శుక్రవారం, మే 29, 2009

ఉషా పరిణయం

సాహసాలు చేయడమంటే నాకు సరదా.. ఇవి చేయబోతున్నట్టు ఇంట్లో చెప్పకపోవడం నా అలవాటు. ఇన్సూరెన్సు పాలసీలు, రావాల్సిన, తీర్చాల్సిన బాకీల వివరాలన్నీ ఓ పుస్తకం లో వివరంగా రాసి ఉంచి వాటిని క్రమం తప్పకుండా అప్డేట్ చేసే అలవాటు ఉంది కాబట్టి నా సాహసాల వల్ల వెనుక వాళ్లకి అన్యాయం జరుగుతుందనే భయం లేదు. అలా "సిరికిం జెప్పకుండా" నేను చేసిన తాజా సాహసం సుమనోహరుడి ఉషా పరిణయ వీక్షణం.

రిలీజ్ షో చూసే అవకాశం ఇవ్వని ఉద్యోగాన్ని తిట్టుకుంటూ, సెకండ్ షో కి థియేటర్ దగ్గరికి చేరుకున్నాను. మరీ తెర ముందుగా కూర్చుని చూడడం కష్టమని, "ఏ రో" అని అడిగాను కౌంటర్ అబ్బాయిని. "ఫోర్త్ సార్" అన్నాడు వినయంగా. "స్క్రీన్ ముందునుంచా?" నా సందేహం. నాకేసి విచిత్రం గా ఓ చూపు చూసి "బ్యాక్ నుంచి సార్" అని టిక్కెట్ చేతిలో పెట్టాడు.

పక్క థియేటర్ లో వేరే సినిమాకి టిక్కెట్లు దొరకని ఓ ఫ్యామిలీ ఇంతలో అక్కడికి వచ్చింది. "ఉషా పరిణయం చూద్దామా అమ్మా?'' తన కూతురిని పర్మిషన్ అడిగాడు. "ఈలో ఎవలూ?" అడిగిందా నాలుగేళ్ల పిల్ల ముద్దుగా.. ఆయన అక్కడే ఉన్న నీలిమేఘ శ్యాముడి పోస్టర్ చూపించాడు. "ఈలు బూచాలు..వద్దు" చెప్పేసిందా అమ్మాయి నిష్కర్షగా.. శకునం బాగోలేదనుకుంటూ థియేటర్ లోకి అడుగుపెట్టాను.

ఇంకా సినిమా మొదలు కాలేదు. జనం ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎవరూ ఫోన్లు చేసి డిస్ట్రబ్ చేయకుండా ముందు జాగ్రత్తగా స్నేహితులందరికీ సంక్షిప్త సందేశాలు పంపాను, సినిమా చూడబోతున్నట్టు. వెంటనే జవాబులు వచ్చేశాయి. నా ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేయబోతున్నట్టు ఒకరు, 'నీధైర్యాన్ని దర్శించి దైవాలే తల దించగా..' అని మరొకరూ.. ఇలా... వీటికి నేను భయపడతానా?

మొత్తం ఓ పాతిక మంది ప్రేక్షకులు ఉన్నారు హాల్లో. సినిమా మొదలయ్యింది. ఎక్కడా ఉషా కిరణ్ పేరు గాని, రామోజీ పేరు గాని లేకుండా టైటిల్స్ పూర్తయ్యాయి. బాణాసురడనే రాక్షసుడు శివుడు తన రాజ్యానికి కావలి ఉండే విధంగా వరం పొందడం తో మొదటి సీన్ అయ్యింది. ఓ డెబ్బై ఏళ్ళు పైబడ్డ తాతగారు ఆయన టీనేజ్ మనవడు వచ్చి నా పక్క సీట్లలో సెటిల్ అయ్యారు. గ్రాంధికం, వ్యావహారికం కలగలిపిన భాషలో శివుడు, రాక్షసుడు మాట్లాడుకోడాన్ని ఎంజాయ్ చేస్తున్న నేను ఈ కొత్త వాళ్ళ కోసం మౌనం పాటించాల్సొచ్చింది.

రెండో సీన్ లో తెరమీద బారెడు పొద్దెక్కింది. ద్వారకలో బంగారు శేషపాన్పు మీద పవ్వళించిన శ్రీకృష్ణుడు.. మరెవ్వరో కాదు మన సుమనోహరుడే... ఆనందంగా నాట్యం చేస్తూ ఆయనకి మేలు కొలుపు పాడుతున్న జానపదులు. ఆ జానపదులకి నాయకుడు మన ప్రభాకరుడు. (ప్రత్యేక అతిధి పాత్ర, ఈ పాటకే పరిమితం). పాట సాంతం అయ్యాక స్వామి కళ్ళు తెరిచి చిరు నవ్వులు చిందించారు.. అది మొదలు, మూడు గంటల పాటు అంతా తానే అయ్యారు.

కథ అత్యంత మందగమనంతో సాగుతోంది. బాణాసురిడి కూతురు కలలోకి ఓ అందగాడు (?) వచ్చి ఆమెని కలవరపెడతాడు. అతను మరెవరో కాదు కృష్ణుడి సోదరుడు బలరాముడి (ఇంకెవరూ..మన ఈశ్వర్రావే) మనవడు అనిరుద్ధుడు. మాయలు మంత్రాలు తెలిసిన తన స్నేహితురాలు చిత్రరేఖ సహాయంతో అతన్ని కిడ్నాప్ చేయించి తన అంతః పురానికి రప్పించుకుంటుంది ఉష. స్వామి ఇందుకు రహస్యంగా సహాయం చేస్తారు. మరోపక్క అనిరుద్దుడికి భార్య కాగల అమ్మాయిల చిత్రపటాలు తెప్పిస్తుంది బలరాముడి భార్య రేవతి (నాగమణి).

స్వామి లీల వల్ల వాటిలో ఉష పటం వచ్చి చేరడం. రేవతికి ఆ పటమే ఎంతగానో నచ్చడం జరుగుతాయి. నా పక్కన కూర్చున్న తాతగారి మనవడు అసహనంగా కదులుతున్నాడు. (నేనెంతగా సినిమాలో లీనమైపోయినా..అతన్ని గమనిస్తూనే ఉన్నా) ఇంతలో అతనికి ఫోన్ వచ్చింది. "డొక్కు సినిమారా.. ఇంటర్వెల్ లో వచ్చేస్తా" అని గుసగుసగా చెప్పడం వినిపించింది. తెరమీద అనిరుద్ధుడి కిడ్నాప్ వార్త అతని తల్లిదండ్రులకి తెలిసింది. వాళ్ళు ఆందోళన పడుతుంటే కేళీ విలాసంగా చిరునవ్వులు చిందించారు స్వామి. నేను చూసుకుంటా అని వాళ్లకి హామీ ఇచ్చి మాకు 'విశ్రాంతి' ని ప్రసాదించారు.

లైట్లు వెలగ్గానే తాతగారి మనవడు "అంకుల్..చిన్న రిక్వెస్ట్" అన్నాడు. "నేను బయటికి వెళ్తున్నాను. కొంచం మా తాతగారిని చూసుకోండి.. సినిమా అవ్వగానే వచ్చి పికప్ చేసుకుంటా.." అన్నాడు. నేను కొంచం అమాయకంగా ముఖం పెట్టి "సినిమా బాగుంది కదా" అన్నాను, వెళ్ళిపోవడం ఎందుకూ అన్నట్టు. అతను కొంచం ఇబ్బందిగా నవ్వి, "అర్జెంటు పని అంకుల్, ఫ్రెండ్ ఫోన్ చేశాడు..ప్లీజ్" అన్నాడు. ఇంతకీ ఆ తాతగారు ముందువరుసలో తన వయసు వాళ్ళ పక్కన కూర్చున్నారు.. "అంత వెనక్కి రాలేను" అంటూ.. విశ్రాంతి తర్వాత పది మందిమి మిగిలాం.

రెండో సగం లో ఘటోత్కచుడు, చిత్ర విచిత్రమైన రాక్షసులు బోల్డంత మంది వచ్చి హాస్యం పుట్టించే ప్రయత్నం చేశారు.. నాకైతే సుమన్ గారి హాస్యం ముందు అవన్నీ బలాదూర్ అనిపించాయి. ఆయన నవ్వు, నడక, మాట, పాట.. ఒకటేమిటి.. ప్రతి కదలికా హాస్య రస భరితమే. అనిరుద్ధుడు తన కూతురి దగ్గర ఉన్నాడని తెలిసిన బాణాసురుడు అతన్ని జైల్లో బంధిస్తాడు. ఘటోత్కచుడు తన మాయలతో అనిరుద్ధుడి జాడ తెలుసుకుంటాడు.

ఈ మాత్రం మాయలు కృష్ణుల వారే చేయగలరు కానీ, ఎందుకో ఆయన అన్నా వదినా ఆయన్ని నమ్మరు. ఘటోత్కచుడు, కృష్ణుల వారు, వారి బృందం బాణాసురుడి రాజ్యానికి వెళ్లి అనిరుద్ధుడిని విడిపించడం, యుద్ధం అనివార్యం కావడంతో కృష్ణుల వారు బాణాసురిడితో యుద్ధం చేసి పెళ్ళికి ఒప్పించడం కథ ముగింపు. ఎప్పటిలాగే సుమన్ గారు తెర ముందు, వెనుక అన్నీ తానే అయ్యారు. మొత్తం నటీ నటులందరి లోనూ తనే అందంగా కనిపించే విధంగా శ్రద్ధ తీసుకున్నారు.

సినిమా అన్నారు కాని చూడ్డానికి టెలిఫిలిం లాగే అనిపించింది..పైగా 35 mm. నాకైతే "శ్రీకృష్ణ బలరామ యుద్ధం" పదే పదే గుర్తొచ్చింది. ఐతే ఇది థియేటర్ కాబట్టి విశ్రాంతి మినహా ఎక్కడా కమర్షియల్ బ్రేక్స్ లేవు. అందరూ టీవీ నటులే కావడం తో, సుమన్ తో కాంబినేషన్ సీన్లలో వాళ్ళంతా కంపెనీ ఎండీ ముందు నాలుగో తరగతి ఉద్యోగుల్లా భయ భక్తులతో నిలబడ్డారు. కథలో భాగంగా జానపదుడి గాను, బృహన్నల (?) గానూ మారు వేషాలు వేశారు స్వామి.

నల్లనయ్యగా సుమన్ నయనానందకర విశ్వ రూపాన్ని కళ్ళ నిండుగా నింపుకుంటూ కింద రాసిన "సర్వేజనా సుఖినోభవన్తు" వాక్యాన్ని చదువుకుంటూ థియేటర్ బయటికి వస్తున్నానో లేదో మిత్రుల నుంచి నా క్షేమాన్ని తెలియజెప్పమంటూ సందేశాలు. "సినిమా ఎలా ఉందని మర్యాదకైనా అడగరా?" రిప్లై లో కోప్పడ్డాను నేను. "మాకు తెలియక పోతే కదా..." ఓవర్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళ జవాబు.

48 వ్యాఖ్యలు:

 1. హ్హహ్హ... నేను ఈ సినిమా బెంగళూరు లో రిలీజ్ అవుతుందేమో, చూద్దామనుకున్నా, కానీ ప్చ్.. !
  chk this..
  http://nalonenu.blogspot.com/2007/12/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Mee dhiryaniki Joharlu ... Aina ... itagaadu seriyallu vadilipetti cinemala meeda yenduku padinatlo chepma ??????

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఏ రో

  ఈలో ఎవలూ

  మొత్తం నటీ నటులందరి లోనూ తనే అందంగా కనిపించే విధంగా శ్రద్ధ తీసుకున్నారు.

  కాంబినేషన్ సీన్లలో వాళ్ళంతా కంపెనీ ఎండీ ముందు నాలుగో తరగతి ఉద్యోగుల్లా భయ భక్తులతో నిలబడ్డారు

  హ ..హ్హ ...
  నిజంగా కేక

  inka ilantivi mee mark style lo raayali..chaala bavundi

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ha ha ha.

  Your Ushaparinayam is hilarious right from start.
  (For some reason, I am unable to write in Telugu in these embedded comment boxes).

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారూ ! హు ...నాకు తెలుసండీ ..తెలుసు ! మీరింత సాహసానికెందుకు పూనుకున్నారో ....మాకోసమే కదండీ ...తోటి బ్లాగరులకు ఉషాపరిణయ విశేషాలు తెలిపేందుకు మీ ప్రాణాలు సైతం పణంగా పెట్టారంటే ...మీ త్యాగం అర్ధమౌతుంది.
  మీ త్యాగం వృధా కాదండీ ....వృధా కాదు . మీ బ్లాగు మిత్రులెందరో....చేద్దామనుకున్న రిస్క్ మాని ప్రాణాలు కాపాడుకుంటారు .చూడటమే కాకుండా సుమనోహరుని దివ్య రూపం కళ్ళకు కట్టినట్టు వర్ణించారు...మీ సాహసానికి ,హేట్సాఫ్ ...చాలా చిన్న పదం ...

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఏంటి మురళీ,
  ఎంత ఇన్స్యూరెన్స్ చేయిస్తే మాత్రం మరీ ఇంత సాహసమా.డేరింగ్ అండ్ డేషింగ్ హీరో కిట్టిగాడు కూడ పనికిరాడు బాసూ నీ దవిర్య సాగసాల ముందు.(సుమనోహహహహహాహ్హ్రురురురురుడుడుడుడుడుడుడు....హహహహహ).పోస్ట్ మాత్రం కేక...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి ..గారు ..విచిత్రమేమిటంటే ఈ సినిమా ను నేను నిన్నే చూసాను. అయితే సుమన్ గారు ఒక టెలిఫిలిమ్ ను సినిమాగా ప్రేక్షకుల మీదకు వదిలేంత సాహసం ఎందుకు చేసారో అర్ధం కాలేదు.అయితే ఈ సినిమాకు దాదాపు తక్కువ మార్కులే పడవచ్చు ఈనాటి ప్రేక్షకుల అభిప్రాయాలతో పోల్చుకుంటే.కనీసం సినిమా ఫీల్డ్ కు చెందినా కొంతమంది నటులనైన సినిమాలో చూపిస్తే బాగుణ్ణు. ఎంతైనా అది సిల్వర్ స్క్రీన్ కదా..అందరు కూడా టీవి నటులే.సినిమా క్లైమాక్స్ లో కృష్ణుడికి, భాణాసురుడికి మధ్యన జరిగిన యుద్దాన్ని కూడా సక్రమంగా చూపించలేదు..ఈ సినిమా ఒక రకంగా చూస్తె నాకు సురభి వారి నాటకం చూసి నట్టు మాత్రమే వుంది గాని.. బాక్సాఫీస్ సినిమా చూసినట్లు లేదు.

  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @మంచిబాలుడు -మేడిన్ ఇన్ వైజాగ్:
  సురభి వారి నాటకాలు చాలా బావుంటాయంటారు, మీరు సుమన్ సినిమాని అలా పోలిస్తే ఎలా అండీ..!?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. సినిమా చూశాక నవ్వుతానో లేదో గానీ రివ్యూ కి పొట్ట చెక్కలయ్యింది బాబూ!
  "ఈలు బూచాలు" మనకంటే పిల్లలే నయమన్నమాట.

  "ఇంకెవరూ మన ఈశ్వర్రావే"
  ఆయన నవ్వు, నడక, మాట, పాట.. ఒకటేమిటి.. ప్రతి కదలికా హాస్య రస భరితమే.
  "సినిమా ఎలా ఉందని మర్యాదకైనా అడగరా?" రిప్లై లో కోప్పడ్డాను నేను. పోనీలేండి,ఈ సినిమాకు వెళ్తున్నట్టు చెప్పే వెళ్లారన్నమాట జాగ్రత్త కోసం!

  మొత్తానికి బొద్దుగా ముద్దుగా ముద్దుగా మాట్లాడే కృష్ణుడు మీకు పంచిన హాస్యాన్ని మాకూ పంచారు. కాసిన్ని డబ్బులు మిగిల్చారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మురళి,,
  ఎంత భీమా చేయిస్తే మాత్రం అంత రిస్క్ తీసుకోవాలా?? సినిమా చూసొచ్చావు ఒకె.. ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉంది.. ఐనా నీ జీవితాన్ని పణంగా పెట్టి ఆ సినిమా చూసి, బ్లాగి, మమ్మల్నందరిని కాపాడావు. చల్లగా బ్రతుకు...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హ!హ!హ!మీరు ఇంత సాహసవంతులని తెలీదు సుమీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మురళీ గారు మీ అంత ధైర్యం మాకు లేదండి!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఏదో నాలుగు పుస్తకాలు చదివి, నలుగురు నాయికల గురించి బ్లాగుతూ చల్లగా ఉంటారనుకుంటే ఇదేంటండీ బాబూ. ఎవరికీ చెప్పాపెట్టకుండా అలా వెళ్లిపోవడమే? చిన్నప్పుడు మిమ్మల్ని వేసవిలో ఇంట్లోనే ఎందుకు ఉంచేవారో నాకు ఇప్పుడు అర్థమయింది. బాగా నవ్వించారు. మీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం... గుడ్డు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నటనా, పాటలు, మాటలు, కథ, స్క్రీన్‍ప్లే, బొమ్మలు, నృత్యం, దర్శకత్వ పర్యవేక్షణా, దర్శకత్వం, ఏసేదీ, చూసేదీ...

  ఎవులాలు...? బూచోలు.

  సుమన్. హహహ.

  వెరీ గుడ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కేక మురళిగారు. కానీ మీరు మాకు మాటివ్వాల్లి ఇంకెప్పుడూ ఇలా చేయనని. మీరింకా ఎన్నో సినిమాల గురించీ, నవలా నాయికల గురించీ, మీ చిన్నన్నటి అందమైన కబుర్ల గురించీ చెప్పాలి. ఆ తరువాత ఇలాంటి సినిమాలు చూద్దురుగాని.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మురళీ, ఈలో మన బూచోడే ? బుల్లితెర నుంచి పెద్ద తెరకు ఎప్పుడు ఎక్కాడు? ఇంతకీ సినైమా చూశాక ఆఫిస్ లో పని చేశారా లేక విష్ణు మాయలో పడి గిలగిల లాడారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మీతో పాటు ధైర్యం చేసి సినిమా మధ్యలో నుండి లేచివస్తూ మిమ్మల్ని చూసి ధైర్యవంతులే అనుకున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. జందూబాం జందూబాం నొప్పిహరించేబాం...వీకెండ్ హాయిగా రెస్టు తీస్కో, సినిమా గుర్తుకొస్తుంది, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయ్, ఇంట్లో ఎవ్వరికీ కనిపించనీకు, మొహం శుభ్రంగా కడుక్కో, ఏంపర్లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అసలు మీకు అంతటి దురాలోచన ఎందుకు వచ్చింది TV లో క్లిప్పింగ్స్ లోనే సుమనోహరుడు వారి దివ్య మంగళ స్వరూపం మనకు కొంచం సాంపుల్ గా వదిలేరు కదా.. సాహసానికైనా ఒక అంతు వుండక్కర్లేదు... మళ్ళీ కొసమెరుపు.... చెమక్కు ఏమంటే యెంటోడి పుట్టిన రోజునే దానిని జనాల మీదకు వదలటం... రామ చంద్రా.. (భయం గా వుంది కృష్ణ కృష్ణ అనాలంటే ఆయన క్లిప్పింగ్స్ గుర్తు వచ్చి)

  ప్రత్యుత్తరంతొలగించు
 20. @మేధ: సుమనోహరుడికి ఓ ఉత్తరం రాయాల్సిందండి.. మీరుండే ఏరియా లో రిలీజ్ అయ్యేవిధం గా ఏర్పాట్లు చేసి ఉందురు. అభిమానుల మాట ఆయన అస్సలు కాదనలేరని ఈటీవీ ని ఆయన ఏలే రోజుల్లో ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయనే స్వయంగా చెప్పడాన్ని నా చెవులతో విన్నాను.. ధన్యవాదాలు.
  @ఫజ్లుర్ రహమాన్ నాయక్: టీవీలో తనని తాను నిరూపించుకున్నాక, ఇప్పుడు వెండితెర మీద నిరూపించుకునే ప్రయత్నం అండి.. మనం ప్రోత్సహిస్తే మరిన్ని పౌరాణికాలు వస్తాయి. ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @కొత్తపాళీ: నా బ్లాగు సెట్టింగ్స్ లో ఏమైనా మార్పులు చేయాలా? మిగిలిన అందరూ రాయగలుగుతున్నారు కదండీ? ...ధన్యవాదాలు.
  @పరిమళం: మీరు మరీ ఎమోషనల్ అవుతున్నారండి.. 'శ్రీ కృష్ణ బలరామ యుద్ధం' ఈటీవీలో వచ్చిన రెండుసార్లూ రెప్ప వెయ్యకుండా చూసిన అభిమానం నాది. ఇంట్లో వాళ్ళు హాహాకారాలు చేశారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి నేను చూసింది నా కోసమే.. ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: ఇంతకీ మెచ్చుకున్నట్టా? తిట్టినట్టా? నాక్కొంచం కన్ఫ్యుసింగ్ గా ఉంది.. చదివి వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. @మంచిబాలుడు -మేడిన్ వైజాగ్: నేను చెప్పాలనుకున్న విషయం మేధ గారు చెప్పేశారు. ఇది సుమన్ గారి అపూర్వ సృష్టి అండి.. దీన్ని మరే ఇతర కళాఖండం తోనూ పోల్చకూడదు. సినిమా వాళ్ళతో సినిమా ఎవరైనా తీస్తారు. టీవీ వాళ్ళతో సినిమా తియ్యడమే సుమన్ గారి ప్రత్యేకత. ధన్యవాదాలు.
  @మేధ: మళ్ళీ ధన్యవాదాలు.. నా ఉద్దేశ్యం కూడా అదేనంది.. పైగా నాకు నాటకాలంటే ప్రత్యేకమైన ఇష్టం కూడా..
  @సుజాత: పిల్లల్ని దేవుడితో ఎందుకు పోలుస్తారో మరో సారి అర్ధమైందండీ నాకు. మిత్రులకి చెప్పానండి.. కొన్ని కొన్ని విషయాలు వాళ్లకి చెప్పాలి. డబ్బుదేం ఉందండి.. తెల్లారి లేస్తే ఎన్ని వృధా ఖర్చులు చేయడం లేదు.. అయినా ఎంత ఖర్చుపెడితే మాత్రం ఇంత వినోదం దొరుకుతుంది చెప్పండి?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @జ్యోతి: హాస్యం జీవన ప్రమాణాన్ని పెంచుతుందట.. కాబట్టి నాకు రిస్కేమీ లేదు.. ధన్యవాదాలు.
  @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
  @సునీత: ధైర్యం చేస్తేనే కదండీ ఏమైనా దొరికేది.. అది వినోదమైనా..మరొకటైనా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. @పద్మార్పిత: సుమన్ మీద అభిమానం అనండి.. ధన్యవాదాలు.
  @అరుణ పప్పు: ఇంట్లో చెప్పలేదు కానీ, స్నేహితులకి చెప్పానండి.. ఎన్నో పుస్తకాలు చదివిన, రాసిన సుమన్ గారి నుంచి కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం అండి ఇది... ..ధన్యవాదాలు.
  @సుజ్జి: అభిమానం ఎంతపనైనా చేయిస్తుందండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @సృజన రామానుజన్: మీరు 'సంగీతం' మర్చిపోయారు.. అది కూడా సుమనే.. ఒక్క మనిషిలో ఇన్ని
  టాలెంట్లు ఉన్నాయంటే...అసలు గిన్నిస్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్ధం కావడంలేదండి నాకు.. ధన్యవాదాలు.
  @భవాని: ముందే చెప్పాను కదండీ సాహసాలు అలవాటని.. ధన్యవాదాలు.
  @భాస్కర రామిరెడ్డి; సినిమాని తల్చుకుని తల్చుకుని నవ్వుకున్నానండి.. ఆ జోకేదో మాకూ చెబితే మేమూ నవ్వుతాం కదా అన్నారు కొలీగ్స్.. అవి చూడాల్సిన జోకులే కానీ చెప్పగాలిగేవి కాదని చెప్పాను.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @yohanth: నేనలా మధ్యలో రానంది.. అంతు చూడాల్సిందే.. ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: అలా ఏమీ లేదు.. శుభ్రంగా ఉన్నాను.. ధన్యవాదాలు.
  @భావన; టీవీలో చూశాకే సినిమా చూడాలని నిర్నయించుకున్నానండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. బాసూ మీరు మరీను, ఎంత ఒకవేల ఎవరాన్నా ఎమన్నా అంటే మాత్రం ఇలా ఆత్మహత్యా ప్రయత్నాలు చెస్తారా ఎవరైనా.

  ఐనా మీ పిచ్చి(అభిమానం) కాకపొతే, మీకు తెలిసినట్లు లేదు గిన్నీసు బుక్ వాళ్ళు ప్రయత్నించారు కాకపొతే మన అయ్యవారు ఆ గిన్నీసు బుక్ లోకి ఎక్కించే ప్రోగ్రాం కూడా ఆయనే షూట్ చేస్తా అన్నరు అంటా, దెబ్బకి పారిపోయారు వాళ్ళు.

  కొసమెరుపు: నేను ఎలాగూ స్వీడన్ లొనే వున్నను కాబట్టి ఆయన అభిమానిగా ఆయన గురించి నోబెల్ వాల్లకి చెబ్దాం అనుకుంటున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @విజయ మాధవ: మంచి సలహా ఇచ్చారు.. నన్నెవరైనా ఏమన్నా అంటే..వాళ్ళని సైలెంట్ గా ఈ సినిమాకి తీసుకెళ్ళి పోతా.. మీరు నోబుల్ వాళ్ళని కన్ఫ్యుస్ చేసే పని పెట్టుకున్నారు.. స్వామి ఎన్నో రంగాల్లో లబ్ద ప్రతిష్టులు.. ఈయనకి ఎన్ని నోబుల్ ఇవ్వాలన్న విషయంలో వాళ్ళో వాళ్లకి గొడవలొస్తాయేమోనండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. గోలీ సోడా కొట్టినంత ఈలేసుకోండి బాసు, మన మాటగా. అయినా 'ఈలో బూచాడూ ఆన బాలవాక్కు ఇనకుండా బొమ్మ చూత్తే ఇలా కాక మరెలా వుంటదేంటి కథ! ;) టపా అంతా కేకో కేక.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. ముఖ్య ప్రకటన : ఇందు మూలంగా యావన్మంది బ్లాగు ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా ...ఉషా పరిణయం అనే అద్భుత చలన చిత్రం కలక్షన్లు దండిగా ఉన్నప్పటికీ ...వేసవి సెలవుల స్పెషల్ గా మొదటి వందమంది బాలబాలికలకు ప్రవేశం ఉచితం అని మురళి గారి బ్లాగ్ ముఖంగా తెలియజేయటమైనదహో....చూడాలనుకొనే వారు బుల్లి బుల్లి గౌనులూ ...చిన్న చిన్న నిక్కర్లూ వేసుకొని వస్తే టికెట్ లేదండొహో...

  ప్రత్యుత్తరంతొలగించు
 31. very interesting...naku chinna doubt..mee age entha? meeru writer na? mee books ivvamannanu ivvaledu

  ప్రత్యుత్తరంతొలగించు
 32. @ఉష: నా మిత్రులు కూడా ఇదే మాటన్నారండి.. 'సుమన్ సవ్యసాచిలా తీసిన సినిమా ఇలా కాక ఎలా ఉంటుంది?' అని.. ధన్యవాదాలు.
  @పరిమళం: ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన తెలుగు సినిమా అనే రికార్డును కూడా సొంతం చేసుకోవాలనుకుంటున్నారేమోనండి సుమన్ గారు. స్కీముల స్కీములు ప్రకటిస్తున్నారు, ప్రేక్షకుల కోసం... ధన్యవాదాలు.
  @శిరీష: మీ చిన్న సందేహాలకి సమాధానాలు వరుసగా.. నా వయసు నాలుగు నెలలు పూర్తయ్యి ఐదో నెల నడుస్తోందండి బ్లాగరిగా.. రచయితా అంటే..నేను బ్లాగు రచయితని.. నేను రాసినవన్నీ నా బ్లాగులోనే ఉన్నాయి కదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. ayitE, dInni thiyETar lO rilIj cEstE mAtraM evaru cUstArU? ani anukunna nA AlOcanE tappannamATa! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 34. S: మీరు సుమన్ని, ఆయన అభిమానులని తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నారు :):) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 35. చాలా థాంక్స్ అండి మురళి గారు. సినిమా ఎలా ఉందో కళ్ళకి కట్టినట్టు మాకు చెప్పారు. నేను ఎప్పుడైనా ఎదైన విపరీతమైన పని ఎదైనా చేస్తే మా స్నేహితులు అడుగుతూ ఉంటారు...ఎందుకు చేసావురా అని..."సరదాగా చేసాన్లేరా" అని చెప్తు ఉంటా వాళ్ళతో. మీ లాగే నాకు కుడా రిస్క్ తీసుకొవడం సరదా. ఈ వేసవిలో సరదాగా ( అంటే సంథింగ్ రిస్కీ) ఎమైనా చెద్దామని ప్లాన్ వేసి రేపు సిక్స్ ఫ్లాగ్స్ అని ఒక ఎమ్యుస్మెంట్ పార్క్ కి వెళ్తున్నా...సరదాగా ప్రపంచంలోని వెగవంతమైన రోలర్ కోస్టర్ ఎక్కుదామని. కాని మీరు అంతకంటే ఇంకా సరదా అయిన పని చుపించారు. సో, రేపు రోలర్ కోస్టర్ ఎక్కగానె ...ఇంటికొచ్చి...నెట్ లొ గనక ఆ సినిమా దొరికితే సరదాక చుడాలని నిర్ణయించుకున్నా. ఈ విషయంలో మాత్రం మీరు నాకు ఆదర్శం.

  నేను ఆ కళా ఖండం వీక్షించి మీకు నా అభిప్రాయం చెప్తాను మళ్ళీ. అప్పటిదాక....జై మురళి..జై జై మురళి.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. Keko kaka guru naa jivitham lo ee cinema ni chudakudadu anukunnanu Me tapa chusaka (sorry Chadivaka)!!!

  Nenu Maharajasri suman Garki Cheppadi Emitanagaa Meru eppudu Mammulanu(Prekshakulanu) Badapettalanna Cinema lu Tiyandi

  ప్రత్యుత్తరంతొలగించు
 37. @బాలకృష్ణ: ఇలాంటివి మరో నాలుగు సినిమాలు వస్తే అంటే జరగొచ్చండి.. ధన్యవాదాలు.
  @MI3CHI..'s బ్లాగ్: ధన్యవాదాలు
  @"శం కరోతి" - ఇతి శంకరః : నేను చూసి కూడా నిక్షేపంగా ఉన్నాను.. మీరూ చూడండి.. ధైర్యే సాహసే సుమన్.. ధన్యవాదాలు.
  @శశి: అంతే అంటారా? ఆయన తప్పేమీ లేదండి.. నాన్-స్టాప్ ఎంటర్ టైనర్ అని చెప్పే తీశారు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 38. మురళి గారు, మీకు ఎన్ని గుండెలు, ఎంత ధైర్యం ఈ సినిమా చుడడానికి. మేము trailor చుసినప్పుడె భయపడ్దాము.చక్కని బ్లాగుకి ధన్యవాదాలు .
  http://santhlavvi.in

  ప్రత్యుత్తరంతొలగించు
 39. sholay cinemalo gabbar ante chuttupakkala konni gramalake bhayam..
  kani usha parinayamlo suman ante cities lo kuda andariki bhayame!!

  vyakhyalu chadivi navvi navvi alasipoyanandi..
  mee sahananiki , saahasaniki joharlu!!

  neeta.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. @Happy World :ధన్యవాదాలు
  @Homoeo Honey:ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 41. Ee Cinema ni "Mayabazar" tho polchi Ala Theeyalane uddesamtho color lo mee andhari kosam theesanani suman ekkado statment isthe nijame komasanukonna. Nijamaga naaku "Mayabazar" ante anthishtam mari. Parledhulendi mothammeedha Muraligaru janalani rakshincharu

  ప్రత్యుత్తరంతొలగించు
 42. @rao: రెండోసగంలో 'మాయాబజార్' ని బాగానే అనుకరించారండి.. పోల్చే సాహసం సుమన్ మాత్రమే చేయగలరు.. ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. దీన్ని డిజిబీటాలో షూటింగూ ఎడిటింగూ చేసి తరువాత 35mm లో బ్లోఅప్ చేశారు. అంటే నిజానికి ఇది టెలీసీరియలే. కేవలం సినిమాహాల్లో చూపించారంతే!

  మీ ధైర్యానికి జోహార్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. @కత్తి మహేష్ కుమార్: టెక్నికల్ గా కూడా ఎక్కడా సినిమా లా అనిపించలేదండి.. ఇదన్న మాట రహస్యం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు