గురువారం, మే 14, 2009

నీళ్ళావకాయ

ఆవకాయల సీజన్ హడావిడి చూడగానే నాకు మా చిన్నప్పటి నీళ్ళావకాయ గుర్తొచ్చింది. ఇదేమీ కొత్తరకం వంటకం కాదు. నాకు తెలిసి మా ఊరికి మాత్రమె ప్రత్యేకమైనది. ఈ ఆవకాయ ని గురించి చెప్పాలంటే ముందుగా మా సుబ్బమ్మ గారి గురించి చెప్పాలి. సుబ్బమ్మ గారు ఓ వితంతువు. మా ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. జీవిక కోసం ఓ చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉండేవారు. ఆవిడ కొడుకు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. దీనితో ఆవిడే తిప్పలు పడి ఏదోలా ఇల్లు నడుపుతూ ఉండే వారు.

ఆవిడ కొట్లో ఏ వస్తువైనా, యెంత తక్కువ పరిమాణం లో అయినా విసుక్కోకుండా ఇచ్చేవారు. చిన్న పిల్లలు కొనడానికి వస్తే వాళ్లకి విధిగా బెల్లం ముక్క కొసరు ఇచ్చేవారు. ఈ కారణాల వాళ్ళ మరో పెద్ద కిరాణా కొట్టు ఉన్నా ఎక్కువమంది ఈవిడ కొట్లోనే కొనడానికి మొగ్గు చూపించే వాళ్ళు. మా కోనసీమలో ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే కదా.. చెట్టు మీద నుంచి రాలిన కాయను తోట యజమాని చూడక ముందే ఇంకెవరైనా చూశారంటే అది చూసిన వాళ్ళదే అన్న మాట.

ఇలా సేకరించిన కాయలని సుబ్బమ్మ గారికి అమ్మేసేవాళ్ళు మా ఊరి జనం. బదులుగా చిల్లరో, లేక ఏవైనా సరుకులో, చిరుతిళ్లో పట్టుకేళ్ళే వాళ్ళు. ఆవిడ ఆ కాయలని ఓపికగా విభజించి, ముదురు కాయలని నూనె కోసం పక్కన పెట్టి, లేత కాయలతో కొబ్బరి ఉండలు చేసి కొట్లో అమ్మేవాళ్ళు. చీపురీనల మొదలు, బూరుగు కాయల వరకు ఎవరేం పట్టుకొచ్చినా కొనేవాళ్ళు. వాటిని రూపాంతరం చెందించి అమ్మేవాళ్ళు. అంటే చీపురీనలని చీపుళ్ళుగాను, బూరుగు దూది విడిగానో లేక తలగడలుగా చేసో.. ఇలా అన్నమాట.

ఇక ఎండలు వస్తున్నాయనగా వాళ్ళింట్లో హడావిడి మొదలయ్యేది. ఆవిడ పొరుగూరు వెళ్లి మిరపకాయలు, ఆవాలు, ఉప్పు కొనుక్కుని, నేల టిక్కెట్ లో ఓ సినిమా చూసి సాయంత్రానికి తిరిగి వచ్చేవాళ్ళు. మర్నాడు ఒకరో ఇద్దరో కూలీలని పెట్టి మిరపకాయలు, ఆవాలు, ఉప్పు రాళ్ళు పొడులు కొట్టించి, జల్లించి జాడీలకి ఎత్తించేవాళ్ళు. అది మొదలు, కొట్లోకి వచ్చిన పిల్లలకి మామిడి కాయలు కొంటానని అన్యాపదేశంగా చెప్పేవాళ్ళు.

మధ్యాహ్నాలు గాలి కోళ్ళలా ఊరి మీద పడి తిరిగే పిల్లలకి పండగన్నమాట. దొంగతనంగా మామిడి కాయలు కొట్టి రహస్యంగా పట్టుకెళ్ళి ఆవిడకి అమ్మేసేవాళ్ళు. సాయంత్రానికి ఆవిడ ఆవకాయ పెట్టేసేవాళ్ళు. మామిడి కాయ ముక్కలు, కొట్టి ఉంచిన కారం, ఆవ, ఉప్పు పొడులు, కాసిన్ని వేడి నీళ్ళు ఓ గిన్నెలో వేసి కలిపేస్తే ఆవకాయ తయారు. ఎర్రెర్రని ఆవకాయని కొట్లో ప్రదర్శించే వాళ్ళు.

వేసవి వస్తుండగానే వ్యవసాయ పనులు ముమ్మరం అవుతాయి కాబట్టి కూలీలంతా ఉదయాన్నే పనులకెళ్ళి ఏ రాత్రికో తిరిగొచ్చే వాళ్ళు. కూర వండే ఓపిక లేని వాళ్లకి ఈ ఆవకాయ మహా ప్రసాదం. పైగా కనీస ధర అన్నది లేదు. ఎంత తక్కువ డబ్బిచ్చినా ఆవకాయ వస్తుంది. దీనితో అందరూ చిన్న చిన్న గిన్నెలతో కొట్టు దగ్గర మూగే వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి. 'వర్రగా (కారం) ఉంద'నో, ఉప్పు సరిపోలేదనో వాళ్ళిచ్చే సలహాలను ఆవిడ పాటించేవాళ్ళు. మర్నాడు ఆవకాయ కలిపేటప్పుడు రుచి మార్చేవాళ్లు.

వేసవి సాయంత్రాలు వీధిలో కూర్చుంటే చాలు, జనం కొనుక్కుని పట్టుకెళ్ళే ఆవకాయ వాసన ముక్కుపుటాలని సోకేది. పైన మూత లేని చిన్న గిన్నెల్లో కొత్తావకాయ నోరూరించేది. ప్చ్.. ఏం లాభం.. ఆ ఆవకాయ తినే అదృష్టం లేక పోయింది. రహస్యంగా తినగలిగేది కాదు. అక్కడికీ ధైర్యం చేసి ఒకటి రెండు సార్లు అమ్మని అడిగాను.. "గట్టిగా అనకు..నాన్నగారు వింటే వీపు చీరేస్తారు" అని చెప్పింది. ఎన్నో రకాల ఊరగాయలు రుచి చూశాను కానీ, మా సుబ్బమ్మ గారి నీళ్లావకాయ తినలేకపోయాననే లోటు మాత్రం మిగిలిపోయింది.

20 వ్యాఖ్యలు:

 1. పోనీలెండి....భాధ పడకండి
  నాకు ఇప్పుడే ఒక ఇన్స్టెంట్ ఐడియా వచ్చింది, తిట్టుకోకండి
  ఇంట్లో ఉన్న కొత్తావకాయలో కాస్త నీళ్ళు పోయండి
  ఇన్స్టెంట్ కొత్త నీళ్ళావకాయ రెడీ...(just for kidding)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. తనకున్న తెలివి తేటలతో బ్రతకడం అంటే ఇదే ,గ్రేట్ సుబ్బమ్మగారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మురళి గారూ..
  ఎన్నో రోజులయిపోయిందండీ మీ బ్లాగుకి రాక. చదవాల్సినవి బోలెడు పెండింగ్ :-(
  సమయం చిక్కట్లేదు. మీరు చెప్పింది విన్నాక ఆ నీళ్ళావకాయ నాకూ తినాలనిపిస్తుంది.
  పోనీ.. మనమే ఆ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉంటుందంటారూ..!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ప్చ్..మాకూ నొట్లో నీళ్ళూరాయి. బాడ్ లక్, మీరు రుచి చూడలేక పోవడం.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిజం గానే ఇదేదో మీ వూరి సుబ్బమ్మ గారి స్పెషల్ అనుకుంటా.. పోనిలెండి ఆమె నీళ్ళావకాయ తినలేక పోయినా కొత్తావకాయ కలిపేసిన గిన్నెలో (మేము డిప్ప అనికూడా అనే వాళ్ళము) పచ్చడి తీసేసాక ఎంచక్క గా అన్నం కలిపి ముద్దలు తినగలుగుతున్నరు కదా.. అక్కడికి అదే అదృష్టం అనుకోవాలి మాలాంటి నిర్భాగ్యులతో పోల్చుకుంటే... :( ఆ డిప్పలోనుంచి అమ్మ పెట్టే అన్నం ముద్దల సాటి ఇంకేముంది చెప్పండి....

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చెట్టు మీద నుంచి రాలిన కాయను తోట యజమాని చూడక ముందే ఇంకెవరైనా చూశారంటే అది చూసిన వాళ్ళదే అన్న మాట.

  chaala baaga raasaru.........

  enduku kodataaru..........

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నీళ్ళతో కూడా అవకాయ రుచించెటట్టు చేసారు అంటే సుబ్బమ్మగారు అసాద్యులే !! శ్రీ శ్రీ గారు "కాదేది కవితకనర్హం" అంటే సుబ్బమ్మ గారు " కాదేది కొట్టు కి అనర్హం " అనేవిధంగా గొప్ప వ్యాపార నీతి భోధించారు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. > మా సుబ్బమ్మ గారి నీళ్లావకాయ తినలేకపోయాననే లోటు మాత్రం మిగిలిపోయింది
  ఈ సారి మీ ఇంట్లో వాళ్ళకు తెలియకుండా... టెస్ట్ చెయ్యండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నీళ్లావకాయ? మొదటిసారి వింటున్నా ! పచ్చడి పాడైపోయేది కాదా ? ఏదేమైనా సుబ్బమ్మగారు గ్రేట్ !
  ఇంతకూ ఇప్పటికైనా తిన్నారా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Ee neellavakaya Krishna zilla lo chaalaa prasidhdhi.Measurements anthaa avakaya maadiree...aithe masala is mixed with boiled and cooled water.This avakaya comparatively Ghatekkuvagaa vuntundi.Just like normal avakaya..this one can be stored for years.Hope this helps.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @పద్మార్పిత: మీ ఆలోచన బాగుంది.. నా చిన్నప్పుడు మీరీ సలహా ఇచ్చి ఉంటే ఉత్సాహంగా పాటించి ఉండే వాడిని :) ధన్యవాదాలు.
  @చిన్ని: నిజమేనండి.. ఇప్పుడు తలచుకుంటుంటే అనిపిస్తోంది..ఆవిడ జీవన పోరాటం ఓ అద్భుతం అని.. అలాంటి వాళ్ళ పరిచయం కూడా ఒకలాంటి గర్వాన్ని కలిగిస్తుంది మనకి.. ధన్యవాదాలు.
  @మధురవాణి: అవునండి.. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు.. వీలైనప్పుడే చదవండి నా టపాలు.. ఆవెక్కడికీ పారిపోవు కదా.. మీ (అందరి) సలహాలూ, సూచనలూ మాత్రం నాకు అమూల్యం.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @సునీత (నాబ్లాగు): రాస్తుంటే నాక్కూడా నోట్లో నీళ్ళూరాయండి.. నిజంగా దురదృష్టమే.. మా ఊరి వాళ్ళంతా అంతగా అభిమానించారంటే ఆ రుచి ఎంత అద్భుతంగా ఉండి ఉంటుందో కదా అనిపిస్తోందిప్పుడు. ధన్యవాదాలు.
  @భావన: చిన్నప్పుడు మేము కూడా అలా తినేవాళ్ళం అండి.. ఇప్పుడది అవుట్ ఆఫ్ ఫాషన్ అయిపోయినట్టుంది :( కొత్తావకాయ మాత్రమ తినగలుగుతున్నాం లెండి.. ధన్యవాదాలు.
  @వినయ్ చక్రవర్తి: చిన్నప్పుడు చాలా ఆంక్షలు ఉండేవండి.. బయటి తిళ్ళు తినకూడదు అన్నది వాటిలో ఒకటి.. అందువల్ల తినలేకపోయాను. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @కృష్ణ: నిజమేనండి.. ఆవిడ వ్యాపార చతురత అద్భుతం.. ధన్యవాదాలు.
  @పానీపూరీ: ప్చ్.. లాభం లేదండి.. ఆవిడ కాలం చేసి చాలా కాలం అయింది.. ధన్యవాదాలు.
  @పరిమళం: ప్చ్..తినలేదండి.. 'మిధునం' లో అప్పదాసు గారిలా అప్పుడప్పుడు ఆ రుచిని ఊహించుకుంటూ ఉంటాను అంతే.. ధన్యవాదాలు.
  @సాహితి: నిజమా అండి? మొదటిసారి వింటున్నాను.. నిజంగా ఆసక్తికరమైన సమాచారం. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నీళ్లావకాయ-పేరు విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదు. వెనుకటి రోజులలో ఊళ్లల్లో ఇలా సీజన్ బట్టి వ్యాపారాలు చేసే సుబ్బమ్మ గారులు బాగానే ఉండేవాళ్లు. చాలా వరకు ఎక్కువ పెట్టుబడి లేనివే!

  ఈ నెల చదవాల్సిన టపాలు ఎన్ని ఉన్నాయో!!

  ప్రత్యుత్తరంతొలగించు
 15. నీళ్ళావకాయ!!! భలే... భలే
  నూనెలేదు కాబట్టి డైటింగ్ వాళ్ళు కూడా తినొచ్చన్నమాట!!

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మా అమ్మగారింట్లో ఆవకాయ పెట్టిన వైనం జ్ఞప్తికి తెచ్చారు. అమ్మగారు చివర్లో జాడిలోకి మార్చాక, ఆ పళ్ళెంలో కాస్త వేడి అన్నం వేసి, వెన్న కలిపి అందరికీ ముద్దలు పంచేవారు. అవెంత రుచో చెప్పలేను. అలాగే మా ఇంటి నుండి ఆవకాయ కొనుక్కెళ్ళేవాళ్లంటే అంత జాలీను. నిజానికి నాకు అమ్మగారికి అక్కడే గొడవలు మొదలయ్యాయి, మనకి ఎక్కువ వున్నది పంచాలి కానీ అమ్మకూడదు అని నా గోల. మీ తాతమ్మ గారికి హార్లిక్స్ సీసా కొనటానికి అప్పెట్టి మా బాప్ప ఓ ఎకరం పొలం రాసిచ్చేసిందట అది తీర్చను అని మా బాబుని చూడటానికి సాయం వచ్చిన, సుబ్బు నాతో నిష్టూరాలు పోయేది, అందుకే అదో కోరిక ఆ అప్పు తాలూకు డబ్బు నేనైనా దానికి ఇచ్చేయాలని, చాలా వరకు ఇచ్చాను కూడా ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @సిరిసిరిమువ్వ: నేను కళ్ళతో చూశానండి.. కాని రుచి చూడలేదు :( ..ధన్యవాదాలు.
  @సృజన: నిజమేనండి.. మంచి ఆలోచన.. మా సుబ్బమ్మ గారు ఇంత దూరం ఆలోచించి ఉండరు. అప్పట్లో
  డైటింగులు అవీ లేవు కదా.. ధన్యవాదాలు.
  @ఉష: కొన్ని కొన్ని బాకీలు తీర్చడం కూడా సంతోషం ఉంటుందండి.. చిన్నప్పటి కొత్తావకాయ రుచిని గురించి యెంత చెప్పినా తక్కువే.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నేనిలా గొడవపెట్టానని మా మమ్మీ బంగినపల్లి మామిడికాయతో నీళ్ళవకాయ చేశారు. తెనాలి రామలింగడు పెంచుకున్న పిల్లికి వేడిపాలతో పాల మీద విరక్తి ఎలా వచ్చిందో అలానే మాకు కూడా నీళ్ళావకాయంటే విరక్తి వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @భవాని: భలే పోలిక చెప్పారు :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఈ నీళ్ళావకాయ తెలియదుగానీ సుబ్బమ్మ గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది. She is really inspiring.

  ప్రత్యుత్తరంతొలగించు