శనివారం, అక్టోబర్ 17, 2026

గరివిడి లక్ష్మి

ఉత్తరాంధ్ర ప్రాంతపు ఎమోషన్ 'గరివిడి లక్మి'. ఆమె బుర్రకథకి కొత్తరూపు ఇచ్చి జనంలోకి మరింతగా చేరువ చేసిందన్న ప్రసంశ, బూతుమయం చేసిందన్న విమర్శ ఎదుర్కొన్న కళాకారిణి. ఈ క్రమంలో ఆమె సంపాదించుకున్నది ఏవిటో తెలియదు కానీ, పోగొట్టుకున్నది మాత్రం తన 'ఐడెంటిటీ'ని. పంతొమ్మిది వందల తొంభయ్యో దశకం స్మార్ట్ కాలం కాకపోవడంతో, గరివిడి లక్ష్మి ప్రదర్శనని నేరుగా చూడని వాళ్లకి ఆమె ఎవరో గుర్తుపట్టే అవకాశం లేదు. ఒకపక్క విపరీతమైన పేరు, ఊపిరి సలపనన్ని ప్రోగ్రాంలూ ఉన్నా, ఆ కార్యక్రమాలకి ఉన్న డిమాండ్ రెట్టింపు. ఇదిగో, ఇక్కడి నుంచే అనేకమంది గరివిడి లక్ష్మిలు పుట్టుకొచ్చారు. ఒక కాలంలో ఉత్తరాంధ్రలో బుర్రకథ చెప్పిన ప్రతిస్త్రీ పేరూ గరివిడి లక్ష్మే అనడం అతిశయోక్తి కాదు. మరి, అసలు 'గరివిడి లక్ష్మి' వీటన్నింటినీ ఎలా తీసుకుంది? ఇంతమంది లక్ష్ములు పుట్టుకురావడం వెనుక ఆమె పాత్ర ఏమిటన్నది ఇంతకాలం ఎవరికీ తెలియదు. ఇప్పుడా అవకాశం వచ్చింది, ఔత్సాహిక దర్శకుడు గౌరినాయుడు జమ్మి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన 'గరివిడి లక్ష్మి' సినిమా రూపంలో. 

'గరివిడి లక్ష్మి' బయోపిక్ అనే వార్త ఏడాదిగా ఊరిస్తోంది. ఆరునెలలుగా పాటలు ఒక్కొక్కటీ విడుదలవుతున్నాయి. సినిమా ప్రామిసింగ్ గా ఉండబోతోందన్న అంచనా నానాటికీ పెరుగుతుండగా, ఎట్టకేలకి ఈవేళ థియేటర్లలోకి వచ్చింది సినిమా. తెలుగమ్మాయి ఆనంది టైటిల్ పాత్ర పోషించిన ఈ సినిమాని గురించి మాట్లాడేప్పుడు  'మహానటి' సినిమాతో పోలిక తప్పదు. రెండూ స్త్రీల కథలు. ఇద్దరూ శక్తిమంతులైన స్త్రీలు. పట్టుదలకు ప్రాణమిచ్చే వాళ్ళు. ఇద్దరి జీవితాలూ సవాళ్లమయం. వాటిని ఎదుర్కొన్న మార్గాలు మాత్రం వేర్వేరు. ఒకరి గుర్తింపు వెండితెర రూపం అయితే, మరొకరి గుర్తింపు కేవలం గొంతు. ఇక్కడే ఈ రెండు కథల్లోనూ ప్రధానమైన భేదం కనిపిస్తుంది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న స్త్రీ, వేరెవరో తన పేరుతో ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు "నేనే అసలు గరివిడి లక్ష్మిని" అని చెప్పుకోవాల్సి రావడాన్ని మించిన విషాదం వుండదు. అప్పటికే ఆమె ఆ చెప్పుకోవాలనే ఆలోచననీ, ఆసక్తినీ పరిస్థితుల కారణంగా కోల్పోతే?? జవాబు, 'రెండు గంటల ఇరవై నిమిషాలు అప్పుడే గడిచిపోయేయా?' అనిపించే ఈ సినిమా. 

దేవుడమ్మ (రాశి) ఒంటిమీదకి దేవుడొచ్చి తమ ప్రశ్నలకి సమాధానాలు చెబుతాడని ఆ చుట్టుపక్కల ప్రజల నమ్మిక. ఒక పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం. ఆలయాలు, పూజలు, భక్తుల ప్రశ్నలకి జవాబులు..వీటితో క్షణం తీరిక వుండదు ఆమెకి. చివరికి కూతురు విజయలక్ష్మిని చూసుకోడానికి కూడా. ఆ పిల్ల తనకి తెలియకుండానే పాట మీద ఇష్టాన్ని పెంచుకుంటుంది. అనుకోకుండా బుర్రకథ మార్గంలో ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ బుర్రకథకి కొత్త  మెరుగులు దిద్దాల్సిన అవసరాన్ని గుర్తిస్తుంది. ప్రయత్నించి, విజయవంతమవుతుంది. అయితే, దేవుడమ్మ తీసుకున్న రెండు నిర్ణయాలు విజయలక్ష్మి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఆ అమ్మాయి 'గరివిడి లక్ష్మి' గా మారి ఉజ్వలమైన కీర్తిని ఆర్జించినా ఆ రెండు నిర్ణయాల తాలూకు చీకటి ఆమెని విడిచిపెట్టదు. వీటికి తోడు, ఆమె స్వయంగా  తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు -- అన్నీ కూడా మనుషుల మీద నమ్మకంతో తీసుకున్నవే -- లక్ష్మి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తాయి. 

బుర్రకథకి నగిషీ చెక్కే క్రమంలో లక్ష్మి ప్రవేశ పెట్టిన జానపద బాణీల అశ్లీలం, ఆమె కళ్ళముందే పెరిగి పెద్దదై, "గుడ్డలిప్పుకుని ఆడతాదేటి?" అని జనం ఆశగా అడిగే వరకూ వెళ్లడాన్ని ఈ సినిమా దాచలేదు. ఒక ఆడియో కంపెనీ వాళ్ళు ఆమె బుర్రకథని రికార్డు చేసుకుని, వేరే కవి పేరుతో చెలామణి చేసుకున్న విషయాన్నీ, ఆర్ఫీ పట్నాయక్ ఆమెకి సినిమాకి పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చి ఆమె బుర్రకథ ట్యూన్ ని 'చిత్రం' సినిమా కోసం వాడుకోడాన్ని నేరుగానే చూపించింది. ఇక వ్యక్తిగత జీవితంలో జరిగిన నమ్మకద్రోహాన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ పురుష పాత్రని కేవలం అవకాశవాదిగా చూపారే తప్ప ప్రయత్న పూర్వకంగా విలన్ ని చేయలేదు. ఆమె పేరు మీదో, సంపాదన మీదో అసూయ పడుతున్నట్టుగా కూడా చిత్రించలేదు. అతనంతే అని చెప్పి వదిలేశారు. అయితే, చివర్లో ఆడియో కంపెనీ వాళ్ళు, ఆర్ఫీ పట్నాయక్ మాట్లాడిన క్లిప్స్ చూపించకపోయినా సినిమాకేమీ నష్టం లేదనిపించింది. చూపించడం వల్ల కొత్తగా ఒరిగేది కూడా ఏదీ లేదు. 

నటీనటుల విషయంలో ముందుగా చెప్పాల్సింది టైటిల్ పాత్రధారిణి ఆనంది గురించే. స్టేజి మీద మాత్రమే కాదు, నిజజీవితంలోనూ గరివిడి లక్ష్మి ఇలాగే ఉండేదేమో అనిపించేలా నటించింది. ఎక్కడా అతి అని కానీ, పాత్ర నుంచి దూరం జరిగినట్టు కానీ అనిపించలేదు. సత్తిబాబుగా రాగ మయూర్ కి గుర్తుండిపోయే పాత్ర దొరికింది. నేను ఊహించిన కన్నా బాగా చేశాడు. మరో రెండు ముఖ్యమైన పాత్రలు రాశి, నరేష్ లవి. ఇద్దరికీ చాలా మంచి పాత్రలు దొరికాయి. ఇద్దరూ నూటికి నూరుశాతం న్యాయం చేశారు. తర్వాత చెప్పుకోవాల్సింది, లక్ష్మి స్నేహితురాలు విజయగా నటించిన శరణ్య ప్రదీప్ గురించి. మంచి పాత్ర, పాత్రకి తగ్గ నటన. బుర్రకథ గురువుగా ఎల్ బీ శ్రీరామ్ కనిపించారు. నరేష్ పోషించిన రాంబాబు పాత్ర, 'మహానటి' లో ఇతని పాత్రకి కొంచం దగ్గరగా అనిపించింది. అయితే ఇక్కడ కేవలం కథ చెప్పే పాత్ర మాత్రమే కాదు, ఆమె కథని మలుపు తిప్పే పాత్ర కూడా. 

బుర్రకథ కళాకారిణి కథలో పాటలది కీలక పాత్ర. చరణ్ అర్జున్ సంగీతంలో చాలావరకు గరివిడి లక్ష్మి ఒరిజినల్ ట్యూన్స్ వినిపించాయి. నేపధ్య సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ (రవితేజ గిరిజాల) ఎంత చక్కగా కుదిరిందంటే, ఇంటర్వల్ లో 'అప్పుడే మొదటి సగం అయిపోయిందా' అనిపించింది. కథ రీత్యా, రెండో సగంలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు (మొదటిసగంలో వచ్చినవి) చూపాలి. ఇలా చూపాల్సిన సందర్భం రెండుసార్లు వచ్చింది. రెండుసార్లూ ఆయా సన్నివేశాలని పూర్తిగా చూడడం వల్ల, ఆ సన్నివేశాలని మూడోసారి కూడా చూశారు ప్రేక్షకులు. ఈ పునరుక్తిని కొంత పరిహరించవచ్చు. లివింగ్ లెజెండ్స్ బయోపిక్ లకి ప్రధానమైన ఛాలెంజ్ ముగింపు. 'గరివిడి లక్ష్మి' విషయంలో సినిమా మొత్తం నిజాయితీగానూ, ముగింపు తెలివిగానూ అనిపించింది. కళల మీద ఆసక్తి ఉన్నవాళ్ళకి మాత్రమే కాదు, రొటీన్ సినిమాలు నచ్చని వాళ్లకి కూడా నచ్చేసే సినిమా 'గరివిడి లక్ష్మి'. ఎండ్ టైటిల్స్ పడుతుండగా దర్శకుడి గురించి ఒకటే అనిపించింది, యితడు 'గౌరినాయుడు జెమ్' అని. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి