దేవుడి గదిలో బియ్యం పోసుకునే జాడీ పక్కనే ఉన్న ఇత్తడి గంగాళం మీద, గంధం అరగదీసుకునే సాన బరువుగా మూత పెట్టి ఉంది. బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని, జాగ్రత్తగా ఆ సానని కిందకి దింపేసి, గంగాళంలో చెయ్యి పెడితే లోపల గరుగ్గా తగులుతూ వడ్లు. ఓ చిన్న పళ్ళెంలోకి వాటిని తీసుకుని, గంగాళం మీద మూతని మళ్ళీ జాగ్రత్తగా పెట్టేసి, ఎందుకన్నా మంచిదని ఓ సారి వంటింటి వైపు చూసేసరికి, అమ్మా, బామ్మా పండగ పిండి వంటల హడావిడిలో మునిగిపోయి ఉన్నారు. ఇద్దరూ కూడా నన్ను చూడనేలేదు.
ఆ పళ్ళెం తెచ్చి వీధిలో బూరా ఊదుతున్న తలపాగా అబ్బికి ఇవ్వగానే తను యెంత సంతోషించాడో చెప్పలేను. నేను చూస్తూ ఉండగానే ఆ వడ్లు తనతో తెచ్చుకున్న సంచీలో పోసేసుకున్నాడు. అదేమిటీ? గంగిరెద్దుకి వడ్లు పెడతానని కదా నన్ను అడిగాడూ? "మా ఎంకన్నబాబు ఇప్పుడేవీ తినడు బాబయ్యా. మద్దినాల మేం బోయినం సేసేప్పుడు తవరి పేరు సెప్పి నేను తినిపింతాను సావీ" అని చాలా మర్యాదగా చెప్పాడు పాపం. కూడా వచ్చిన రెండో బూరా అబ్బి అవునవునని తలూపాడు. సర్లే నా పేరు చెప్పి తినిపిస్తాడు కదా... పుణ్యం అంతా నాకే కదా అనుకున్నాను.
ఏటా సంక్రాంతి రోజుల్లో వెంకన్నబాబుని తీసుకుని వస్తారు వాళ్ళు. మామూలుగా మన ఊళ్ళో బండి లాగే ఎడ్లు ఉంటాయి చూడూ, వాటికన్నా ఎత్తుగా ఉంటాడు వెంకన్న బాబు. కాళ్ళకీ, మెడ లోనూ, కొమ్ములకీ, పొట్టకీ కూడా మువ్వల పట్టీలు కట్టేస్తారు కదా... తను ఒక్క అడుగు వేసినా ఘల్లు ఘల్లు మని పోతాడు. కొమ్ములకి పట్టు కుచ్చులు, మూపురం వెనుక మడతలు పెట్టిన పాత పట్టు చీరా, చెమ్కీ దండలూ అవీ వేస్తారేమో భలేగా మెరిసిపోతాడు. మన ఎడ్లు అయితే కొరడా కర్రతో కొడితే తప్ప మాట వినవా? అదే వెంకన్న బాబయితే ఏం చెప్పినా ఇట్టే చేసేస్తాడు. అయినా మామూలు ఎడ్లని కొట్టినట్టు వెంకన్నబాబుని కొట్టకూడదు, తను గంగిరెద్దు కదా మరి.. దేవుడితో సమానం.
బూరా అబ్బిలు ఇద్దరూ వెంకన్న బాబుతో భలే భలే పనులు చేయిస్తారులే అసలు. "అయ్యగారికీ దండం పెట్టూ" అనగానే అంత పెద్ద వెంకన్న బాబూ ఇంచక్కా దండం పెట్టినట్టు నిలబడి పోతాడు. అది చూడగానే గంగాళంలో ఉన్న వడ్లన్నీ తెచ్చి తన ముందు పెట్టెయ్యాలని అనిపించేస్తుంది.. అలా చేస్తే ఇంకేమన్నా ఉందా? బామ్మ బతకనివ్వకపోవడం అలా ఉంచి, అటుకులు కావాలంటే ఎక్కడినుంచి వస్తాయీ? అందుకని ఒక్క పళ్ళెంతో, అది కూడా బామ్మ చూడకుండా చూడకుండా తెచ్చి ఇచ్చెయ్యాలి. చూసిందంటే మాత్రం "వాళ్ళు చెప్పే వెధవ సినేమా కబుర్ల కోసం, వడ్లన్నీ సంతర్పణ చేసేస్తున్నావా నాయనా..ఇలా అయితే ఇల్లు గుల్లైపోతుంది. సుపుత్రా..కొంప పీకరా అనీ..." అంటూ సాధిస్తుంది.
బామ్మ తిట్లు కాదు కానీ, బూరా అబ్బిలు చెప్పే కబుర్లు భలేగా ఉంటాయ్ అసలు. "మొన్నా మజ్జినండీ..ఎన్టీ వోడు కబురెట్టేడు మన ఎంకన్నబాబు కోసం.. కొత్త సినీమా తీత్తన్నారంట.. అట్టాంటిట్టాంటి గంగిరెద్దు పనికిరాదు.. ఎంకన్న బాబైతేనే కరెస్ట్ గా సరిపోతాడు అన్నాడంట. ఆళ్ళ మనిసొచ్చి ఒకిటే బతిమాలేసేడు. మావు ఇనలేదు లెండి.. ఇంకో ఎద్దుని సూసుకోమని సెప్పేసాం.." అయ్యో... ఎందుకలాగా? మన వెంకన్న బాబుని అందరూ చక్కగా సినిమాలో చూసేవాళ్ళు కదా?? అని అడిగామనుకో వెంటనే "సినీమానులో పడితే దిట్టి బాబయ్యా..బాబుకి కల తగ్గిపోద్ది..ఒప్పేసుకో కూడదండి అలాగ..ఆయ్.." అని వివరంగా చెప్పేస్తారు.
అదేమిటో పెద్దవాళ్ళు ఎవరూ కూడా వీళ్ళ మాటలు నమ్మరు. "మెడ్రాసులో గంగిరెద్దులకి కరువు మరీ... వీళ్ళని వెతుక్కుంటూ వచ్చారు సినిమా వాళ్ళు" అనేస్తారు. అయినా నిజం అయితే ఏమిటి, కాకపొతే ఏమిటి... వాళ్ళు సరదాగా చెబుతున్నప్పుడు సరదాగా వినొచ్చు కదా. మనం చూస్తూ ఉండగానే బూరా అబ్బిలు ఇద్దర్లోనూ ఒకతను ముగ్గుకి దూరంగా నేలమీద వెల్లకిల్లా పడుకుంటాడా.. వెంకన్న బాబు మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ నడిచి వెళ్లి అతని గుండెల మీద కాళ్ళు పెడతాడు. యెంత భయం వేసేస్తుందో. అప్పుడప్పుడూ మన ఎద్దులు కొమ్ము విసిరినట్టు వెంకన్నబాబు కూడా కోపం వచ్చి ఏమన్నా చేస్తే? వాళ్లకి అస్సలు భయం ఉండదేమో.. అలా తొక్కించేసుకుంటారు.
అబ్బిలిద్దరూ వీధిలో నిలబడి పోటాపోటీగా బూరలు ఊదుతూ ఉంటే అమ్మో, బామ్మో తప్పకుండా బయటికి వస్తారు కదా. అప్పుడు వెంకన్నబాబు కాస్తా మాలచ్మి అయిపోతుంది. "పండగ పూటా మాలచ్చిమి వచ్చింది తల్లే... నాలుగు పాతగుడ్డలు, పలారం ఎట్టించి పంపండమ్మా... జయం కలుగుతాది మీకు" అని ఆపకుండా ఏవేవో అడుగుతూనే ఉంటారు. మనకేమీ భయం అక్కర్లా... "అబ్బాయ్ గారు ఎంకన్న బాబుకి వడ్లు పెట్టారమ్మా" అని వాళ్ళు చెప్పరు గాక చెప్పరు. ఈలోగా నాన్నో, తాతో కనిపిస్తే "ఆట ఆడించాం బాబయ్యా...సదివింపులు గనంగా సదివించుకొవాలి బాబయ్యా..." అంటూ రూపాయో అర్ధో ఇచ్చే వరకూ వదలరు. గొబ్బిళ్ళు, హరిదాసు, ఆ తర్వాత వెంకన్న బాబూ అందం సంక్రాంతి పండక్కి.
మిత్రులందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు!!
బాగా రాసారండి
రిప్లయితొలగించండిమీకు మీ కుటుంబానికీ సంక్రాంతి శుభాకాంక్షలు మురళి గారు
రిప్లయితొలగించండిసంక్రాంతి అనగానే మా ఊరే గుర్తొస్తుంది ..సంక్రాంతి చూడాలంటె ఊళ్ళ లోనే ... పండగకి ఊరెళ్ళి ఎన్నాళ్ళయిందో :(
మీ బ్లాగ్ కి రాకూడదండి. బాల్యం అంతా కళ్ళముందు పెట్టేస్తున్నారు. గతం లోకి ప్రయాణం కష్టమే మరి...దహా.
రిప్లయితొలగించండిభలే వెంకన్న బాబు..
రిప్లయితొలగించండిఎంత బాగా రాసారో ..:))
చాలా రోజుల తర్వాత మీ చిన్ననాటి కబుర్లు రాసారు...చదువుతున్నంత సేపూ నిక్కరేస్కున్న ఒక చిన్న పిల్లాడు కబుర్లు చెబుతున్నట్టే అనిపించింది.పండగ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నా...
రిప్లయితొలగించండిమురళి గారు ఎప్పటిలాగే మీ ఈ 'జ్ఞాపకాలు' నా బాల్యాన్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది. గంగిరెద్దు ని చూస్తే నందీశ్వరుడు ఇలానే ఉంటాడేమో అనిపించేది. రాన్రాను కొన్నేళ్ళ తర్వాత గంగిరెద్దు లేకుండానే, గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వచ్చేవారు. అప్పుడు వాళ్ళకు బియ్యం ఇవ్వాలని అనిపించేది కాదు.
రిప్లయితొలగించండిఆలస్యంగా మీక్కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
@కృష్ణ: ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి@వాసు: ఇండియా లో ఉన్న వాళ్ళమే వెళ్ళలేక పోతున్నామండీ.. ఇక మీరు అక్కడి నుంచి రావడం అంటే..... .....ధన్యవాదాలు
@బులుసు సుబ్రహ్మణ్యం: ఒక్క క్షణం కంగారు పెట్టేశారు :-) ...ధన్యవాదాలండీ...
@ధాత్రి: ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండి@స్ఫురిత : బాగా జరుపుకున్నామండీ... ధన్యవాదాలు
@శ్రీ.దు: మా చిన్నప్పుడు విడిగా కొందరు బూరా ఊదుకుంటూ వచ్చేవాళ్ళు, ఎద్దుని తేకుండా... వాళ్ళని ఎవరూ పట్టించుకునే వారు కాదు పెద్దగా.... ధన్యవాదాలు.
ఓ పదిహేన్రోజులు ఆలశ్యంగా నాకు సంక్రాంతి ఇపుడొచ్చిందంటే నమ్మండి :-) ఆదరాబాదరాగ పైపైన చదవకూడదని మీ టపాలు కొన్ని తీరిగ్గా తర్వాత చదవడానికి దాచిపెట్టుకుంటాను అలా దాచిపెట్టుకోవడం ఎంతకరెక్టో మీ వెంకన్నబాబు కబుర్లు మరోమారు రుజువు చేశాయి. బాగున్నాయండీ కబుర్లు :-)
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్ : ధన్యవాదాలు వేణు గారూ, ప్రశాంతంగా చదివినందుకు :)
రిప్లయితొలగించండి