శనివారం, సెప్టెంబర్ 09, 2017

పూజారి గవరయ్య

ఎంతటి పిశాచన్నైనా పట్టి బంధించే సత్తా, నేర్పూ ఉన్న మాంత్రికుడు పూజారి గవరయ్య. లుబ్ధావధాన్లు పెళ్లాడింది మనిషిని కాదు కామినీ పిశాచాన్ని అని చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని భర్త సహితంగా సీసాలో బంధించిన ప్రజ్ఞాశాలి. రామచంద్రపురం అగ్రహారపు సిద్ధాంతికి చేదోడు వాదోడుగా ఉండడమే కాదు, ఊరూ పేరూ లేని బైరాగి మాయారూపంలో సంచరిస్తుంటే చనువుగా మాట్లాడగల శక్తి కూడా గవరయ్యకే ఉంది. అలాగని నిత్యం క్షుద్ర పూజల్లో మునిగి తేలుతూ ఉంటాడనుకుంటే పొరపాటే. శుద్ధ లౌకికుడు. అగ్రహారీకులందరితో కలిసి మధురవాణి పేకాడుతుంటే, ఒక్కొక్కరిమీదా ఆశువుగా కవిత్వం చెప్పగల సరసుడు. సమయానికి తగు మాటలాడడం గవరయ్యకి వెన్నతో పెట్టిన విద్య.

'కన్యాశుల్కం' నాటకం చతుర్ధాంకంలో లుబ్దావధాన్లుకి గుంటూరు శాస్తుర్లు కూతురితో (మాయగుంట) పెళ్లి జరిగిన ఉత్తర క్షణమే కథలోకి ప్రవేశిస్తాడు గవరయ్య. నాలుగ్గడియల పొద్దుకు లగ్గం కాబట్టి, లౌక్యుల్ని పిలుచుకు రావడానికి పెద్దిపాళెం బయల్దేరతాడు పెళ్లిపెద్ద రామప్పపంతులు. అతగాడు అటు వెళ్ళగానే పాంచరాత్ర వివాహం కాస్తా ఏకరాత్రానికి మారిపోడంతో పాటు, ముహూర్తం కూడా 'నాలుగ్గడియల రాత్రి ఉందనగా' కి ముందుకి జరుగుతుంది. ఇంకేముంది, పంతులు తిరిగొచ్చేసరికి కొత్తజంట పసుపు బట్టలతో కూర్చుని ఉంటుంది. అప్పుడు అద్దుమాలిన కోపంతో చిందులేసే రామప్పంతులుని శాంతింప జేసింది గవరయ్యే. అంతేనా, కొత్తజంట రామప్పంతులు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అందుకునేలా చేస్తాడు కూడా. అల్లుడి (రామప్పంతులు) కాళ్ళకి మావగారి (లుబ్దావధాన్లు) చేత మొక్కించిన చమత్కారి గవరయ్య.

"తమరు ఏదో వ్యవహారాటంకం చేత రాజాలినారు కారనుకున్నాం. తాము లేకపోవడం చేత సభ సొగసే పోయింది," అని  "నియ్యోగి లేని సావిడి అయ్యాయో అది వట్టి రోత - అది యెట్లన్నన్" అంటూ పద్యం అందుకోబోతాడు. అంతేకాదు, "పంచాంగం మార్చడానికి ఎవడి శక్యం బాబూ?" అంటూనే ముహూర్తానికి పంతులు లేకపోవడం చేత పెళ్ళికొడుకు లుబ్దావధాన్లు, మేజువాణీ చేయాల్సిన మధురవాణి ఎంతగా తల్లడిల్లారో వర్ణించడం మొదలు పెడతాడు. "అట్టే పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడిబొమ్మ లాగ నిల్చుందిగాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు ఎంత బతిమాలుకున్నా పాడింది కాదు," అంటూండగానే, కొండుభొట్లు అందుకుని, మధురవాణి అంతసేపూ హెడ్డు కనిస్టీబుతో కబుర్లు చెప్పిందని రహస్యం బయటపెట్టి భవిషం తీసేస్తాడు. గవరయ్య ఏమాత్రం తడుముకోకుండా ఆ మాట్లాడింది కూడా పంతులు యోగక్షేమం గురించే అని కవిత్వం పన్నేస్తాడు.

పంచమాంకంలో మాయగుంట లుబ్దావధాన్లు ఇంట్లో నుంచి మాయమైపోయే సమయానికి, మధురవాణి ఇంట్లో పేకాట కాలక్షేపం చేస్తూ ఉంటాడు గవరయ్య. భుక్త, పోలిశెట్టి, మధురవాణి, సిద్ధాంతి 'బేస్తు' పేక ఆడుతుంటే, వాళ్లందరికీ వినోద కాలక్షేపం గవరయ్య పని. "రాణా డైమను రాణీ" అంటూ మధురవాణి మీదా, "పోలిశెట్టి ముఖము పోలిరొట్టెని బోలు" అంటూ పోలిశెట్టి మీదా అక్కడికక్కడే కవితలల్లేసి తర్వాతి కాలపు ఆశు కవులందరికీ తాత స్థానంలో నిలబడ్డాడు. మాయగుంట ఆచోకీ కనిపెట్టడం కోసం గవరయ్యకి కబురెడతారు. అతగాడు మంత్రాలు జపించి, కామినీ పిశాచి రూపంలో ఉన్న మాయగుంట ఒక్కదాన్నే కాదు, ఆమె భర్తని కూడా సీసాలో బంధించేస్తాడు. ఆ సీసాని భూస్థాపితం చేసి, చేయాల్సిన శాంతుల జాబితా వల్లిస్తుంటే, "నా ఇల్లు గుల్ల చెయ్యాలి" అని ఆవేశ పడతాడు పాపం లుబ్దావధాన్లు.

అంతలావు కామినీ పిశాచాన్ని సీసాలో బంధించిన గవరయ్యే, కొద్ది రోజులతర్వాత 'ఆ పిల్ల గోడదూకి పారిపోయిందని, తాను కళ్లారా చూశానని' సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఈ కేసులో మరో ప్రధాన సాక్షి బైరాగి కారణాంతరాల వల్ల అదృశ్యం అయిపోతే, బైరాగి తనకి కనిపిస్తున్నడనీ, తన చేత అంజనం వేయించి మాయగుంట ఆచోకీ కనిపెట్టిస్తాడనీ హెడ్ కానిస్టీబుకి ధైర్యం చెబుతాడు. అదృశ్య బైరాగితో గవరయ్య సంభాషణలు, బైరాగి తనకి కూడా కనిపిస్తున్నాడని అసిరి చెప్పే సాక్ష్యం.. ఇవన్నీ చదివి ఊహించుకోవాల్సిందే. బైరాగి కనిపించడం "డామ్ హంబగ్" అన్న గిరీశాన్ని గుక్క తిప్పుకోనివ్వడు గవరయ్య. "నువ్వు రెండు ఇంగిలీషు ముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే మహత్యాలు పోతాయనుకున్నావా ఏవిటి? నువ్వు సొట్టకర్ర తిప్పితే సిద్దులకి తగులుతుందా?" అని ప్రశ్నిస్తాడు.

అంతటితో ఊరుకోకుండా, "కిరస్తానప భ్రష్టలు చేరిన చోట మాంత్రికులు, సిద్ధులు ఉండజనదు" అని ప్రకటించి, ఖాళీ జాగావైపు చూసి "రండి గురోజీ, మన తోవని మనం పోదాం" అని బయల్దేరేస్తాడు. హెడ్ కనిస్టీబు, లుబ్ధావధాన్లు ఎంత బతిమాలినా కరగక "అవుధాన్లు గారు పెళ్లాడింది కామినీ పిశాచం. 'అది మనిషీ, గోడ గెంతి పారిపోయిందీ' అని నేను అబద్ధపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రం అన్నది నాకు మళ్ళీ పలుకుతుందా?" అని, తన వంతు సాక్ష్యం కూడా గిరీశం చేతే చెప్పించుకోమని సలహా చెప్పి మరీ వెళ్ళిపోతాడు గవరయ్య. పిశాచాలనీ, అంజనాలనీ జనం నమ్మినంతకాలం పూజారి గవరయ్యలు పుడుతూనే ఉంటారు

2 వ్యాఖ్యలు:

 1. ఈ నాటకంలో సౌజన్యరావు పాత్ర తప్ప దాదాపు మిగిలిన పాత్రలన్నీ నెగటీవ్ రోల్స్..ఎవడు తోచిన నాటకం వాడు ఆడేస్తూ గందరగోళం సృష్టిస్తారు..
  మధురవాణి అను వేశ్య రామప్పంతులింట్లోనే స్వేచ్ఛగా దుకాణం తెరిచి ఆఖరికి అతడింట్లోకి ఆతడే రానివ్వకుండా గెంటేస్తుంది..కాని చివర్లో అసలు నిజం ఆమె ద్వారా చెప్పించి ఈ నాటకానికి హీరో అయిపోతుంది..ఎంతో నిష్టుడైన సౌజన్యరావుని కూడా "ముద్దుకి కరువో"అంటూ ముగ్గులోకి లాగుతుంది..
  గిరీశం, మధురవాణి లాంటి చెడ్డ పాత్ర ద్వారా అనేక సమాజహితం కాని డైలాగులు చెప్పిస్తాడు..
  ఉదా: పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్..
  వేదాలను, పవిత్ర గాయత్రిని, జంధ్యాలను అపహాస్యం చెయ్యడం..
  రచయితల్లో ఈ అలవాటు వలన రావణ, దుర్యోధన, కర్ణులు హీరోలయ్యారు..
  ఇడియట్, పోకిరీలు, డాన్ లు హీరోలయ్యారు..
  ఇవాళ హీరో అనేవాడు ఎన్ని చెడ్డ పనులు చేస్తే అంత గొప్ప..తాగి ఆపరేషన్లు చేసే డాక్టరు హీరో..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @Voleti: నాటకం సమాజాన్ని ప్రతిబింబిస్తుందన్నది మీకు తెలియంది కాదు. నాటి సమాజంలో ఉన్న చెడుని ఎత్తిచూపేందుకు గురజాడ ఎంచుకున్న మార్గం 'కన్యాశుల్కం.' నమ్మకం ఉన్న వాళ్లకి గాయత్రి, జంధ్యం.. నమ్మకంలేని గిరీశం లాంటివాళ్ళకది దారప్పోచ. మరి ఎందుకు ధరిస్తారు అంటే, ఎప్పుడో అప్పుడు వినియోగానికి రాకపోతుందా అని. సినిమా విషయం అంటారా, అది పూర్తిగా వ్యాపారం. వాళ్లకి లాభం వచ్చేదే తీస్తారు, డబ్బొచ్చే విధంగానే ప్రచారం చేసుకుంటారు.(మీరు ప్రస్తావించిన సినిమాల్లో ఏ ఒక్కటీ నేను చూడలేదు)
  ఇక, మధురవాణి, సౌజన్యారావు పంతులు పాత్రల గురించి నా అభిప్రాయాన్ని కొంచం వివరంగా చెబుతానండి, రాబోయే టపాలలో.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు