సోమవారం, జనవరి 27, 2020

మిత్రుడి సమాధి

ఊరి శివార్లలో పంట కాలువ పక్కనే కొబ్బరి తోట. ఆ తోట మధ్యలో ఓ పాక. ఆ పాక పక్కనే రోడ్డు మీదకి కనిపించేలా ఓ సమాధి. ఆ సమాధి నా మిత్రుడిది. మా ఊరికి వెళ్లాలన్నా, ఊరినుంచి రావాలన్నా ఆ సమాధి మీదుగానే ప్రయాణించాలి. అలా ప్రతిసారీ ఊరికి వెళ్లేప్పుడు, వచ్ఛేప్పుడూ కూడా అతన్ని తల్చుకోకుండా ఉండడం కుదరదు. రీల్ కెమెరా నుంచి డిజిటల్ కెమెరా మీదుగా స్మార్ట్ ఫోన్ కెమెరాకి వచ్చినా ఎప్పుడూ ఆ సమాధిని ఫోటో తీయబుద్ధి కాదు. కానీ అతనితోనూ, ఆ సమాధితోనూ నా జ్ఞాపకాలు ఎన్నెన్నో. 

నేను ఆరోతరగతిలో చేరాక, మా ప్రభుత్వోన్నత పాఠశాలలో తగినంతమంది టీచర్లు లేకపోవడం నన్నో పుంభావ సరస్వతిగా చూడాలనుకున్న మా ఇంట్లో వాళ్ళని కొంచం ఇబ్బంది పెట్టింది. అదే సమయంలో మా ఊళ్ళోనే ఉన్న డిగ్రీ స్టూడెంట్ ఒకతను ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టడంతో నన్నూ అందులో చేర్చారు. ఐదేళ్ల పాటు మేం చదువుకున్న చిన్న బడి (ప్రాధమిక పాఠశాల) ఆవరణలోనే సాయంత్రం వేళల్లో ప్రయివేటు ఉండేది. ఆ బడి పక్కనే పంచాయతీ ఆఫీసు, ఆటస్థలం కూడా ఉండేవి. 

మా ట్యూషన్ మేష్టారిది కొంచం పైలా పచ్చీసు వ్యవహారం. వారంలో కనీసం రెండు మూడు రోజులు ఆయన టైముకి వచ్చేవారు కాదు. ఒక్కోరోజు వచ్చేవారే కాదు. అయినా కూడా మేము క్రమం తప్పకుండా ప్రయివేటుకి హాజరయ్యేవాళ్ళం, ఇళ్ల నుంచి ఆటవిడుపు కోసం. పంచాయితీ ఆఫీసు పక్కనే ఉన్న ఆటస్థలంలో కబడ్డీ ప్రాక్టీసు జరిగేది ప్రతి సాయంత్రమూ. అది చూడడం కొందరికి వినోదం. ఆ పక్కనే గోళీలు, గూటీ బిళ్ళ లాంటి క్రీడా సంరంభాలూ జరుగుతూ ఉండేవి. మిగిలిన మిత్రులు వాటిలో సర్దుకునే వాళ్ళు. 

నాకు మొదటి నుంచీ క్రీడా స్ఫూర్తి బొత్తిగా లేదు. కాబట్టి నాకు మిగిలిందల్లా పంచాయితీ ఆఫీసులో ఉండే రేడియో వినడం. వ్యవసాయం పనులు పూర్తి చేసుకున్న రైతులు, కొందరు యువకులూ కూడా చేరేవాళ్ళు, వార్తలు వినడానికి. అదిగో అక్కడ కలిశాడీ మిత్రుడు. మా ట్యూషన్ మేష్టారి కాలేజ్మేట్. ఒకే ఊరి వాళ్ళం కావడంతో పరిచయాలు అవసరం లేదు. ఇద్దరి ఇళ్లూ ఊరికి చెరో చివరా ఉన్నా, వాళ్ళ నాన్నా, మా నాన్నా మంచి స్నేహితులు. అలా ఒకరి గురించి మరొకరికి తెలుసు. నాలాగే ఆటలు చూస్తూ, రేడియో వినేవాడు. చేతిలో తప్పనిసరిగా పుస్తకమో, న్యూస్ పేపరో ఉండేవి. 

మేష్టారు రాని ఓ సాయంత్రం నేను రేడియో వింటూ ఉంటే, తనొచ్చి, పలకరించి, పక్కన కూర్చున్నాడు. కబుర్లు మొదలయ్యాయి. అవి ఎంతకీ తెగలేదు. ఆశ్చర్యం ఏమిటంటే, తన వయసులో దాదాపు సగం వయసున్న నన్ను తనతో సమంగా చూసి మాట్లాడాడు. అది మొదలు, ట్యూషన్ లేనప్పుడల్లా తనతో కబుర్లు సాగేవి. గ్రామ రాజకీయాల మొదలు, దేశ రాజకీయాల వరకూ మేం మాట్లాడుకోని విషయం ఉండేది కాదు. ఊళ్ళో జరిగే పంచాయితీ తగువుల్లో కొన్ని తీర్పులు మా వాకిట్లోనే జరిగేవి కాబట్టి, అప్పటి మా ఊరి రాజకీయాలు నాకు కొట్టిన పిండి. స్కూల్ అసెంబ్లీ లో వార్తలు చదవడం కోసం పేపరు చదవడం కొత్తగా అలవాటు చేసుకుంటున్న రోజులు. ఇక రేడియోతో అనుబంధం చిన్నప్పటినుంచీ పెరిగిందే. 

తన ఈడు వాళ్ళు నవ్వుతున్నా పట్టించుకోకుండా, నేను గనుక ఖాళీగా ఉంటే అతను నాతో కబుర్లు చెప్పేందుకే ఉత్సాహ పడేవాడు. అప్పటికే చదివిన కథలు, అప్పుడే చదవడం మొదలు పెట్టిన యద్దనపూడి నవలల్ని గురించిన నా జ్ఞాన ప్రదర్శనని తను చెంపకి చేయి ఆన్చుకుని శ్రద్ధగా వినడం ఇప్పటికీ గుర్తుంది. ఆరోజుల్లో అతని గురించి తెలిసిన విశేషం ఏమిటంటే, ఊరి చివర కాలువ పక్కన ఉన్న వాళ్ళ కొబ్బరి తోటలో ఉన్న పాక అంటే తనకి చాలా ఇష్టమని, ఇంట్లో కన్నా ఎక్కువసేపు అక్కడే గడుపుతాడనీను. "చదువుకోడానికి అక్కడ బాగుంటుంది" అనేవాడు. నాక్కూడా ఎప్పటికైనా అలాంటి ఏర్పాటు దొరుకుతుందేమో అని కలలు కన్నాను. 

ఇలా ఓ ఏడాది గడిచిందేమో. ఉన్నట్టుండి ఊరు అట్టుడుకిపోయే వార్త. తనకి ఇష్టమైన పాకలోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. (ఈ వాక్యం రాస్తుంటే మరోసారి ఒళ్ళు జలదరించింది). నాకేమీ అర్ధం కాలేదు. దుఃఖం రాలేదు. చిన్న వాడిని కాబట్టి అతన్ని చివరగా చూసేందుకు వెళ్లే స్వేచ్ఛ లేదు. సాయంత్రానికి వచ్చిన ఒకే ఒక్క ఆలోచన అతను నన్ను మోసం చేశాడని. ఈ ఆలోచన చాన్నాళ్లే వెంటాడింది. అతను వాళ్ళ నాన్నకి చివరి ఉత్తరం రాశాడు. తన డైరీని చితిలో కాల్చేయమని. ఊళ్ళో తగుమాత్రం పెద్దమనుషులు అందులో ఏముందో చదవమని సలహా ఇచ్చినా వినకుండా కొడుకు కోరిక తీర్చారాయన. 

ఊరి పద్ధతికి విరుద్ధంగా శ్మశానంలో కాకుండా ఆ పాక పక్కనే అంత్యక్రియలు చేసి, అక్కడే అతనికో సమాధి కట్టారు. కొన్నాళ్ళకి అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని పుకార్లు లేచాయి ఊళ్ళో. మరో మూడేళ్ళ తర్వాత నేను కాలేజీ చదువుకి వచ్చాను. పక్కూళ్ళో కాకుండా, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలో చేరాల్సి వచ్చింది. ఇష్టం లేని కాలేజీ, బుర్రకెక్కని కోర్సు, శరీరంలో ఒక్కసారిగా వచ్చిపడిన మార్పులు, రోజూ ఎడతెగని సైక్లింగ్, ఇవి చాలవన్నట్టుగా ఇంటి వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు.. ఉన్నట్టుండి జీవితం అస్తవ్యస్తంగా మారిపోయిన కాలమది. అప్పుడు మరింత బలంగా అనిపించేది, అతనుంటే బాగుండేదని. 

కాలేజీ నుంచి ఇంటికి వచ్చేప్పుడు రోజూ బాగా చీకటి పడిపోయేది. సైకిల్ డైనమో లైట్లు కాలేజీ పార్కింగు లో తరచూ దొంగతనం జరిగేవి.  ఎటూ పోయేదే కాబట్టి, లైటు ఉండేది కాదు సైకిల్ కి. అప్పటికింకా వీధి దీపాలు పూర్తిగా రాలేదు. చీకట్లో ఆ పాక పక్క మట్టి రోడ్డు మీంచి రావాలంటే ఊళ్ళో పెద్ద వాళ్ళు కూడా లోపల్లోపల భయ పడేవాళ్ళు. నాకు మాత్రం ప్రతి రోజూ ఆశే, అతని ఆత్మ కనిపించి పలకరిస్తుందేమో అని. ఆత్మలు లేవు అనే హేతువుకీ, ఉంటే తప్పేంటి అనే మనసుకీ నిరంతర ఘర్షణ. మనసు బొత్తిగా బాగోని రోజుల్లో ఇంటికెళ్లడానికి ముందు కావాలనే అక్కడ సైకిల్ ఆపి, కాసేపు నిలబడేవాడిని. ఆ దారిలో ఇంకెవరైనా కనిపిస్తే, సైకిలు చైను ఇబ్బంది పెట్టినట్టు నటించేవాడిని. 

పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న సమయాల్లో 'అతని దారిలోనే వెళ్తే' అన్న ఆలోచనలు బలంగా వచ్చేవి. కానీ, అతను చేసిన పనిని నేను ఏనాడూ మెచ్చక పోగా తీవ్రంగానే వ్యతిరేకించాను, లోపల్లోపలే. ఈ సంఘర్షణ లోంచి కూడా ఎన్నో ప్రశ్నలు పుట్టేవి, అతన్ని గురించి. కాలం గడిచే కొద్దీ నా సమస్యలు రూపం మార్చుకుంటూ వచ్చాయి తప్ప సమసిపోలేదు. నాకు మాత్రం వాటిని ఎదుర్కొనే శక్తి కొద్దికొద్దిగా పెరుగుతూ వచ్చింది. తర్వాత జీవితంలో నా వయసు వాళ్ళ కన్నా పెద్ద వాళ్ళతో సులువుగా స్నేహాలు కుదిరాయి. నా తోటి వాళ్ళకి నా స్నేహాలెప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేవి. 

ముళ్ళూ, రాళ్ల దారుల్లో జీవితపు ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ రోడ్డున వెళ్లేప్పుడు అతనోసారి కనిపిస్తే బాగుండునని బలంగా అనిపిస్తూ ఉంటుంది. తేడా అల్లా ఇప్పుడు నేను ఎదురు చూసేది అతని భుజం కోసం కాదు. నేను చేసిన ప్రయాణాన్ని గురించి చెప్పి, 'నేనే చేసినప్పుడు, నువ్వెందుకు ఈ ప్రయాణం చేయలేకపోయావు?' అని నిలదీయడానికి. 'నువ్వు నాకన్నా చిన్నవాడివి అయ్యుంటే, ఆ నిర్ణయం తీసుకుని ఉండేవాడివి కాదేమో' అని చెప్పడానికి. కానీ లోపలెక్కడో, ఏమూలో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి - 'ఏ పరిస్థితులు, ఏ క్షణాలు అతన్నా నిర్ణయం తీసుకునేలా చేశాయో?' అని. ఈ సంఘర్షణ, బహుశా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే, అతని సమాధి నాకు ఫోటోగా దాచుకునే ఒక జ్ఞాపకం కాదు. అంతకు మించి చాలా చాలా... మాటల్లో చెప్పలేనంత... 

14 కామెంట్‌లు:


  1. // 'ఏ పరిస్థితులు, ఏ క్షణాలు అతన్నా నిర్ణయం తీసుకునేలా చేశాయో?' //

    90 శాతం ఆత్మహత్యల విషయంలో ఇది జవాబు దొరకని ప్రశ్నే. ఆ వ్యక్తి గురించి బాగా తెలిసున్న వారికీ, గమనిస్తున్న వారికీ “పరిస్థితుల” గురించి కాస్తేమైనా ఐడియా తర్వాత విశ్లేషణలో ఏమన్నా కాస్త దొరుకుతుందేమో గానీ ఆ నిర్ణయపు “క్షణాల” గురించి ... ఉహూ కష్టం. అలా అయితే చాలా ఆత్మహత్యలను ముందే ఊహించడం కొంచెం సులువవుతుందేమో? అతను మీతో అంత సన్నిహితంగా ఉన్నప్పటికీ ఇటువంటివి ముందే అనుమానించగలిగే వయసు కూడా కాదు మీది.

    విరామం తరువాత తిరిగి వచ్చి చాలా disturbing టపా వ్రాశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను కూడా డిస్టర్బ్ అవుతూ రాసిన టపా అండీ.. నిజమే, ఇలాంటి విషయాల్లో కంక్లూజన్ తీసుకోవడం చాలా కష్టం. ..ధన్యవాదాలు. 

      తొలగించండి
  2. గుబులుగుబులుగా అయిపోయిందండీ మనసంతా! కొద్ది రోజులే కలిసున్నా, జన్మంతా నన్ను విడవవ్వనిపించే నా స్నేహాలూ కొన్ని గుర్తొచ్చాయి. ఆశా స్నేహం కుదురుకున్నచోట, బాధా, బరువూ దింపుకోవాల్సిన చోట, ఒగ్గే చేవీ, వొంగే భుజమూ అవసరాలైన చోట - ఆత్మలను కూడా చెలిమిగా తప్ప చూడలేని తప్త హృదయపు తునక, ఈ జీవన శకలం - మెత్తగా కోసుకుపోయింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఆత్మలను కూడా చెలిమిగా తప్ప చూడలేని చూడలేని తప్త హృదయపు తునక..." బహుశా కవులే ఇలాంటి భావ ప్రకటన చేయగలరేమో.. ..ధన్యవాదాలండి.. 

      తొలగించండి
  3. అదీ సంగతి ... చిన్న వయస్సులోనే అంత పెద్దోళ్ళతో స్నేహము అందుకే సమంగా స్నేహం కుదురుతుంది ..!!!
    ఇలాంటి అనుభవమే ..మా అమ్మమ్మ వూరు వెళ్తుంటే మొదట్లో సమాధులు టక్కున తల తిప్పుకోవడము ఇప్పటికి ...మీ పోస్టు మనస్సంతా డిస్టర్బ్ అయ్యింది ..ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నాడో హ్మ్మ్ !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "ఎందుకా నిర్ణయం?" అన్న ప్రశ్నకి నాకు పదుల్లో జవాబులు దొరికాయండి.. వాటిలో ఏదన్నా కావొచ్చు, ఏదీ కాకపోవచ్చు.. అతని జీవితం కదా.. ..ధన్యవాదాలు.. 

      తొలగించండి
  4. దాదాపు ఓ పదిసార్లు పైనే చదివుంటాను దీన్ని...

    ఒక ఆర్నెల్ల క్రితం...ఓ వ్యక్తిగత సమస్యతో విపరీతమైన ఒత్తిడికి గురైన సమయంలో ఒకానొక మధ్యాహ్నం ఉన్నట్టుండి నన్నావరించిన ఆ అంతులేని నిరాశ ఇప్పటికీ నన్ను భయపెడుతుంది. పోలికతో చెప్పాలంటే ఒక భయంకరమైన సుడిగుండం నన్ను లోపలికి లాక్కోవాలని ప్రయత్నిస్తుంటే నాలోని మరో శక్తి సర్వశక్తులూఒడ్డి దాన్నుంచి నన్ను దూరంగా లాగేయడానికి చేసే విశ్వప్రయత్నం.దాదాపు ఒక రెండు మూడు గంటల భయంకరమైన అనుభవం అది.. I am absolutely fine now.

    ఇప్పుడెక్కడున్నాడో ఏంచేస్తున్నాడో గాని నాక్కూడా దాదాపు ఇటువంటిదే ఒక జ్ఞాపకం. నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా,తనేమో డిగ్రీ మొదటి సంవత్సరమో లేక రెండోదో.ఏం మాట్లాడుకునేవాళ్ళమో అస్సలు గుర్తులేదుగాని తను రాసిన కవితలూ,వేసిన బొమ్మలూ(జడ ముందుకేసుకొని వాకిట్లో వయ్యారంగా నిలబడ్డ అమ్మాయి లాంటివి..(బాపూ గారి ప్రభావమనుకుంటా...). అలానే శ్రీశ్రీ, తిలక్ గార్ల కవితల్లోంచి సేకరించిపెట్టున్న కొన్ని పంక్తులూ చదివి వినిపించేవాడు..కొన్ని నాటకాలూ చదివినట్టు గుర్తు..నాకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసాడాయన..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "I am absolutely fine now." ఈ వాక్యం చదివే వరకూ గుండె అదిరిందండి.. మీలోని మరో శక్తికి శతకోటి వందనాలు. ..ధన్యవాదాలు 

      తొలగించండి
  5. ఎలా స్పందించాలో తెలియక చాలాసార్లు వచ్చి వెళ్ళిపోయానండీ. ఇప్పుడు కూడా తెలియట్లేదు.

    రిప్లయితొలగించండి
  6. హృదయం భారమైపోయిందండీ.. మీరన్నట్లు అతని జీవితం కదా ఎవరమూ కారణాలు వెతకలేం.. కొన్ని జ్ఞాపకాలంతే వెంటాడుతూ ఉంటాయి. మీ పోస్ట్ చదువుతుంటే నాకు ఇంటర్మీడియట్ లో అతి తక్కువ పరిచయంతోనే ఆప్త మిత్రుడై అంతలోనే అనారోగ్యంతో దూరమైన ఓ మిత్రుడు గుర్తొచ్చాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా సులువుగా జడ్జ్ చేసి తీర్పులు చెప్పేసేవాళ్ళని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమేనండీ.. అతన్ని గురించి ఎన్ని తీర్పులు విన్నానో మా ఊళ్ళో. ..ధన్యవాదాలు

      తొలగించండి
  7. ఎందుకో తెలీదుగాని ఈ పోస్ట్ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది...బహుశా అతను అలా చేసాడని రాసిన విషయం అబద్దం అని ఎక్కడైనా చెప్తారని మనసు ఆశించింది కాబోలు! చదివిన ప్రతీసారి మనసంతా ఓకేలాంటి ఆర్ద్రత. మిమ్మల్ని గట్టిగా hug చేసుకోవాలనిపించింది ఇన్ని సంవత్సరాలుగా ఆ జ్ఞాపకాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనీయకుండా అలానే మనసులో ఉంచుకున్నందుకు. పది సంవత్సరాలు తర్వాత మళ్ళీ పల్లేటి గుర్తొచ్చాడు ఈ పోస్ట్ చదివాక

    రిప్లయితొలగించండి
  8. మీ వ్యాఖ్య చాలాసార్లు చదువుకున్నానండి.. యేమని జవాబివ్వాలో కూడా తెలియడం లేదు. ...ధన్యవాదాలు. 

    రిప్లయితొలగించండి