మంగళవారం, సెప్టెంబర్ 19, 2017

వెంకటేశం

వెంకటేశానికి చెగోడీలంటే మహా ఇష్టం. గేదె పెరుగన్నా, జామపళ్ళన్నా కూడా ఇష్టమే. గొట్టికాయలు, కోతిపిల్లి కర్ర ఆటల్లో వెంకటేశాన్ని కొట్టేవాడు లేదు. వీటన్నింటికన్నా పొగచుట్టలు కాల్చడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కృష్ణరాయపురం వాసి అగ్నిహోత్రావధానులు కొడుకు వెంకటేశం. తండ్రిలా సంస్కృతం కాకుండా, పట్నంలో ఉండి ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. అసలే ఇంగ్లీషు చదువులు దేశంలో ప్రవేశించిన కొత్త రోజులు కదా, పైగా వేంకటేశానికి చిల్లర ఖర్చులు జాస్తి. అందుకే, అతగాడి చదువు ఖర్చు తడిపి మోపెడవుతోంది తల్లిదండ్రులకి. ఇక ఆ చదువేదో అయ్యీ అవ్వడంతోనే అతగాడికి పెళ్ళిచేయక తీరదు కదా. పెళ్లంటే 'కన్యాశుల్కం' తో వ్యవహారం. చదువుకీ ఖర్చు చేసి, పెళ్ళికీ డబ్బు ఖర్చు పెట్టాలంటే మాటలు కాదు. అందుకే వెంకటేశానికి ఖర్చు లేకుండా పెళ్లయ్యే మార్గం ఆలోచించాడు అగ్నిహోత్రావధానులు.

కిందటేడు పరీక్ష ఫెయిలయిన వెంకటేశం ఈమారైనా పాసయినాడో లేదో అని సందేహం అవధాన్లుకి. తండ్రి సందేహాన్ని నిజం చేస్తూ పరీక్ష తప్పాడు వెంకటేశం. ఆమాట చెబితే తండ్రి అగ్గి రావుడైపోతాడని బాగా తెలుసు. కాబట్టే, తనకి అప్పుడప్పుడూ చదువు చెబుతూ ఎప్పుడూ లెక్చర్లిచ్చే గురువు గిరీశాన్ని కూడా తన వెంట ఊరికి తీసుకెళ్లాడు. అక్కడ, తల్లిదండ్రులు, మేనమామ సమక్షంలో జరిగే 'కుమార విద్యా ప్రదర్శన' లో వేంకటేశం చదువుల సారం ఏమిటన్నది తేటతెల్లమవుతుంది. చదువుకే కాదు, పొగచుట్టలు కాల్చడంలో కూడా గిరీశమే గురువు వెంకటేశానికి. ఆ చుట్టలు కొనుక్కోడానికి డబ్బు ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, గురువు గారు చెప్పిన పుస్తకాల జాబితా తయారు చేస్తాడు శిష్యుడు, 'కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్' తో సహా.

ఇంతకీ వెంకటేశానికి ఖర్చు లేకుండా పెళ్లయ్యే మార్గం ఏమిటి? అతని చెల్లెలు సుబ్బిని, రామచంద్రపురం వాసి లుబ్ధావధాన్లుకిచ్చి పెళ్లి చేసి, తద్వారా వచ్చే పద్ధెనిమిది వందల రూపాయల కన్యాశుల్కంతో వెంకటేశానికి పెళ్ళిచెయ్యడం. ఇదిగో, ఈ సుబ్బి పెళ్లే 'కన్యాశుల్కం' నాటకానికి మూల కథ, ఆ పెళ్ళికి ప్రధాన కారకుడు వెంకటేశం. అంతేకాదు, గిరీశం ఇచ్చకాలు చెప్పి లేవదీసుకుపోయిన వితంతువు బుచ్చమ్మ, వెంకటేశానికి స్వయానా అక్కగారు. పరీక్ష ఫెయిలయి పల్లెకి వచ్చినా చదువు మీద ఏమాత్రం ఖాతరీ లేదు వెంకటేశానికి. ఇటు సంస్కృతమూ, అటు ఇంగ్లీషూ కూడా అంతంత మాత్రమే. 'నలదమయంతులిద్దరు' పద్యం చెప్పగలడు కానీ, అర్ధం తెలీదు. ఇక ఇంగ్లీష్ అయితే 'దేరీజే వైట్ మాన్ ఇన్ ది టెంట్' మొదలు 'నౌన్స్ ఎండింగ్ ఇన్...' వరకూ గళగ్రాహిగా మాట్లాడేస్తాడు. ఎటొచ్చీ, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళెవరూ దగ్గరలో ఉండకూడదు.

గిరీశం లెక్చర్లకి తప్పనిసరి శ్రోత వెంకటేశం. అతగాడి కవిత్వానికి ప్రధమ పాఠకుడు కూడా. చుట్ట కాల్చడంతో పాటుగా, 'పొగచుట్టకి సతిమోవికి..' లాంటి పద్యాలూ పట్టుబడ్డాయంటే అదంతా గిరీశం తరిఫీదు మహత్యం. ఇతగాడి చదువు ఇలా ఉంటూ ఉండగా, రెండు మూడేళ్ళలో సర్కారీ నౌకరీ అయిపోతుందని తల్లిదండ్రుల ఆశ, వెంకడు ఇంగ్లీష్ చదువు చదివేస్తున్నాడని మహేశం లాంటి సావాసగాళ్ళ అసూయ, తమ్ముడి చదువు కోసమే తల్లీతండ్రీ గొడవలు పడుతున్నారన్న బుచ్చమ్మ అమాయకత్వం.. ఇవన్నీ ఆ చదువుని గురించి చుట్టూ ఉన్న వాళ్ళ స్పందనలు. చదువుకయ్యే ఖర్చుతో కానీ, గొడవలతో కానీ ఏమాత్రం నిమిత్తం లేని బలాదూర్ కుర్రాడు వెంకటేశం. 'అక్కడిదాకా వచ్చినప్పుడు చూసుకుందా' అనుకునే రకమే తప్ప బాధ్యతా, భయమూ బొత్తిగా కనిపించవు.

ఇంగ్లీష్ చదువు అని గొప్పగా అనుకోడం తప్ప తల్లిదండ్రులకి ఆ చదువుని గురించి ఏమీ తెలియకపోవడం, గురువు గిరీశానికి కూడా చదువు చెప్పడం కన్నా ఇతరేతర విషయాల మీదే ఆసక్తి మెండవ్వడం వల్ల వెంకటేశం చదువు గుంటపూలు పూస్తోంది. "మా నాన్న నాకూ పెళ్లి చేస్తాడు" అని సంబరంగా గిరీశానికి చెబుతాడు వెంకటేశం. పెళ్ళిలో పెళ్ళికొడుకు ప్రత్యేకంగా చూడబడతాడన్నది తప్ప ఇంకేమీ ఆలోచించి ఉండడు బహుశా. అగ్నిహోత్రావధానులు కొడుకు, అందునా ఇంగ్లీషు చదువుకుంటున్న వాడు, కాబట్టి మనుషులంటే బొత్తిగా లెఖ్ఖ లేదు వెంకటేశానికి. ఆడవాళ్ళ మీద అతడి ప్రతాపం చూడాల్సిందే. "గిరీశం గారు సురేంద్రనాధ్ బెనర్జీ అంతటి వారు" అని బుచ్చమ్మకి చెప్పిన వెంకటేశం, "ఆయనెవరురా?" అన్న ప్రశ్నకి, "అయన అందరికన్నా గొప్పవాడు" అని ఒక్కముక్కలో తేల్చేస్తాడు తప్ప, తనకీ తెలీదని ఒప్పుకోడు.

గిరీశం, బుచ్చమ్మని తన దారికి తెచ్చుకోడానికి వెంకటేశాన్నే ఉపయోగించుకుంటాడు. బుచ్చమ్మ ఎదురుగా, వితంతు వివాహాలని గురించి వెంకటేశానికి లెక్చరు దంచి, ఆమెని దారికి తెచ్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తాడు. సుబ్బి పెళ్ళికి యావత్ కుటుంబమూ రామచంద్రపురం ప్రయాణమైనప్పుడు, వెంకటేశాన్ని బుచ్చమ్మ బండిలో ఎక్కిస్తారు. ఓ రాత్రి వేళ వెంకటేశం బండి నుంచి ఏనుగు మీదకి మారతాడు. గిరీశం ఆ బండిలోకి మారి రామవరం దారి పట్టించేస్తాడు. తెల్లారి లేచి, కూతురుతో పాటే నగలపెట్టి, కోర్టు కాగితాలు కూడా ఆ బండిలో ఉండిపోయాయని అగ్నిహోత్రావధానులు గుండెలు బాదుకుంటూ ఉంటే, "అక్కయ్య పెట్టెలో నా పుస్తకాలు కూడా పెట్టాను" అంటాడు వెంకటేశం, కొత్త పుస్తకాలు కొనే వరకూ చదువు బాధ తప్పిందని సంతోషించి ఉంటాడు బహుశా. "ఈ గాడిదకొడుకు యింగిలీషు చదువు కొంప ముంచింది" అని నెపాన్నంతా కొడుకు చదువు మీదకి నెట్టేస్తాడు అగ్నిహోత్రావధానులు.

ఈకాలం పిల్లలంతా బొత్తిగా కెరీర్ ఓరియంటెడ్ అయిపోయినా, వెంకటేశాలు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు, కాదంటారా?

6 వ్యాఖ్యలు:

 1. >> గిరీశం ఇచ్చకాలు చెప్పి లేవదీసుకుపోయిన వితంతువు మీనాక్షి, వెంకటేశానికి స్వయానా అక్కగారు.

  This is wrong. Bucchamma not meenakshi. Pls correct.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి గారు బుచ్చమ్మ అనే రాసారు కదండీ డి జి గారూ..!
  మురళి గారూ.. మొత్తానికి కన్యాశుల్కాన్ని జలకడిగేస్తున్నారు. కన్యాశుల్కం అనే అగాధమౌ జలనిదిలోంచి ఎన్నో ఆణిముత్యాల్ని వెలికి తీస్తున్నారు.ఎదో పూనకం ఆవహించినట్టు రోజూ ఒక పోస్ట్ పెట్టడం నిజంగా అభినందనీయం.
  మధురవాణి గురించి బాగా రాసారు. మధురవాణి నవ్వుని ప్రస్తావిస్తారనుకున్నాను. అయినా కొండని అద్దంలో చూపించారు. ఇప్పుడు కన్యాశుల్కం మా కాళ్ళ తెరముందు శాశ్వతంగా నిలిచిపోయింది, మీ ఈ పత్రాల పరిచయలవాల్. మరోసారి మిమ్మల్ని అభినందిస్తూ..
  మిత్రుడు, మీ రచనల గాఢ అభిమాని..
  -భాస్కర్.కే.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @DG: Corrected, thank you
  @భాస్కర్: ఒకచోట 'మీనాక్షి' అని తప్పు పడిందండీ.. డీజీ గారి కామెంట్ చూసి సరిచేశా.. మధురవాణి నవ్వుని మాటల్లో పెట్టలేననిపించి ఆ ప్రస్తావన తేలేదు.. 'కన్యాశుల్కం' ని జలనిధి అనడం కన్నా, ఆణిముత్యాల పేటిక అనడం సబబేమోనండీ.. పుస్తకం చదివితే చాలు, ఆణిముత్యాలు దొరికేస్తాయి, కష్ట పడక్కర్లేకుండా.. మీ అభిమానానికి కృతజ్ఞతలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పైన గణేష్ "కన్యా షుల్కం పాటలు" అన్నారు. కన్యాశుల్కం నాటకంలో శిష్యుడు పాడిన ఏవో తత్వాలు తప్ప పాటలేమున్నాయండీ మురళి గారూ? 🤔

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @గణేష్: ధన్యవాదాలండీ
  @విన్నకోట నరసింహారావు: నేను 'పాఠాలు' అని చదువుకున్నానండీ.. ఆ వ్యాఖ్య భాస్కర్ గారిని ఉద్దేశించి అని నా అనుకోలు.. ..ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు