శుక్రవారం, జూన్ 03, 2011

మా భూషణం

నిచ్చెన మెట్లన్నీ ఎక్కేసి, చివరిమెట్టు మీద ఆగాడు భూషణం. తన నడుము చుట్టూ పెట్టుకున్న పెద్ద బెల్టుకి తగిలించిన బంధం తీసుకుని జాగ్రత్తగా తన రెండు కాళ్ళకీ వేసుకున్నాడు. మరో పట్టీ తీసుకుని దానిని తన నడుము చుట్టూ తిప్పుకుని, కొబ్బరిచెట్టు చుట్టూ తిప్పి ముడేశాడు. బెల్ట్ కి కత్తి ఉంది. పట్టీ నెమ్మది నెమ్మదిగా పైకి జరుపుకుంటూ, బంధం వేసుకున్న కాళ్ళతో మెల్ల మెల్లగా చెట్టు పైపైకి ఎక్కుతున్నాడు. అబ్బా... మెడ నొప్పెడుతోంది. కానీ చూడకపోతే ఎలా, ఒకవేళ భూషణం గబుక్కున జారుతున్నాడనుకో గట్టిగా అరిచి జాగ్రత్త చెప్పొద్దూ.

ఇంకో నలుగురు దింపు వాళ్ళు కూడా చెట్ల మీద ఉన్నారు కానీ, నేనెప్పుడూ భూషణం వెనకాలే తిరుగుతాను. కొబ్బరి తోటలో దింపు తీయిస్తున్నామంటే తాతయ్య, నాన్నలతో పాటు నేనూ ఉండాల్సిందే. దింపు వాళ్ళు తిరిగి నిచ్చెన మీదకి వచ్చే వరకూ ఆగి, అప్పుడు వెళ్ళాలి చెట్టు కిందకి. ఒక్కో చేత్తో ఒక్క కాయకన్నా ఎక్కువ పట్టుకోలేం. నాన్నయితే రెండేసీ, మూడేసీ పట్టుకుంటారనుకో. కానీ ఒక్కో కాయా ఎంత బరువుంటుందో. ఆ ముచిక చుట్టూ బిగించి పట్టుకోవడంలో అరిచేతులు ఎర్రగా అయిపోతాయి కూడాను.

కాయలొకటేనా? అడ్డుగా ఉన్నఎండు కొబ్బరాకులు, డొలకలు ఇంకా దెయ్యపు తొట్లూ కూడా కత్తితో కొట్టేస్తారు కదా. అవన్నీ కూడా కింద పడతాయి. జాగ్రత్తగా కొబ్బరికాయలో రాశి, డొలకలొకటి, ఆకులొకటి, ఇలా వేరువేరుగా రాశులు పొయ్యాలి. మనం ఒక్కళ్ళమే కాదులే. దింపు తీస్తున్నారంటే ఇద్దరో ముగ్గురో అప్పటికప్పుడు వచ్చేసి, పని సాయం చేసేసి వెళ్తూ వెళ్తూ డొలకలో, ఒకటో రెండో కాయలో తాతయ్యని అడిగి పట్టుకెడతారు. ఆకులు మనం మోయ్యలేం. డొలకలేమో కొంచం మట్టిగా ఉంటాయి. అందుకని కాయలైతే కొంచం బరువైనా పని సులువన్నమాట.

భూషణానికి నేనంటే ముద్దు. అలా ఎండల్లో నేను కాయలు మొయ్యడం తనకి నచ్చేది కాదు. నేను ఎర్రగా అయిపోయిన చేతులు మధ్యమధ్యలో ఊదుకుంటుంటే చూసి, "మీరలా కూకోండి బాబో.. శానామందున్నారు కదా" అనేవాడు ప్రేమగా. కానీ కాయలు మొయ్యకపోతే తోటలో ఉండడానికి ఉండదు, ఇంట్లోకి వెళ్లి చదువుకోవాలి. అప్పుడు భూషణం వాళ్ళూ చెప్పే కబుర్లు వినడానికి ఉండదు. ఇంట్లోకి వినిపించవు కదా మరి. ఇంకో కారణం కూడా ఉంది కానీ, అది తర్వాత చెబుతాను. భూషణం వాళ్ళూ రోజూ ఎక్కడో అక్కడికి దింపుకి వెళ్తారు. దింపు అయ్యాక పడ్డ కాయల్ని బట్టి వందకిన్ని అని కాయలో, ఆ మింజువోలె డబ్బులో తీసుకుంటారు.

దింపుకెళ్ళిన ఊళ్లలో ఎక్కడెక్కడ ఏమేం జరిగాయో భూషణం చెబుతూంటే వినాలంతే. తను నాన్న కన్నా పెద్దవాడు, తాతయ్య కన్నా చిన్నవాడు. కబుర్లు మొదలు పెట్టాడంటే మాత్రం నా అంత చిన్న పిల్లాడైపోయేవాడు. ఏ ఊళ్ళో ఎవరికి ఎన్నెన్ని కాయలు పడ్డాయో, ఎవరి కొబ్బరికాయల రాశిలోకి ఎంత పెద్ద పామొచ్చిందో, ఎక్కడ దింపు తీస్తూ తను ఏ సినిమా షూటింగ్ చూశాడో ఇవన్నీ ఊరిస్తూ ఊరిస్తూ చెప్పేవాడు. "ఈ భూషణం కబుర్ల పోగు. పని తెవల్చడు" అని తాతయ్య, నాన్న తిట్టుకునే వాళ్ళు కానీ, పైకేమీ అనేవాళ్ళు కాదు. దింపు వాళ్ళందరికీ భూషణమే పెద్ద మరి.

మామూలు చెట్లు ఎవరన్నా ఎక్కేవాళ్ళు కానీ, ముచ్చెట్లు మాత్రం భూషణానికే వదిలేసేవాళ్ళు. మామూలు కొబ్బరి చెట్టు కన్నా రెట్టింపు పొడుగుండే ముచ్చెట్లు కొబ్బరి చెట్లలో ముసలివన్నమాట. అలా ఎక్కుతూ ఎక్కుతూ నలకలా అయి, మాయమై పోయేవాడు భూషణం. ముచ్చెట్టు ఎక్కితే పైనుంచి తన గొంతు కూడా వినిపించేది కాదు. తను చెట్టు దిగేంతవరకూ నాకు భయం భయంగా ఉండేది. ఇంకెవరికీ అస్సలు భయం ఉండేది కాదు. "ఈ ముచ్చెట్లు కొట్టించేయొచ్చు కదా" అనుకునే వాణ్ణి. కానీ, భూషణం చెబితే తప్ప చెట్టు కొట్టించే వాళ్ళు కాదు.

ముచ్చెట్లే కాదు, 'నా చెట్టు' కూడా భూషణమే ఎక్కేవాడు. నా చెట్టు అంటే నేను పాతిన మొక్క పెరిగి పెద్దై, చెట్టయ్యిందని కాదు. ఆ చెట్టు బొండాలు చాలా బాగుంటాయి. మిగిలిన బొండాల కన్నా ఆ బొండాలంటేనే నాకు ఎక్కువ ఇష్టం. ఈ రహస్యం తెలుసు భూషణానికి. ఇంకో రహస్యం కూడా ఉంది మా ఇద్దరికీ. తనా చెట్టు ఎక్కుతుంటే నేను "భూషణం, బొండము తియ్యవూ" అని అడగాలి. మాటలు పలకడంలో ఏవన్నా తేడాలోస్తే వీప్పగిలిపోయేది. అందుకని కొంచం పట్టి పట్టి జాగ్రత్తగా మాట్లాడాలి కదా.. నేనలా మాట్లాడితే వినడం భూషణానికి సరదా. అంతేనా? నేనిలా అడగ్గానే "ఏవీ అక్కర్లేదు" అని నాన్న అరుపూ, "పిల్లాడికి నాలుగు బొండాలు తియ్యరా" అన్న తాత ఆర్డరూ, వాళ్ళిద్దరూ తోటలో ఏమూల ఉన్నా వినిపించేవి.

అప్పటికే కాయలు చేరేసీ, చేరేసీ అలిసిపోయేవాడినేమో, బొండాలు చెట్టు దిగడం ఆలస్యం, తాగడానికి రెడీ అయిపోయేవాడిని. తనే చెలిగి, కొట్టి ఇచ్చేవాడు భూషణం. నీళ్లన్నీ తాగాక, బొండాన్ని రెండు ముక్కలు చేసిచ్చేవాడు, మీగడ తినడానికి వీలుగా. "ఇంకోటి కొట్టమంటారా?" తనెంత మెల్లిగా అడిగినా, తాతయ్యకో, నాన్నకో వినపడిపోయేది. "అక్కర్లేదు. వాడింక అన్నం తినడు.. మిగిలినవి నూతిలో పడేయ్.. రేపు కొట్టిద్దాం" అనేసేవాళ్ళు. అక్కడితో దింపు వదిలేసి నేనింట్లోకి పరిగెత్తే వాడిని, నా పని అయిపోయినట్టే కదా మరి. బొండం కొట్టిస్తూ భూషణం ఎప్పుడూ ఒకటే మాట అడిగేవాడు.... "పెద్దోరయ్యాక నన్ను గుర్తెట్టుకుంటారా బాబూ?" .....

16 కామెంట్‌లు:

  1. manchi ga mee chinnapudu viseshalu bhale ga rastaru meeru murali garu and e madhya meeru rase tym mee post nenu choose tym almost lapse avvuthunnayi :)

    రిప్లయితొలగించండి
  2. బాగా చెప్పారు. దింపు, ముచ్చెట్లు లాంటి కొత్తపదాలు తెలిసాయి

    రిప్లయితొలగించండి
  3. గుర్తెట్టుకున్నారుగా. భూషణానికి తెలిస్తే మురిసిపోతాడేమో!

    రిప్లయితొలగించండి
  4. నేను ఇంతవరకు ఈ ముచ్చెట్లు గురించి వినలేదు :) ఇప్పుడు తెలిసింది మీ వల్ల! ఎంతబాగా గుర్తుపెట్టుకున్నారు మీ భూషణాన్ని! :)

    రిప్లయితొలగించండి
  5. భూషణం కబుర్లు చాల భాగున్నాయే.

    రిప్లయితొలగించండి
  6. అప్పుడెప్పుడో తృష్ణ గారి బ్లాగులో సరిగ్గా ఇలాగే దింపు తీసే తోటయ్య గురించి చదివి కాకినాడ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి ఆ దెబ్బకి మా కాకినాడ కబుర్లు సీరీస్ స్టార్ట్ చేశా. మళ్ళీ ఇప్పుడు మీ భూషణం వలన చిన్నప్పుడు శలవుల్లో మా తాతగారి ఊరు వెళ్ళినప్పుడు ముచ్చెట్ల మీదకు చకచకా స్పైడర్ మాన్ లా ఎక్కేసే దింపు తీసే వాళ్ళని అబ్బురంతో నోరు తెరచుకుని చూడటం, వాళ్ళ ఇన్స్పిరేషన్ తో రెండు పాదాలకీ స్కూలు బెల్టు కట్టుకుని ఇంట్లో బొప్పాయి చెట్టు మీదకి ఎక్కేప్రయట్నం చేసి కింద పడి కాళ్ళు, చేతులు కొట్టుకుపోవడం గుర్తొచ్చింది. :(

    శిశిరగారన్నట్టు మీ భూషణానికి ఈ పోస్ట్ సంగతి తెలిస్తే తబ్బిబ్బైపోతాడేమో!

    రిప్లయితొలగించండి
  7. కొబ్బరికాయలు ఎంత పెద్ద చెట్టు చెకచెకా ఎక్కేస్తూ, కోసేస్తూ ఉంటే చూడటానికి చాలా సరదాగా ఉంటుంది. మీ భూషణం ఇంకా అక్కడే ఉన్నాడా. మీరు ఇప్పటికీ కలుస్తూ ఉంటారా. మీ ఇద్దరి ఫొటో ఒకటి మాకూ చూపించొచ్చుగా.

    రిప్లయితొలగించండి
  8. మా బాగా రాశేరు మురళి... భూషణాన్ని గుర్తెట్టుకొని మాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. భూషణం ఇప్పుడు ఏం చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  9. మంచి సంగతులు గుర్తు చేసారు మురళి గారు, భూషణాన్ని అడిగానని చెప్పండి..

    రిప్లయితొలగించండి
  10. @బాలు: ధన్యవాదాలండీ..

    @పంతుల జోగారావు: మా జిల్లాలో వాడుక మాటలండీ ఇవి ... ధన్యవాదాలు.

    @శిశిర: ఇంకెక్కడి భూషణమండీ... ఎప్పుడో వెళ్ళిపోయాడు.. కానీ ఈమాట రాయలేకపోయాను, టపాలో... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @ఇందు: మర్చిపోగలిగే మనిషి కాదండీ.. ధన్యవాదాలు.

    @రత్నమాల: ధన్యవాదాలండీ..

    @శంకర్.ఎస్: ప్చ్... తెలిసే అవకాశమే లేదండీ.. వెళ్ళిపోయాడు తను... అన్నట్టు, మీ జ్ఞాపకాలు బాగున్నాయి.. నేనెప్పుడూ ప్రయత్నించలేదు :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @జయ: భూషణం అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయి చాలా ఏళ్ళయ్యిందండీ.. తన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం.. ధన్యవాదాలు.

    @చక్రవర్తి: అప్సరసలతో డేన్స్ చేస్తూ ఉండాలండీ ప్రస్తుతం.. నాకు కొట్టిచ్చిన బొండాలకి గాను స్వర్గానికే వెళ్లి ఉంటాడని నా నమ్మకం మరి :)) ..ధన్యవాదాలు

    @Creative Oracle: తప్పకుండానండీ, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. మురళి గారు, మనసుకు హత్తుకునే ముచ్చట్లు పంచుకున్నారు. దింపు ముచ్చట్లు అన్నీ ఓ పక్కన, కొసమెరుపు మరో పక్కన. అద్భుతంగా ఉంది టపా:)

    రిప్లయితొలగించండి
  15. @మనసు పలికే: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి