ఆధునిక భారత దేశ చరిత్రలో మైలురాళ్లుగా నిలబడే ఘట్టాలు రెండు. మొదటిది 1947 లో బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందడం, రెండవది 1991 లో నూతన ఆర్ధిక సంస్కరణలని ఆహ్వానించి గ్లోబల్ మార్కెట్ లో భాగం కావడం. ఈ రెండూ కూడా 'జరగకపోతే బాగుండేది' అనుకునే జనం అప్పుడూ, ఇప్పుడూ కూడా ఉన్నప్పటికీ, నేటి మన జీవితాల మీద ఈ రెండింటి ప్రభావం తక్కువది కాదు. స్వాతంత్య్రానికి పూర్వం ఏం జరిగింది, ఏ పరిస్థితులు దేశ ప్రజల్లో స్వతంత్ర కాంక్షని రగిలించి పోరాటానికి పురిగొల్పాయి అనే ఇతివృత్తం చుట్టూ అనేక సినిమాలు వచ్చాయి. కానైతే, ఏ పరిస్థితుల కారణంగా భారతదేశం ప్రపంచీకరణని ఆహ్వానించాల్సి వచ్చిందో చూపించిన సినిమాలు బహు తక్కువ. వాటిలోనూ, ఏ ఒక్క పక్షం వైపూ వేలెత్తి చూపనివి బహుశా లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా 'గవర్నర్', అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై నేరుగా విడుదలైంది.
మండల్ కమిషన్ ఆందోళనల (1990) అనంతరం, వీపీ సింగ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక, కాంగ్రెస్ మద్దతుతో సమాజ్ వాది జనతా పార్టీ నేత చంద్రశేఖర్ ప్రధాని పదవి చేపట్టే నాటికి, ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యింది. ద్రవ్య నిల్వలని నియంత్రించే భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)లో పరిస్థితి దినదిన గండం. అప్పు ఇస్తుందన్న రష్యా అంతర్గత సంక్షోభాల్లో కూరుకుపోయింది. గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు, వాటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిగుమతులకు చెల్లించాల్సిన మొత్తాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సిఫార్సుతో ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన రమణన్ కథే ఈ 'గవర్నర్'. నూట ఇరవై రెండు నిముషాల నిడివి వున్న ఈ సినిమా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు. నేపధ్యం తెలియని వారికీ అరటిపండు ఒలిచినట్టు చెబుతూనే, తెలిసిన వాళ్లకి కూడా విసుగు కలిగించని విధంగా తెరకెక్కించడం దర్శకుడు చిన్మయ్ మండ్లేకర్ సాధించిన విజయం.
నాలుగేళ్ళ క్రితం నాటి శ్రీలంక ఆర్ధిక సంక్షోభంతో మొదలయ్యే కథ, యిట్టే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి, నాటి ఆర్బీఐ పరిస్థితిని, బలికాబోయే మేకగా రమణన్ గవర్నర్ పదవి చేపట్టడాన్నీ చూపించి, అటుపై కొత్త గవర్నర్ ముందుగా ఆఫీసు నుంచి, ఆపై ప్రభత్వంనుంచీ మద్దతు కూడగట్టుకుని, దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడెయ్యడానికి చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు చెబుతూ ముందుకు సాగుతుంది. ప్రధాన కథ ఆర్ధిక సంక్షోభాన్ని తాత్కాలికంగా అధిగమించడమే అయినా, దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం 'భవిష్యత్తు'. నలుగురు యువతీయువకుల కలలనీ, కథలనీ ప్రధాన కథతో అనుసంధానం చేశాడు. వీరివి భిన్న నేపధ్యాలు, ప్రత్యేకమైన కలలు కావడంతో ప్రతి ఒక్కరి కథా ఆసక్తికరంగానే అనిపించింది. అన్నిటిని మించి, వీళ్ళ కథల్ని ప్రధాన కథలో భాగం చేయడం వల్ల కథనంలో బిగి సడలలేదు.
రమణన్ పాత్ర ప్రారంభ సన్నివేశాల్లో అతడో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటాడు. అక్కడ జరిగిన ఒక సంఘటనని అతడు ఆపలేకపోతాడు. కానీ, ఆ సంఘటన నిత్యం అతడిని వెంటాడుతుంది. ముగింపుకి ముందు సన్నివేశంలో మళ్ళీ ట్రాఫిక్ జామ్. ఈసారి రమణన్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతాడు. ఒక పాత్ర పరిణామక్రమాన్ని ఇంత సింబాలిక్ గా చెప్పడం ఎక్కడో తప్ప కనిపించడం లేదు. ఆర్ధిక సంక్షోభానికి ఏ ఒక్క రాజకీయ పక్షాన్నో బాధ్యులుగా చేసి నిందారోపణలు చేయకుండా, తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోడానికి అన్ని పక్షాలూ కలిసి పనిచేసినట్టుగా చూపడం ద్వారా రాజకీయ రగడలకి తావివ్వలేదు. నిజానికి ఆ తిలా పాపంలో తలా పిడికెడూ భాగం వుంది. ప్రధాని అసహాయత, కీలక నిర్ణయం తీసుకోవాల్సిన వేళకి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారిపోవడం లాంటివి కథనాన్ని పరుగులు పెట్టించడమే కాక, రమణన్ పాత్రని కీలకంగా నిలబెట్టాయి (ఇక్కడ సినిమాటిక్ లిబర్టీని కొంచం ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు).
ఆర్బీఐ ఆధీనంలో ఉండే భారత దేశపు బంగారు నిల్వలని తనఖా నిమిత్తం విదేశాలకి తరలించడం కథలో కీలకమైన సన్నివేశం. అత్యంత రహస్యంగా జగవలసిన ఈ తరలింపు గురించి ఓ జర్నలిస్టుకి ముందుగా ఉప్పందడం, అనంతర పరిణామాలు, వాటిని రమణన్ డీల్ చేసిన విధానాన్ని ఆసక్తిగా చిత్రించారు. అన్ని పాత్రలనీ పాజిటివ్ గానే చూపించినా, ఈ జర్నలిస్ట్ అదితి వర్మ పాత్రని మాత్రం మొదటినుంచీ కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగే విధంగానే తీర్చి దిద్దాడు. అయితే, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు ద్వారా ఆ నెగటివిటీని పోగొట్టేశాడు. ఆఫీస్ ప్యూన్ పాటిల్ పాత్ర చిత్రణ లోనూ ఇలాంటి గమ్మత్తే కనిపిస్తుంది. స్క్రిప్ట్, చిత్రీకరణల విషయంలో దర్శకుడి శద్ధ ప్రతి నిమిషమూ తెరమీద కనిపిస్తుంది. సాంకేతిక విభాగాలన్నీ చక్కగా కుదిరాయి. ఈ తరహా సినిమాలన్నింటిలోనూ చేసినట్టే, చివర్లో యదార్ధ సంఘటనల తాలూకు వివరాలు తెరపై చూపించారు.
నటీనటుల విషయానికి వస్తే, ముందుగా చెప్పుకోవాల్సింది రమణన్ గా తెరపై జీవించిన మనోజ్ భాజపేయిని గురించి. ప్రతి సినిమాలోనూ నన్ను ఆశ్చర్య పరుస్తాడీ నటుడు. ప్రతిసారీ కూడా 'మొన్నటి సినిమాలో చూసింది ఇతన్నేనా?' అనిపించేస్తూ వుంటుంది. వెంటనే చెప్పుకోవాల్సింది సీఆర్ (సి. రంగరాజన్) పాత్ర పోషించిన నౌషాద్ మొహమ్మద్ కుంజు గురించి. రమణన్ మీద పూర్తి అవిశ్వాసంతో మొదలయ్యే ఈ పాత్ర, సినిమా చివరికి వచ్చేసరికి అతడికి అనుయాయిగా మారిపోతుంది ( రమణన్ కేరక్టర్ ఎలివేషన్ -- తెలివిగా); ఈ షేడ్స్ అన్నీ చులాగ్గా చూపించేశాడు నౌషాద్. మరో కీలక పాత్ర అదితి వర్మ గా ఆదా శర్మ. ఈమె కనిపించేది కొన్ని సన్నివేశాలే అయినా, అవన్నీ కీలక సన్నివేశాలు. రమణన్ భార్య వందితగా మధుబాలకి చెప్పుకోదగిన పాత్ర దొరికింది. నటించేందుకు రెండు మూడు సన్నివేశాలున్నాయి. బాగా చేసింది కూడా. నటీనటులందరూ వంక పెట్టేందుకు వీల్లేని విధంగా నటించారు. సెట్లతో పాటు, తొంభైల చిత్రణ కోసం ఏఐని కూడా బాగానే వాడినట్టుగా అనిపించింది.
పీవీ నరసింహా రావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో సినిమా ముగుస్తుంది. నిజానికి అసలు కథ అక్కడినుంచే మొదలయ్యింది. విదేశాలకి వెళ్లిన బంగారం తిరిగి ఎలా వచ్చింది, బంగారాన్ని విమానం ఎక్కించే అవసరం రాకుండా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుని ఎలా అమలు చేశారు.. ఇదంతా తెరకెక్కాల్సిన చరిత్ర.
