడు మన వెంకటేశం మన దగ్గరే ఉండి చదువుకుంటాడు" అన్నప్పుడు మాత్రం, "అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా, అమ్మా వాడి చదువుకోసం దెబ్బలాడ్రు" అని మాత్రమే అంటుంది.

ఇన్ని అస్త్రాలూ తిరిగి వచ్చేసిన తర్వాత, గిరీశం ప్రయోగించిన చివరి అస్త్రం, బుచ్చమ్మ  తనతో లేచిపోయి వచ్చేస్తే సుబ్బి పెళ్లి ఆగిపోతుంది అని. బుచ్చమ్మ లేచిపోవడం వల్ల గడబిడ జరిగి పెళ్లి ఆగుతుందని, అటు లుబ్దావధాన్లుకి, ఇటు అగ్నిహోత్రావధాన్లుకి కూడా బుద్ధి వచ్చి మళ్ళీ బాల్య వివాహం అన్న మాట తలపెట్టరనీ ఆమెని నమ్మించ గలుగుతాడు గిరీశం. తన సుఖం కోసం కన్నా, చెల్లెలికి బాల్య వివాహం తప్పిపోతుందన్న కారణానికి మాత్రమే గిరీశంతో వెళ్లిపోవడానికి ఒప్పుకుంటుంది బుచ్చమ్మ. గిరీశం నిజరూపం తెలిసిన తర్వాత, బుచ్చమ్మ గారికి చదువు చెప్పించే ఏర్పాటు చేయాలనీ, చదువుకున్నాక ఆమె భవిష్యత్తు ఆమె నిర్ణయించుకుంటారనీ అంటాడు సౌజన్యారావు పంతులు. గిరీశంతో పెళ్లి తప్పిపోవడం బుచ్చమ్మని బహుశా బాధించి ఉండదు. అంతకన్నా, చెల్లెలి పెళ్లి తప్పిపోయిన ఆనందాన్ని ఆమె ఎక్కువగా అనుభవించి ఉంటుంది.

2 కామెంట్‌లు:

  1. "తమ్ముడూ..అమ్మ కాళ్ళు కడుక్కోమంఛోందిరా" అంటూ ప్రవేశించిన బుచ్చెమ్మ అందానికి స్త్రీలోలుడైన గిరీశం "వాట్ ఈమె నీ సిస్టరా? తల చెడ్డట్టు కనిపిస్తోందే.." అంటూ ఆశ్చర్యపోతాడు..
    "మధురవాణి ఒఠ్ఠి గాజుబొమ్మ..ఈ బుచ్చమ్మ ప్యూర్ డైమండ్..ఇన్నాళ్ళు ఆ మధురవాణి మాయలో పడి వట్టి యాస్ నైపోయాను" అంటూ బాధపడిపోతుంటాడు..
    అయితే అప్పటికే రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం పంతులుగారు స్త్రీలకు పునర్వివాహం చేయిస్తూ అనేక విధవ స్త్రీలకు చదువుకునే అవకాశం వారిని వివాహం చేసుకునే వారికి 200 రూపాయలు ధనసహాయం చేసేవారు..ఈ నాటకంలో ఆ ప్రస్తావన చాలా చోట్ల వచ్చి చివరకు బుచ్చమ్మ బండి దారిమళ్ళిస్తాడు..
    ఇంటికో బుచ్చమ్మ నిజజీవితంలో ఉండబట్టే కన్యాశుల్కం నాటకం ఆవిర్భవించింది..బ్రాహ్మణ్య కుటుంబ భాష ఈ కుటుంబం ద్వారా ఆశ్వాదించవచ్చు..కొన్ని పదాలకు అర్థం అందదు..

    రిప్లయితొలగించండి
  2. @Voleti: 'కొన్ని పదాలకు అర్ధం అందదు' ...కొన్నాళ్ల క్రితం వరకూ నాకూ ఇదే ఇబ్బంది ఉండేదండీ. 'కన్యాశుల్కం' అభిమాని మందలపర్తి కిషోర్ గారు 'కన్యాశుల్కం పలుకుబడి' పేరుతో ఒక నిఘంటువు తెచ్చారు రైతునేస్తం పబ్లికేషన్స్ వారు రెండేళ్ల క్రితం ప్రచురించిన ఈ పుస్తకంలో, నాటకం రెండు కూర్పుల నుంచీ (పీఠికలతో సహా) అర్ధం అందని పదాలకి సవివరంగా అర్ధ వివరణ ఇచ్చారు. దీనితో పాటు, విదేశీ పదాలు, పలుకుబళ్ల సమాచారం, బేస్తు పేకాట నియమ నిబంధనలు లాంటి విశేషాలు అదనం. మనలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడే కృషి. విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతోంది ఈ పుస్తకం. మీరన్న "ఇంటికో బుచ్చమ్మ" అక్షరాలా నిజమండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి