శనివారం, జులై 11, 2026

ఎస్. జానకి ...

వంశీ సినిమా 'సితార' ప్రారంభంలో సంగీత వాయిద్యాలు గోదారి నీళ్ళమీద తేలుతూ ఉండగా, నేపథ్యంలో సంగీతం వినిపిస్తూ ఉండగా టైటిల్స్ పడతాయి. ఆ వాయిద్యాలన్నీ నీళ్ల మీద తేలుతున్నట్టు కాక, నిప్పుల్లో పడుతున్న భావన కలిగింది, అభిమాన గాయని ఎస్. జానకి ఇక లేరన్న వార్త తెలియగానే. దశాబ్దాల అనుబంధం ఆ గొంతుతో. అతి కొద్దిపాటి పరిచయం ఆ వ్యక్తితో. ఆ గొంతు విన్న ప్రతిరోజూ, ఆ వ్యక్తి రూపం కళ్ళముందు కదలాడుతూ ఉంది కాసేపటి క్రితం వరకూ. ఇప్పుడిక ఒక శూన్యాన్ని ఊహించుకుంటూ ఆమె పాటలు వినాలి కాబోలు. ఆమె పాడిన అన్ని వేల పాటలనీ నేను వినలేదు. కొన్ని వందల పాటల్ని మాత్రమే విని ఉంటాను. వాటిలో కొన్ని పదుల పాటల్ని మాత్రం మళ్ళీ మళ్ళీ విన్నాను, వింటాను. 

జానకి గొంతు పట్ల నాలో కలిగి పెరిగిన మోహానికి ఒకే ఒక్క కారణం ఆ గొంతు పలికించే భావం.. ఎక్స్ ప్రెషన్.. అది మానవ మాత్రులకి అనితరసాధ్యం. ఆమె పాడిన ఏ పదిపాటలనైనా వరసగా విన్నవాళ్ళు ఎదురైనా వెంటనే గమనించే విషయం ఒక్కటే, ఆమె గంధర్వ గాయని అని. ఆమె గొంతు ఏ భావాన్నైనా అలవోకగా పలికించ గలదు. ఎక్కడ, ఏ భావాన్ని ఏ మోతాదులో పలికించాలి అన్నది ఆమెకి బహుశా సుకృతంగా కలిగిన జ్ఞానం. పాట సాహిత్యంలో ఒక్క పదంలోనే, లేదా ఒకే ఒక్క అక్షరంలోనో ఎక్స్ ప్రెషన్ ని తగు మోతాదులో కూరి వినిపించడం జానకికి వెన్నతో పెట్టిన విద్య. 'కీచుగొంతు గాయని' అనే విమర్శని తుత్తినియలు చేయడానికి ఆమెకి అక్కరకు వచ్చినది ఈ విద్యే. ఆ గొంతులో మాధుర్యం లేకపోలేదు, కానీ ఆమె పాటల్లో వినిపించే భావానిదే పైచేయి. 

'ఎందుకో చేరువై, దూరమౌతావు' అని జానకి గొంతులో వింటున్నప్పుడు, 'దూరమౌతావు' దగ్గరకి వచేసరికి తెలుగు తెలియని వాళ్లకి కూడా బెంగ అర్ధమవుతుంది. 'భేషజం చూపుతూ దోహదం చేయవూ..' అంటుంటే సాహిత్యం అర్ధమైన వాళ్ళకీ, కాని వాళ్ళకీ కూడా కవ్వింపు చెవిని తాకుతుంది. అర్ధమైన వాళ్ళకి గిలిగింత కలుగుతుంది, పాట విన్న ప్రతిసారీ. 'ఈ మంచు బొమ్మలొకటై' కళ్ళుమూసుకుని వింటుంటే మంచు బొమ్మలు కరిగి నీరయ్యే దృశ్యం కనిపించకుండా ఉంటుందా? జీవన వేణువులలో మోహన వినిపించకుండా ఉంటుందా?? ఆ గొంతే 'తప్పుడు కథల అప్పారావు జటకా ఎక్కు కోటిపల్లిలో' అంటూ బేరం చేయడం ఎలాగో కొంటెగా నేర్పిస్తుంది. 'అణువు అణువు ప్రణయ మధువు' వింటున్న తనువు శివధనువు కావాల్సిందే కదా. 'ఇవి ఏడడుగులా, వలపు మడుగులా' మడుగులు కట్టిన వలపు చెవుల్లోకి ప్రవహిస్తున్న భావన. 

Google Image

ప్రత్యేకంగా చెప్పాల్సింది సినిమాయేతర పాటల్ని గురించి. తన అక్క కొడుకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీత సారధ్యంలో అన్నమయ్య సంకీర్తనలు కొన్ని రికార్డులు ఇచ్చారు జానకి. వాటిలో నేను తరచూ వినే కీర్తన 'రాధా మాధవ రతిచరితం'. శృంగార ప్రధానమైన ఈ కీర్తనని చాలాసార్లు విన్న తర్వాత అర్ధం తెలుసుకున్నాను. అయితే, కీర్తనలో భావం మనసుకి పట్టేయడం వల్ల కావచ్చు, ఆ అర్ధం కొత్తగా తెలుకున్నట్టుగా కాక, తెలిసిన విషయాన్ని మళ్ళీ వింటున్నట్టుగా అనిపించింది. త్యాగరాజ కీర్తనల్లో 'నగుమోము..' రికార్డు నాకెంతో ఇష్టమైన జేసుదాస్ తో సహా ఎంతోమంది గాయకుల గొంతుల్లో అందుబాటులో వుంది. కానీ నేనెప్పుడూ వినేది జానకి పాడిన కీర్తనే. ఆమె గొంతులో 'గగనానికి ఇలకీ..' ఇప్పుడు విన్నా తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. 

'పాడుతా తీయగా' కార్యక్రమం మొదలైన కొత్త రోజులు. మిత్రుల ఇంట్లో టీవీలో వాళ్ళతో కలిసి ప్రోగ్రాం చూస్తున్నా. సెమీ ఫైనల్స్ అని జ్ఞాపకం. ఒకమ్మాయి చాలా బాగా పాడుతోంది. "ఈ అమ్మాయి సినిమాల్లో ప్రయత్నిస్తే మంచి గాయని అవుతుంది" ఆ ఇంట్లో పెద్దావిడ అన్నారు. "జానకికి రాంప్రసాద్ దొరికినట్టుగా, మంచి భర్త దొరికితే..." అనేసి ఆగిపోయాను. తెలియకుండానే లోపల్నుంచి వచ్చేసిన మాట అది. ఇప్పుడున్నన్ని వీడియో ఇంటర్యూలు అవీ అప్పటికి లేకపోయినా, భర్త నుంచి, అత్తమామల నుంచీ జానకికి దొరికిన ప్రోత్సాహం తెలుసు. ఆ ప్రోత్సాహం లేని కారణంగా ఇబ్బందులు పడ్డ గాయనుల కథలూ తెలుసు. అందుకే కాబోలు, ఆమె పాటకి గొప్ప సపోర్ట్ సిస్టమ్ నిలబడ్డ రాంప్రసాద్ గారంటే గొప్ప గౌరవం నాకు. వాళ్ళ ఏకైక సంతానం మురళీకృష్ణ, 'శ్రుతిలయలు' సినిమాలో నటించాడు. 

పాతికేళ్ళకి అటూ ఇటూగా ఒకనాడు జానకిని కలిసి కాసేపు మాట్లాడే అవకాశం దొరికింది, చాలా యాదృచ్చికంగా. ఆవేళ సాయంత్రం ఆవిడ పాట కచేరి, సన్మానం. కొడుకుతో కలిసి ఆమె ఓ హోటల్లో దిగారు. నిర్వాహకులు ఆమెని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్తూ, కూడా నిలబడమన్నారు. అప్పటికి ఆమె ఫోటోలు చూడడమే. మధ్యతరగతి గృహిణిలా, ఇంకా చెప్పాలంటే దగ్గరి బంధువులా అనిపించారు. ఎక్కడ మొదలయ్యాయో గుర్తు లేదు కానీ, కబుర్లు ఎడతెగకుండా సాగిపోతున్నాయి. కొద్ది నిముషాలు గడిచేసరికి భగవంతుడు స్నేహితుడిగా మారిపోయిన భావన. ఆ గదిలో మా ఇద్దరి గొంతులే వినిపిస్తున్నాయి, ఒకటి సంగీతం, మరొకటి చప్పుడు. మిగిలిన వాళ్ళు శ్రోతలు. 

ఉన్నట్టుండి అపశృతి, "వాళ్ళని పంపుతావా?" విసుగు నింపుకున్న మురళీకృష్ణ గొంతు. ఆమె ఏకాలంలోనే తల్లీ, అతిధేయి కూడా అయ్యారు. "వస్తున్నాను నాన్నా" అని అక్కడా, "మీరు మద్రాసు రండి, మనం మాట్లాడుకుందాం" అని నాకూ ఒకే లాలనతో చెప్పారు. ఆ ఆహ్వానం చెవుల్లో మారుమోగుతూనే వుంది, ఇప్పటికీ. కొడుకు ప్రభావం ఆమె మీద చాలానే వుంది. కేవలం అతని పట్టుదల వల్లనే ఆమె  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాన్ని తిరస్కరించారని వినిపించిన వార్తలు నిజమే అయి ఉంటాయని నా నమ్మకం. 'భారత రత్న' కి ఆమె అర్హురాలని అతనికి మాత్రమే కాదు, అభిమానుల అందరికీ నమ్మకం. పురస్కార ప్రదాతలకి ఆ నమ్మకం కలగాల్సివుంది. ఇప్పుడు ఆమె లేదు, కానీ ఆమె పాటలు నిలిచి వుంటాయి, కనీసం కొన్ని తరాల పాటు.