బుధవారం, సెప్టెంబర్ 06, 2017

కరటకశాస్త్రి

నాటకంలో ఎంత హాస్యమైనా చెల్లుతుందని బాగా తెలిసిన విదూషకుడు కరటకశాస్త్రి. అదే హాస్యాన్ని నటనలోకి తెచ్చినా నెగ్గుకు రాగల భరోసా ఉన్నవాడు. విద్య చేత సంస్కృత పండితుడు, వృత్తి చేత విజయనగరం నాటక కంపెనీలో విదూషకుడూను. క్రియలో అంతవరకూ రాకపోయినా, మాటల్లో అమేషా మెడపట్టుకుని బయటకు తరిమే ఇల్లాలికి మగడు. భర్తకి ఇష్టం ఉండదని తెలిసీ, పెరట్లో కాస్తున్నాయని  రోజూ ఆ ఇల్లాలు దొండకాయ కూరే  వండినా కిక్కురుమనకుండా కంచం ఖాళీ చేసే సగటు మగాడు.

ఇవన్నీ నాణేనికి ఒకవైపు. మరోవైపున తోబుట్టువుకి కొండంత అండగా నిలబడే అన్నగారు. మేనల్లుడు, మేనకోడళ్ళ పట్ల బాధ్యత ఉన్న మేనమామ. అగ్నిహోత్రావధానులంతటి 'మూర్ఖప గాడిద కొడుకు' కూడా "ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీమారన్నావంటే నీ అన్న ఉన్నాడని ఊరుకునేది లేదు" అంటూ భార్య వెంకమ్మ మీద కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఒక్కటి చాలు, ఆ అన్నగారు కరటకుడెంతటి అసాధ్యుడో తెలియడానికి. "అగ్నిహోత్రావధాన్లూ, కుర్రవాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందూ వెనకా చూస్తున్నావు? బుచ్చమ్మనమ్మిన పదిహేను వందల రూపాయాలేంజేశావ్?" అని జంకూ గొంకూ లేకుండా అడగ్గలడు.

సోదరి వెంకమ్మ చిన్న కూతురు సుబ్బి పెళ్లిని తలపెట్టాడు బావగారైన అగ్నిహోత్రావధానులు. వరుడు లుబ్ధావధాన్లుకి అరవయ్యేళ్ళ పైమాటే. పెళ్లి తప్పించాల్సిన బాధ్యత అన్నగారిమీద పెట్టేసింది వెంకమ్మ.  తప్పించని పక్షంలో నుయ్యో గొయ్యో చూసుకుంటానని హెచ్చరించింది కూడా. అన్ని విధాలా కుదిరిన సంబంధాన్ని చెడగొట్టడం అంటే మాటలు కాదు కదా. ఇక్కడే, కరటకశాస్త్రి లోని నటుడు వినియోగానికి వచ్చాడు. తన శిష్యుడు మహేశం చేత ఆడపిల్ల వేషం కట్టించి, తాను పిల్ల తండ్రి వేషం కట్టి, సుబ్బికి మాట్లాడుకున్న కన్నా తక్కువ శుల్కానికి మహేశాన్ని లుబ్ధావధాన్లకి కట్టబెట్టి చెల్లెలికిచ్చిన మాట ప్రకారం పెళ్లి తప్పిస్తాడు.

గిరీశం శిష్యరికం చేస్తున్న మేనల్లుడు వెంకటేశం చదువు మీద మొదటి నుంచీ సందేహమే కరటకశాస్త్రి కి. గురుశిష్యులిద్దరూ ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నపుడే ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని స్ఫురించి ఉండాలి. అందుకే, "అబ్బీ, ఒక తెనుగు పద్యం చదవరా?" అని అడగడమూ, వెంకటేశం "పొగచుట్టకి సతిమోనికి" అనగానే "చబాష్" అనడమూను. "తెల్లవాళ్ళ స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరీ లేదండి" అని గిరీశం ఇచ్చిన వివరణ వింటూనే "తర్ఫీదు మా చక్కగా ఉంది. వీణ్ణి పెందరాళే తోవ పెట్టకపోతే మోసవొస్తుంది" అనుకుంటాడు ఆత్మగతంగా.

కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ కరటకశాస్త్రి. సుబ్బి పెళ్లి తప్పించమని అగ్నిహోత్రావధానులతో గొడవ పెట్టుకుని లాభం లేదని బాగా తెలుసు. అక్కడికీ "బావా, ఈ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను" అని బెదిరిస్తాడు కానీ, అగ్నిహోత్రావధానులు ముందు ఆ బెదిరింపు తాటాకు చప్పుడని బాగా తెలుసు. చేయాల్సిన పని ఏమంత సులువు కాదని తెలుసు కాబట్టే, "గట్టి అసాధ్యం తెచ్చి పెట్టావే" అంటాడు చెల్లెలితో. అలాగని చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తన శక్తియుక్తుల్ని అంచనా వేసుకుని రంగంలోకి దిగాడు. స్నేహితులు కూడా కలిసి రావడంతో కార్యం సాధించాడు.

మహేశానికి ఇంగ్లీష్ చదువు చెప్పించి, తన కూతురినిచ్చి పెళ్లిచేసి ఇల్లరికం ఉంచుకుంటానని మాటిచ్చి నాటకానికి ఒప్పించడం మొదలు, రామప్పంతులు ఊళ్ళో లేకుండా చూసి అప్పటికప్పుడు లుబ్ధావధాన్లుని ఏకరాత్ర వివాహానికి ఒప్పించడం వరకూ అడుగడుగునా కరటకుడి ప్రతిభ కనిపిస్తూనే ఉంటుంది. లౌక్యంతో తనకి మించిన వాడు లేడని విర్రవీగే రామప్పంతులు మీద లౌక్య ప్రజ్ఞ చూపించి గెలిచాడు. ఏకరాత్ర వివాహ విషయం తెలిసి పంతులేవంటాడో అని భయపడుతున్న 'అల్లుడు' లుబ్ధావధాన్లుతో "పావంతటి దానికి విరుగుడుంది, పంతులుకుండదా?" అన్నప్పుడు కరటకశాస్త్రి లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

ఇచ్చకాలకి లొంగే మనిషి కాదని తెలిసీ, మధురవాణిని బులిపించేందుకు తన పాండిత్యాన్నంతా వినియోగిస్తాడు కరటకశాస్త్రి. 'నీలాంటి మనిషి మళ్ళీ ఉందా?' అన్నా, 'ఏకానారీ సుందరీ వాదరీవా' అన్నా, 'మధురవాణి అంటూ ఒక వేశ్యా శిఖామణి ఈ కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండును?' అని  ప్రశ్న వేసినా, మధురవాణి భుజాలు పొంగుతాయని కాదు, ఎంతోకొంతయినా పని సానుకూలం కాకపోతుందా అని. ప్రోనాచ్, యాంటీ నాచ్ గురించీ, వకీలు సౌజన్యరావు పంతులు సౌజన్యం గురించీ మధురవాణి ఎదుట ఇచ్చిన ఉపన్యాసం పుణ్యమా అని తల వాచి తెల్లవెంట్రుకలు లావవుతాయి పాపం.

'కన్యాశుల్కం' నాటకం ద్వితీయాంకంలో తొలిసారి కనిపించే కరటకశాస్త్రి, చతుర్ధాంకంలో కథని కీలకమైన మలుపు తిప్పి, మళ్ళీ షష్ఠ్యంకంలో ప్రత్యక్షమై  నాటకాన్ని ముగింపు దిశగా నడిపిస్తాడు. మొత్తం నాటకంలో జరిగే 'మాయగుంట పెళ్లి' అనే ఉప నాటకానికి సూత్రధారి, ప్రధాన పాత్రధారి కూడా ఇతగాడే. చిఱిగెడ్డం అతికించుకుని, గుంటూరు శాస్తుర్లు అని మారుపేరు పెట్టుకున్నా, మాటల్లో పడమటి యాస పలికించలేకపోతాడు. ఉపనాటకం మధ్యలో శిష్యుణ్ణి వదిలి వెళ్లేప్పుడు, మీనాక్షి కి జాగ్రత్తలు చెప్పేప్పుడు మహేశం యెడల కరటకశాస్త్రి కి ఉన్న వాత్సల్యం కనిపిస్తుంది. డిప్టీ కలక్టర్ని చూడమని మధురవాణిని బలవంతం చేసినప్పుడు కరటకుడి మీద మనకి కించిత్ కోపం వచ్చినా, మధురవాణి తలంటి పోయగానే ఆ కోపం ఎగిరిపోతుంది.

(ఇతగాడి పేరు చాలా రోజులపాటు 'కరకట శాస్త్రి' అని పొరబడ్డాన్నేను. కళ్ళెంత మోసం చేస్తాయి!! "కరటకము అంటే కాకి. గురజాడ లాంటి రచయిత పాత్రకు పేరు పెట్టారెంటే దాని వెనుక ఎంతో అర్ధం ఉంటుంది" అంటూ మిత్రులొకరు తలంటి పోయడం గుర్తొస్తూ ఉంటుంది, కరటకశాస్త్రి ని ఎప్పుడు తల్చుకున్నా).

5 కామెంట్‌లు:

  1. కరటకశాస్త్రి పాత్ర విశ్లేషణ బహు బాగుగా ఉంది..
    ముఖ్యంగా రామప్పంతులుతో పలికిన సంభాషణలు (బుట్టలో పడేసిన వైనం) అద్భుతం..నాటకంలో హైలైట్ సీన్....
    ఒకటికి పదిసార్లు చదివి ఆనందించవచ్చు..
    అక్కడే గురజాడ వారు తన శాఖ అయిన నియ్యోగి వర్గం మీద కాస్త అనుకూలంగా రాసుకున్నట్టు అనిపించినా, వైదిక వర్గాన్ని కించపరచనట్టు కాకుండా హాస్యధోరణిలో సీన్ రక్తి కట్టించారు..
    నిజానికి గురజాడ వారు అన్ని వర్గాల వారికీ చురకవేశారు...కానీ ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినలేదు...అందుకే 125 ఎన్నయినా, మరో వెయ్యేళ్ళ వరకైనా సజీవంగా ఉంటుంది..

    రిప్లయితొలగించండి
  2. @Voteti: అనుకూలం ఎక్కడండీ.. 'నియ్యోగపాళ్ళం' అంటూ విర్రవీగిన రామప్పంతులికి చివరికి మిగిలిందేమిటి? మీరన్నది నిజమే, అందరిమీదా విసుర్లు వేసినా ఏ ఒక్కరినీ కించ పరచకపోవడం గురజాడ గొప్పదనం. ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మీ పుణ్యమాని మళ్ళీ పుస్తకం తెరిచి ఈరోజే ద్వితియాంకం పూర్తి చేశాను.
    "మనఃప్రభవానలవంటే యేవిట్రా?" అంటూనే వీళ్ళిద్దరూ నాటకమాడుతున్నట్లు రూఢీ చేసుకున్నట్లనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. నా అభిప్రాయంలో "కన్యాశుల్కం" కథని కీలకమైన మలుపులు తిప్పగలిగిన సమర్ధులు ఇద్దరే - కరటక శాస్త్రి, మధురవాణి (అఫ్కోర్స్ - మీ అంకుల్ కరటక శాస్త్రి స్కౌండ్రల్లా కనబడుతున్నాడు - అని గిరీశం నోట పరోక్షంగా అనిపించుకున్నవాడు కూడా లెండి). అటువంటి కరటక శాస్త్రి గురించి టపా వ్రాయడం బాగుంది.

    "బావా, ఈ సమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను" అన్న కరటక శాస్త్రి బెదిరింపే కదండీ అగ్నిహోత్రావధానులు చేసిన "తాంబోలం ఇచ్చేసాను; ఇహ తన్నుకు చావండి" అనే ఎవర్-గ్రీన్ స్టేట్మెంట్ కి దారితీసింది 🙂.

    నాకు అన్ని సన్నివేశాలూ నచ్చినవే కానీ ఒకటి మాత్రం క్లాసిక్ అనిపిస్తుంది. శిష్యుడైన మహేశాన్ని ఇల్లరికపుటల్లుడుగా చేసుకుంటానన్నప్పుడు అలాగని ప్రమాణం చేయమని శిష్యుడు కోరితే "తప్పితే భూమితోడ్రా" అంటాడుగా కరటక శాస్త్రి. దానికి "మీరు యెగేస్తే భూవేం జేస్తుంది?" అని శిష్యుడంటాడు చూడండి - అది క్లాసిక్, నాకు చాలా ఇష్టమైనదిన్నూ 👌. దేనిమీదో ఒట్టు పెట్టడం, ప్రమాణం చేయడం మీద గురజాడ వారి పదునైన విసురు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  5. @Madhav Kandalai: 'మనః ప్రభావానలు' అవుతూనే బుచ్చమ్మ ఎంట్రీ ఇవ్వడం చాలా నచ్చుతుందండీ నాకు.. ధన్యవాదాలు..
    @విన్నకోట నరసింహారావు: గిరీశానికి స్కౌండ్రల్లా కనిపించడం ఒక్కటి చాలు కదండీ, కరటకుడు మంచి వాడు అనడానికి :)
    "మీరు యెగేస్తే భూవేం చేస్తుంది.." అక్షరాలా నిజమండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి