గురువారం, జనవరి 24, 2019

పదేళ్ల పండుగ

అసలైతే గడిచిన ఏడాదంతా విస్తృతంగా టపాలు రాసేసి 'దశాబ్ది ఉత్సవాలు' ఘనంగా నిర్వహించాలని బోల్డన్ని ప్లాన్లేసుకున్నాను. 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అని 'మనసుకవి' అల్లప్పుడెప్పుడో చెప్పేశారు కదా. అందుకనే, ఆయనే చెప్పినట్టు 'జరిగేవన్నీ మంచికని' సరిపెట్టేసుకుని, ఈ పుట్టిన్రోజు పోస్టు రాయడానికి ఉపక్రమించానన్నమాట. ఇంకెందుకాలస్యం? 'అక్షింతలు' తీసుకుని రండి. 'నెమలికన్ను' కి పదో పుట్టినరోజు ఇవాళ!!

మార్కులు తక్కువొచ్చాయని ప్రోగ్రెస్ కార్డు చూపించడం మానెయ్యకూడదు కదా. చిన్న చిన్న తొండిలు చేయడం కూడా నేర్చుకోకుండానే రోజులెళ్ళిపోతున్నాయి, ఏవిటో. ఎప్పటిలాగే సమీక్ష లోకి వచ్చేస్తే, ఏడాది మొత్తంలో రాసి అచ్చేసిన పోస్టుల సంఖ్య అక్షరాలా పదహారు. అదృష్టం బానే ఉన్నట్టుంది, మరీ 'అంకె' అనికాకుండా 'సంఖ్య' అని రాయగలిగా. ఈ పోస్టులని గురించి వెనక్కెళ్ళి ఆలోచించడం అంటే, గడిచిన ఏడాది జీవితాన్నీ తిరగతోడుకోవడమే.

ఒక్కమాటలో చెప్పాలంటే కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగిన ఏడాది. సంవత్సర కాలాన్ని గంటల్లోకి మార్చుకుని, రకరకాల వాహనాల్లో ప్రయాణం చేసిన గంటల్ని పక్కన వేసి ఓ టేబుల్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది కానీ, దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు కదా. నిజానికి ప్రయాణాలు చేసేప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కథల్లాంటి వాటితో సహా అనేక బ్లాగు పోస్టులు అలా ప్రయాణాల్లో చేసిన ఆలోచనల నుంచి వచ్చినవే. కాకపొతే, గతేడాది ప్రయాణాల్లో బుర్రలో అలాంటి మెరుపులేవీ మెరవలేదు.

Google Image
టపాలకు మరో ముఖ్యమైన ముడి దినుసు పుస్తకాలూ, సినిమాలూను. పుస్తకాల విషయానికి వస్తే ఎక్కువగా రివిజన్ మీదే నడిచింది బండి. వాటిలో కొన్ని రాయాల్సినవి ఉన్నాయి. కొత్తగా చదివినవి బహు తక్కువ. పైగా, ఒకేసారి నాలుగైదు పుస్తకాలు మొదలెట్టడం అనే అలవాటు పెరిగి పెద్దదయ్యింది. దీంతో, రోజులు గడుస్తున్నాయి కానీ, ఏ పుస్తకంలోనూ పట్టుమని వంద పేజీలు కూడా కదలడం లేదు. దీనికేదో పరిష్కారం వెతకాలి. సినిమాల విషయానికి వస్తే, మంచి సినిమాలేవీ మిస్సవ్వలేదు కానీ చూసిన చాలా వాటిని గురించి పోస్టులు రాయలేదు.

చాలా రోజులుగా నానుతున్న ఆలోచనలు కొన్ని ఉన్నాయి. వాటిని రాయడం అంటూ జరిగితే ఇక్కడే రాయాలి. మొదలు పెడితే తప్పించి అవి ఏ రూపు తీసుకుంటాయన్నది చెప్పడం కష్టం. కాళ్ళ చక్రాలకి ఇప్పుడు మరీ ఎక్కువ పని చెప్పడం లేదు కాబట్టి, ఇకపై కొత్తవి చదవడంతో పాటు ఆలోచనలని ఇక్కడ పంచుకునే ప్రయత్నాలు చేస్తానేమో. 'చేస్తాను' అని ధైర్యంగా చెబుదామంటే పదహారు పోస్టులూ వెక్కిరిస్తున్నాయి మరి.

ఏడాది సంగతి ఇలా ఉండగా, బ్లాగరుగా దశాబ్ద కాలం పూర్తి చేసుకోడం కూడా నా ప్రమేయం పెద్దగా లేకుండా జరిగిపోయిన విషయం. నా పాటికి నేను రాసుకుంటూ ఉండగా, కాలచక్రం అలా దొర్లిందన్న మాట. మాంఛి ఉధృతంగా మొదలైన బ్లాగింగ్ మందకొడిగా మారడం ఈ పదేళ్లలోనూ సంభవించిన పరిణామం. అయితే, ఏడాది నిరాశ పరిచినట్టుగా దశాబ్ది పరచలేదు. వెనక్కి చూసుకుంటే బోలెడన్ని మెరుపులు కనిపిస్తున్నాయి నాకు. రాయాల్సిన విషయాలూ గుర్తొస్తున్నాయి..

పాఠకులందరికీ మరోమారు మనఃపూర్వక ధన్యవాదాలు!!

23 కామెంట్‌లు:

  1. శుభాభినందనలు, మురళిగారు! నేను మీ బ్లాగ్‌లో పుస్తక సమీక్షలు చదివి ఎన్నో మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. Thank You!

    రిప్లయితొలగించండి
  2. 'బ్లాగు తల్లిలాంటిది..' అని గూగుల్ బజ్ రోజుల్లో మీరన్నమాట గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను.. అమ్మలా, నేస్తంలా అక్కున చేర్చుకున్న బ్లాగుకి ఎంత ఋణపడిపోయానో అని. ఎప్పటికీ తీర్చుకోలేను బహుశా..

    మీ కలానికి విశ్రాంతినిచ్చారిన్నాళ్ళూ.. ఆ చక్రాలేవో దానికి కట్టేయండి. బోలెడన్ని పుస్తకాలు, చూడదగిన సినిమాలు, మంచి ఆలోచనలిచ్చే ప్రయాణాలూ ఈ యేడాది మీకు ఎదురవ్వాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, నెమలికన్నుకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీకు హేపీ న్యూ ఇయర్..

    రిప్లయితొలగించండి
  3. Congratulations on completing a decade in blogging. Not all bloggers achieved this feat. your blog is special one dedicated to literature, movies and reviews. I regularly follow your posts. Please do not stop blogging. I have been following blogs for last 8 years, I dont know why few famous bloggers left without notice and they closed their blogs also. it was a golden period for telugu blogs till 3 years ago.

    రిప్లయితొలగించండి
  4. కొత్తావకాయ గారూ మీ తల్లిని అసాంతం మర్చిపోయారనుకుంటా ! మురళిగారు కనీసం పదహారు పోస్టులన్నా వ్రాసారు. మీరు మరీ నల్లపూసయిపోయారు. కాస్త సొరంగం లో నుండి పుట్టింటివైపు చూడండీ :)

    రిప్లయితొలగించండి
  5. మురళీరవం మందంగానే అయినా మంద్రంగా వినబడుతూనే ఉంది కదా... దశాబ్ద కాలం పాటు రచనా అభ్యాసాన్ని విడిచిపెట్టకపోవడమూ ఘనతే. శంకరమంచి సత్యం గారి నెమిలికంఠం రంగు చీర లాంటి మీ బ్లాగు మరింత వన్నెతేరాలని ఆశంస.

    రిప్లయితొలగించండి
  6. Hi...I am following your blog since 8 years..great work. Congratulations on 10 the anniversary

    రిప్లయితొలగించండి
  7. ముందుగా పదేళ్ళ పండుగ శుభాకాంక్షలు .. ఆఫీసు రాగానే మొదటి చేసే పని మీ బ్లాగు ఓపెన్ చేయడం .. తరువాత స్మార్ట్ ఫోన్లు రావడంతో లేవగానే చూడటం.. తరువాత మీ పోస్టులు తగ్గిపోవడంతో ఆ అలవాటు నెమ్మదిగా తగ్గిపోయింది .. మీ సమీక్ష చదవకుండా ముందు పుస్తకాన్ని చదవడం .. తరువాత మీ సమీక్ష చదివాకా మరలా పుస్తకాన్ని చదివాక అరే ఈ కోణంలో కూడా చదవచ్చా అని ఎన్ని సార్లు అనుకున్నానో.. ఇంట్లో కూడా మొన్నేగా ఆ పుస్తకం చదివావు మరలా చదువుతున్నావేంటి అని చాలా సార్లు అడిగారు, మీ వల్ల చాలా పుస్తకాలు రెండు సార్లు చదవాల్సివచ్చింది :) కొత్త సమీక్షలు తగ్గిపోయినా ఇప్పుడుకూడా ఏదైనా చదువుతుంటే అనుకుంటా ఈయనైతే ఎలా దీన్ని అర్ధంచేసుకొంటారు అని ... మీ సమీక్షలతో పోస్టులతో ఒక పుస్తకం తీసుకువస్తే బాగుంటుందేమో

    రిప్లయితొలగించండి
  8. Hi sir.. Thank you for your blog... Its been a great journey. I have been reading your blog since 2010. I bought so many books after reading your reviews and watched movies with the effect of your blog! Hapyy Birth Decade and Happy New year

    రిప్లయితొలగించండి
  9. @విన్నకోట నరసింహారావు: అదికూడా అప్రయత్నంగానండీ :) ..ధన్యవాదాలు
    @ధాత్రి: ధన్యవాదాలండీ
    @లలిత టీఎస్: చాలా సంతోషం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @కొత్తావకాయ: నేను రాయాలనుకున్నదే నీహారిక గారు చెప్పారు. "తీర్చుకోలేను" అనేస్తే సరిపోదు కదండీ.. ధన్యవాదాలు.
    @Unknown: అయ్యో.. నేను ఆపాలని అనుకోడం లేదండీ.. వీలైనంత తరచుగా రాయాలనే ప్రయత్నం.. ధన్యవాదాలు.
    @నీహారిక: పదహారుకి పాస్ మార్కులు వేశారయితే :) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @ఫణీన్ద్ర : ధన్యోస్మి
    @క్రాంతి: థాంక్యూ

    రిప్లయితొలగించండి
  12. @సురేష్ మోహన్: చాలా చాలా సంతోషం అండీ.. పుస్తకం ఒకటే అయినా ఒక్కొక్కరు చదివే పధ్ధతి ఒక్కోలా ఉందనుకుంటాను.. మీ అభిమానానికి ధన్యవాదాలు.
    @నీలకంఠ: చాలా చాలా సంతోషమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. పది సంవత్సరాలా.... జారిపోతున్న కాలం తో పాటూ తరిగిపోతున్న బ్లాగ్ బంధాలూ కనిపిస్తున్నాయండి.:( అప్పుడప్పుడూ మీ బ్లాగే చూస్తున్నాను. కొంచెం తృప్తిగా అనిపిస్తుంది...కృతజ్ఞతలు, ధన్యవాదాలూ...అభినందనలండి మురళి గారు.

    రిప్లయితొలగించండి
  14. @జయ: కాలంతో పాటు మార్పు సహజం అనుకోవాలేమోనండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. నీహారిక గారూ, సొరంగమైతే పరవాలేదండీ.. ఊబిలో కొట్టుకుంటున్నాను. చురుక్కుమనిపించారుగా అసలు..! Enjoyed your comment! :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ కోరికల లిస్ట్ లో బెడ్ రూం నుండి పుట్టింటికి సొరంగం ఉంటే బాగుండు అని వ్రాసారు కదా అందుకే అలా వ్రాసాను.అంతేలెండి సంసారంలో "సరిగమలు" తప్పవుగా !

      తొలగించండి
  16. అభినందనలు మురళి గారు.
    మీరు ఈ మధ్య తక్కువగా వ్రాసినా మీ పోస్టులన్నీ తప్పకుండా చదువుతాను. సాహిత్యం, సినిమాలకి మీ బ్లాగు ఒక రిఫరెన్సులా ఉపయోగపడుతుంది. చాలా సార్లు నా స్నేహితులతో షేర్ చేసుకున్నాను.

    రిప్లయితొలగించండి
  17. @బోనగిరి రావు: చాలా సంతోషమండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  18. అభినందనలు మురళీగారు...నా బ్లాగు జ్ఞాపకాలు తిరగతోడిన ప్రతీసారి మొదట గుర్తొచ్చేది మీరు, మీ బ్లాగ్. ఎంత అందమైన రోజులవి!! మీ బ్లాగుకు కాలదోషం పట్టనందుకు చాల హ్యాపీగా వుంది. కొంతమంది బ్లాగు మిత్రులను ఫెస్బుక్ లో టచ్లో వున్నా కూడా మీరు అక్కడలేని లోటు తెలుస్తూనే వుంది నాకు. ఇలానే మీ టపాలు కొనసాగిస్తూ సిల్వర్ జూబ్లీకి చేరువవ్వాలని కోరుకుంటున్నా!!

    రిప్లయితొలగించండి
  19. @శేఖర్ పెద్దగోపు: బ్లాగింగ్ కొనసాగిద్దామనే అనుకుంటున్నానండీ.. మీవంటి మిత్రుల ప్రోత్సాహమూ కొనసాగుతోంది.. నిజమే.. అందమైన రోజులు.. స్వర్ణయుగం అనాలేమో.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  20. అలుపెరుగక...మీ అక్షర సేద్యం మరో దశాబ్దం కొనసాగించాలని కోరుకుంటూ....అభినందనలు మురళిగారూ 😊

    రిప్లయితొలగించండి