బుధవారం, జనవరి 20, 2021

సినిమా వంటలు

ముందుగా 'రియలిస్టిక్' సినిమాల మీద బాపూ చెప్పినట్టుగా చెలామణిలో ఉన్న ఓ జోకు: హీరో ఆఫీసు నుంచి నిదానంగా ఇల్లు చేరుకొని, అంతే నిదానంగా కుర్చీలో కూర్చుంటాడు. అతని భార్య అంతకన్నా నిదానంగా వచ్చి, చేతిలో ఫైల్ అందుకుని, 'టీ తీసుకురానా' అని అడుగుతుంది. అతను తలూపుతాడు. ఆమె వంటింట్లోకి వెళ్లి, గిన్నె కడిగి, నీళ్లతో స్టవ్ మీద పెట్టి, స్టవ్ వెలిగించి, నీళ్లు కాగాక టీ పొడి తదాదులన్నీ వేస్తుంది. టీ మరిగే వరకూ కెమెరా టీగిన్నె మీంచి కదలదు. కప్పులో పోసి తెచ్చి భర్తకి ఇచ్చి, పక్కన కూర్చుంటుంది. అతను నింపాదిగా తాగి, కప్పు కింద పెట్టాక, 'ఇంకో కప్పు టీ తీసుకురానా?' అని అడుగుతుంది. అతను జవాబు చెప్పేలోపే థియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ ముక్త కంఠంతో 'వద్దూ' అని అరుస్తారు, హాలు దద్దరిల్లిపోయేలా. 

ఇప్పుడో ప్రశ్న: మన తెలుగు సినిమాల్లో వంట చేయడాన్ని చూపించిన సినిమాలెన్ని?? అలా అలనాటి 'మాయాబజార్' నుంచీ ప్రయాణం మొదలు పెడితే, ఘటోత్కచుడి వేషంలో ఉండే ఎస్వీఆర్ పళ్ళాలతో, గుండిగలతో నిండిన వంటకాల్ని చులాగ్గా ఆరగించడాన్ని చూపించారే కానీ, ఎక్కడా వంట చేయడాన్ని చూపలేదు. ఆ వంటకాలన్నీ వండబడినవి కాదు, సృష్టింపబడినవి. 'గుండమ్మ కథ' లో రామారావు పప్పు రుబ్బిపెడితే, 'బుచ్చిబాబు' లో నాగేశ్వర రావు -జయప్రద ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం  - వంటవాడిగా నటించాడు. 'దసరా బుల్లోడు' లో వాణిశ్రీ, చంద్రకళల మిరపకాయ బజ్జీల సీన్ సినిమా కథనే మలుపు తిప్పింది.  'గొప్పింటి అల్లుడు' సినిమాలో బాలకృష్ణ వంటవాడిగా హీరోయిన్ల ఇంటికొచ్చి ఒక్క పాటలోనే ఇంటిల్లిపాదికీ కావాల్సినవన్నీ వండి వార్చేస్తాడు. 'చిరునవ్వుతో' హీరో వేణు తొట్టెంపూడి వృత్తి గరిట తిప్పడమే అయినా రెండే సీన్లలో వంట చేస్తూ కనిపిస్తాడు. 

కేరక్టర్ ఆర్టిస్టుల వంట అనుకోగానే డబ్బింగ్ జానకి గుర్తోచేస్తుంది మొదటగా. స్టేజీ మీద మంజుభార్గవీ, వెనుక కమల్ హాసనూ 'బాల కనకమయ చేల' కి నాట్యం చేస్తూ ఉంటే, సాక్షి రంగారావు ట్రూపులో వంట చేసే జానకి, పప్పు రుబ్బుతూ కమల్ నాట్యాన్ని అబ్బురంగా చూడడం, ఆ దృశ్యాలని జయప్రద కెమెరాలో బంధిచడం.. 'సాగర సంగమం' చూసినవాళ్లు మర్చిపోలేని దృశ్యం. 'సప్తపది' లో ఇదే డబ్బింగ్ జానకి కోడలు పాత్రధారిణి కుంపటి రాజేసే సీన్ కూడా భలే సింబాలిక్ గా ఉంటుంది.  బాగా గుర్తుండి పోయే మరో సన్నివేశం 'సీతారామయ్య గారి మనవరాలు' లోది. సీత పెళ్లి గురించి స్త్రీ బంధు జనమంతా వంటింట్లో వాదులాడుకుంటూ ఉండగా, తనకేం పట్టనట్టుగా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటుంది రోహిణి హట్టంగడి. ఏమాటకామాట, ఎంత సహజంగా వంట చేస్తుందో అసలు!! మేనత్త పప్పు రుబ్బుతుంటే, సీత తన వేలు నలిగినట్టుగా అభినయించడమూ ఉందీ సినిమాలో. 

బాలూ-లక్ష్మిల 'మిథునం' లో భోజనాలది పెద్ద పాత్ర. పెసరపప్పు రుబ్బిన పిండితో లక్ష్మి పెసరట్టు వేయడాన్ని క్లోజప్ లో చూడొచ్చు. మన సినిమాల్లో వంట సన్నివేశాలు సినిమాలో అంతర్భాగంగా ఉన్నాయి తప్ప, వంటింటి చుట్టూ మాత్రమే తిరిగే సినిమాలు రాలేదనే చెప్పాలి. మనకి మాత్రమే ప్రత్యేకమైన బోలెడన్ని రకాల వంటలున్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో మరి. అసలిదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ మధ్య చూసిన ఒకానొక మలయాళం సినిమా వల్ల. 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' అనే టైటిల్ బాగా ఆకర్షించడంతో చూడడం మొదలు పెట్టా. సినిమా నిడివి కేవలం వంద నిమిషాలే కావడం, లాక్ డౌన్ లో మలయాళం సినిమాలు చూసిన అనుభవం ఉండడం కూడా నన్నీ సినిమా చూడడానికి పురిగొల్పాయి. సినిమాలో మూడొంతులు వంటగదిలోనే జరుగుతుంది. కేరళ మాంసాహార, శాఖాహార వంటలన్నీ వండించారు నాయిక చేత. 

ఈ సినిమా మొదట్లో కూడా, నాయిక తన భర్తకి కాఫీ ఇచ్చి, అతగాడా కాఫీని పూర్తిగా తాగాక, ఆ కప్పుని సింకులో శుభ్రంగా కడుగుతుంది, క్లోజప్పులో. అసలు ఈ సీన్ చూస్తుంటేనే నాకూ బాపూ రియలిస్టిక్ సినిమా జోకు గుర్తొచ్చింది. సినిమా ఆసాంతమూ కూడా వంటగదిలో ఆమె చేసే ప్రతి పనినీ అంతే నిశితంగా చిత్రించారు. మొదట్లో ఏంటబ్బా ఇదీ అనిపించినా, రానురాను ఆసక్తి పెరిగి, చివరికొచ్చేసరికి ఆ షాట్ల ఆంతర్యం బోధ పడింది. వంటపని ఒక 'డ్రెడ్జరీ' గా ఎందుకు మారుతుందన్నది సులువుగా తెలిసేలా ఉన్నాయి సన్నివేశాలు. సినిమా ఆసాంతామూ కిచెన్ ఇతివృత్తంతోనే తీసిఉంటే మరింత బాగుండేది కానీ, రెండేళ్ల నాటి ఈ సినిమా రెండో సగంలో అప్పటి ట్రెండింగ్ టాపిక్ వైపుకి కథని మలుపు తిప్పారు. దీనివల్ల అసలు పాయింట్ కి కాస్త అన్యాయం జరిగిందన్న భావం కలిగింది, సినిమా పూర్తయ్యాక. 

'మన దగ్గర ఇలాంటి సినిమాలు ఎందుకు రావు?' అన్న ప్రశ్న మలయాళం సినిమాలు చూసే ప్రతిసారీ వచ్చేదే కానీ, ఈ సారి మాత్రం 'కిచెన్ చుట్టూ తిరిగే కథల్ని తెలుగులో ఇంకా బాగా చెప్పే వీలుంటుంది కదా' అనిపించింది. మొన్నటి 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఇతివృత్తం 'బొంబాయి చట్నీ' అయినప్పటికీ అందులో కూడా మెయిన్ పాయింట్ కి జరగాల్సిన న్యాయం జరగలేదు. జంధ్యాల కూడా 'బాబాయ్ హోటల్' సినిమాలో కాసేపు మాత్రమే హోటల్ని చూపించి, తర్వాత కథనంతా బాబాయి చుట్టూ తిప్పేయడం, శేఖర్ కమ్ముల నిర్మించిన 'ఆవకాయ్-బిర్యానీ' కూడా టైటిల్ ని దాటి ఎటో వెళ్లిపోవడం మనకి తెలిసిందే. భోజనం అనేది మనుషులందరికీ సంబంధించిన విషయం కాబట్టి, విషయాన్ని సరిగా చెబితే ప్రేక్షకులు 'కనెక్ట్' కాకపోవడం అనే ప్రశ్న ఉండదు. కిచెన్ కథల్ని మన సినిమా వాళ్ళు ఎప్పుడు వండుతారో.. 

4 కామెంట్‌లు:

  1. హఠాత్తుగా సినిమా వంటలెందుకు గుర్తొచ్చాయా అనుకున్నానండీ అసలు విషయం మీరు చెప్పేవరకూ :-) నేనూ అస్సలు ఏమీ తెలియకుండా ఈ సినిమా చూశానండీ. చాలానే రాయాలనిపించింది త్వరలో రాస్తాను. టైటిల్ చూసి వంటల సినిమా కాబోలు అనుకుని మొదలుపెట్టిన నాకు టైటిల్లోని సర్కాజమ్ అర్ధమయ్యాక దిమ్మతిరిగింది :-)
    అన్నట్లు బాపు గారి జోక్ టూ గుడ్ :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా చూస్తుండగా రెండు మూడు సార్లు బాపూ జోక్ గుర్తొచ్చిందండీ, అందుకే ప్రస్తావించా.. కథని డైవర్ట్ చేయడం వల్ల నాకు అసంతృప్తి మిగిలిపోయింది.. మీ రివ్యూ కోసం ఎదురు చూస్తూ.. ధన్యవాదాలు 

      తొలగించండి
  2. తెలుగు అనలేమేమో కానీ ఉలవచారు బిర్యానీ, ఉస్తాద్ హోటల్ రెండూ కూడా వంటల చుట్టూ తిరిగిన సినిమాలేనండీ. మీ పోస్ట్ చదివాక చంటబ్బాయ్ సినిమాలో శ్రీలక్ష్మి రాసిన మినీకథ గుర్తొచ్చింది :-) చారు ఎలా కాచాలో ఓ పాత్ర చేత చెప్పించి అది మినీకథ అంటావా అంటూ తిట్లు లంకించుకుంటాడు ఎడిటర్జీ :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పబ్లిష్ చేశాక చదువుకుంటే నాకూ పొట్టి ప్రసాదే గుర్తొచ్చాడండీ :))

      తొలగించండి