మంగళవారం, ఏప్రిల్ 28, 2009

నాయికలు-ఇల్లేరమ్మ

"ఇదేం పేరూ?" ఇల్లేరమ్మ గురించి నేను చెప్పినప్పుడు చాలా మంది అడిగిన మొదటి ప్రశ్న ఇది. వాళ్ళలో చాలా మంది పుస్తకాలు చదవని వాళ్ళు. ఇంకొందరు అప్పుడప్పుడు మాత్రమే చదివే వాళ్ళు. లేక పోతేనా.. అసలు పేరు సుశీల అనీ, ఆరిందాలా ఇల్లిల్లూ తిరుగుతుందని పక్కింటి తాతగారు ఇల్లేరమ్మ అని పేరు పెట్టారనీ వాళ్లకి నేను వివరంగా చెపాల్సి వచ్చేదే కాదు. తన బాల్యంలో జరిగిన సంఘటన లన్నీ కథలు గా మలచి, డాక్టర్ సోమరాజు సుశీల అందించిన సంకలనం 'ఇల్లేరమ్మ కతలు.' ముగ్గురు చెల్లెళ్ళున్నా ఒక్కళ్ళ చేత కూడా 'అక్కా' అని పిలిపించుకోలేని ఇల్లేరమ్మే ఇందులో నాయిక.

ఇల్లేరమ్మ వాళ్ళ నాన్న వెంకటేశ్వర రావు గారు 'చిన్నింజనీరు.' ఆయనది ట్రాన్స్ఫర్ల ఉద్యోగం. ఏడాదికో, రెండేళ్ళకో ఓసారి ఊరు మారిపోతూ ఉండాలి. పాత స్నేహితులని మర్చిపోవడం, కొత్తవాళ్ళని వెతుక్కోవడం, అప్పుడప్పుడు మళ్ళీ పాత వాళ్ళని గుర్తుచేసుకోవడం.. ఇలా అన్న మాట. సుశీల కి ముగ్గురు చెల్లెళ్ళు -- చిన్నారి, ఇందు, బుజ్జి. వాళ్ళమ్మ కన్నా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం సుశీలకి. 'నానీ' అని పిలుస్తారాయన. 'నీ కన్నా యేడాది వెనుక పుట్టినందుకు నాకు నువ్వు అక్కవై పోయావా?' అంటూ చిన్నారి 'అక్కా' అని పిలవకుండా తనుకూడా 'నానీ' అనే పిలుస్తుంది.. ఆమెని చూసి మిగిలిన ఇద్దరూను..

ఇల్లిల్లూ తిరిగి అందరి అజా కనుక్కుంటుందని గుంటూరు తాతగారు సుశీలకి 'ఇల్లేరమ్మ' అని పేరు పెట్టేశారు. తనదేమో చిన్నజడ . అందుకే చిన్నారి 'ఇల్లేరమ్మ-ఎలక తోక' అని ఏడిపిస్తూ ఉంటుంది. ఇల్లేరమ్మ అస్సలు బాధ పడదు. 'బుద్ధిశాలి జుట్టు భుజాలు దాటకూడదు' అన్న రహస్యం వాళ్ళమ్మ చెప్పేసింది కదా.. చెల్లెళ్ళ కోసం ఇల్లేరమ్మ ఎన్ని కష్టాలు పడినా, అదేమిటో ఎవరూ గుర్తించరు. అసలు చదువొద్దని ఏడుస్తున్న చిన్నారిని ఈడ్చుకుంటూ బడికి తీసుకెళ్ళి చేర్పించిందే ఇల్లేరమ్మ. అలాంటి చిన్నారి పక్కలో బల్లెమైపోతుంది.. 'డబల్ ప్రమోషన్ కొట్టి నీ క్లాసులో నీ పక్కనే కూర్చుంటా' అని బెదిరిస్తూ ఉంటుంది.

ఇల్లేరమ్మకి వాళ్ళమ్మ కన్నా నాన్నంటే భలే ఇష్టం. ఆయన కూడా అంతే.. ఇంటికి రాగానే 'నానీ' అనే పిలుస్తారు. తను ఏం చెప్పినా కాదనకుండా చేస్తారు. వాళ్ళమ్మ తెలివిగా తనకి కావలసినవి ఇల్లేరమ్మ చేత చేయించుకుంటూ ఉంటుంది.. 'అప్పచ్చులు' లంచమిచ్చి. ఓసారలాగే గుంటూరులో ఉన్నప్పుడు పాయసం చేసిపెట్టి, 'మల్లీశ్వరి' సినిమాకి ప్రయాణం చేసేసింది. సరిగ్గా సినిమా టైముకే సిమెంట్ బస్తాలు రావడం తో ప్రోగ్రాం కేన్సిల్ అయ్యింది.. అలిగిన ఇల్లేరమ్మ పార్కుకెళ్ళి కూర్చుంది.. నాన్నొచ్చి బతిమాలారు. అసలు ప్రయాణం చేసిన అమ్మేమో నాన్నెదురుగా ఇల్లేరమ్మని తిట్టడం. వాళ్ళ నాన్న చేసే 'బంగాళా ఉల్లిఖారం' కూరంటే తనకి మరీ ఇష్టం. మధ్యలో సిగరెట్ కాల్చకుండా ఆ కూర వండడం ఎంత కష్టమో..

గుంటూరు నుంచి ఏలూరు, అక్కడి నుంచి విజయవాడ బదిలీలు. గుంటూరు నుంచి వచ్చేస్తున్నప్పుడు అందరూ తనకి ఎన్ని ప్రెజెంట్లు ఇచ్చారని. అమ్మకైతే జాకెట్ ముక్కలూ, అరటి పళ్ళే.. అదే తనకైతే కేరం బోర్డు, డిక్షనరీ..ఇలా ఎన్నో.. 'దీని సామాన్లకే జీపు పట్టేలా లేదని' అక్కడా అమ్మ తిట్లే .. ఏలూరులో ఉన్నప్పుడు తాతగారి తద్దినం వస్తుంది. ఎన్ని కూరలో.. ఎన్ని పిండి వంటలో.. 'మళ్ళీ తద్దినం ఎప్పుడు వస్తుందో ఏమిటో' అనుకుంటుంది. తనతో ఆటలకి పార్కుకొచ్చిన బుజ్జి తప్పిపోతే అమ్మ ఎంత హడావిడి చేసింది. చందర్రావు సైకిల్ మీద తీసుకొచ్చి దింపాక ఇల్లేరమ్మని ఒకటే తిట్టడం. 'ఈసారి నేను తప్పిపోయి చూపిస్తా..నన్నెక్కడ వెతకగలరో అదీ చూస్తా' అనుకుంటుంది.

విజయవాడ వెళ్ళాకా ఎన్ని పనులు చేసిందని? మల్లెపూలు కట్టిచ్చి నందుకు చెల్లెళ్ళ దగ్గర పదేసి పూలు ఫీజు గా వసూలు చేసిందా..ఇంటివారిచ్చిన పాసుతో లక్ష్మి టాకీసులో 'జయసింహ' శతదినోత్సవంలో రామారావునీ, అంజలినీ, శ్రీరంజనినీ దగ్గరనుంచి చూసి, ఆటోగ్రాఫు తీసుకుందా.. నారింజా సమ్మర్ స్కూల్ పెట్టి తలకి అర్ధ రూపాయి ఫీజు వసూలు చేసిందా.. చెల్లెళ్ళతో కలిసి అమ్మకి ఇడ్లీ పిండి రుబ్బి ఇచ్చిందా.. అబ్బో చాలానే చేసింది. విజయవాడ చల్లా వారింట్లో అద్దెకి దిగి రేడియో సంగీతోత్సవాలు జరిపించిందో లేదో, వాళ్ళ నాన్నగారికి హైదరాబాదు బదిలీ.. ఆ బదిలీ ఆపడానికి అమ్మకి తెలియకుండా శనివారం ఒంటిపొద్దులు కూడా చేసింది.. ప్చ్.. ఏ దేవుడూ కరుణించలా..

హైదరాబాదులో గోషా బడిలో చదువు. 'ఆడ పిల్లలు గోగు కాడల్లా ఎదిగొస్తున్నార్రా వెంకటేసూ' అని బంధువులు గోలెడితే 'చదివినంతా చదువు చెప్పిస్తా.. ఉన్న ఎనిమిదెకరాల్లొ తలో రెండెకరాలూ రాసిస్తా' అంటారు నాన్న. అంతే అమ్మాయిలంతా వాళ్ళ వాళ్ళ రెండెకరాల్లో ఏం చేయాలా అని ఆలోచనలో పడతారు. 'మామిడితోట వేస్తా' నంటుంది బుజ్జి. అంతేనా ప్రతి వేసవిలోనూ మిగిలిన ముగ్గురూ వచ్చి పళ్ళు తిని వెళ్ళ వచ్చని' ఆహ్వానిస్తుంది కూడా. ఇంతలొ వాళ్ళకో తమ్ముడు పుడతాడు. హాస్పిటల్లో వాడిని చూసి 'ఐతే నా రెండెకరాలూ గోవిందేనా' అంటుంది బుజ్జి... చదివే అలవాటున్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన, అందరి చేతా.. ముఖ్యంగా పిల్లల చేత.. చదివించాల్సిన పుస్తకం 'ఇల్లేరమ్మ కతలు.'

19 వ్యాఖ్యలు:

 1. మొదటి పేరా లో ఇల్లేరమ్మను మీరు పరిచయం చేసిన తీరు ....భలే నచ్చేసిందండీ ! అసలు నా జీవిత కాలంలో ఇన్ని పుస్తకాలు చదవగాలనా అనిపిస్తుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ పుస్తకం ఎప్పటినుండో చదవాలనుకుంటున్నా కానీ, కుదరడం లేదు.. ఈ సారి వదిలిపెట్టకూడదు..
  nice intro...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళీ గారూ,
  మీరు కుళ్లుకునే వార్త ఒకటి చెప్పనా? నేను మొన్నంటే మొన్నే ఇల్లేరమ్మని కలిసి రెండు మూడు గంటలు మాట్లాడాను. ఎంత నవ్వుకున్నానో ఆవిడ మాటలకు. చాలా గొప్ప మనిషి. ఆవిడ కబుర్లతో ఇంటర్వ్యూ కోసం ఎదురు చూడండి. మీకు తెలిసి రాశారో, తెలియక రాశారో గాని, ఇవాళ ఆమె పుట్టిన రోజు కూడాను. మరిన్ని కథలతో ఇల్లేరమ్మ వందేళ్లూ చల్లగా ఉండాలని మీ బ్లాగ్ముఖంగా ఆశిస్తున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. 'తప్పక చదవాల్సిన ' జాబితాలోకి ఇంకో మంచి పుస్తకం చేరింది.. ఇల్లేరమ్మ పేరు వెనుక ఉన్న కధ ఇదా! భలే నవ్వొచ్చింది.. మరొక ఆణిముత్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏమిటోనండీ మీ బ్లాగు వల్ల చదవాల్సిన పుస్తకాల లిస్టు కొండవీటి చాంతాడంత అయికూర్చుంది. :(

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మురళీ గారూ
  ఎప్పుడో ఆవిడ జ్యొతిలో సీరియల్ గా వ్రాసినప్పుడే చదివేసాను. చక్కటి రచన.ఏ తరంవాళ్ళైనా తమలో తాము తొంగి చూసుకొనేట్లు ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి గారు ...మీ ఇల్లెరమ్మ {మన్నించాలి} సుశేల గారి... ఇల్లెరమ్మ ..గత వెసవి సెలవుల్లొ మా ఇంటికొచ్చి మా పాప. బాబు నవ్వుల్లొ పువ్వులు పూయించి ఇక్కడే ఉంది. పిల్లలు ఉన్న ప్రతి లొగిలి లొ ఉండాల్సిన పుస్తకం. మీరు ఇలా అందరికీ పరిచయం చేయడం అభినందనీయం ...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా బాగా రాశారు. అన్నట్టు, మన ఇల్లేరమ్మ ఆర్కుట్లో కూడా ఉంది.
  http://www.orkut.co.in/Main#Profile.aspx?uid=9704402709144527355

  ప్రత్యుత్తరంతొలగించు
 9. భలే మంవ్హి పుస్తకాలు పరిచయం చేస్తున్నారు!ఇల్లేరమ్మ కథలు ఎన్ని సార్లు చదివినా మళ్ళీ చదవాలనిపిస్తాయి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @పరిమళం: బేసిక్ గా మీరు కవితలు ఎక్కువగా చదువుతారనిపిస్తుంది, మీ బ్లాగు చూస్తుంటే.. ధన్యవాదాలు.
  @మేధ: అస్సలు వదిలిపెట్టకండి.. ధన్యవాదాలు
  @అరుణ పప్పు: కేవలం యాదృచ్చికం అండి.. ఆవిడ పుట్టిన రోజని తెలిసి చాలా సంతోషం కలిగింది.. ఆవిడని క్రమం తప్పకుండా రాస్తూ ఉండమని మా అందరి మాటగా చెప్పండి. అన్నట్టు ఆవిడ 'చిన్న పరిశ్రమలు - పెద్ద కథలు' పుస్తకం ప్రింటు దొరకటం లేదని కూడా చెప్పరూ.. మీరు చెప్పబోయే ఇల్లేరమ్మ కబుర్ల కోసం ఎదురు చూస్తున్నాం. ధన్యవాదాలు.
  @నిషిగంధ: మీరీపాటికే చదివేసి ఉంటారనుకున్నా.. పదే పదే చదివే పుస్తకం అండి.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: చదవడం మొదలు పెట్టేయండి.. లిస్టు అదే తగ్గిపోతుంది :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @నాబ్లాగు: నేనప్పుడు ప్రతి వారం వచ్చే వారం కోసం ఎదురు చూసేవాడినండి.. మీరన్నది నిజం.. మా ఇంటిల్లపాడికీ నచ్చిందీ పుస్తకం. ధన్యవాదాలు.
  @రిషి: 'మన ఇల్లేరమ్మ' అనండి.. నాకైతే కుటుంబ సభ్యురాలని అనిపిస్తుంది.. నిజమేనండి పిల్లలున్న ఇంట్లో ఉండాల్సిందే, 'బుడుగు' తో పాటు. ధన్యవాదాలు.
  @తెరెసా: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @ఇల్లేరమ్మ: ఆర్కుట్ విషయంలో అజ్ఞానినండి.. మెయిల్ ఐడీ ఉంటే ఇస్తారా కొంచం.. చాలా చాలా ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. చాలా ఏళ్ల క్రితం ఆంధ్రజ్యోతి / భూమి లో చదివాను. 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @Subrahmanya Chaithanya Mamidipudi: చాలా మంచి పుస్తకం అండి.. ఎన్ని సార్లు చదివినా మరోసారి చదవాలనే అనిపిస్తుంది.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. life o nenu naa kosam buy chesina oka book illerlu amma kathlu
  adi book chadivinatharavatha ee book complsory undali ani konkunna kthalu.eelanti ivi malgudi days lo swamy charcter srushinchi nattu
  mana telugu lonu pillalatho eno vishayalu teluukovachu ani ardhamaindhiillanti books inka emina unte vati gurinchi inform cheyara please

  ప్రత్యుత్తరంతొలగించు
 16. hello
  mee block chadivaa
  nna illeramma parichayam chesukovali ani pichindhi
  nenu hyderbad lo maa pedannan gari intlo 30 days unna akkada vallaki evaro book gift ga ichharnta adi naadrusti lo padi 30 days naa cheti lone undhi
  adi chadivi nalo nenu enno sarlu navuu kunna koda
  oka manchi book iche aandam eno ee book chadivinatharavatha telusukunaa
  naa life lo book chadivesina tharavatha book kavalani konukunna book ee bookee
  telugu lo nu malfudi days swamy charcter laa chala baga andariki nachhe patra illerama .illaniti pusthakalu inka emaina unte parichyam cheyandi endukante prati sari good luck undadu ggaa bye

  ప్రత్యుత్తరంతొలగించు