"ఒక్క మాటు ఇలా తోట లోంచి వెళ్లి, మా బామ్మగారు రమ్మంటున్నారు అని శాయమ్మకి చెప్పు బాబూ.. అందరూ వచ్చేశారు, మీకోసమే చూస్తున్నారు అని కూడా చెప్పేం.. మర్చిపోవద్దు..." ఓ నాలుగు సార్లు బామ్మచేత ఇలా బతిమాలించుకుని, అడ్డదారిన శాయమ్మ గారి ఇంటికి పరిగెత్తాను నేను. అప్పటికే రాజ్యం గారింటికీ, జగదాంబగారింటికీ రెండేస్సార్లు వెళ్లి రావడం అయ్యింది, జల్లెడ కోసం. ఆ మధ్యలోనే మావిడికాయలన్నీ గోలెంలో వేసి బాగా కడిగేసి, ఆరబెట్టేశాను. చిన్నపిల్లాడినన్న పేరే కానీ ఎన్నిపనులో. కొత్తావకాయ ఊరికే వస్తుందా మరి?
నాకసలు అలా ఇంట్లోనుంచి బయటికి తిరగడం అంటే భలే సరదా. రోజూ అలా తిరగడానికి ఉండదు కదా. అలా అని బామ్మ అడిగిన వెంటనే పని చేసేశామనుకో, ఇంక బతిమాలదు మనల్ని. అదే కాసేపు ఆగితే దార్లో తినడానికి ఏదో ఒకటి పెట్టి మరీ పంపిస్తుంది. ఇట్టే వెళ్లి అట్టే శాయమ్మ గారిని తీసుకొచ్చేశాను. వేసంకాలం సెలవలు కదా, బడి లేదు. ఆవకాయ పనులకోసమని మధ్యాహ్నం భోజనాలు తొరగా అయిపోయాయి. అమ్మ, బామ్మ వరస చూస్తుంటే కాఫీలు కూడా ఉండేలా లేవు.
కారాలు దంపడానికి మంగమ్మా, సుబ్బలక్ష్మీ వచ్చేశారు. అమ్మ అప్పటికే కుంది రోలు, రోకళ్ళు కడిగి పెట్టేసింది. పెద్ద పెద్ద పొట్లాల్లో ఉన్న ఎండు మిరపకాయలు, ఆవాలు పళ్ళాల్లో పోసి ఎండలో పెట్టేసింది. జాడీలో ఉన్న రాళ్లుప్పు కూడా విడిగా ఎండబెట్టేసింది. కుంది రోలు తులసి కోట పక్కకి లాక్కుని, "ముందర కారం కొట్టేత్తావండి" అంటూ మిరపకాయలు అందుకున్నారు ఆడవాళ్ళిద్దరూ. అమ్మేమో దంపిన కారం జల్లించడానికి సిద్ధంగా ఉంది. చూస్తుండగానే ఖణేల్ ఖణేల్ మంటూ రోకలి చప్పుళ్ళు మొదలైపోయాయి పెరట్లో. "ఇదిగో మంగమ్మా, భద్రం. గతమాటు నీ విసురుకి రోకలి పొన్ను విరిగిపోయింది," బామ్మ జాగ్రత్తలు మొదలు పెట్టేసింది.
శాయమ్మ గారు మావిడికాయలు తరగడానికి కూర్చున్నారు. నాకేమో తరిగిన ముక్కలు తుడిచే పని. అసలు ఆవకాయ పెట్టడంలో అన్ని పనులకన్నా కష్టమైనదీ, జాగ్రత్తగా చేయాల్సిందీ ఇదే. ఓ పాత గుడ్డతో తరిగిన ప్రతీ ముక్కనీ జాగ్రత్తగా తుడవాలా. పెచ్చు మీద ఓ చిన్న మైకా కాగితం లాంటి పొర ఉంటుంది. అది ఊడి చేతిలోకి వచ్చేదాకా ఊరుకోకూడదు. గోకైనా తీసేయాలి. అలా తియ్యలేదనుకో, ఆవకాయ్ పాడైపోతుంది. నేనొక్కడినీ అంత ముఖ్యమైన పని చేస్తున్నాననైనా లేకుండా, మధ్య మధ్యలో బామ్మ బోల్డన్ని ఆర్డర్లు.
కారం ఓ నాలుగు దంపులు దంపేసరికి మంగమ్మ బుగ్గనేసుకోడానికి బెల్లమ్ముక్క అడిగింది. అలా వేసుకుంటే దంపడం సులువౌతుందిట. ఏమిటో, నా పనికే ఏ సులువులూ లేవు. "దేవుడు గదిలో నీలం మూత సీసాలో బెల్లం ముక్కలు ఉంటాయి, నిమ్మళంగా సీసా పట్టుకురా నాయినా" అంది బామ్మ. అసలు ఎవరూ చెప్పకుండానే ఆ సీసా ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. ఎలా తెలుసో ఎవరికీ చెప్పననుకో. ఓ బెల్లమ్ముక్క గుటుక్కుమనిపించి, సీసా తెచ్చి బుద్ధిగా బామ్మకిచ్చా. మంగమ్మతో పాటు బామ్మ నాకూ ఓ ముక్కిచ్చింది "మా నాయినే" అంటూ. ఈ ముక్క బుగ్గనేసేసుకున్నా.
నేనెంత తొరగా తుడుస్తున్నా, శాయమ్మ గారు గబాగబా కోసేస్తున్నారు కదా. తుడవాల్సిన ముక్కలు పెరిగిపోతున్నాయి. దంపేవాళ్ళు ఉస్సు అస్సు అంటున్నారు.. అందరికీ చెమటలు కారిపోతున్నాయ్. ఇలాంటి పని ఏ రాత్రో పెట్టుకోవాలి కానీ, ఈబామ్మకేంటో ఏవీ తెలీదు, చెప్పినా వినదు. చూస్తుండగానే అన్నేసి మిరపకాయలూ దంపడం అయిపోయింది. మజ్జిగ తేట తాగేసి ఆవాలు రోట్లో పోసుకున్నారు వాళ్ళు. శాయమ్మ గారు చెప్పినట్టు వాళ్ళంత గబగబా చేయడం మనకి రాదు. బామ్మ కూడా మధ్యలో ముక్కలు తుడవడానికి వచ్చింది కానీ, మళ్ళీ ఏదో పనుందని వెళ్ళింది.
మొత్తానికి మా ముక్కల పని అయ్యేసరికి, వాళ్ళు ఆవపిండి, ఉప్పు కూడా దంపేసి, కూరా పులుసూ పట్టుకుని వెళ్ళిపోయారు. అమ్మ అప్పటికే కడిగి ఆరబెట్టిన పెద్ద జాడీని తులసికోట దగ్గరికి పట్టుకొచ్చింది. జాడీ ఎంత ఉంటుందంటే, అందులో నేను ములిగిపోతాను. అప్పటికి నీరెండ పడుతోంది. బామ్మ, నేను తుడిచిన మావిడి ముక్కలు, ఉప్పు, కారం, ఆవపిండీ జాడీలోకి దింపి బాగా కలుపుతోంటే, అమ్మ నూని కేన్లు బయటికి పట్టుకొచ్చింది. ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే, శాయమ్మ గారి పర్యవేక్షణలో అమ్మ, బామ్మ కలిసి ఆ నూనంతా జాడీలోకి వంపేసి, బాగుచేసిన మెంతులు జాడీలో పోసి బాగా కలిపేశారు. అంతే, ఆవకాయ పెట్టడం అయిపోయింది. జాడీని దేవుడి గదిలోకి సాయం పట్టేశారు.
మూడో రోజు సాయంత్రం నేను అన్నం తింటోంటే "కాస్త రుచ్చూడు" అంటూ కొత్తావకాయ విస్తట్లో వేసింది బామ్మ. ఓ ముద్ద తిని, "కొంచం ఉప్పగా ఉంది" అన్నాన్నేను. అంతే, బామ్మకి కోపం వచ్చేసింది. "దీపాలెట్టాక ఉప్పు ఉప్పు అనకూడదు.." అంటూ వాదించేసింది. మరి ఉప్పుడుపిండి కావాలంటే ఏమని అడగాలో? రాత్రి అన్నంతిన్న నాన్న, తాతయ్యా కూడా అదే మాట, ఉప్పు తగులుతోందని. ఈసారి బామ్మకి కోపం రాలా. "నేను జాగ్రత్తగానే చూశాను, శాయమ్మ ని కూడా చూడమన్నాను. సాయంత్రం చంటాడూ ఉప్పన్నాడు కానీ, వాడి మోహం వాడికేం తెలుసులే అనుకున్నాను" అంది, నేను నిద్రపోతున్నాననుకుని. "రేపు తిరగేశాకా కూడా తగ్గకపోతే, ఓ నాలుక్కాయలు తరిగి పడేద్దావండత్తయ్యగారూ" అని అమ్మ అనడం కూడా వినిపించింది నాకు. పెచ్చులకి మాత్రం ఎవరూ పేరు పెట్టలా... ఏడాదంతా అయ్యింది కానీ, ఒక్కళ్ళకీ విస్తట్లోకి మైకా కాయితంముక్క రాలేదు.
మీ చిన్ననాటి కబుర్లు ఎప్పటిలాగానే అందంగా ఉన్నాయి మురళి గారు... మీ టపా చదువుతూ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ మామిడి పెచ్చులు తుడుస్తున్న బాలమురళి కళ్ళ ముందు మెదిలాడు. చాలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండిచెప్పడం మరిచాను ఈ మధ్య మళ్ళీ నాకో వ్యసనం అలవాటైంది :-) సాథారణంగా రాత్రి పన్నెండు తర్వాత పడుకునే నేను ప్రతిరోజు పడుకునేముందర ఈ రోజు మురళిగారు ఏం టపాయించారో అనుకుంటూ మీ బ్లాగుకు వచ్చి రిఫ్రెష్ కొట్టడం అలవాటైంది :-) మీ టపాలు ఇలా తరచూ చదవడం చాలా సంతోషంగా ఉంది.
ముందుగా మీకు బోలెడు థాంక్సులు - మళ్ళీ మీ జ్ఞాపకాలలోంచి ఒకటి ఇంత చక్కగా పంచినందుకు.
రిప్లయితొలగించండి>>> ఎంతనూనో! ఆ నూనితో ఎన్నేసి జంతికలూ, చేగోడీలూ, పాలకాయలూ చేసుకోవచ్చో నేను లెక్కలేసుకుంటుంటే,
ఇది సూపర్.
మా ఇంట్లోకూడ ఇంచుమించు ఇవే దృశ్యాలు. పోయిన వారాంతమే ఇంట్లో రోలుని ఒక పోర్షను నుంచి ఇంకో పోర్షనుకి రుబ్బడానికి వీలుగా జరిపివచ్చా.
నాకు ముక్క తుడవడం, మధ్యలో ఆవాలు, నూనెలాంటివి ఏదైనా తక్కువైతే ఎండలో కొట్టుకెళ్ళి రావడంలాంటి చిన్నచిన్నవాటితో పాటు ఇచ్చే ముఖ్యమైన పని మాగాయ కాయలకి చెక్కుతీయడం :-)
కొ.మె.: మీరు ఈ మధ్య టపాలు వేగంగా రాస్తున్నారే! :-)
ఆవాయోపఖ్యానం చాలా బాగున్నది. చక్కగా వ్రాసారు. ఆవగాయలో శనగలు కూడా వేస్తారు. కొత్త ఆవగాయ తినేప్పుడు అవి ఇంకా గట్టిగానే ఉంటాయి. కొన్నాళ్ళకి ఊటలో బాగా నాని భలే రుచిగా ఉంటాయి.
రిప్లయితొలగించండిబాగున్నాయి మీ చిన్నప్పటి ఆవకాయ జ్ఞాపకాలు.
రిప్లయితొలగించండిమా అమ్మ కారం దంచేటప్పుడు బయటకి రానిచ్చేది కాదు
కిటికీల్లోంచి తొంగి చూసి ఆనందించటమే.
chaalaa baagundanDi! kottaavakaaya peTtaeyyaalanae feel vachchaesindi.
రిప్లయితొలగించండిఇలా ఎలా రాసెయ్య గలుగుతున్నారు మురళీ గారూ. సుమన్ బాబు సినిమా కథ, కొత్తావకాయ ఙ్ఞాపకాలు, హింది డబ్బింగ్ సినిమాలు, మంచి పుస్తకాలు ఇలా చిన్న పాయింట్, చక్కటి శైలి, వేగంగా టపాలు. నా మటుకు నాకు ఉల్లిపాయ పకోడీలు గుర్తొస్తాయి మీ టపాలు చదువుతుంటే, అందులోనూ అంతే కొంచం ఉల్లి, కొంచం పిండి, కొంచం ఉప్పు, ఎక్కువ నూనె.. ఒక్కో ముక్కా చిన్నది అలా వేస్తే నోటిని వదిలి పెట్టవు.
రిప్లయితొలగించండి--సూరంపూడి పవన్ సంతోష్
మురళి గారు, మీకు ఆవకాయ పెట్టటం బాగా వచ్చన్నమాట. సీజన్ కి తగ్గ టపా. ఎన్నో రకాల ఆవకాయలుంటాయిగా. అవన్నీ పెట్టేవారా మరి. మీ వైపు మాగాయ పెడ్తారా. మీ స్పెషల్స్ ఏమిటి. అన్నీ సంవత్సరం లోపలే అయిపోగొట్టేస్తారా. కొత్తలో ముక్కల పచ్చడి లాంటివి ఏమన్నా చేస్తారా. తియ్యావకాయ కూడా చేస్తారా. వేరే వాళ్ళకి కూడా సహాయం చేసే వారా. అలిసిపోయానండి. ఇంక నా ప్రశ్నలు ఆపేస్తాను. మీరు మాత్రం అన్నిటికీ సమాధానం చెప్పల్సిందే:)
రిప్లయితొలగించండిబాగున్నాయి మురళి గారు కొత్త ఆవకాయ కబుర్లు. మా ఇంట్లో కూడా దాదాపు గా ఇలానే వుండేది ఆవకాయ ప్రహసనం. కాని ఆవకాయముక్కలని అదో రకం పెద్ద చెక్కపీట మీద కత్తి లాంటి దాని కింద పెట్టి పాలేరు టపా టపా మని కొట్టే వాడు. ఎక్కడైనా నుజ్జు ఐతే మా అమ్మ వొరే జరుగులు వొరే జరుగులు అనే మందలింపుల నేపధ్యం లో. :-)
రిప్లయితొలగించండిAs usual..wonderfully written sir !
రిప్లయితొలగించండిపచ్చడి పెట్టడం మొదలు పెట్టిన దగ్గరి నుండి తిని రుచి చూసే దాకా చాలా చక్కగా చెప్పారు మురళి గారు..
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: చాలా సంతోషంగా ఉందండీ.. ఇంచుమించుగా మీరు ఊహించుకున్న దృశ్యమే చిన్నప్పుడు.. రాస్తూ రాస్తూ నేను కూడా అలా వెనక్కి వెళ్ళిపోయాను.. బ్లాగుల్లో మీ పునర్దర్శనం ఎప్పుడండీ?? ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జేబీ: అంటే అప్పట్లో నా ప్రయారిటీ జంతికలూ అవేనండీ.. అందుకనే ఆలోచన అక్కడికే వెళ్ళిపోయేది.. అలా అని ఆవకాయకి అన్యాయం చేసేవాడిని కాదు. అన్నట్టు మాగాయ చెక్కులు నేనూ తీశాను కానీ అది కొంచం పెద్ద కథ అవ్వడం వల్ల ఇందులో కలపలేదు.. అదండీ సంగతి.. ధన్యవాదాలు.
@శివరాం ప్రసాద్ కప్పగంతు: ఆవకాయోపాఖ్యానం :)) ..పేరు బాగుందండీ.. శనగలు మా ఇంట్లో వేసే వాళ్ళు కాదండీ.. ఎందుకో తెలీదు. అయితే శనగలు వేసిన ఆవకాయ మా బంధువుల ఇంట్లో రుచి చూశాను. నాకు మాత్రం ఆ నూనెలో నానిన మెంతులు బాగా నచ్చుతాయి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ఆత్రేయ: చూశారా, చూశారా, మా ఇంట్లో నన్నో బాల కార్మికుడిలా వాడుకున్నారన్న మాట!! :)) నాకు వరసపెట్టి ఓ ఐదారు తుమ్ములు వచ్చేసేవండీ.. అవి అయిపోయనంటే, ఇక ఏ సమస్యా ఉండేది కాదు.. ధన్యవాదాలు.
@సునీత: అవునా? అలా అయితే మీ చేత మాగాయ మరియు ఇతర ఊరగాయలన్నీ పెట్టించేయనా?:)) ఇప్పుడు ఆవకాయలు పెట్టడమూ తగ్గిపోయింది, అందులో పిల్లల పార్టిసిపేషన్ మరీ తగ్గిపోయింది.. ఏమిటోనండీ, కాలమహిమ!! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@పక్కింటబ్బాయి: ఉల్లిపాయ పకోడీలు.. వావ్.. నాకు చాల ఇష్టమైన పోలికండీ.. ఇప్పటికిప్పుడే ఓ టపా రాసేయాలని అనిపిస్తోంది :)) ...ధన్యవాదాలండీ..
@జయ: అమ్మో, అమ్మో.. చిన్న పిల్లాడిని చేసి ఎన్ని ప్రశ్నలు?:)) ...సరేనండీ, వరుసగా చెబుతాను.. మా ఇంట్లో ఆవకాయ, పులిహోర ఆవకాయ, బెల్లం ఆవకాయ పెట్టేవారండీ నా చిన్నప్పుడు. (ఇప్పుడు పెట్టేవారూ, తినేవారూ కూడా లేరు, ఇదో విషాదం). మాగాయల్లో మామూలు మాగాయతో పాటు నూనె మాగాయ పెట్టేవారు. దీనితో పాటు తోక మెంతికాయ అని ఉండేది.. మాగాయ టెంకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ముఖ్యంగా చద్దన్నం, గడ్డ పెరుగు కాంబినేషన్.. (దేవుడా, దేవుడా, ఒక్కసారి టైం మిషన్ ఎక్కించి ఆ కాలానికి తీసుకెళ్ళవా, నీక్కూడా మాగాయ విత్ గడ్డ పెరుగు తినిపిస్తా..) మరేమో అప్పటికప్పుడు తినడానికి ఆవ బద్దలు, మెంతి బద్దలు వేసేవాళ్ళు. తియ్యావకయన్నా, బెల్లం ఆవకాయన్నా ఒకటే కదండీ.. అన్నట్టు మావిడి కాయలు ఇంకా టెంక పట్టకపోతే శాంపిల్ ఆవకాయ పెట్టేవాళ్ళు. సంవత్సరం పూర్తవ్వకుండానే అయిపోయేవండీ. తినడం కన్నా పంచడం ఎక్కువ కదా మా ఇంట్లో. సాయం అంటే, మనకి సాయం చేసిన వాళ్ళు పిలిస్తే వెళ్లి చేసేవాళ్ళు పెద్దాళ్ళు. (పిల్లల్ని రానిచ్చే వాళ్ళు కాదు :() ..అన్నట్టు మా సుబ్బమ్మగారి 'నీళ్లావకాయ' విశేషాలు తెలుసుకదా మీకు?? ...హమ్మయ్య అన్ని ప్రశ్నలకీ జవాబులు చెప్పేశాను. ఎన్ని మార్కులు వస్తాయో ఏమిటో :)) ...ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@భావన: ఈ ముక్కలు కొట్టడం అన్నది నేను కొంచం పెద్దయ్యాక మా బంధువుల ఇంట్లో చూశానండీ.. మా ఇంట్లో మాత్రం ఆవకాయ కాయ తరగడానికి ప్రత్యేకమైన కత్తిపీట ఉండేది, కొంచం పెద్దగా. కొట్టిన ముక్కలతో ఆవకాయ తరిగిన ముక్కలతో ఉన్నంత బాగా రాదన్నది మా బామ్మ నమ్మకం (చాదస్తం అనాలంటారా?) మొత్తానికి మీరుకూడా అలా అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వచ్చేశారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@స్వాతి: ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@రాజి: ఎందుకో గుర్తొచ్చిందండీ.. రాసేశాను.. ధన్యవాదాలు.
మురళిగారు మాగాయ పచ్చడి అంత రుచి గా ఉన్నాయి మీ జ్ఞాపకాలు !
రిప్లయితొలగించండినాకు , మీరు వేణు గారు మాట్లాడుకుంటుంటే ఎక్కువ దేబ్బలాడుకొని ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్న దృశ్యం కనపడుతుంది :)
అమ్మో...అమ్మో...మీరిలా అన్ని ప్రశ్నలకీ సమాధానాలు రాసేస్తారని నేను నిజంగా(నిజ్జంగా నిజ్జం) అస్సలనుకోలేదు. ఒక్క మాత్స్ పేపర్ కి మాత్రమే 100/100 వస్తాయండి. ఇలా జెనెరల్ నాలెడ్జ్ కయితే కావాల్సుకొని మరీ తక్కువ మార్కులేస్తారు:) చిన్నపిల్లలకి ఎక్కువెక్కువ మార్కులేస్తే పాడైపోతారటకదా!!!!
రిప్లయితొలగించండిమీ జ్ఞాపకాల టపాలకి వ్యాఖ్య రాయాలంటే నాకు భయం, నా వ్యాఖ్య టపా అందాన్నెక్కడ చెడగొడుతుందోనని. మీ రచనా శైలి అద్భుతం అన్నమాట కూడా చిన్నదే. కానీ అంతకంటే పెద్ద మాటేమిటో నాకు తెలీదు.
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: 'ఎక్కువగా దెబ్బలాడుకొని' లేక 'ఎక్కువగా దెబ్బలాడుకోని?' ...మొత్తం మీద దృశ్యం మాత్రం బాగుందండీ :)) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@జయ: అన్యాయం.. అన్ని ప్రశ్నలకీ జవాబిచ్చినా మార్కులేయనంటారా? అంతేలెండి, మాస్టర్లదే ఇష్టారాజ్యం!! ..ధన్యవాదాలు.
@శిశిర: ప్రత్యేకత అంటూ ఏమన్నా ఉంటే అది బాల్యానిదేనండీ.. ఆపై మీ అభిమానం, అంతే.. ధన్యవాదాలు.
హ హ తూచ్ తూచ్ "దెబ్బలాడుకోని" "దెబ్బలాడుకోని" :)
రిప్లయితొలగించండి@శ్రావ్య వట్టికూటి: పనిలో పనిగా అన్నెవరో, తమ్ముడెవరో కూడా చెప్పేయండి :))
రిప్లయితొలగించండిహ హ శ్రావ్య గారు మీరూహించుకున్న దృశ్యం చాలా బాగుందండీ :))
రిప్లయితొలగించండిమురళి గారు, నాగురించి చెప్పుకోవాల్సిన కబుర్లు ప్రస్తుతానికి ఏం గుర్తురావడం లేదండీ.. వచ్చిన మరుక్షణం మళ్ళీ వచ్చేస్తాను.
మీ టపాలు ఉల్లిపాయ పకోడీలని పోలిక పెడితే వెంటనే ఓ టపా రాసెయ్యాలనుంది అన్నారు. నేనూరుకుంటానా మీ టపాలకూ ఉల్లిపాయ పకోడీలకూ ఎలా పోలికుందో సిద్ధాంత వ్యాసం లెవెల్లో రాయాలని ఇంకా చాలా చాలా కలిపి రాసేసా
రిప్లయితొలగించండి@వేణూ శ్రీకాంత్: ఆ క్షణం కోసం ఇక్కడ చాలామంది వెయిటింగ్ అండీ మరి..
రిప్లయితొలగించండి@పక్కింటి అబ్బాయి: నాకు రాయాలనిపించింది ఉల్లిపాయ పకోడీల గురించండీ :))) చాలా..చాలా..థాంక్స్ మీకు..
మురళి గారు,
రిప్లయితొలగించండిమా ఇంట్లో మాగాయిపప్పు, మాగాయి పెరుగుపచ్చడి కూడా చేసేవారోచ్ :-) మాగాయిపప్పులో టెంక ఎంతసేపయినా చీకుతూనే ఉండచ్చు.
మాగాయి పెరుగుపచ్చడి మినప రొట్టెలలోకి చాల బావుంటుంది కూడా.
ఇంకా సెనగ ఆవకాయి, పెసర ఆవకాయి కూడా చేసేవారు. కాకపోతే అవి ఎక్కువ కాలం నిలవఉండవు అన్నమాట.
ఉసిరి ఆవకాయి గురించి మీకు తెలిసే ఉంటుంది.
@శ్రీ: మాగాయ పెరుగు పచ్చడి నేనూ రుచి చూశానండీ.. పుల్లట్లలోకి కూడా భలేగా ఉంటుంది కదూ.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి