శుక్రవారం, జూన్ 17, 2011

సంసారం ఒక చదరంగం

కొన్ని సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు "అబ్బా.. సెంటిమెంట్" అనుకుంటాం. కానీ చూడడం మొదలు పెట్టగానే, మనకి తెలియకుండానే సినిమాలో పూర్తిగా లీనమైపోతాం. నేనలా లీనమైపోయే కుటుంబ కథా చిత్రాల్లో పాతికేళ్ళ క్రితం ఏవీఎం వారు నిర్మించిన 'సంసారం ఒక చదరంగం' ఒకటి. ఇదో మధ్య తరగతి మందహాసం. మన చేతికున్న ఐదువేళ్ళూ ఒక్కలా ఉండనట్టే ఏ కుటుంబంలోనూ సభ్యులందరూ ఒకేలా ఉండరు. విశాఖపట్నంలో కాపురం ఉండే స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పలనరసయ్య కుటుంబ సభ్యుల మధ్యన వచ్చిన అభిప్రాయ భేదాలని, వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారన్నదే ఈ సినిమా.

నిర్మాణ విలువలకి పెట్టింది పేరైన ఏవీఎం సంస్థ నిర్మించిన ఈ సినిమాకి బలం కథ, కథనం, సమర్ధులైన నటీనటుల నటన. అక్కడక్కడా కనిపించే కూసింత నాటకీయతని మినహాయిస్తే, ఆద్యంతమూ సాఫీగా సాగిపోయే -- సినిమాని కాక మన ఇంటినో పక్కింటినో తెర మీద చూసుకుంటున్నామేమో అని ప్రేక్షకులకి సందేహం కలిగే -- విధంగా చిత్రించిన ఘనత ఎస్పీ ముత్తురామన్ ది. ముప్ఫయ్యేళ్ళ క్రితం కుటుంబ కథలకి పెట్టింది పేరైన దర్శక రచయిత విసు అందించిన కథకి అచ్చ తెలుగు సంభాషణలు అందించారు గణేష్ పాత్రో.

స్టీల్ ప్లాంట్లో రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న క్లర్క్ అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతిరావు ) గోదావరి (అన్నపూర్ణ) దంపతులకి నలుగురు పిల్లలు. పెద్దబ్బాయి ప్రకాష్ (శరత్ బాబు) ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్. ఆఫీసులోనే కాదు, ఇంట్లోనూ ప్రతి ఖర్చూ లెక్కగా జరగాలంటాడు. ఇంట్లో అందరికన్నా పెద్ద జీతగాడే అయినా వృధాఖర్చు నచ్చదు. అతని భార్య ఉమ (సుహాసిని) కల్మషం లేని మనిషి. నాఇల్లు, నావాళ్ళు అనుకునే తత్వం.

రెండో కొడుకు రాఘవ (రాజేంద్రప్రసాద్) ఓ ఫ్యాక్టరీలో చిరుద్యోగి. కూతురు సరోజ (కల్పన) డిగ్రీ చదివి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. చివరివాడు కాళిదాసు పదో తరగతి పరిక్షలు రాస్తూ, తప్పుతూ రాస్తూ ఉంటాడు. వీళ్ళతో పాటు నలభై ఏళ్ళుగా అ ఇంట్లో పని చేస్తూ ఇంటిమనిషి కన్నా ఎక్కువైన పనిమనిషి చిలకమ్మ (షావుకారు జానకి).సరోజని చూడ్డానికి ఓ పెళ్ళికొడుకు తన తండ్రి, చెల్లెలు వసంత (ముచ్చెర్ల అరుణ) లతో అప్పలనరసయ్య ఇంటికి రావడం సినిమాలో ప్రారంభ దృశ్యం. ఈ ఒక్క సన్నివేశం ద్వారా పాత్రల పరిచయంతో పాటు వారి వారి గుణగణాలనీ వాళ్ళ మధ్య అనుబంధాన్నీ కళ్ళకి కట్టేస్తాడు దర్శకుడు.

అప్పలనరసయ్య ఇంట్లో ఆనవాయితీగా పాడే పెళ్ళిచూపుల పాట 'జానకిరాముల కల్యాణానికి' పాడేస్తుంది సరోజ, తన ఆఫీసులో పని చేస్తున్నవాడూ, తన కన్నా ఓ అంగుళం పొట్టి వాడూ మరియూ అప్పటికే తను ప్రేమిస్తున్నవాడూ అయిన పీటర్ శామ్యూల్ ని ఊహించుకుంటూ. ప్రకాష్-ఉమ, అప్పలనరసయ్య-గోదావరిలు కూడా వాళ్ళ వాళ్ళ పెళ్లి చూపులు జ్ఞాపకం చేసేసుకుంటారు, పనిలో పనిగా. పెళ్ళికొడుకు తనకి నచ్చలేదని సరోజ తెగేసి చెప్పేయడంతో పెళ్ళివారు వెళ్ళిపోతారు.

వాళ్ళింటికి వెళ్లి క్షమాపణలు కోరిన అప్పలనరసయ్య, రాఘవ-వసంతల పెళ్లి నిశ్చయం చేసుకుని వస్తాడు. పీటర్-సరోజల పెళ్లి కాగానే రాఘవ-వసంతల పెళ్ళవుతుంది. గర్భవతి అయిన ఉమ పురిటికి పుట్టింటికి వెళ్ళడం, పీటర్-సరోజ, రాఘవ-వసంతల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇటు సరోజ అటు వసంత పుట్టిళ్ళకి చేరడం, కాళిదాసు మళ్ళీ పరీక్ష తప్పడం ఒకేసారి జరుగుతాయి. రాఘవ వెళ్లి వసంతని కాపురానికి తీసుకు వస్తాడు. అలాగే పీటర్ వచ్చి తనని తీసుకు వెళ్తాడని పుట్టింట్లోనే ఉండిపోతుంది సరోజ.

ఇంటి ఖర్చు విషయంలో అప్పలనరసయ్య-ప్రకాష్ ల మధ్య వచ్చిన మాట పట్టింపు, ప్రకాష్ ఓ వాటాలోకి వెళ్లి పోడానికీ, ఇంటి మధ్యలో లక్ష్మణ రేఖ లాంటి ఓ రేఖ మొలవడానికీ కారణమవుతుంది. బిడ్డనెత్తుకుని వచ్చిన ఉమ, చిలకమ్మ సాయంతో సరోజ సమస్యని పరిష్కరించడం తో పాటుగా, కాళిదాసు చదువు కారణంగా రాఘవ-వసంతల మధ్య పెరుగుతున్న దూరాన్ని గమనించి దానిని తగ్గించడానికీ తెర వెనుక ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తుంది.

తండ్రి-కొడుకుల మధ్యన అపార్ధాలు తొలగిపోయినప్పుడు మాత్రం, మళ్ళీ ఉమ్మడి కాపురానికి ససేమిరా అని, "కలిసి ఉండి రోజూ విడిపోవడం కన్నా విడిపోయి వారానికోసారి కలుద్దాం" అని ప్రతిపాదించి, వేరు కాపురానికి వెళ్ళడం సినిమా ముగింపు. గొల్లపూడి-సుహాసిని-శరత్ బాబు -రాజేంద్ర ప్రసాద్ లు ఈ సినిమాకి నాలుగు స్థంభాలు. వీళ్ళతో పాటుగా షావుకారు జానకి, పీటర్ తండ్రి ఎడ్మండ్ శ్యామ్యూల్ గా నటించిన నూతన్ ప్రసాద్ గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎక్కడా కూడా వీళ్ళెవరూ నటిస్తున్నారు అన్న భావన కలగని విధంగా చాలా సహజంగా కనిపించారు తెరమీద.

ఉమ, రాఘవలవి ఆదర్శ పాత్రలు. ప్రతి పాత్రకీ తనదైన ఐడెంటిటీ సినిమా మొదటి నుంచి చివరి వరకూ కొనసాగడం దర్శకుడి కృషే. అలాగే కథలో వచ్చే మలుపులకి సంబంధించి ఏ పాత్రనీ తప్పు పట్టలేం. ఏ పాత్ర దృష్టి కోణం నుంచి చూసినప్పుడు వాళ్ళు చేసిందే కరెక్ట్. ఇక మనసుని తాకే సన్నివేశాలు బోలెడు. ఉమ పురిటికి వెళ్ళే సన్నివేశం, రాఘవ-వసంతల హనీమూన్, భర్త గీసిన గీతని దాటిన గోదావరి అతనికి దొరికిపోవడం లాంటికి ఎన్నో. అలాగని హాస్యానికీ కొదవలేదు. ప్రారంభంలో వచ్చే పెళ్ళిచూపుల సన్నివేశం మొదలు, ఎడ్మండ్ శ్యామ్యూల్-చిలకమ్మల మధ్య వచ్చే సన్నివేశం, కాళిదాసు లేత ప్రేమకి భాష అడ్డంకిగా మారడం ఇవన్నీ అలవోకగా నవ్వించేవే.

సంభాషణల ద్వారా నేటివిటీని అద్దారు గణేష్ పాత్రో. వదినతో గొడవ పడ్డ సరోజ "వదినా నువ్వు వీరఘట్టం నేను విశాఖపట్నం. నువ్వు టెన్త్ క్లాసు నేను బీఎస్సీ" అంటుంది పొగరుగా. ఏ సంభాషణా కూడా మధ్య తరగతిని దాటి వెళ్ళదు. అలాగే చిలకమ్మ సంభాషణల్లో అచ్చమైన శ్రీకాకుళం మాండలీకం వినిపిస్తుంది. వాటిని చాలా సొగసుగా పలికిన షావుకారు జానకి కి 'ఉత్తమ సహాయ నటి' గా నంది అవార్డు లభించింది. చక్రవర్తి సంగీతంలో 'జానకి రాముల కల్యాణానికి' తో పాటు 'సంసారం ఒక చదరంగం' అనే నేపధ్య గీతం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

పాతికేళ్ళ క్రితానికే చివరి దశలో ఉన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు అరుదుగా కూడా కనిపించడం లేదు. అంతే కాదు, అలా దశాబ్దాల పాటు ఓకే ఇంటిని అంటిపెట్టుకుని పనిచేసే పనిమనుషులూ ఇప్పుడు లేరు. అయినప్పటికీ ఈనాటికీ ఇది సమకాలీన సినిమానే. ఎందుకంటే మనుషుల మనస్తత్వాలలోనూ, ఆలోచనా విధానంలోనూ ఏమంత మార్పు రాలేదు కాబట్టి. ఉమ్మడి కుటుంబం అంటే ఏమాత్రం తెలియని వాళ్లకి ఓ మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేదో చూపించడానికి బహుచక్కని ఉదాహరణ ఈ 'సంసారం ఒక చదరంగం.'

14 కామెంట్‌లు:

 1. నాకు కూడ ఈ‌ చిత్రం చాల ఇష్టం - ముగింపు మాత్రం ఇప్పటికీ అర్థవంతంగా అనిపించట్లేదు.

  రిప్లయితొలగించు
 2. మధ్య తరగతి సినిమా కష్టాలతో ఉంటుంది ఈ సినిమా.

  రిప్లయితొలగించు
 3. నిన్నో మొన్నో తలుచుకున్నా ఈ సినిమాని. మంచి పరిచయం మురళిగారు.ముగింపు ఐడియలిస్టిక్‌గా కాకుండా వాస్తవికంగానే ఉంటుంది. ఒకడికి మంచి అనిపించేది మరొకడికి చెడ్డనిపించే ఈ రోజుల్లో ఆదర్శాలు చెప్పినా ఎవరి చెవికీ ఎక్కవు.
  నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ముగ్గురు అన్నదమ్ములతో కూడిన ఉమ్మడి కుటుంబం. ఈ రోజుకి ఆ ఇంటిలో నీ డబ్బు నా డబ్బు అనే కాదు మన డబ్బు అని కూడా ఏ రోజూ డబ్బుల గురించి వాదించుకోగా వినలేదు. చూడలేదు. వాళ్ళే కాకుండా వాళ్ళ బందువులు కూడా చాలమందివి ఉమ్మడి కుటుంబాలే. ఆ ఇంట్లో పొయ్య ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. వచ్చేపోయే జనాలకి టీలు,కాఫీలు,భోజనాలతో ఎప్పుడు సందడిగా ఉంటుంది.

  రిప్లయితొలగించు
 4. సినిమా థీం మంచిదే కానీ .. నాటకంలా లౌడ్ గా ఉంటుంది . గొల్లపూడి తన ట్రేడ్ మార్క్ చాంతాడు డైలాగులతో విసిగిస్తాడు . అరవ వాసన ఎక్కువ . ఆ రోజుల్లో ఇప్పట్లా టీవీ సీరియల్స్ లేవు కాబట్టి మహిళలు బాగానే చూశారు . ఈ సినిమాని మీరు ఇంత వివరంగా రాసి చర్చించటం ఆశ్చర్యంగా ఉంది . మిమ్మల్ని విమర్శించట్లేదు . నా అభిప్రాయం నిర్మొహమాటంగా రాస్తున్నాను . గమనించగలరు .

  రిప్లయితొలగించు
 5. మంచి సినిమాని గుర్తు చేశారు.ధన్యవాదాలు

  రిప్లయితొలగించు
 6. చాలా మంచి సినిమా గురించి రాశారు మురళి గారు. ఈ సినిమాలో అనవసర పాత్ర, అనవసరమైన మాట వుండదు. కొన్ని సన్నివేశాలు డ్రమాటిక్ అనిపించవచ్చు గాని అప్పటికి ఆ శైలి నడిచేది. సుహాసిని, నూతన్ ప్రసాద్, గొల్లపూడి, జానకి... అందరు గుర్తుండిపోయేలా నటించారు. ఎడ్మండ్ శామ్యూల్ అనే పేరుని ఎద్దుబండి సోములు అనడం భలే నవ్విస్తుంది

  రిప్లయితొలగించు
 7. నాకు ఈ సినిమా చాలా ఇష్టం. ఉమ కారెక్టర్ ఇంకా ఇష్టం. సుహాసిని చేసింది కాబట్టి మరీ మరీ ఇష్టం. ఈ చిత్రం ముగింపు ఉమ దెబ్బతిన్న మనసుకు మంచి పరిష్కారమే. మురళి గారు, మళ్ళీ ఉమ ని గుర్తు చేసినందుకు చాలా థాంక్స్.

  రిప్లయితొలగించు
 8. @జేబీ: మీరాశించే ముగింపు ఇస్తే మరో రొటీన్ సినిమా అయిపోతుంది కదండీ... ..ధన్యవాదాలు.
  @శ్రీ: అన్నీ కష్టాలే కాదండీ, కామెడీ కూడా ఉంది.. ధన్యవాదాలు.
  @మురళి: ఇంకా ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా? భలే మంచి కబురు చెప్పారు మీరు.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 9. @రమణ: మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా రాసినదుకు ధన్యవాదాలండీ.. మీరు చెప్పినవన్నీ కొంతమేరకి నిజమే.. (చాంతాడంత డైలాగులు, అరవ్వాసన).. అయినప్పటికీ నాకీ సినిమా నచ్చింది.. జిహ్వకో రుచి కదండీ..
  @బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 10. @చక్రవర్తి: అక్కడక్కడా కొంచం నాటకాల ధోరణి కనిపిస్తుందండీ.. అది మినహాయిస్తే సినిమా అంతా నచ్చుతుంది నాకు.. ధన్యవాదాలు.
  @జయ: మీరు సుహాసిని ని 'ఉమ' అని ఫిక్సయ్యారంటే అర్ధమవుతోందండీ, ఆ పాత్ర మీకెంత నచ్చిందో.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 11. చాలా మంచి సినిమా గురించి పరిచయం చేశారు మురళి గారు, ఈ సినిమా డైలాగ్స్ క్యాసెట్ మా ఇంట్లో ఉండేది.. చాలా సార్లు విన్నాను. గొల్లపూడి గారు పేజీలకొద్దీ డైలాగ్స్ చెప్పినా తన మాడ్యూలేషన్ వల్ల ఎక్కడా విసుగు రాకపోగా ఆసక్తికరంగా అనిపిస్తాయి. సినిమాకి చక్కని స్క్రీన్ ప్లే సంభాషణలు ఊపిరి పోసాయి. తగుపాళ్ళలో హాస్యం.. మూడ్ ని ఎలివేట్ చేసే నేపధ్య సంగీతం.. అక్కడక్కడా ముఖ్యమైన ఘట్టాలలో వచ్చే టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుంటాయ్.
  మొదట్లో అంత ప్రాముఖ్యత ఉన్నట్లుగా అనిపించకపోయినా తరువాత సినిమా అంతా తానై నడిపించిన ఉమ పాత్రలో సుహాసిని గుర్తుండిపోతుంది. తను చేసిన పాత్రలలో స్వాతి తర్వాత ఇది ఇంకా ఛాలెంజ్ లో లక్ష్మి పాత్రలు నాకు తనని తలుచుకోగానే గుర్తొచ్చే పాత్రలు. షావుకారు జానకి గారి పాత్ర కూడా నాకు చాలా ఇష్టం తను సుదీర్ఘ విరామం తర్వాత నటించిన చిత్రం అనుకుంటా ఇది. ముగింపుని జస్టిఫై చేస్తూ క్లైమాక్స్ లో ఉమ చెప్పే మాటలు కూడా నాకు బాగా ఇష్టమ్.

  రిప్లయితొలగించు
 12. @వేణూ శ్రీకాంత్: అవునండీ, షావుకారు జానకి గ్యాప్ తర్వాత మేకప్ వేసుకున్నారు ఈ సినిమాకి. ఆమెని పరిచయం చేసే సన్నివేశంలో ఇల్లు తుడుస్తూ "ఆ.. పాండవులు పాండవులు తుమ్మెద.. " అని ఒకనాటి తన హిట్ గీతం పాడించడం భలేగా నచ్చేసింది నాకు. చెప్పుకుంటూ వెళ్తే బోలెడు.. గణేష్ పాత్రో చాలా చక్కని సంభాషణలు రాశారు.. అందరూ వాటిని అంట చక్కగానూ పలికారు. రెండు మూడు సీన్లే అయినా, నూతన్ ప్రసాద్ తనదైన ముద్ర వేశారు.. ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 13. ఈ సినిమాలోని "సంసారం ఒక చదరంగం" పాట ఒక హైలైట్‌. ఇతివృత్తమైన మధ్యతరగతి సంసారానికి ఒక ప్రతిబింబం.

  రిప్లయితొలగించు
 14. @రామచంద్రరావు: అవునండీ.. అప్పటి మధ్యతరగతికి.. ధన్యవాదాలు

  రిప్లయితొలగించు