సోమవారం, జూన్ 01, 2009

వాన కురిస్తే

చెప్పదలచుకున్న విషయాన్ని ఎలాంటి తికమకలూ లేకుండా సూటిగా స్పష్టంగా చెప్పే కథకుల్లో కేతు విశ్వనాథ రెడ్డి ఒకరు. ఈయన కథల్లో పాత్రలన్నీ నిజజీవితం నుంచి వచ్చేవే.. జీవితానికి సంబంధించి అన్ని అంశాలనూ తన కథల్లో స్పృశించే ఆచార్య కేతు రాయలసీమ రైతు సమస్యలను నేపధ్యంగా తీసుకుని ఎన్నో కథలు రాశారు.

వర్షం కోసం ఎదురు చూస్తున్న ఓ రైతు ఆవేదననూ, ఒక్క వాన తన జీవితాన్ని మార్చేయగలదన్న అతని ఆశనీ చిత్రిస్తూ ఆయన రాసిన కథ 'వాన కురిస్తే.' 1971 లో తొలిసారి ప్రచురితమైన ఈ కథ కన్నడ, హిందీ భాషల్లోకీ అనువాదమైంది. ఈ కథాకాలం నాలుగు దశాబ్దాలకి ముందు దైనా, ఈ నాటికీ రైతు స్థితిలో..ముఖ్యంగా రాయలసీమ రైతు స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ లేకపోవడం వల్ల సమకాలీన కథే అనిపిస్తుంది.

కథానాయకుడు పాపయ్య రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ రైతు. తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం పదెకరాలు అమ్మేసి, మిగిలిన భూమిలో చీనీ, మిరప తోటల పెంపకం మొదలు పెట్టాడు. వర్షాధారమైన వ్యవసాయం చేయడం ఎప్పుడూ లాటరీనే. వ్యవసాయం కోసం, కుటుంబం గడవడం కోసం తప్పని అప్పులు. కురవని వర్షం.. అన్ని బావుల్లో మాదిరే లోతుకి, ఇంకా లోతుకి పోతున్న నీళ్ళు.

"నిమ్మచెట్లే కాస్తే, చేసిన అప్పులు ఒక లెక్క కాదు. తన ఆశా, నమ్మకమూ నెరవేరే విషయం ఏమో కాని అప్పుల దయ్యం తన్ను పట్టుకుంది. తన వంశంలో ఏదో పద్ధతిలో, ఏదో కారణానికి, ఏదో దశలో అప్పులు చేయందెవరు? అవును. చేయక తప్పేదేముంది? మెట్టన్నమ్ముకున్న వాళ్ళు ఎవళ్ళూ బాగుపడరు. ఎప్పుడూ బాగు పడరు. వానలు అదునులో వస్తే బాగుపడతారు."

ఓ స్వామి మాటలు నమ్మి బావి తవ్వినా నీళ్ళు పడలేదు. ఇంక ఉన్న ఒకే ఒక్క అవకాశం వర్షం పడడం. వర్షం కురిస్తే, పంట చేతికొస్తే, మంచి రేటు పలికితే, పంట అమ్మి అప్పులు తీర్చాలి. వంశం పేరు నిలబెట్టాలి. తన వంశానికి పేరూ ప్రతిష్టా ఉన్నాయి.. డబ్బు లేకపోతేనేం. అంగడి రామిరెడ్డి దగ్గర డబ్బుంది కాని పేరెక్కడుంది? రామిరెడ్డి అప్పు ముందుగా తీర్చేయ్యాలి. ఆలోచిస్తూ ఇంటిదారి పట్టిన పాపయ్యకి ఆకాశంలో ఉరుము ఉరిమిన శబ్దం వినిపిస్తుంది.

వార్తలు వినడం కోసం పంచాయితీ ఆఫీసు దగ్గర ఆగుతాడు పాపయ్య. ఊరి రాజకీయాలు అతనికి కోపం రప్పిస్తాయి. బోర్లు వేయించని, చెరువులు తవ్వించని ప్రభుత్వం మీదా అతనికి కోపం వస్తుంది. ఐతే దానికి ప్రకటించడు. "అందరూ దొంగలే..ఈ మనుషులు బాగు పడరు..ఈ ఊరు బాగు పడదు..ఈ దేశం బాగు పడదు. అందరూ చస్తారు..అప్పులతో చస్తారు.. పనికి మాలిన రాజకీయాలతో చస్తారు.. " పాపయ్య మనసులో కసి.. గుండెల్లో మంట..

ఇంటికి చేరుకున్న పాపయ్య వానొస్తే ఇల్లు తడిసి పాడైపోతుందని బాధ పడతాడు. పంట డబ్బు రాగానే అప్పులు తీర్చాక మిగిలిన డబ్బుతో ఇల్లు బాగు చేయించాలనుకుంటాడు. భోజనం చేసి వర్షం కోసం ఎదురు చూస్తూ ఆరుబయట నిద్రపోతాడు. "నిద్రలో పాపయ్యకి ఒక కల వచ్చింది. పెద్ద వాన పడుతోంది. చెరువు నిండింది. తోట పక్కనే గట్టుల్ని ఎగదంటూ పారుతున్న కాలవ. బావిలో నీళ్ళు. పాదుల్లో నీళ్ళు. యింట్లో నీళ్ళు. వీధిలో నీళ్ళు. తనమీద నీళ్ళు. ఎక్కడ చూసినా నీళ్ళు..."

ఉన్నట్టుండి ఉరిమిన ఉరుముకి కల చెదిరిన పాపయ్య దిగ్గున లేచి కూర్చుంటాడు. ఆర్తనాదం చేసి కూలిపోతాడు. ఆరాత్రి ఆకాశంలోంచి పడని వాన ఆ ఇంట్లో వాళ్ళ కళ్ళలోనుంచి పడింది. కర్మకాండ ముగిశాక అప్పులవాళ్ళంతా పాపయ్య పెద్ద కొడుకు మల్లయ్యతో బాకీ విషయం నెమ్మదిగా చూసుకోవచ్చని హామీ ఇస్తారు. నెల రోజుల తర్వాత తోట దగ్గరికి వెళ్తాడు మల్లయ్య.

"నాయన పోయినాక వొక వాన వచ్చింది. ఇంకొక మంచి వాన కురుస్తే ఈ మిరప చెట్లకి కాయ బాగా పడుతుంది. ధరలున్నాయి. సెనక్కాయ తీగ బాగా సాగుతుంది. ధరలు పెరుగుతున్నాయి. నిమ్మ చెట్లకు పూత వస్తుంది. రెండు మూడు లారీలు కాస్తాయి. బావిలో నీళ్ళు సరిపోతాయి. అన్నీ కుదిరితే ఏముందీ? బాకీలు సుమారుగా తీర్చ వచ్చు. బాకీలెంత బాధ! బాకీలు తీర్చాలి. బావిలోకి చూస్తూ, ఆకాశం వైపు చూస్తూ, ఆ మధ్య వచ్చిన ఒక వానతో బతకలేక, చావలేక అవస్థ పడుతున్న మిరప చెట్లను చూస్తూ, నీరెత్తని నిమ్మ చెట్లని చూస్తూ అనుకున్నాడు.. వొక్క వాన కురిస్తే! మరొక్క వాన కురిస్తే!!"

3 వ్యాఖ్యలు:

 1. నిజం. ప్రతి సీజనూ నిరాశ మేస్తున్నా కూడా మన రైతు తరతరాలుగా ఆశాజీవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ముందు టైటిల్ చూసి ఋతు పవనాలకు స్వాగతమేమో అనుకున్నా ! కానీ చదివాక రైతు కష్టం కంట తడి పెట్టించింది .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @కొత్తపాళీ: మనిషిని బతికించేది ఆ ఆశే కదండీ.. ధన్యవాదాలు.
  @పరిమళం: కేతు విశ్వనాథ రెడ్డి గారి కథలన్నీ ఇలాగే ఉంటాయండి.. జీవితానికి దగ్గరగా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు