అమెరికా కాఫీ చైన్ 'స్టార్ బక్స్' ఒడిదుడుకుల్లో ఉందన్న వార్త చూడగానే నాకు మన 'కేఫ్ కాఫీ డే' గుర్తొచ్చింది. ఈ రెండు కాఫీ చైన్లకీ పోలికలు పెరిగిపోతున్నాయి రోజురోజుకీ. 'కాఫీ డే' ని తన ఇంటిపేరుగా మార్చేసుకున్న దివంగత వీజీ సిద్ధార్థ ఒకానొక టైం లో ఈ 'స్టార్ బక్స్' కి పోటీ ఇవ్వాలనుకున్నాడు, దేశీయంగా మొదలుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో. బెంగళూరు నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఊపందుకుంటున్న తొలినాళ్లలో సిద్ధార్థ్ చేసిన 'కేఫ్ కాఫీ డే' ప్రయోగం ఊహించనంతగా విస్తరించింది, అది కూడా తక్కువ కాలంలోనే. సిద్ధార్థ్ వ్యాపార సామ్రాజ్యం కూడా కాఫీ నుంచి అనేక ఇతర రంగాలకి విస్తరించింది. అతడి అకాల, అనూహ్య మరణం తర్వాత 'ఇక కాఫీ డే పని అయిపోయినట్టే' అనుకున్నారు అందరూ. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపధ్యం మంచినీ, చెడునీ కూడా చేసిందన్నారు. ఊహించని విధంగా సిద్ధార్థ భార్య మాళవిక తెరమీదకి వచ్చింది. కాఫీ డే పగ్గాలు చేపట్టడమే కాదు, అప్పులన్నీ తీర్చి సంస్థని గాడిన పెడతానని నమ్మకం కలిగించింది ఉద్యోగులు అందరిలోనూ. ఆమె కృషి కొనసాగుతోంది.
అటు 'స్టార్ బక్స్' కూడా చిన్నగా మొదలై తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుని వేగంగా విస్తరించిన సంస్థ. అప్పటివరకూ ఇల్లు, పని ప్రదేశం తప్ప మరో చోటు తెలీని వారికి 'థర్డ్ ప్లేస్' ని పరిచయం చేసింది. రకరకాల కాఫీ ఫ్లేవర్లని అన్ని రకాల ధరల్లోనూ అందుబాటులో ఉంచడం, కస్టమర్లు కోరిన కొత్త ఫ్లేవర్లని, కాంబినేషన్లని అప్పటికప్పుడు చేసి ఇవ్వడం లాంటివి 'స్టార్ బక్స్'ని సగటు అమెరికన్లకి దగ్గర చేశాయి. అదే సమయంలో ఓ సంస్థగానూ మిగిలిన సంస్థలకి భిన్నంగా వ్యవహరించింది 'స్టార్ బక్స్'. పూర్తి కాలపు ఉద్యోగులకే కాదు, కాంట్రాక్టర్లకీ షేర్లు ఇవ్వడం, సామాజిక బాధ్యత తలకెత్తుకుని, అవసరమైన సమయాల్లో అవసరమైన విషయాల మీద జనంలో కదలిక తెచ్చే ప్రయత్నం చేయడం (రేస్ సమస్య లాంటివి), చిన్నచిన్న అమ్మకం దారులని ప్రోత్సహించడం, విద్యార్ధులకి స్కాలర్షిప్పులు.. ఇలా సామాజిక బాధ్యతని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అలాంటి 'స్టార్ బక్స్' లో అంతర్గత సంక్షోభం ముదురుతోందంటోంది అమెరికన్ మీడియా.
Google Image |
అమెజాన్ తో కలిసి 'స్టార్ బక్స్' ప్రారంభించిన నో టచ్ కాఫీ షాపులు వివాదం మొదలవడానికి కారణమట. బరిస్టా (కాఫీ కలిపి ఇచ్చే ఉద్యోగి) అవసరం లేకుండా, యాప్ ద్వారా కాఫీ ఆర్డర్ ఇచ్చి, పే చేసి, మెషీన్ నుంచి కప్పు అందుకుని తాగే ఈ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల కోత ఏర్పడుతుందని భయం మొదలైందట ఉద్యోగుల్లో. ఈ కొత్త ఏర్పాటుకి ప్రజలింకా పూర్తిగా అలవాటు పడలేదు. కాఫీ షాపులోకి వెళ్ళడానికి ఫింగర్ ప్రింట్స్ ఎందుకివ్వాలో అర్ధం కాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రస్తుతానికి. ఒకప్పుడు ఘనంగా అనిపించిన 'స్టార్ బక్స్' వాళ్ళ పే చెక్కులు, కోవిడ్ తర్వాత సవరింపబడిన మార్కెట్ వేతనాలతో పోలిస్తే వెలవెలపోతూ ఉండడం, షిఫ్టుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటివన్నీ ఉద్యోగులు రోడ్డెక్కేలా చేశాయి. ఫలితంగా, 'స్టార్ బక్స్' షేరు పతనమవుతోంది. ఓ పక్క మూతపడిపోతోందనుకున్న 'కేఫ్ కాఫీ డే' పునరుత్తానం వైపు అడుగులు వేస్తుండగా, 'స్టార్ బక్స్' భవిష్యత్తుని గురించి సందిగ్ధత ఏర్పడడం ఓ చిత్రమైన పరిణామం.
ఇంతకీ, 'కేఫ్ కాఫీ డే' ని పునర్నిర్మించడం మాళవికకి నల్లేరు మీద బండి నడక అవుతుందా? సిద్ధార్థ్ కాఫీ డే ప్రారంభించే నాటికీ, ఇవాళ్టికీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. నాడు ప్రజలకి వేరే ఛాయిస్ లేదు. ఇప్పుడు ఎంచుకునేందుకు ఛాయిస్ లు అనేకం. సాఫ్ట్వేర్ రంగంలో మొదలయిన 'స్టార్ట్ అప్' ల ట్రెండు కాఫీ వ్యాపారానికీ విస్తరించింది. కొత్తగా వస్తున్నవాళ్ళు కూడా వ్యాపారాన్ని ఆషామాషీగా తీసుకోడం లేదు. నేరుగా కాఫీ ఎస్టేట్లకి వెళ్లి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సరుకుని కొనుక్కు తెచ్చి, గింజల్ని స్వయంగా పొడికొట్టి, కాఫీ చేసి అమ్ముతున్నారు. కాఫీ నాణ్యత విషయంలో రాజీ పడక పోవడం, కొత్త రుచుల్ని పరిచయం చేయడానికి సర్వదా సిద్ధంగా ఉండడంతో ఆదరణ బాగుంటోంది. వీటికి లేనిదీ, 'కాఫీ డే' కి ఉన్నదీ బ్రాండ్ ఇమేజి. ఈ కారణంగానే వీటి విస్తరణ ఆలస్యమవుతోంది. ఈ కొత్త సంస్థలు నిలదొక్కుకునే లోగానే 'కాఫీ డే' బండిని పూర్తిగా పట్టాలెక్కించడం మాళవిక ముందున్న పెద్ద సవాలు. మరి దేశీయ 'స్టార్ బక్స్' కథ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
కాఫీ గురించి మాట్లాడుకుని, టీ గురించి చెప్పుకోకపొతే ఎలాగ? సిద్ధార్ధ్ చూపించిన మార్గాన్ని టీ వ్యాపారులూ ఉపయోగించుకున్నారు. 'కాఫీ డే' స్థాయిలో కాకపోయినా, అనేక 'టీ' చైన్లూ మార్కెట్లోకి వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడం, విస్తరణ వేగంగా కాక మందకొడిగా సాగుతూ ఉండడం ఈ రంగాన్ని పీడిస్తున్న సమస్య. నగరాల్లో ఉండే పోటీకి దూరంగా, చిన్న పట్టణాల మీద దృష్టి పెట్టి 'టీ టైం' చైన్ ని విస్తరించిన గోదావరి కుర్రోడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కథ స్ఫూర్తివంతంగా అనిపించింది. ఇంజనీరింగ్ చదివి, పదేళ్ల పాటు సాఫ్ట్వేర్ రంగంలో పని చేసిన ఈ కడియం కుర్రాడు, ఉద్యోగాన్ని వదిలి టీ వ్యాపారంలోకి దిగడం, అది కూడా కార్పొరేట్ స్థాయిలో కాకుండా, గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టడం అతని కుటుంబాన్నే కాదు, అందరినీ ఆశ్చర్య పరిచింది. పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాల్లో టీ వ్యాపారానికి కొదవ లేదని, కోట్లలో ఆదాయం సంపాదించే వీలుందని నిరూపించింది 'టీ టైం'. రకరకాల పేర్లతో స్థానిక షాపుల వాళ్ళు ఇమిటేషన్ బ్రాండింగ్ చేసేసుకున్నా, ఆ పోటీని తట్టుకుని తన బ్రాండ్ నేమ్ ని నిర్మించుకుని, నిలబెట్టుకున్నాడు శ్రీనివాస్. ఇవీ కాఫీ, టీ లని గురించి కాసిన్ని కబుర్లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి